మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''

మియన్మార్

ఫొటో సోర్స్, Getty Images

మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు మొదలైనప్పటి నుంచీ ఇప్పటివరకు 43 మంది మంది పిల్లల్ని సైన్యం హతమార్చినట్లు బాలల హక్కుల సంస్థ సేవ్ ద చిల్డ్రన్ ఆరోపించింది.

''ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. హత్యకు గురైన పిల్లల్లో ఏడేళ్ల పాప కూడా ఉంది''అని ఆ సంస్థ పేర్కొంది.

స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి మొత్తం మరణాల సంఖ్యను 536గా పేర్కొంది.

ఊచకోత ఇలాగే కొనసాగితే వీధుల్లో రక్తం ఏరులై పారుతుందని మియన్మార్‌లోని ఐక్యరాజ్యసమితి రాయబారి ఆందోళన వ్యక్తంచేశారు.

సరిహద్దుల్లో సైన్యం, మైనారిటీ పౌర సైన్యాల మధ్య దాడులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజా హెచ్చరికలు జారీచేశారు.

మియన్మార్

ఫొటో సోర్స్, Reuters

మియన్మార్‌లో రెండు నెలల క్రితం ఈ కల్లోల పరిస్థితులు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ విజయం అనంతరం సైన్యం తిరుగుబాటు లేవనెత్తింది.

ఈ తిరుగుబాటుకు వ్యతిరేకంగా వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టారు. వీరిని చెదరగొట్టేందుకు సైన్యం జల ఫిరంగులు ప్రయోగించింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో తొలుత రబ్బరు బుల్లెట్లు, తర్వాత తూటాలు కూడా పేల్చింది.

శనివారం ఈ ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఆ ఒక్క రోజే వంద మందికిపైగా నిరసనకారులు మరణించారు.

రోడ్లపై సామాన్యులను కూడా సాయుధ బలగాలు వదిలిపెట్టడంలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇళ్లలోకి దూరి మరీ ప్రజలను చంపుతున్నారని చెబుతున్నారు.

ఏడేళ్ల పాప ఖిన్ మయోను ఎలా హత్యచేశారో ఆమె కుటుంబం బీబీసీకి వెల్లడించింది. గతవారం మాండలేలోని తమ ఇంటిపై పోలీసులు దాడి చేశారని తెలిపింది.

మియన్మార్

''వారు మా తలుపులు గట్టిగా కొట్టారు. దీంతో మేం తలుపు తెరిచాం. ఇంట్లో ఎవరైనా దాగున్నారా అని వారు మా నాన్నను అడిగారు. మా నాన్న లేదు అని చెప్పారు. అయితే, నువ్వు అబద్ధం చెబుతున్నావని ఆరోపిస్తూ వారు మా ఇంట్లోకి చొరబడ్డారు. అప్పుడే ఖిన్ మా నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏడేళ్ల పాప అని చూడకుండా ఆమెపై కాల్పులు జరిపారు''అని ఖిన్ సోదరి 25ఏళ్ల సుమాయా చెప్పారు.

మృతుల్లో 14ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. మాండలేలోని తన ఇంటికి సమీపంలో అతడిపై కాల్పులు జరిపారు. మరోవైపు యాంగూన్‌లో.. ఆడుకుంటున్న 13ఏళ్ల బాలుడిపైనా కాల్పులు జరిపారు.

ఈ ఘర్షణల్లో గాయపడిన పిల్లల సంఖ్య కూడా ఎక్కువే ఉంటుందని సేవ్ ద చిల్డ్రన్ తెలిపింది. ఏడాది పాప కంటికి రబ్బరు తూటా తగిలిన ఘటనను సంస్థ ప్రముఖంగా ప్రస్తావించింది.

పిల్లల మానసిక స్థితిపైనా ఈ ఘర్షణలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని సంస్థ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)