ఆంగ్ సాన్ సూచీ: మియన్మార్‌లో దశాబ్దాల సైనిక పాలనకు తెరదించిన నేత మళ్లీ సైనిక దిగ్బంధంలో...

ఫొటో సోర్స్, AFP
మియన్మార్‌ను కొన్ని దశాబ్దాల పాటు పాలించిన కఠినమైన సైనికాధికారులను సవాలు చేసేందుకు తన వ్యక్తిగత స్వాతంత్య్రాన్ని కూడా వదులుకున్నారు ఆంగ్ సాన్ సూచీ. ఆమెను ఒక నియమబద్ధమైన ఉద్యమకారిణిగా, మానవ హక్కుల మార్గదర్శిగా అందరూ చూసేవారు.
ఆంగ్ సాన్ సూచీకి 1991లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆమె అప్పటికి హౌస్ అరెస్టులో ఉన్నారు. ఆమెను బలహీనుల పాలిట శక్తికి ఒక ఉదాహరణగా కొనియాడారు.
మియన్మార్‌లో 25 ఏళ్ల తర్వాత 2015లో బహిరంగంగా పోటీ పడిన ఎన్నికలలో ఆమె నేతృత్వం వహించిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది.
కానీ, ఇప్పుడు ఆ దేశ సైన్యం తిరుగుబాటు చేసి ఆమెను పదవీచ్యుతురాలిని చేసింది. ఆమెతో పాటు ఇతర రాజకీయ నాయకులను కూడా అరెస్టు చేశారు. .
మియన్మార్‌లో తలెత్తిన ముస్లిం రోహింజ్యా సంక్షోభ సమయంలో ఆమె స్పందించిన తీరు పట్ల అంతర్జాతీయంగా ఆమె ప్రతిష్టకు భంగం కలిగింది. దేశంలో అత్యధికంగా ఉన్న బౌద్ధ మతస్థులలో ఆమెకు మంచి పేరుంది.

ఫొటో సోర్స్, Getty Images
అధికారానికి మార్గం
సూచీ 1989 - 2010 వరకు నిర్బంధంలోనే గడిపారు. సైనిక పాలనలో ఉన్న మియన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆమె చేసిన వ్యక్తిగత పోరాటం ఆమెకు, అణచివేత ముంగిట శాంతియుతంగా పోరాడుతున్న అంతర్జాతీయ వ్యక్తిగా గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఆమె 2015లో జరిగిన ఎన్నికలలో భారీ ఆధిక్యంతో గెలిచినప్పటికీ ఆమెకు పుట్టిన పిల్లలు విదేశీయులు కావడంతో దేశాధ్యక్షురాలు అయ్యేందుకు మియన్మార్ రాజ్యాంగ నియమాలు అనుమతించలేదు. కానీ, 75 ఏళ్ల సూచీని వాస్తవానికి ఒక నాయకురాలిగానే చూస్తారు.
అధికారికంగా ఆమెకు స్టేట్ కౌన్సిలర్ అనే హోదా ఉంది. ఇప్పుడు తిరుగుబాటు జరిగే వరకు విన్ మిన్ట్ ఆమెకు చాలా దగ్గర సహాయకులుగా ఉండేవారు.
2020లో జరిగిన ఎన్నికలలో ఆమె పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ ఎన్నికలలో ఆమె పార్టీకి 2015 కంటే ఎక్కువ సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అయితే, ఆ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని సైన్యం ఆరోపించింది.
కొత్తగా ఎన్నికైన పార్లమెంటు దిగువ సభ సభ్యులు తొలిసారిగా సోమవారం సమావేశం కావల్సి ఉంది. అదే రోజున మిలటరీ ఆంగ్ సాన్ సూచీతో పాటు మరింత మంది రాజకీయ నాయకులను అరెస్టు చేసింది.

ఫొటో సోర్స్, Aris Family Collection/Getty Images
రాజకీయ వారసత్వం
సూచీ మియన్మార్ స్వతంత్రం కోసం పోరాడిన జనరల్ ఆంగ్ సాన్ కూతురు. ఆమెకు రెండేళ్ల వయసు ఉండగానే ఆయన హత్యకు గురయ్యారు. మియన్మార్ బ్రిటిష్ పాలన నుంచి 1948లో స్వతంత్రం పొందింది.
1960లో ఆమె తల్లి డా ఖిన్ కీతో కలిసి భారతదేశం వచ్చారు. అప్పుడామె తల్లి మియన్మార్ దౌత్యవేత్తగా దిల్లీకి వచ్చారు.
నాలుగేళ్ల తర్వాత ఆమె బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ చదివేందుకు వెళ్లారు.
అక్కడ ఆమె మైకెల్ ఆరిస్‌ని కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
జపాన్, భూటాన్‌లలో కొంత కాలం పాటు నివసించిన తర్వాత ఆమె తన ఇద్దరు పిల్లలు అలెక్జాన్డర్, కిమ్‌లను పెంచడం కోసం బ్రిటన్‌లో స్థిరపడ్డారు. కానీ, మియన్మార్ మాత్రం ఆమె ఆలోచనల నుంచి దూరంగా జరగలేదు.
తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి ఆమె 1988లో యాంగాన్ తిరిగి వచ్చారు. మియన్మార్ అప్పటికే ఒక పెద్ద రాజకీయ తిరుగుబాటు మధ్యలో ఉంది.
దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేయాలంటూ కొన్ని వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు, సన్యాసులు డిమాండ్ చేస్తూ వీధుల్లోకొచ్చారు.
"ఇక్కడ జరుగుతున్నదంతా పట్టించుకోకుండా ఉండలేకపోయాను" అని ఆమె 1988 ఆగస్టు 26న యాంగాన్‌లో ఇచ్చిన ప్రసంగంలో అన్నారు. ఆమె అప్పటి నియంతృత్వ పాలకుడు జనరల్ ని విన్‌కి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటుకు సారథ్యం వహించారు.
అమెరికాలో పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ , భారతదేశంలో మహాత్మా గాంధీ చేసిన అహింసాయుత ఉద్యమాలతో స్ఫూర్తి పొందిన సూచీ, దేశ వ్యాప్తంగా ప్రయాణించి ర్యాలీలు నిర్వహిస్తూ శాంతియుతంగా ప్రజాస్వామ్య సంస్కరణల అమలు, స్వేచ్చాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు.
కానీ, ఆ ప్రదర్శనలను సైన్యం దారుణంగా అణిచివేసింది. సెప్టెంబరు 18, 1988లో జరిగిన సైనిక తిరుగుబాటులో సైన్యం తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ మరుసటి సంవత్సరమే సూచీని గృహ నిర్బంధంలో పెట్టారు.

ఫొటో సోర్స్, AFP
మే 1990లో మియన్మార్ సైనిక ప్రభుత్వం జాతీయ ఎన్నికలకు పిలుపునిచ్చింది. అందులో సూచీ సులభంగా విజయం సాధించారు. కానీ, సైనిక ప్రభుత్వం మాత్రం ఆమెకు అధికార బదిలీ చేయడానికి అంగీకరించలేదు.
ఆమె ఆరేళ్ళ పాటు 1995 వరకు యాంగాన్‌లో గృహ నిర్బంధంలోనే ఉండిపోయారు.
ఆమెకున్న ప్రయాణ నిబంధనలను అతిక్రమించి సెప్టెంబరు 2000లో మండలే నగరానికి వెళుతున్నప్పుడు ఆమెను తిరిగి హౌస్ అరెస్టు చేశారు.
ఆమెను ఎటువంటి నిబంధనలు లేకుండా 2002లో విడుదల చేశారు. కానీ, ఒక్క సంవత్సరం కూడా గడవక ముందే ఆమె మద్దతుదారులు, ప్రభుత్వ మద్దతు ఉన్న మూకలకు మధ్య జరిగిన ఘర్షణల తర్వాత ఆమెను తిరిగి జైలులో పెట్టారు.
ఆమెను తిరిగి ఇంటికి వెళ్లేందుకు అనుమతించినప్పటికీ హౌస్ అరెస్టులోనే ఉంచారు.

ఫొటో సోర్స్, Reuters
కొన్ని సార్లు ఆమెకు కొంత మంది ఎన్ఎల్‌డీ అధికారులు, దౌత్యవేత్తలను కలిసే అవకాశం ఉండేది. కానీ, ఆమె చాలా సంవత్సరాల పాటు నిర్బంధంలోనే ఉండిపోయారు.
సూచిని ఆమె పిల్లలు, భర్తను కూడా చూడనిచ్చేవారు కాదు. సూచి భర్త క్యాన్సర్‌తో 1999 మార్చిలో మరణించారు.
భర్త తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్నప్పుడు సూచి బ్రిటన్‌కు వెళ్లేందుకు సైనికాధికారులు అంగీకరించారు. కానీ, తనను తిరిగి దేశానికి రానివ్వరేమోననే భయంతో ఆమె వెళ్ళలేదు.
రెండు దశాబ్దాల తర్వాత 2010లో జరిగిన ఎన్నికలలో సూచీని పక్కకు పెట్టారు. కానీ, ఎన్నికలయిన ఆరు రోజుల తర్వాత ఆమెను విడుదల చేశారు. ఒక దశాబ్దం తర్వాత ఆమె కొడుకు కిమ్‌కు ఆమెను కలిసేందుకు అనుమతించారు.
మియాన్మార్లో కొత్త ప్రభుత్వం సంస్కరణలు చేపట్టే దశలో ఉండగా, సూచీ, ఆమె పార్టీ తిరిగి రాజకీయ ప్రక్రియలో భాగమయ్యాయి.
ఏప్రిల్ 2012 లో జరిగిన ఉప ఎన్నికలలో వారు 45 స్థానాలలో పోటీ చేస్తే 43 స్థానాలను పొందారు. ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా , పార్లమెంట్ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తరువాత ఆమె 24 సంవత్సరాలలో మొదటి సారి దేశం వదిలి బయటకు వెళ్లారు. కొత్త నాయకత్వం ఆమె దేశం తిరిగి రావడానికి అభ్యంతరం చెప్పరని భావించారు.

ఫొటో సోర్స్, AFP
రోహింజ్యా సంక్షోభం
సూచీ మియన్మార్ స్టేట్ కౌన్సిలర్ అయినప్పటి నుంచి ఆమె దేశంలో ముస్లిం మైనార్టీల విషయంలో ప్రవర్తించిన తీరును బట్టి ఆమె నాయకత్వాన్ని పాక్షికంగా నిర్వచించడం మొదలయింది.
2017లో రఖైన్ రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లపై కొన్ని దాడులు జరగడంతో సైన్యం రంగంలోకి దిగి చర్యలు తీసుకుంది. ఈ సమయంలో కొన్ని వందల మంది రోహింజ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కి పారిపోయారు.
అక్కడ మారణహోమం జరిగిందనే అభియోగంపై మియన్మార్ ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో కేసును ఎదుర్కొంటోంది. మానవత్వానికి వ్యతిరేకంగా దేశం నేరాలకు పాల్పడిందన్నఆరోపణలపై ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారణ చేస్తోంది.
గతంలో సూచీకి మద్దతిచ్చిన అంతర్జాతీయ మద్దతుదారులు కూడా ఆమె రోహింజ్యాలపై చోటు చేసుకున్న అత్యాచారాలు, హత్యలు, మారణహోమాన్ని ఆపడానికి ఏమి చేయలేదని ఆరోపించారు. శక్తివంతమైన సైన్యం చేస్తున్న చర్యలను ఖండించకపోవడాన్ని, జరుగుతున్న దారుణాన్ని ఆమె గుర్తించకపోవడాన్ని తప్పు పట్టారు.
ఆమె విభిన్న జాతులతో సంక్లిష్టమైన చరిత్రతో కూడిన దేశాన్ని పాలించడానికి సంసిద్ధం అవుతున్న ఒక వ్యవహార జ్ఞానంతో కూడిన రాజకీయ నాయకురాలని కొంత మంది ఆమెను సమర్ధించారు.
హేగ్ లో జరిగిన విచారణలో సైన్యం చర్యలను సమర్ధించడం ఆమెకున్న అంతర్జాతీయ ప్రతిష్టను మలుపు తిప్పింది.
కానీ, స్వదేశంలో బౌద్ధ మతస్థుల దగ్గర మాత్రం ఆమె పేరు ప్రతిష్టలు ఏ మాత్రం తగ్గలేదు.

ఫొటో సోర్స్, Reuters
సంస్కరణలకు బ్రేక్
సూచీ అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ లీగ్ ఆఫ్ డెమాక్రసీ (ఎన్ఎల్‌డీ) ప్రభుత్వం వలసపాలన నాటి కాలంలో ఉన్న చట్టాలను ఉపయోగించి విలేకరులను, ఉద్యమకారులను శిక్షించడం మొదలుపెట్టడంతో ప్రభుత్వం పై విమర్శలు రావడం మొదలుపెట్టాయి.
కొన్ని విషయాలలో కొంత మేర అభివృద్ధి కనిపించినప్పటికీ పార్లమెంటులో ఉన్నపావు వంతు స్థానాలలో అధికారం సైన్యం చేతుల్లోనే ఉంది. కొన్ని కీలక మంత్రిత్వ శాఖలైన రక్షణ, హోం, సరిహద్దు వ్యవహారాలు కూడా సైన్యం చేతుల్లోనే ఉన్నాయి.
తాజా పరిణామాలతో మియన్మార్లో జరుగుతున్న ప్రజాస్వామ్య బదిలీకి ఆటంకం ఏర్పడిందిని విశ్లేషకులు భావించారు.
ఒక వైపు ఆగ్నేయ ఆసియాలో కోవిడ్-19 సంక్షోభం తీవ్రంగా నెలకొన్న సమయంలో సైన్యం తిరుగుబాటు చోటు చేసుకుంది.
లాక్ డౌన్లో విధించిన చర్యలు ప్రజల జీవనోపాధికి భంగం కలిగించడమే కాకుండా ఇప్పటికే బలహీనంగా ఉన్న వైద్య వ్యవస్థపై ఈ తిరుగుబాటు మరింత ఒత్తిడిని తెచ్చి పెట్టింది.

ఫొటో సోర్స్, Reuters
కానీ, సూచీకి ప్రజల్లో ఉన్న ప్రాముఖ్యం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. పీపుల్స్ అలియన్స్ ఫర్ క్రెడిబుల్ ఎలక్షన్స్ 2020లో నిర్వహించిన సర్వేలో 79 శాతం ప్రజలకు ఆమెపై నమ్మకం ఉందని తేల్చింది. ఇది గత సంవత్సరం కంటే 70 శాతం ఎక్కువ.
"ఆంగ్ సాన్ సూచీ కథ కేవలం ఆమె గురించి మాత్రమే కాకుండా మా అందరి గురించి కూడా. ఆమె ఏ మాత్రం మారి ఉండరు. ఆమె ఎప్పుడూ ఒకేలా ఉండి ఉండవచ్చు. ఆమె గురించి పూర్తి సంక్లిష్టతలు మాకు తెలియదు" అని అమెరికాకు మాజీ మియన్మార్ దౌత్యవేత్తగా పని చేసిన డెరెక్ మిచెల్ అన్నారు.
"ఎవరైనా వ్యక్తులను దిగ్గజాలుగా భావిస్తూ ప్రతిష్టను ఆపాదించే విషయంలో మనం జాగ్రత్తతో వ్యవహరించడం మాత్రం చాలా అవసరం" అని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా?
- బడ్జెట్లో ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?
- మదనపల్లె హత్యలు: కూతుళ్లను చంపిన కేసులో తల్లితండ్రులకు 14 రోజుల రిమాండ్...
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








