దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు? బీజేపీతో, డియోల్ కుటుంబంతో ఆయనకు సంబంధాలు ఉన్నాయా?

- రచయిత, సరబ్‌జీత్ సింగ్ ధాలివాల్, సునీల్ కటారియా
- హోదా, బీబీసీ ప్రతినిధులు
జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ ఏ మార్గాల్లో కొనసాగాలో ముందే నిర్ణయించుకున్నారు. అయితే, ఒక సమూహం మాత్రం నిర్ణయించిన మార్గంనుంచీ విడిపోయి ఎర్రకోటవైపు దారి తీసింది.
వారు ఎర్రకోట బురుజులపైకి చేరుకుని సిక్కుల సాంప్రదాయ జెండా 'నిషాన్ సాహిబ్', రైతుల ఐక్యతకు గుర్తుగా ఆకుపచ్చ-పసుపు జెండా ఎగురవేశారు.
ఇది జరుగుతున్నప్పుడు దీప్ సిద్ధూ అక్కడే ఉన్నారు. వీడియోలు తీస్తున్నారు. అప్పటినుంచీ ఆయన పేరు చర్చల్లోకొచ్చింది.
ఇంతకీ ఎవరు ఈ దీప్ సిద్ధూ? రైతుల ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి? రాజకీయ నాయకులతోనూ, సినిమావాళ్లతోనూ ఈయనకేంటి సంబంధం?
దీప్ సిద్ధూ - రైతుల ఆందోళనలు
దీప్ సిద్ధూ 2020 సెప్టెంబర్‌లో దిల్లీ సరిహద్దులవద్ద రైతులు చేస్తున్న ఆందోళనల్లో చేరారు. కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు.
దీప్, పోలీసులతో ఇంగ్లీష్‌లో వాదిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో దీప్ "ఇది ఒక విప్లవం. దీని తీవ్రతను వారు అర్థం చేసుకోలేకపోతే, ఈ విప్లవం ఈ దేశంలోని, దక్షిణ ఆసియాలోని భౌగోళిక రాజకీయాలను పునర్నిర్వచిస్తుంది" అని అన్నారు.
ఈ వీడియో తరువాత దీప్ సిద్ధూ పేరు జాతీయ స్థాయి వార్తల్లోకెక్కింది.
రైతు సంఘాలు అన్నీ దీప్ సిద్ధూనుంచీ దూరం ప్రకటించినప్పుడు సోషల్ మీడియాలో అనేక వాదోపవాదాలు జరిగాయి.
సామాజిక కార్యకర్త, న్యాయవాది సిరంజీత్ కౌర్ గిల్ రైతు సంఘాల నిర్ణయాన్ని సమర్థించారు. వారు అలా ప్రకటించడానికి కారణం ఉందని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, FB/Deep Sidhu
రైతు ఉద్యమంలో దీప్ సిద్ధు వైఖరి
రైతుల ఆందోళనలు ప్రారంభమైనప్పుడు దీప్‌తో సహా అందరూ.. రైతులకోసం ఉద్యమం చేస్తున్నామని, రైతు సంఘాల నాయకుల నేతృత్వంలో ఇందులో పాల్గొంటున్నామని తెలిపారు.
కానీ, కొంత సమయం తరువాత దీప్, రైతు సంఘాల నాయకుల నిర్ణయాలతో విభేదించడం మొదలుపెట్టారు. అంతే కాకుండా, సింఘు సరిహద్దు వద్ద తానే సొంతంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు.
దీప్ చేసే ప్రసంగాలు కొత్త వ్యవసాయ చట్టాలపై కాకుండా రాజ్యాంగంలోని సమాఖ్యేతర అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాయి.
ఈ కారణంగా దీప్ సింఘు బోర్డర్ వద్ద ప్రధాన వేదికపై ప్రసంగించకుండా రైతు సంఘాలు అడ్డుకున్నాయి.
దీప్, రైతు ఉద్యమం దిశను మార్చేస్తున్నారని రైతు సంఘాల్లోని ఉగ్రాహన్ గ్రూపు అభిప్రాయపడింది.
దీప్ తరచూ సోషల్ మీడియాలో జర్నైల్ సింగ్ భింద్రాన్వాలే గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఈ కారణంగా కూడా రైతు సంఘాలు ఆయన్ను దూరం పెట్టాయి.
దిల్లీ సరిహద్దులవైపు నడక సాగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చినప్పుడు, దీప్ ప్రజలను వెనక్కు వెళ్లిపొమ్మని, రైతు సంఘాలు తమ స్వప్రయోజనాల కోసం వారిని వాడుకుంటున్నారని పిలుపునిచ్చారు.
జనవరి 26న రైతులు ట్రాక్టర్ ర్యాలీని ప్రకటించిన వెంటనే దీప్ సిద్ధూ మళ్లీ చురుకుగా మారి ఈ ర్యాలీ కోసం ప్రజలను సమీకరించడం మొదలుపెట్టారు. దీప్, అవుటర్ రింగ్ రోడ్‌వద్ద ర్యాలీకోసం ప్రజలను సమీకరించారు.
ఇంతలో, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి, మరో భారతీయ వామపక్ష రైతు సంఘం (విప్లవ సంఘం).. ప్రణాళిక ప్రకారం దిల్లీ వెలుపల రింగ్ రోడ్డు దగ్గరే ర్యాలీ చేయాలని చెప్పారు.
దాంతో, దీప్ సిద్ధూకు పోలీసులతో కలిసి నిర్ణయించుకున్న మార్గంగుండా కాకుండా వేరే మార్గంనుంచీ ర్యాలీ చేసే అవకాశం చిక్కింది.
అయితే, ఈ ర్యాలీలో తాము దిల్లీ లోపలికి ప్రవేశిస్తామని, ముందే నిర్ణయించుకున్న మార్గంగుండా కాకుండా వేరే దారిలో వెళతామని సోమవారమే దీప్ సిద్ధూ, లక్ఖా సిధానా సింఘు బోర్డర్ ప్రధాన వేదికపై ప్రకటించారు.
అదే విధంగా మంగళవారం ర్యాలీ చేస్తున్న రైతులనుంచీ ఒక సమూహం విడిపోయి ఎర్రకోట చేరుకుంది. అందులో దీప్ సిద్ధూ ఉన్నారు.
ఎర్రకోటపై జెండాలు ఎగురవేస్తున్న సమూహంతో పాటుగా దీప్ కూడా అక్కడే ఉన్నారు. వీడియోలు తీస్తూ ఉన్నారు.
దీప్ సిద్ధూ వివరణ
ఎర్రకోట సంఘటన తరువాత దీప్ సిద్ధూ ఫేస్‌బుక్ లైవ్ ద్వారా తన వివరణ ఇచ్చారు.
"మేము ఏ జెండానూ కిందకు దించలేదు. మా 'నిషాన్ సాహిబ్', రైతుల ఐక్యత జెండాలను అక్కడ ఎగురవేసాం. ఇది మొత్తం రైతుల ఆక్రోశం... నా ఒక్కడిదీ కాదు. నేను ఎవరినీ ముందుకు తోయలేదు. ఇది అంతా ఒక ఊపులో జరిగింది. నేను ఎవ్వరినీ రెచ్చగొట్టలేదు" అని దీప్ తెలిపారు.

దీప్ సిద్ధూ - డియోల్ కుటుంబం
డియోల్ పరివారంతో దీప్‌కు ఉన్న సంబంధం గురించి సన్నీ డియోల్, దీప్ వేరు వేరుగా చెబుతున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి దీప్ సిద్ధు తీయించుకున్న ఫొటోల ఆధారంగా దీప్‌కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ అజెండాను ముందుకు తీసుకురావడమే అతని లక్ష్యమని కొందరు ఆరోపిస్తున్నారు.
అయితే, ఈ ఆరోపణలను దీప్ అనేకసార్లు ఖండించారు.
నరేంద్ర మోదీ, అమిత్ షాలతో దీప్ ఉన్న ఫొటోలను ప్రముఖ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.
దీప్ గతంలో ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ...సన్నీ డియోల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను బీజేపీతో జతపడి ఉన్నానని, బీజేపీ అగ్రనాయకులను కలిసి మాట్లాడానని తెలిపారు.
తనను బీజేపీలో చేర్చడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ సైద్ధాతికపరమైన విభేదాల కారణంగా అందుకు తాను అంగీకరించలేని దీప్ తెలిపారు.
దీప్ ఫేస్‌బుక్‌లో సన్నీ డియోల్, ఆయన తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డీయోల్‌తో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి.
అయితే ఎర్రకోట ఘటన తరువాత, "తనకు, తన కుటుంబానికి దీప్ సిద్ధూతో ఏ సంబంధం లేదని" సన్నీ డియోల్ ట్వీట్ చేసారు.
"ఈరోజు ఎర్రకోట పైన జరిగిన సంఘటన చాలా విచారకరం. నాకు, మా కుటుంబానికి దీప్ సిద్ధూతో ఎటువంటి సంబంధాలు లేవని డిసెంబర్ 6న నేను ఒక ట్వీట్ ద్వారా చెప్పేసాను" అని సన్నీ డియోల్ రాశారు.
తన డిసెంబర్ 6 ట్వీట్‌లో.. రైతుల ఉద్యమం, రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సమస్య అనీ చెప్తూ దీప్ సిద్ధూ గురించి కూడా సన్నీ డియోల్ ప్రస్తావించారు.
"ఎన్నికల ప్రచారం తరువాత చాలాకాలంగా దీప్ సిద్ధూను నేను కలవలేదు. ఆయన ఏం చేసినా, తన ఇష్టానుసారం చేస్తున్నారు. అందులో నాకేం సంబంధం లేదు" అని సన్నీ డియోల్ తెలిపారు.

ఫొటో సోర్స్, FB/Deep Sidhu
దీప్ సిద్ధూ కుటుంబ నేపథ్యం
దీప్ సిద్ధూ కుటుంబం పంజాబ్‌లోని ముక్త్సర్ జిల్లాలో ఉదేకరణ్ గ్రామానికి చెందినవారు.
దీప్ తండ్రి సర్దార్ సుర్జీత్ సింగ్ వృత్తిరీత్యా న్యాయవాది అనీ, తామంతా ఆరుగురు అన్నదమ్ములమని బటిండాలో నివసించే దీప్ చిన్నాన్న బిధీ సింగ్, బీబీసీకి చెప్పారు.
దీప్‌వాళ్లూ ముగ్గురు అన్నదమ్ములని..నవదీప్ కెనడాలో ఉన్నారని, మన్‌దీప్ న్యాయవాద వృత్తిలో ఉన్నారని, దీప్ రైతుల ఉద్యమంలో భాగం పంచుకుంటున్నారని ఆయన తెలిపారు.
దీప్ కుటుంబం రైతుల కుటుంబం అనీ, కానీ ఆయన తండ్రి లూధియానాలో న్యాయశాస్త్రం అభ్యసించి, లాయర్ వృత్తి చేపట్టారని, మూడేళ్లక్రితం ఆయన మరణించారని బిధీ సింగ్ తెలిపారు.
"దీప్ కూడా న్యాయశాస్త్ర విద్యను అభ్యసించడం కోసం పుణె వెళ్లారు. తరువాత ముంబయి చేరి అక్కడే లా చదువుకుని స్థిరపడ్డారు.
మొదట ముంబయిలోని బాలాజీ ఫిలింస్‌కు వకీలుగా పనిచేసారు. అలా సన్నీ డియోల్ కుటుంబానికి దగ్గరయ్యారు. తరువాత సినిమా ప్రపంచంలోకి కూడా ప్రవేశించారు" అని ఆయన చెప్పారు.
దీప్‌కు వివాహం అయ్యింది. ఒక కూతురు కూడా ఉంది.
సన్నీ డియోల్ పరివారంతో ఉన్న స్నేహం కారణంగానే దీప్, సన్నీ డియోల్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నారని, ఎర్రకోట సంఘటన గురించి మీడియా ద్వారానే తమకు సమాచారం అందిందని దీప్ చిన్నాన్న బిధీ సింగ్ తెలిపారు.
దీప్ సిద్ధూ సినీ ప్రయాణం
2017లో వచ్చిన 'జోరా 10 నంబరియా' సినిమాలో జోరా పాత్ర ద్వారా దీప్ సిద్ధూ పంజాబీలకు సుపరిచితమే.
దీప్, ముంబయిలో మోడలింగ్ చేస్తూ అనేక ఫ్యాషన్ షోలలో భాగం పంచుకున్నారు. తరువాత సినిమాల్లోకి ప్రవేశించారు.
డియోల్ కుటుంబం సొంత బ్యానర్ 'విన్నర్ ఫిలింస్’ కింద 2015లో వచ్చిన మొదటి పంజాబీ చిత్రం 'రమ్తా జోగీ'లో హీరోగా దీప్ సినీరంగ ప్రవేశం చేసారు. అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు.
తరువాత 2019లో ప్రముఖ పంజాబీ నటుడు గుగూ గిల్‌తో పాటుగా 'సాడే ఆలే' సినిమాలో దీప్ నటించారు.
2020లో విడుదల అయిన "జోరా సెకండ్ చాప్టర్' సినిమాలో దీప్ హీరోగా నటించారు. ఇందులో ధర్మేంద్ర, గుగూ గిల్ కూడా నటించారు. జోరాగా రెండు సినిమాల్లో కూడా దీప్ గ్యాంగ్‌స్టర్ పాత్ర పోషించారు.
ఇవి కూడా చదవండి:
- గీతా గోపీనాథ్‌పై అమితాబ్ బచ్చన్ ప్రశంసల మీద ఎందుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి?
- ఆంధ్రప్రదేశ్: హిందూ దేవతల విగ్రహాలు ధ్వంసం చేశానన్న ప్రవీణ్ చక్రవర్తి అసలు ఎవరు?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- ISWOTY - సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్: ఒడిశా నుంచి దూసుకొచ్చిన ఆఫ్-స్పిన్నర్
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








