కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?

కోడి రామ్మూర్తి నాయుడు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘‘కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ, జగదేకవీర, ఇండియన్ హెర్క్యులెస్, ఇండియన్ శాండో’’... ఇవన్నీ మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు పొందిన బిరుదులు.

దేశవిదేశాల్లో సాహస కృత్యాలు ప్రదర్శించి పేరు తెచ్చుకున్న కోడి రామ్మూర్తి నాయుడు. శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే చిన్నగ్రామంలో 1883 నవంబర్ 3న జన్మించారు.

కోడి రామ్మూర్తి నాయుడు బతికి ఉన్న రోజుల్లో ఆయన ప్రదర్శనలు, దానధర్మాల గురించి ప్రశంసిస్తూ రోజూ పత్రికల్లో వార్తలు వస్తుండేవని తమ పెద్దలు చెప్పేవారని వీరఘట్టం వాసులు అంటున్నారు.

కోడి రామ్మూర్తి నాయుడు

పెంకితనంతోనే మద్రాసు వరకూ...

మల్లయోధుడు కోడి రామ్మూర్తి పుట్టిన ఊరిలోనే తాము పుట్టామని వీరఘట్టం వాసులు ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటారు.

వీరఘట్టంలోని తెలగవీధికి చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తి జన్మించారు. ఆయన పుట్టి, పెరిగిన ఇల్లు ఇప్పటికీ ఉంది.

అందులో ఆయన మనుమడి కుటుంబం నివసిస్తోంది. రెండో తరగతి వరకు రామ్మూర్తి వీరఘట్టంలోని కూరాకులవీధి పాఠశాలలో చదువుకున్నారు.

''మేం చదువుకునేటప్పుడు తెలుగు పుస్తకంలో ఆయన గురించి పాఠ్యాంశం కూడా ఉండేది. అందులో వీరఘట్టం అని పేరు చూసినప్పుడు, మాకు ఎంతో సంతోషంగా అనిపించేంది. మా తాతలు, తండ్రులు కూడా ఆయన గురించి అనేక విషయాలు చెప్పేవారు'' అని తెలగవీధిలోని రామ్మూర్తినాయుడు ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న మన్మథరావు బీబీసీతో చెప్పారు.

"రామ్మూర్తినాయుడుకు చదువుపై పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. బడికి వెళ్లకుండా నిత్యం వ్యాయామాలు చేస్తూ... వీరఘట్టానికి సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దే ఎక్కువగా గడిపేవారు. అరకిలోమీటరు పొడవుండే చెరువుని రామ్మూర్తి గారు ఆగకుండా సునాయసంగా ఐదారుసార్లు ఈదేసేవారు. రాజ చెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఓ సాధువు రామ్మూర్తి గారిని పిలిచి మంత్రోపదేశం చేశారని, అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందని మా పెద్దలు చెప్పారు. ఆ సాధువు వద్దే రామ్మూర్తిగారు వాయు స్తంభన, జల స్తంభన విద్యను నేర్చుకున్నారట'' అని ఆయన వివరించారు.

''మరోవైపు ఊర్లో అందరూ పెంకి పిల్లాడు అని...రామ్మూర్తి గురించి ఆయన తండ్రికి ఫిర్యాదులు చేసేవారు. దీంతో తండ్రి వెంకన్న బాల్యంలోనే కొడుకుని చదువు కోసం వీరఘట్టం నుంచి విజయనగరంలో ఉన్న అతని సోదరుడి ఇంటికి పంపించారు. అక్కడ కూడా రామ్మూర్తి విద్య కంటే కసరత్తులు, దేహదారుఢ్యంపైనే ఆసక్తి చూపేవారు. దాంతో రామ్మూర్తిని తండ్రి మద్రాసు వ్యాయామ కళాశాలలో చేర్పించారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత రామ్మూర్తినాయుడు విజయనగరంలో అనేక మల్లయుద్ధ ప్రదర్శనలు చేసేవారు. ఆ ప్రదర్శనలు ఆయనకి ఎంతో కీర్తిని తెచ్చాయి. ఆ విషయం విన్న పూసపాటి అలకానంద గజపతి రాజు అప్పుడే ప్రారంభించిన మహారాజ కళాశాలలో కొంతకాలం వ్యాయామ శిక్షకుడిగా ఉద్యోగం ఇచ్చారని మా తండ్రి చెప్పారు" అని మన్మథరావు చెప్పారు.

కోడి రామ్మూర్తి నాయుడు

స్నేహితుడి సలహాతో సర్కస్ కంపెనీ

వీరఘట్టం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉంది. రామ్మూర్తి నాయుడు పుట్టిన సమయానికి అది విశాఖ జిల్లా పాలకొండ తాలుకాలో ఉండేది. అందుకే రామ్మూర్తినాయుడిని ఇటు విశాఖ జిల్లా వాసులు, అటు శ్రీకాకుళం జిల్లా వాసులు తమవాడేనని గర్వంగా చెప్పుకుంటారు.

రామ్మూర్తి మద్రాసు వ్యాయమ శిక్షణశాలలో పాశ్చాత్య వ్యాయామ విద్యను సైతం నేర్చుకున్నారు. పార్లల్ బార్, హారిజెంటల్ బార్, రోమన్ రింగ్స్ వంటివి చేయడంలో బాగా నేర్పు సాధించారు.

పాశ్చాత్య శైలికి, భారత శైలిని జోడించి రామ్మూర్తి ఆ రోజుల్లోనే సరికొత్త వ్యాయామాలు రూపొందించారు. వాటిని ప్రదర్శిస్తూ ఎంతో పేరు సంపాదించారు.

విజయనగరంలో ఉద్యోగం చేస్తూనే అనేక మల్లయుద్ధ పోటీలలో రామ్మూర్తి పాల్గొనేవారు. ఆ సమయంలో రామ్మూర్తికి పొట్టి పంతులు అనే వ్యక్తితో స్నేహం ఏర్పడింది.

రామ్మూర్తి శారీరక బలం, తెగువని గుర్తించిన పొట్టి పంతులు... సర్కస్ కంపెనీ పెట్టమని ఆయనకు సలహా ఇచ్చారని రామ్మూర్తి గురించి పరిశోధనలు చేసిన ముల్లంగి వెంకటరమణారెడ్డి బీబీసీతో చెప్పారు.

"విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సలహా, సహకారంతో రామ్మూర్తి సర్కస్ కంపెనీ నెలకొల్పారు. రామ్మూర్తి సర్కస్ కంపెనీ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకుంది. 1912లో మద్రాసులో సర్కస్‌ను ఏర్పాటు చేశారు. పులులు, ఏనుగులు, గుర్రాలతో రామ్మూర్తి చేసే బల ప్రదర్శనలు అందరినీ ఆకర్షించేవి'' అని ఆయన వివరించారు.

''శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ముక్కలు చేయడం, రెండు కార్లను భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని... వాటిని కదలకుండా చేయడం, ఛాతీపై ఏనుగును ఎక్కించుని 5 నిమిషాల పాటు అలాగే ఉండటం వంటి ప్రదర్శనలు చూసేందుకు రామ్మూర్తి సర్కస్ ఎక్కడుంటే అక్కడికి తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చేవారు. సర్కస్ కంపెనీ ద్వారా రామ్మూర్తి నాయుడు కోట్ల రూపాయలు సంపాదించారు" అని వెంకటరమణారెడ్డి చెప్పారు.

కోడి రామ్మూర్తి నాయుడు

బ్రిటన్ రాజు, రాణి ముందు కూడా...

దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఆసియాలోని జపాన్, చైనా, మయన్మార్ దేశాల్లో కూడా రామ్మూర్తి నాయుడు ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన ప్రదర్శనలను సామాన్య ప్రజలతో పాటు రాజులు, రాజ్యాధినేతలు, నాయకులు ఇలా అందరూ ఎంతో ఆసక్తి చూపేవారు.

''ఆ క్రమంలోనే రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చిన ప్రతిచోటా అయనకు అనేక బహుమతులు, బిరుదులు ఇచ్చేవారు. లోకమాన్య తిలక్‌ కోరిక మేరకు పుణెలో రామ్మూర్తి ప్రదర్శన ఇచ్చారు. ఆ ప్రదర్శన చూసి ఆశ్చర్యపోయిన తిలక్‌...రామ్మూర్తికి మల్లమార్తాండ, మల్లరాజ తిలక్ అనే బిరుదులిచ్చారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రదర్శన అనంతరం ఆంధ్రభాషా నిలయం పెద్దలు సత్కారం చేసి 'జగదేకవీర' బిరుదునిచ్చారు'' అని ముల్లంగి వెంకటరమణా రెడ్డి చెప్పారు.

''1600 మంది సభ్యులున్న తన బృందంతో లండన్ వెళ్లి రామ్మూర్తి ప్రదర్శనలు ఇచ్చారని... అక్కడ బ్రిటన్ రాజు జార్జ్, రాణి మేరీ రామ్మూర్తి ప్రదర్శనలను మెచ్చుకుని 'ఇండియన్‌ హెర్క్యులస్‌' అనే బిరుదునిచ్చారు'' అని వివరించారు.

కోడి రామ్మూర్తి నాయుడు

'హత్యాయత్నాలు'

"రామ్మూర్తి నాయుడు సర్కస్ కంపెనీకి అనేక దేశాల్లో ఆదరణ వచ్చింది. దాంతో భారతదేశానికి, పుట్టిన ఊరికి రావడానికి కూడా ఆయనకు కుదిరేది కాదు. రామ్మూర్తి ఓసారి స్పెయిన్‌లో కూడా సర్కస్‌ను ఏర్పాటు చేశారు. స్పెయిన్ బుల్ ఫైట్‌కు చాలా ప్రసిద్ధి. రామ్మూర్తిని అందులో పాల్గొనాలని ఆ దేశ ప్రతినిధులు కోరారు. బుల్ ఫైట్‌లో ఎలాంటి అనుభవం లేకపోయినా, రామ్మూర్తి వారి కోరికను అంగీకరించి రంగంలోకి దిగారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో కింద పడేశారు" అని ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు తాను రచించిన 'కోడి రామ్మూర్తి బతుకు-భావి యువతకు మేలుకొలుపు' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

"రామ్మూర్తికి పేరు ప్రఖ్యాతులతో పాటు శత్రువులు కూడా పెరిగారు. బర్మాలో ప్రదర్శన ఇచ్చినప్పుడు కొందరు ఆయన్ను చంపాలనుకున్నారు. విషయం గ్రహించిన రామ్మూర్తి ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. అంతకు ముందు కూడా వేర్వేరు ప్రదర్శనల సందర్భంగా ఆయనపై హత్యాయత్నాలు జరిగాయి. లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు బలహీనమైన చెక్కను ఛాతీపై పెట్టారు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది'' అని వివరించారు.

''మాస్కోలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఆయన విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. వరుస హత్యాయత్నాల నేపథ్యంలో విదేశీ ప్రదర్శనలకు రామ్మూర్తి స్వస్తి చెప్పారు. స్వదేశంలోనే వ్యాయామం, మల్లయుద్ధంలో యువకులకు శిక్షణ ఇస్తూ గడిపారు. అప్పటీకే రామ్మూర్తి ఎన్నో కోట్ల ఆస్తి సంపాదించారు. అయితే దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఆయన సంపాదనంతా ఇచ్చేసేవారు. దాంతో ఆస్తి క్రమంగా కరిగిపోయింది. కొన్నాళ్ల తర్వాత రామ్మూర్తి రాచపుండు బారినపడ్డారు. వైద్యులు ఆయన కాలును తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు కూడా మత్తుమందు తీసుకోకుండానే ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారు" అని అవసరాల రామకృష్ణారావు పుస్తకంలో రాశారు.

కోడి రామ్మూర్తి నాయుడు

సంక్రాంతి రోజున....

కోడి రామ్మూర్తి మూడో తరం వారసులు వీరఘట్టంలోనే ఉంటున్నారు. బ్రహ్మచారైన కోడి రామ్మూర్తి తన అన్నదమ్ముల పిల్లలనే సొంత పిల్లలుగా భావించేవారు.

వీరఘట్టంలోని తెలగవీధిలో రామ్మూర్తి పుట్టిన ఇల్లు, ఆయన అన్నదమ్ముల ఇళ్లలో మూడోతరం వారసులు నివసిస్తున్నారు. వీరు రామ్మూర్తినాయుడు గురించి తమ తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న విషయాలను బీబీసీతో చెప్పారు.

"రామ్మూర్తి నాయుడు మా తాతయ్య అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. మాది వీరఘట్టం అనగానే అందరూ మమ్మల్ని కోడి రామ్మూర్తి గురించే అడుగుతారు. ఆయన మా తాతయ్య అని చెబితే... ఆసక్తిగా అనేక విషయాలు అడుగుతారు. మా తల్లిదండ్రులు రామ్మూర్తి నాయుడి విన్యాసాలు, సాహసాల గురించి చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపించేది. ఎంతో కీర్తి, ధనం సంపాదించిన మా తాతయ్య తన చివరి రోజుల్లో ఒరిస్సా పరగణాల ప్రభువులు ఇచ్చే ఆర్థిక సహాయంతో బతికారని తెలుసుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది. చివరి రోజుల్లో బలంగీర్ ప్రభువు పోషణలో కొందరు శిష్యులతో కలిసి ఉన్నారు. అక్కడ 1942 భోగి పండుగ రోజు రాత్రి పడుకుంటూ తనకి తలనొప్పిగా ఉందని... తాను లేచే వరకూ ఎవరూ లేపవద్దని శిష్యులకు చెప్పి వారిని పంపించేశారు. మరునాడు సంక్రాంతి. కానీ, ఆయన నిద్ర లేవలేదు. ఆ రోజునే ఆయన స్వర్గానికి చేరుకున్నారు" అని తమ తల్లిదండ్రులు చెప్పారని వారు వివరించారు.

కోడి రామ్మూర్తి నాయుడు

కోడి రామ్మూర్తి బయోపిక్?

కోడి రామ్మూర్తి జీవిత కథతో సినిమా తీయబోతున్నారని, ఆయన పాత్రలో ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా నటించబోతున్నారని రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి.

గత ఏడాది కొంత మంది సినిమా వాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడి పరి స్థితులపై ఆరా తీశారని, రామ్మూర్తి జీవిత విశేషాలను తెలుసుకున్నారని వీరఘ్టటం వాసులు చెప్పారు.

కొందరు పది రోజుల పాటు వీరఘట్టంలోనే ఉండి కోడి రామ్మూర్తి జీవిత విశేషాలకు సంబంధించిన ప్రాంతాల్లో తిరిగి వీడియోలు, ఫోటోలు కూడా తీసుకున్నారని అన్నారు.

అయితే, ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఎటువంటి వార్తా రాలేదు.

రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర తెరకెక్కితే, ఆయన గురించి నేటి తరం వారందరికీ తెలుస్తుందని వీరఘట్టం వాసులు అంటున్నారు.

కోడి రామ్మూర్తి నాయుడు

'దండలు, దండాలకే పరిమతమయ్యారు'

ఇటు శ్రీకాకుళం, అటు విజయనగరం జిల్లాల్లో కోడి రామ్మూర్తి స్మృతులను పదిలపరిచే చర్యలేమీ ప్రభుత్వాలు తీసుకోలేదని, ఆయనకు ఇంతవరకూ సరైన నివాళి కూడా ఇవ్వలేదని ఆయన అభిమానులు అంటున్నారు.

"కోడి రామ్మూర్తినాయుడు పుట్టిన వీరఘట్టంలో, విశాఖ, శ్రీకాకుళం పట్టణాల్లో ఆయన విగ్రహాలు పెట్టారు. ఏయూలో జిమ్‌కు, శ్రీకాకుళంలో స్టేడియానికి ఆయన పేరు పెట్టారు. అంతకుమించి ఆయన్ను స్మరించుకునేందుకు ఏమీ చేయలేదు. విగ్రహాలు పర్యవేక్షణ లోపంలో పాడైపోయాయి. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడేళ్ల క్రితం పునర్నిర్మాణం పేరుతో స్టేడియం గోడలను కూల్చేశారు. ప్రస్తుతం అది వాహనాల పార్కింగ్‌ స్థలంగా, తాగుబోతుల నిలయంగా ఉంది. ఇప్పటీకి నిధుల కొరత పేరుతో దానిని పూర్తి చేయలేదు. ఆయన వర్థంతికి, జయంతికి మాత్రం దండలు వేయడం, దండాలు పెట్టడం తప్ప ప్రజాప్రతినిధులు చేసిందేమీ లేదు" అని కోడి రామ్మూర్తి అభిమాని శేషాద్రి ఆవేదన వ్యక్తం చేశారు.

"ఒక క్రీడాకారుడిగా, జిల్లా వాసిగా కోడి రామ్మూర్తి నాయుడి విజయాలను అందరికి తెలియజేసే బాధ్యత నాపై ఉంది. పునర్నిర్మాణం పేరుతో స్టేడియంను పడగొట్టారు. ఇప్పుడు రూ.15 కోట్ల నిధులతో పనులు ప్రారంభించాం. బిల్లుల చెల్లింపులు, డిజైన్లలో మార్పులు, కరోనా కారణంగా ఆలస్యం జరుగుతోంది. పనులు పూర్తి చేసి ఈ స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతాం" అని రాష్ట్ర మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)