సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?

సింగపూర్ ఇల్లు
    • రచయిత, వెట్టి టాన్
    • హోదా, బీబీసీ న్యూస్, సింగపూర్

సింగపూర్ నడిబొడ్డున నింగినంటే భారీ భవంతుల నడుమ వాటిని ధిక్కరిస్తున్నట్లుగా రెండు ఇళ్లు కనిపిస్తాయి.

అప్ అనే కార్టూన్ మూవీలో చుట్టూతా ఆకాశహర్మ్యాల మధ్య ఒక చిన్న ఇంట్లో నివసించే వృద్ధుడు తన ఇంటిని అక్కడి నుంచి తరలించటానికి ఏమాత్రం ఒప్పుకోడు. సింగపూర్‌లోని ఈ రెండు ఇళ్లను చూడగానే ఆ సినిమాలోని ఆ ఇళ్లు, ఆ వృద్ధుడు, అతడి తిరస్కారం గుర్తుకొస్తాయి.

నిజంగానే ఈ రెండు ఇళ్ల యజమానులు కూడా అలాగే తిరస్కరిస్తున్నారు. అక్కడి నుంచి ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్తే కోట్లు గుమ్మరిస్తామన్నా ససేమిరా అంటున్నారు.

అయితే.. అప్ సినిమాలోని కార్టూన్ హీరో చివరికి అక్కడి నుంచి తరలిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కానీ ఈ ఇళ్ల యజమానులు మాత్రం అంగుళం కూడా కదలబోమని తేల్చిచెప్పారు.

అందుకే ఆ ఇళ్లకు ‘నెయిల్ హౌసెస్’ అని పేరువచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల అభివృద్ధికి తలొగ్గని ఇళ్లను ఇలా పిలుస్తారు.

సింగపూర్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, ఇంటి ముందు స్థలాన్ని గార్డెన్‌గా మార్చారు

‘ఇలాంటి ఇల్లు నాకిక దొరకదు’

‘‘కొంటామంటున్న వాళ్లు ఎన్ని డబ్బులిస్తారనే దానితో నాకు సంబంధం లేదు. నా ఇంటిని నేను అమ్మను’’ అని చెప్పాడు ఆ రెండిళ్లలో ఒక ఇంటి యజమాని. ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన ఇంటి చిరునామా.. 54 లోరాంగ్ 28 గేలాంగ్.

‘‘ఇంటి ముందు ఖాళీ స్థలాన్ని తోటగా మార్చాను. మొక్కలు నాటాను. చేపలు, పక్షులను పెంచుతున్నాను. నగరం నిద్ర లేవటానికి ముందే నేనీ తోటలో లేచి కూర్చుంటాను’’ అని ఆయన అన్నారు.

‘‘ఇటువంటి ఇల్లు ఇప్పుడు దొరకదు. ఇది సొంత ఇల్లు. మా సొంత ఇల్లు.’’

బౌద్ధ ప్రార్థనా స్థలంగా ఈ ఇల్లును ఉపయోగిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, బౌద్ధ ప్రార్థనా స్థలంగా ఈ ఇల్లును ఉపయోగిస్తున్నారు

అసలు సమస్య

సింగపూర్‌లో సొంత యాజమాన్యంలోని భూమి చాలా విలువైనది. ఇక్కడ ఒక చదరపు కిలోమీటరు పరిధిలో దాదాపు 8,000 మంది ఇరుకుగా జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెప్తున్నాయి. ఇటువంటి నగరంలో ఖాళీ జాగా అనేది అత్యంత అరుదు.

సింగపూర్ 1965లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచీ ఇప్పటివరకూ తన భూభాగాన్ని 20 శాతం పైగా విస్తరించుకుంది. పొరుగుదేశాల నుంచి ఇసుక దిగుమతి చేసుకుని దానిని ఉపయోగించి భూభాగాన్ని విస్తరించుకుంది. అయినా ఇంకా స్థలం కొరత తీవ్రంగానే ఉంది.

నోమా అభివృద్ధి ఊహా చిత్రం

ఫొటో సోర్స్, The Macly Group

ఫొటో క్యాప్షన్, నోమా అభివృద్ధి ఊహా చిత్రం

అంతేకాదు.. సింగపూర్‌లో రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ పనులు చాలా వరకూ ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న భూములపైనే జరుగుతాయి. అంటే.. లీజు ముగిసిన తర్వాత ఆ భూమి ప్రభుత్వానికి తిరిగి చెందుతుంది.

అయితే సొంత భూముల్లో కట్టుకున్న ఆస్తులు.. వాటి యజమానులకే శాశ్వతంగా చెందుతాయి. కాబట్టి ఆ ఇళ్లను చాలా అధిక ధరలకు అమ్ముకోవచ్చు.

ప్రస్తుత వ్యవహారంలో.. మాక్లీ గ్రూప్ అనే ప్రాపర్టీ డెవలపర్ ఈ భూమి ముక్కను ‘ద నోమా’ అనే పేరుతో 50 యూనిట్లుంటే మూడు అపార్ట్‌మెంట్ భవనాలను నిర్మించాలని ప్లాన్ చేసింది. ఇక్కడ ఒక నాలుగు బెడ్‌రూమ్‌ల యూనిట్ ధర కనీసం 13.6 లక్షల డాలర్లు ఉంటుంది.

ఊహాచిత్రం

ఫొటో సోర్స్, The Macly Group

ఫొటో క్యాప్షన్, ఊహాచిత్రం

మొత్తం 13,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ప్లాటును డెవలప్ చేయడానికి మాక్లే గ్రూప్ అక్కడున్న ఏడు ఇళ్లను కొనుగోలు చేసి, ఆ ఇళ్లను కూల్చివేయాల్సి ఉంటుందని స్ట్రెయిట్స్ టైమ్స్ ఒక కథనంలో వివరించింది.

వాటిలో ఎన్ని ఇళ్లను కొనుగోలు చేశారు, ఎంత ధరకు కొన్నారు అనే అంశంపై స్పందించటానికి మాక్లే గ్రూప్ నిరాకరించింది. అయితే.. ఆ ఏడు ఇళ్లలో ఐదు ఇళ్లను ఆ సంస్థ 205.50 లక్షల సింగపూర్ డాలర్లకు కొనుగోలు చేసిందని పలు మీడియా కథనాలు చెప్తున్నాయి.

చివరికి మిగిలిన రెండు ఇళ్ల యజమానులు అక్కడి నుంచి కదలటానికి తిరస్కరించారు. ఒక ఇల్లు ప్రధాన రహదారికి అభిముఖంగా ఉంటే.. రెండో ఇల్లు పక్క వీధికి అభిముఖంగా ఉంది. వీరి ధిక్కారంతో డెవలపర్ ప్లాన్లు మార్చుకోవాల్సి వచ్చింది.

తరలించేందుకు సిద్ధపడని రెండు ఇళ్లు (పసుపు కలర్ మార్కింగ్)

ఫొటో సోర్స్, Google Maps

ఫొటో క్యాప్షన్, తరలించేందుకు సిద్ధపడని రెండు ఇళ్లు (పసుపు కలర్ మార్కింగ్)

‘‘ఫలితంగా మేం ఒరిజనల్ డిజైన్లను అమలు చేయలేకపోయాం. అపార్ట్‌మెంట్ భవనాలకు దారుల కోసం డిజైన్‌ను మొత్తం మార్చాల్చి వచ్చింది’’ అని మాక్లీ గ్రూప్ అధికార ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

అలా ఈ ఇళ్లు సింగపూర్ నగరంలో తాజా నెయిల్ హౌస్‌లుగా మారాయి. చైనీస్ భాషలో డింగ్‌జిహు అంటారు.

అయితే ఇక్కడ కళ్లకు కనిపించేదానికన్నా లోతైన విషయాలున్నాయి. 337 గిలిమార్డ్ రోడ్ లోని కట్టడం.. నోమా డెవలప్‌మెంట్ మధ్యలో ఉంటుంది. నిజానికి ఇది ఇల్లు కాదని, ఒక బౌద్ధ ఆలయ మందిరం అని, ఆ కట్టడం యజమాని కుటుంబానికి, మిత్రులకు మాత్రమే దానిని తెరిచేవారని చెప్తున్నారు.

నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌కు చెందిన ప్రొఫెసర్ హో పే-పెంగ్ కథనం ప్రకారం.. ప్రైవేటు ఇళ్లను మత ప్రాంతాలుగా ఉపయోగించటం అరుదైన విషయమేమీ కాదు. చిన్నపాటి మత సంస్థలకు పెద్ద భవనాలను కొనుగోలు చేసేంత ఆర్థిక వెసులుబాటు ఉండకపోవచ్చు.

‘‘మొత్తం సింగపూర్‌లోకెల్లా.. గేలాంగ్‌లో చిన్న మత సంస్థలు అత్యధిక సాంద్రతలో ఉండివుండొచ్చు. అటువంటి వారు ఒక ఇంట్లో ఒక అంతస్తును మత వేదికగా మార్చుకోవటం అసాధారణం కాదు’’ అని ప్రొఫెసర్ హో పేర్కొన్నారు.

బీబీసీ గత నెలలో ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు.. ఒక మధ్యవయస్కుడు ఇంటర్వ్యూ విజ్ఞప్తిని తిరస్కరించారు.

లగ్జరీ అపార్ట్‌మెంట్ల మధ్య ఈ ఇల్లు శాండ్‌విచ్ అయిపోతుంది
ఫొటో క్యాప్షన్, లగ్జరీ అపార్ట్‌మెంట్ల మధ్య ఈ ఇల్లు శాండ్‌విచ్ అయిపోతుంది

ఈ లక్జరీ అపార్ట్‌మెంట్ల నిర్మాణం పూర్తయినపుడు.. ఆ ఫ్లాట్ల నీడలో సదరు ఆలయ మందిరం ఉంటుంది. ఈ ఫ్లాట్ల నివాసులు పై నుంచి ఆ ఇంటిని చూడగలరేమో.

ఈ రెండు కట్టడాలు మరొక కారణం వల్ల కూడా విశిష్టంగా కనిపిస్తాయి. సింగపూర్‌లో నెయిల్ హౌస్‌లు అరుదు. చైనాలో ఇటువంటివి చాలా సాధారణం. చాంగ్షాలో ఒక షాపింగ్ మాల్ మధ్యలో ఒక ఇల్లు అలాగే ఉంది. షాంఘైలో ఒక రోడ్డు నడి మధ్యలో ఒక ఇల్లు 14 ఏళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత దానిని కూల్చివేశారు.

‘‘సింగపూర్‌లో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించటానికి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ జారీ చేసిన ప్రణాళికా మార్గదర్శకాలు ప్రయత్నిస్తాయి’’ అని ప్రొఫెసర్ హో వివరించారు.

దక్షిణ చైనాలో 2015లో ఒక నెయిల్ హౌస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దక్షిణ చైనాలో 2015లో ఒక నెయిల్ హౌస్

‘‘ఉదాహరణకు.. టెర్రాస్ ఇళ్లను ప్లాట్లుగా పునరభివృద్ధి చేయాలనుకుంటే.. నిర్దిష్ట కనీస పరిమాణం, భద్రతాచర్యలు ఉంటాయి. ప్రస్తుత ఉదంతంలో ఆ రెండు ఇళ్ల యజమానులు తమ చుట్టూ అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని అంగీకరించి ఉండొచ్చు. లేదంటే ఈ అపార్ట్‌మెంట్ డెవలప్‌‌మెంట్ ప్లాన్ ముందుకు సాగగలిగేది కాదు’’ అని ఆయన చెప్పారు.

‘‘మా ప్రణాళికలను అమలు చేయటానికి ఆ రెండు ఇళ్ల యజమానులకు అభ్యంతరం లేదు’’ అని మాక్లీ గ్రూప్ బీబీసీకి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)