INDvsAUS: సిడ్నీ టెస్ట్ డ్రా.. సిరీస్‌లో సమ ఉజ్జీలుగా నిలిచిన భారత్, ఆస్ట్రేలియా.. కీలకంగా మారిన నాలుగో టెస్ట్

రిషబ్ పంత్

ఫొటో సోర్స్, EPA/DEAN LEWINS

ఫొటో క్యాప్షన్, రిషబ్ పంత్

భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. చివరి టెస్ట్ జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌లో జరుగుతుంది.

సిడ్నీ టెస్ట్‌లో చివరి రోజు భారత్ విజయం కోసం 407 పరుగులు చేయాల్సి వచ్చింది. కానీ, ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అయితే, జట్టులో చాలామంది ఆటగాళ్లు గాయాలబారిన పడడంతో భారత్ మ్యాచ్ డ్రా చేయడమే పెద్ద విషయంగా నిలిచింది.

సిడ్నీ టెస్ట్ ఐదో రోజు చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ భాగస్వామ్యం మ్యాచ్‌ ఫలితం మీద ఆసక్తిని రేకెత్తించింది.

కానీ, ఇద్దరూ అవుట్ అవడంతో చివరివరకూ ఆచితూచి ఆడిన అశ్విన్, హనుమ విహారి మ్యాచ్‌ను డ్రా చేశారు. వీరిద్దరూ 62 పరుగులు భాగస్వామ్యం అందించారు.

గాయపడ్డ విహారి 161 బంతుల్లో 23 పరుగులు చేయగా, అశ్విన్ 128 బంతుల్లో 39 పరుగులు చేశాడు.

అంతకు ముందు పుజారా, పంత్ ఐదో వికెట్‌కు 148 పరుగుల మంచి భాగస్వామ్యం అందించారు.

రిషబ్ పంత్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో అవుటవగా, పుజారా 77 పరుగులు చేశాడు.

పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 పరుగులు, ఆచితూచి ఆడిన పుజారా 205 బంతుల్లో 77 పరుగులు చేశారు.

ఆస్ట్రేలియా బౌలింగ్

ఫొటో సోర్స్, Getty Images

మ్యాచ్ చివరి రోజు భారత జట్టు ప్రారంభం సరిగా లేదు. మ్యాచ్ మొదలైన రెండో ఓవర్లోనే కెప్టెన్ అజింక్య రహానే అవుట్ అయ్యాడు. రహానే నాలుగోరోజు తన స్కోరుకు(04) ఒక్క పరుగు కూడా జోడించకుండానే పెవిలియన్ చేరాడు.

రహానే తర్వాత బరిలోకి దిగిన రిషబ్ పంత్ జట్టులో ఆశలు నింపాడు. రవీంద్ర జడేజాతోపాటూ పంత్ కూడా గాయపడడంతో అతడు అసలు బ్యాటింగ్‌కు దిగుతాడని ఊహించలేదు.

రెండో ఇన్నింగ్స్‌లో మంచి ప్రారంభం అందించిన రోహిత్ శర్మ(52), శుభ్‌మన్ గిల్(31) మొదటి వికెట్‌కు 71 పరుగులు చేశారు.

కానీ అదే స్కోర్ దగ్గర శుభ్‌మన్ అవుట్ అయ్యాడు. తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా అవుటవడంతో నాలుగో రోజు ముగిసేసరికి భారత్ 98 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో నిలిచింది.

నాలుగో రోజు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు భారత బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ ఆస్ట్రేలియా ప్రేక్షకుల నుంచి మరోసారి అసభ్యకరమైన మాటలు వినాల్సి వచ్చింది. దాంతో ఆటను 10 నిమిషాలు ఆపేశారు.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కామెరన్ గ్రీన్ 84, స్టీవ్ స్మిత్ 81, లాబుషేన్ 73, కెప్టెన్ టిమ్ పేన్ 39 (నాటౌట్) పరుగులు చేయడంతో ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 312 పరుగుల దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో చివరి 20 ఓవర్లలో కెప్టెన్ టిమ్, కామెరన్ గ్రీన్‌తో కలిసి 104 పరుగులు జోడించాడు.

దీంతో ఆ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి భారత్‌ను త్వరగా బ్యాటింగ్‌కు దించడం సులభమైంది. విజయం కోసం భారత్‌ 407 పరుగులు చేయాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా బౌలింగ్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ చెత్త ఫీల్డింగ్, అంపైర్ల తప్పిదాలు

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో మొహమ్మద్ సిరాజ్‌పై ప్రేక్షకుల అభ్యంతరకర వ్యాఖ్యలతోపాటూ, భారత జట్టు చెత్త ఫీల్డింగ్‌ గురించి కూడా జోరుగా చర్చ జరిగింది.

హనుమ విహారి, రోహిత్ శర్మ, అజింక్య రహానే మూడు సులభమైన క్యాచ్‌లను వదిలేశారు.

ఆ తర్వాత భారత్ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మకు 13 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర హేజల్‌వుడ్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్‌బీడబ్ల్యూ ఇచ్చారు. కానీ రోహిత్ డీఆర్ఎస్ తీసుకోవడంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది.

అయితే, ఓపెనర్లు ఇద్దరూ నిలకడగా ఆడుతున్న సమయంలో హేజల్‌వుడ్ బంతికే గిల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అప్పుడు కూడా గిల్ డీఆర్ఎస్ తీసుకున్నాడు. కానీ ఫీల్డ్ అంపైర్ నిర్ణయమే కరెక్ట్ అని తేలింది.

అదే ఓవర్లో బరిలోకి దిగిన పుజారాకు కూడా అంపైర్ ఎల్‌బీడబ్ల్యు ఇచ్చాడు. కానీ అతడు కూడా డీఆర్ఎస్ తీసుకున్నాడు. బంతి వికెట్ల మీద నుంచి వెళ్తున్నట్టు గమనించిన థర్డ్ అంపైర్ దానిని నాటౌట్‌గా చెప్పడంతో ఫీల్డ్ అంపైర్ మళ్లీ నాటౌట్ ఇచ్చాడు.

ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)