అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది? అక్కడి రైతులు ఏమంటున్నారు?

వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికాలోని ఉత్తర కరోలినాలో విలియమ్ థామస్ బట్లర్ అనే ఆయన పందుల పెంపకం సాగిస్తున్నారు.

1995లో పంది మాంసం ప్రొసెసింగ్ చేసే ఓ సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు.

‘‘ఒప్పందం చేసుకున్న సంస్థపై మనం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటాం. ఏటా ఎంత లాభం రావాలన్నదాని గురించి వాళ్లు చెప్పారు’’ అని బట్లర్ అన్నారు.

దాదాపు ఆరు లక్షల డాలర్ల రుణం తీసుకుని 108 ఎకరాల విస్తీర్ణంలో ఆరు పెద్ద ఫామ్‌లను బట్లర్ నిర్మించారు.

మొదటి ఐదారేళ్లు వార్షికంగా 25 వేల నుంచి 30 వేల డాలర్ల దాకా లాభం వచ్చింది. దీంతో మరో నాలుగు ఫామ్‌లు కట్టారు.

పందుల పెంపకం

హెచ్చుతగ్గులు

అయితే, ఆ తర్వాత పరిస్థితి మారడం మొదలైందని బట్లర్ అన్నారు.

‘‘వ్యర్థాల నిర్వహణ గురించి సంస్థ శిక్షణ ఇస్తామని చెప్పి, ఇవ్వలేదు. నా చిన్న ఫామ్‌లో రోజూ 10 వేల గ్యాలన్ల వ్యర్థాలు ఏర్పడేవి. ఈ విషయం తెలిసి ఉంటే, 1995లో ఎవరూ ఈ ఒప్పందం చేసుకునేవారు కాదు. మాకు ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు’’ అని ఆయన అన్నారు.

ఆదాయంలో హెచ్చుతగ్గులు రావడంతోపాటు ఒప్పందం ప్రకారం కొన్ని బాధ్యతలను కూడా బట్లర్ మోయాల్సి వచ్చింది.

‘‘ఎలా డబ్బులు సంపాదించుకోవచ్చో మాకు చెప్పారు గానీ, అవన్నీ బడాయి మాటలు. కొన్నేళ్లకు తాము ఇచ్చే గ్యారెంటీని వాళ్లు మార్చారు. మొదట్లో బాధ్యతలన్నీ సంస్థపై ఉండేవి. రైతులు కేవలం పందులు పెంచితే, సరిపోయేది. పందులకు వచ్చే రోగాలు, మార్కెట్ పరిస్థితులు... వీటన్నింటి గురించి ఆందోళన చెందే పరిస్థితి ఉండేది కాదు. కానీ, వాటికి కూడా మేం బాధ్యత వహించేలా నిబంధనలను మార్చారు. మేం ఖర్చు పెట్టేలా చేశారు. ఒప్పందం ప్రకారం వాళ్లు ఎలా చెబితే, అలా మేం చేయాల్సి వచ్చేది’’ అని ఆయన వివరించారు.

విలియమ్ థామస్ బట్లర్

ఫొటో సోర్స్, Butler

ఫొటో క్యాప్షన్, విలియమ్ థామస్ బట్లర్

అప్పు తీసుకుని ఫామ్‌లు పెట్టడంతో ఈ ఒప్పందం నుంచి బట్లర్ బయటకురాలేకపోయారు.

‘‘ఒప్పందం నుంచి బయటకు వస్తే, మరో సంస్థ మనతో ఒప్పందం చేసుకునే అవకాశాలు కూడా తక్కువ’’ అని ఆయన అన్నారు.

ఒప్పందం నుంచి వైదొలిగితే రైతు పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా కోల్పోవాల్సి రావొచ్చు.

లాభాల కోసం కార్పొరేట్లు రైతులను పూర్తిగా తమ చెరలో పెట్టుకున్నాయని ఇక్కడి రైతు కార్యకర్తలు అంటున్నారు.

ఇక పౌల్ట్రీ రంగంలో ఒప్పందాల్లో ‘టోర్నమెంట్’ పద్ధతి పాటిస్తుంటారని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

టోర్నమెంట్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోళ్లను పెంచిన రైతులకు సంస్థలు బోనస్‌గా డబ్బులు చెల్లిస్తాయి. నాణ్యత లేని కోళ్లను పెంచిన రైతుల ఆదాయంలో కోత పెడతాయి.

అంటే సగం మంది రైతులకు ఎక్కువ ఆదాయం వస్తే, మిగతా సగం మందికి కోత పడుతుంది.

కోళ్ల పరిశ్రమ

ఫొటో సోర్స్, Getty Images

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు వస్తాయని, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు దక్కుతాయని చెబుతూ అమెరికాలో దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఫార్మింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు.

కానీ, మార్కెట్ కార్పొరేట్ల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయిందని, రైతులను వాళ్లు దోచుకుంటున్నారని విమర్శకులు అంటున్నారు.

అయితే, సంస్థలు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నాయి. కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల అటు రైతులకు, ఇటు సంస్థలకు లాభమేనని అంటున్నాయి.

సంస్థల వెబ్‌సైట్లలో లాభాలు వచ్చిన రైతుల కథలే కనిపిస్తుంటాయి. మీడియాను, రాజకీయ నాయకులను సంతృప్తిపరిచేందుకే సంస్థలు అలా చేస్తుంటాయని విమర్శకులు అంటున్నారు.

అమెరికాలో గొడ్డు మాంసం (బీఫ్) ఉత్పత్తి, ప్రొసెసింగ్‌‌లో 80 శాతానికిపైగా నాలుగు సంస్థల చేతుల్లోనే ఉంది.

2015లో పౌల్ట్రీ వ్యాపారంలో 60 శాతానికిపైగా ఐదు సంస్థల నియత్రంణలోనే ఉంది. కోళ్ల దాణా మిల్లులు, వాటిని ప్రొసెస్ చేసే కేంద్రాలు, కోడి పిల్లల ఉత్పత్తి పరిశ్రమలనూ ఈ సంస్థలే నిర్వహిస్తున్నాయి.

సోయాబీన్ ప్రొసెసింగ్‌లో 80 శాతం నాలుగు బయెటెక్ సంస్థల చేతుల్లోనే ఉంది.

ఇక పంది మాంసం వ్యాపారంలో 66 శాతానికి పైగా నాలుగు సంస్థలే నియంత్రిస్తున్నాయి.

పందుల పెంపకం

కొన్ని కార్పొరేట్లు రైతులకు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తాయి.

అయితే, కొన్ని సంస్థలు మధ్యలోనే ఇష్టానుసారం నిబంధనలు మార్చేస్తాయి. ఒప్పందం నుంచి రైతులు వైదొలిగితే జరిమానా కట్టేలా చేస్తాయి. వాటికవి ఏకపక్షంగా ఒప్పందాలను రద్దు చేస్తాయి.

భారత్‌లోనూ ఇలా జరిగే అవకాశాలున్నాయని ఇక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్ట్ ఫార్మింగ్‌తో మిశ్రమ ఫలితాలు ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పీహెచ్‌డీ చేస్తున్న తల్హా రెహమాన్ అంటున్నారు.

రెహమాన్ ముత్తాత ఇమామ్ బఖ్ష్ భారత్‌లో వ్యవసాయం చేశారు. 1905లో ఆయన కుటుంబంతో సహా అమెరికాకు వలస వచ్చారు.

వారి కుటుంబానికి కాలిఫోర్నియాలో వందల ఎకరాల భూములు ఉన్నాయి. వాళ్లు అక్కడ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నారు.

‘‘కాంట్రాక్టు ఫార్మింగ్ వల్ల రైతుకు రిస్క్ తగ్గుతుంది. పంటను కొనుగోలు చేసే వాళ్లు ఉన్నారంటే, ఒక భద్రతాభావం ఉంటుంది. అయితే, అంతిమంగా పంటకు ఎంత ధర వస్తుందన్నది మాత్రం మన చేతుల్లో ఉండదు’’ అని ఆయన అన్నారు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, Tehla Farm

కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి మార్కెటింగ్ కాంట్రాక్ట్, రెండోది ప్రొడక్షన్ కాంట్రాక్ట్.

మార్కెటింగ్ కాంట్రాక్ట్‌లో పంటపై యాజమన్య హక్కు రైతులదే.

ప్రొడక్షన్ కాంట్రాక్ట్‌లో మాత్రం పంట సంస్థలది. పండించినందుకు రైతులకు అవి కొంత రుసుము చెల్లిస్తాయి.

మైక్ వీవర్‌కు భారీ పౌల్ట్రీ వ్యాపారం ఉంది. అయితే, 19 ఏళ్ల పాటు కాంట్రాక్టు ఫార్మింగ్ చేసిన ఆయన అందులో నుంచి వైదొలిగారు.

‘‘నేను 15 లక్షల డాలర్లు తీసుకుని, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నా. అదృష్టం ఉంటే వాటిని తీర్చగలుగుతా. కుటుంబాన్ని కూడా పోషించుకుంటా. దీని నుంచి వచ్చే లాభం చాలా తక్కువ’’ అని అన్నారు.

మైక్ వీవర్

ఫొటో సోర్స్, Weaver

ఫొటో క్యాప్షన్, మైక్ వీవర్

వర్జీనియా కాంట్రాక్ట్ పౌల్ట్రీ గ్రోయర్స్ అసోసియేషన్‌కు మైక్ వీవర్ అధ్యక్షుడిగా ఉన్నారు.

‘‘పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్న చాలా మంది దీన్ని వీడాల్సి వస్తోంది. కుటుంబ పోషణ కోసం మళ్లీ కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పులు తీర్చి, ఫామ్‌లు కాపాడుకోవడానికి కష్టాలు పడుతున్నారు’’ అని ఆయన అన్నారు.

‘‘కోడి ధర మూడు, నాలుగు డాలర్లు ఉంటే, అందులో రైతుకు వచ్చేది ఆరు సెంట్లు మాత్రమే. మిగతావన్నీ ప్రొసెసింగ్ సంస్థకు, రిటెయిలర్‌కు వెళ్తాయి’’ అని వీవర్ వివరించారు.

కాంట్రాక్టు ఫార్మింగ్‌తో అమెరికా ఆహార రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి.

నేషనల్ కాంట్రాక్ట్ పౌల్ట్రీ గ్రోయర్స్ అసోసియేషన్, అమెరికా వ్యవసాయ విభాగం 2001లో చేసిన అధ్యయనం ప్రకారం పౌల్ట్రీ రంగంపై మాత్రమే ఆధారపడ్డ రైతుల్లో 71 శాతం మంది దారిద్ర్య రేఖకు కిందే ఉన్నారు.

వ్యవసాయం

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో రైతుల ఆత్మహత్యలు

అమెరికాలో ఏటా ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న సమాచారం అందుబాటులో లేదు.

అయితే, సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ (సీడీసీ) సమాచారం ప్రకారం మిగతా వృత్తుల్లో ఉన్నవారితో పోల్చితే రైతుల్లోనే ఎక్కువ ఆత్మహత్యలున్నాయి.

రెండు దశాబ్దాల్లో ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయని సీడీసీ తెలిపింది.

‘‘అప్పుల ఒత్తిడి వారిపై చాలా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయోనని, ధరలు ఎలా పలుకుతాయోనని దిగులు చెందుతారు’’ అని మినెసోటాలోని మానసిక వైద్యుడు టెడ్ మాథ్యూ అన్నారు.

మాంసోత్పత్తి రంగంలోని సంస్థల ఆధిపత్యం విషయమై ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా వ్యవసాయ విభాగం బహిరంగ విచారణలను కూడా చేపట్టింది.

‘‘ప్రభుత్వం కొంత రక్షణ కల్పిస్తుంది. అయితే, ఏదో ఒక నిబంధన తెచ్చో, కోర్టు ఆదేశంతోనో ఆ రక్షణ లేకుండా సంస్థలు చేస్తున్నాయి. 30-40 ఏళ్లుగా ఇదే జరుగుతోంది’’ అని రూరల్ అడ్వాన్స్‌మెంట్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన టేలర్ హుయిట్లీ అన్నారు.

అమెరికా వ్యవసాయ రంగంలో మాంసం, పౌల్ట్రీ పరిశ్రమలది పెద్ద భాగం. ఆ దేశంలో 2018లో జరిగిన ఓ సర్వే ప్రకారం ఐదు శాతం మంది మాత్రమే శాకాహారులు ఉన్నారు.

తల్హా రెహమాన్

ఫొటో సోర్స్, Telha

ఫొటో క్యాప్షన్, తల్హా రెహమాన్

‘కనీస మద్దతు ధర కావాలి’

అమెరికాలో 2017లో 52 బిలియన్ పౌండ్ల మాంసం, 48 బిలియన్ పౌండ్ల కోడి మాంసం ఉత్పత్తి అయ్యింది.

ఇంత పెద్ద రంగం కావడంతో ఇక్కడున్న సంస్థలు తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు రాజకీయ పార్టీలు, నాయకులకు విరాళాలు కూడా పెద్ద ఎత్తున ఇస్తుంటాయి.

ఇక కాంట్రాక్టు ఫార్మింగ్ సరిగ్గా అమలు కాకపోవడమే అసలు సమస్య అని రైతులు అంటున్నారు.

‘‘కాంట్రాక్టు ఫార్మింగ్ సరిగ్గా చేస్తే, రైతులకు ప్రయోజనకరమే. తమ ఉత్పత్తికి రైతులకు కనీస మద్దతు ధర ఉండాలి. ప్రభుత్వం దీన్ని నిర్ణయించాలి. కొనుగోలుదారు తరఫు నుంచి గ్యారంటీ ఉండాలి. ముందుగానే ధర నిర్ణయించకూడదు’’ అని తల్హా రెహమాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)