రైతుల ఉద్యమం: 2020లోనైనా రైతుల ఆదాయం రెట్టింపైందా.. మోదీ ప్రభుత్వం హామీలు ఏమయ్యాయి - బీబీసీ రియాలిటీ చెక్

- రచయిత, శృతి మీనన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
కొత్త వ్యవసాయ సంస్కరణ బిల్లులను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.
మరో వైపు, ఈ చట్టలు రైతులకు ఉపకరిస్తాయని ప్రభుత్వం పదే పదే చెబుతోంది.
2020కల్లా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకుంటామని పాలక బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే, వాస్తవంలో రైతుల జీవనోపాధి మెరుగుపడిందా? గ్రామీణ జీవన పరిస్థితులు మారినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయా?

గ్రామీణ ఆదాయాలు ఎలా ఉన్నాయి?
ఇండియాలో 40% కన్నా ఎక్కువమంది వ్యవసాయం వృత్తిగా కలిగి ఉన్నారని ప్రపంచ బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి.
ఇటీవల సంవత్సరాలలో గ్రామీణ గృహ ఆదాయాలకు సంబంధించిన అధికారిక గణాంకాలు లేవు.
కానీ, వ్యవసాయ వేతనాలపై డాటా ఉంది. దీన్ని పరిశీలిస్తే 2014 - 2019 మధ్యలో వ్యవసాయ వేతనాలలో వృద్ధి రేటు తగ్గినట్లుగా కనిపిస్తోంది.
అంతే కాకుండా, ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం..గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ వస్తోంది.
ముఖ్యంగా వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం (కన్స్యూమర్ ప్రైస్ ఇంఫ్లేషన్) 2017లో 2.5 శాతం నుంచీ 2019లో 7.7 శాతానికి పెరిగింది.
వేతనాల పెరుగుదల వలన వచ్చిన లాభాన్ని ధరల పెరుగుదల తుడిచిపెట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవసాయదారుల వాస్తవ ఆదాయం 2013 నుంచి 2016 వరకూ సంవత్సరానికి 2% మాత్రమే పెరిగినట్లు ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) రిపోర్ట్ అంచనా వేసింది.
అంతే కాకుండా, వ్యవసాయేతర ఆదాయాలతో పోలిస్తే వ్యవసాయ వేతనాలు మూడింట ఒక వంతు మాత్రమే ఉన్నాయని ఈ రిపోర్ట్‌లో తెలిపారు.
అనేక దశాబ్దాలుగా రైతుల వాస్తవ ఆదాయాలు ఒకే స్థాయిలో కొనసాగుతున్నాయని, కొన్నిసార్లు క్షీణించాయని అగ్రికల్చర్ పాలసీ నిపుణులు దేవిందర్ శర్మ అభిప్రాయపడ్డారు.
"ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకోకపోతే నెలకు కొన్ని వేల రూపాయల ఆదాయం పెరగడం అనేది మనకి వాస్తవ పరిస్థితులను చూపించదు" అని ఆయన అన్నారు.

అలాగే, పెరుగుతున్న వ్యవయాలను, ఉత్పత్తి అమ్మకపు ధరల్లో వస్తున్న హెచ్చుతగ్గులను కూడా పరిగణించాలని ఆయన అన్నారు.
అంతే కాకుండా, ఇటీవల కాలంలో వాతావరణ మార్పుల వలన ఏర్పడిన తీవ్రమైన పరిస్థితులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇవి కూడా రైతుల జీవనోపాధి మీద గణనీయమైన ప్రభావం చూపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ హామీలు నెరవేరాయా?
2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు కావాలంటే అవి ఏడాదికి 10.4% చొప్పున పెరగాలని 2017లో వచ్చిన ఒక ప్రభుత్వ కమిటీ రిపోర్ట్ చెబుతోంది.
అంతే కాకుండా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం రూ.639 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని ఈ రిపోర్ట్ సూచించింది.
అయితే, ఈ రెండూ జరగట్లేదు....రైతుల ఆదాయం ఆ స్థాయిలో పెరగట్లేదు. వ్యవసాయంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల పెట్టుబడులు తగ్గుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
2011-12లో మొత్తం పెట్టుబడిలో, వ్యవసాయ రంగం పెట్టుబడి 8.5 శాతంగా నమోదైంది. 2013-14లో 8.6 శాతానికి పెరిగింది. 2015నుంచీ పెట్టుబడుల శాతం గణనీయంగా తగ్గి 6 నుంచీ 7 శాతం మధ్య నమోదైంది.

అప్పుల్లో కూరుకుపోతున్న రైతులు
2016 లో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) జరిపిన ఒక అధికారిక ప్రభుత్వ సర్వేలో...గత మూడేళ్లల్లో రైతుల సగటు అప్పులు రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగాయని తేలింది.
అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రుణ మాఫీ ఇవ్వాలా వద్దా అనే అంశంపై వచ్చిన రాజకీయ చర్చలను గతంలో బీబీసీ రియాలిటీ చెక్ పరిశీలించింది.
ఎరువులు, విత్తనాలకు సబ్సిడీలు, ప్రత్యేక రుణ పథకాల ద్వారా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టాయి.
2019లో 80 కోట్ల రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద ఏడాదికి రూ.6,000 ఆదాయ మద్దతు అందిస్తుంది.
అయితే, అంతకుముందే ఆరు రాష్ట్రాలు రైతులకు రాష్ట్ర స్థాయి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాయి.
ఈ పథకాలు రైతుల ఆదాయాల పెరుగుదలకు సహాయపడ్డాయని దేవిందర్ శర్మ తెలిపారు.
"ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని చేపట్టడం ఒక మంచి పరిణామం. ఇది నిజంగా రైతులకు సహాయపడుతోంది" అని ఆయన అన్నారు.
అయితే, ఈ పథకాలు ఎలా పనిచేస్తున్నాయో, ఎంత ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకునేందుకు డాటా అందుబాటులో లేదు.
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ అశోక్ దల్వాయి మాట్లాడుతూ...ప్రభుత్వం సరైన దిశలో చర్యలు చేపడుతోందని అన్నారు.
"వాస్తవంలో గణాంకాలు ఎలా ఉన్నాయో పరిశీలించి చూడాలి. కానీ, గత మూడేళ్లల్లో వృద్ధి శాతం పెరిగిందని చెప్పగలను. రాబోయే కాలంలో మరింత వృద్ధిని చూస్తామని" ఆయన అన్నారు.
వారి అంతర్గత అంచనాల ప్రకారం ప్రభుత్వం సరైన దిశలోనే ఉందని దల్వాయి బీబీసీకి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- రాష్ట్రపతి భవన్‌కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, అడ్డుకున్న పోలీసులు
- సిస్టర్ అభయ హత్య కేసులో ఫాదర్, నన్‌కు జీవిత ఖైదు
- నీటి కాలుష్యం: వైజాగ్ మరో ఏలూరు కానుందా?
- ఏపీ రాజధాని చుట్టూ ఏడాదిగా ఏం జరిగింది? అమరావతి భవితవ్యం ఏంటి?
- దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామన్న జగన్ ఇప్పుడు అనుమతులు ఎందుకిచ్చారు
- 451 ఏళ్ల బానిసత్వం నుంచి గోవాను లోహియా ఎలా విడిపించారు?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మెరుగైన మహిళా సాధికారత... కలవరపెడుతున్న పోషకాహార లోపం -జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








