శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji
- రచయిత, వందన విజయ్
- హోదా, టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్
ఓ కెనడా టీవీ షోలో క్లిష్టమైన గణిత ప్రశ్నలతో నిపుణుల బృందం సిద్ధంగా ఉంది. ప్రశ్నలను బ్లాక్‌బోర్డుపై రాస్తున్నారు. వీటికి భారత్ నుంచి కెనడా వచ్చిన ఓ మహిళ సమాధానం చెబుతున్నారు.
2,45,93,728ను 3,87,22,136తో గుణిస్తే ఎంత వస్తుంది? అని ఆమెను ప్రశ్నించారు.
ప్రశ్నను బోర్డుపై రాయడానికి పట్టిన సమయం కన్నా తక్కువ సమయంలోనే ఆమె సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు సమాధానాన్ని ఎడమ నుంచి కుడికి రాయమంటారా? లేక కుడి నుంచి ఎడమకు రాయమంటారా? అని ఆత్మవిశ్వాసం తొణికిసలాడే స్వరంతో ప్రశ్నించారు.
ఆ టీవీ షోలో కనిపించిన ఆమె పేరే శకుంతలా దేవి. ఆమెను అందరూ మానవ కంప్యూటర్ అని పిలుస్తారు.
1970ల్లో కంప్యూటర్ కన్నా వేగంగా పరుగులు తీసిన మేధస్సుతో శకుంతలా దేవి అందరికీ సుపరిచితురాలు అయ్యారు. అయితే ఆమె జీవితంలో ఇలాంటి కోణాలు చాలా ఉన్నాయి.
తన కూతుర్ని ఎవరి సాయం అవసరం లేకుండా ఒంటరిగానే ఆమె పెంచారు. అంతేకాదు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై ఆమె మెదక్ నుంచి ఎన్నికల్లో పోటీచేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1
హోమోసెక్సువాలిటీ గురించి మాట్లాడటాన్ని తప్పుగా భావించే 1970ల్లో ఆమె దానిపై పుస్తకం కూడా రాశారు. ఈ విషయంలో వచ్చిన విమర్శలను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు.
భారత్‌లోని ఎల్‌జీబీటీ సభ్యులకు బాసటగా నిలిచిన తొలి తరం మహిళగా ఆమెను చెప్పుకోవచ్చు.
స్వలింగ సంపర్కుడైన పారితోష్ బెనర్జీతో ఆమెకు వివాహమైంది. 1979లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే స్వలింగ సంపర్కుల గురించి శకుంతల తెలుసుకునేవారు. దీని కోసం చాలా మంది స్వలింగ సంపర్కులను ఆమె కలిశారు. వారిపై "ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువల్స్" పేరుతో 1977లో పుస్తకం రాశారు.
"నేను స్వలింగ సంపర్కురాలిని కాదు. మానసిక నిపుణురాలిని కూడా కాదు. శాస్త్రవేత్తననీ చెప్పుకోవట్లేదు. ఓ మనిషిగా ఈ పుస్తకం రాస్తున్నాను. ఎవరూ అర్థం చేసుకోక ఒంటరిగా మిగిలిపోతున్న, ఇష్టంలేని జీవితాలు బతుకుతున్న వారి గురించి నాకు రాయాలనిపించింది. అందుకే ఈ పుస్తకం రాశా" అని ఆమె పుస్తకం కవర్‌పై రాశారు.
పుస్తకంలో స్వలింగ సంపర్కులతో ముఖాముఖిలు, వారి వ్యక్తిత్వాలు, సినిమాల్లో వారిని చూపించే విధానం గురించి రాశారు. 1970ల్లో ఇదో సాహసమనే చెప్పాలి.

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji
గణితంలో సాహో..
ఇక గణితం విషయానికొస్తే.. 1980లో ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆమె కంప్యూటర్‌నే ఓడించారు.
లండన్‌లో రెండు 13 అంకెల సంఖ్యలు (7,686,369,774,870 x 2,465,099,745,779) గుణించి వెంటనే చెప్పడంతో.. అక్కడున్న వెయ్యిమంది అవాక్కయ్యారు.
1977లో ఆమె అమెరికాలోని కంప్యూటర్లతోనూ పోటీపడ్డారు. 18,81,32,517 ఘన మూలాన్ని టక్కున చెప్పేసి అక్కడా విజయం సాధించారు.
ఇలాంటి లెక్కలన్నీ ఆమె చేతివేళ్లతో చేసిపారేసేవారు.
శకుంతల 1929, నవంబరు 4న బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి సర్కస్‌లో పనిచేసేవారు. మూడేళ్ల వయసులోనే గణిత చిక్కు ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం శకుంతల ప్రారంభించారు.
ఆమె ప్రతిభను గుర్తించిన తండ్రి వెన్నంటి ప్రోత్సహించారు. నాలుగేళ్లు నిండకముందే ఆమె మైసూర్ యూనివర్సిటీలో మొదటి గణిత ప్రదర్శన ఇచ్చారు.
ఆ తర్వాత దిల్లీ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీలలోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ఇందిరా గాంధీ, జాకీర్ హుస్సేన్, చంద్రశేఖర్ వెంకట్రామన్ తదితర ప్రముఖుల ముందు కూడా ఆమె ఠక్కున సమాధానాలు చెప్పేవారు. బేబీ శకుంతలగా ఆమె పేరు మార్మోగింది.
వయసు పెరిగేకొద్దీ ఆమె పేరు ప్రఖ్యాతులు ఇతర దేశాలకూ విస్తరించాయి. ఆమె పేరు తెలియని దేశం లేదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి.
శకుంతలా దేవి.. గణితాన్ని ఎలా చూస్తారు?
"గణితమంటే గుణకారాలు, భాగహారాలే కాదు. ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ప్రపంచంలో ఏకైక సత్యం ఇదే. నంబర్లు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు. ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే అవుతుంది" అని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
శకుంతలలో చాలా కోణాలున్నాయి. గణిత లెక్కలతో ఇంద్రజాలం చేయడమే కాదు, ఫ్లూటు వాయించడంలోనూ ఆమె దిట్టే. తాగడం, తినడం గురించి కూడా ఆమె పుస్తకాలు రాశారు.
గణితంపై ఆమె చాలా పుస్తకాలు రాశారు. ఇన్ఫోసిస్, ఇతర ప్రముఖ కంపెనీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ నెగ్గాలంటే ఆమె రాసిన పుస్తకాలే ముఖ్యమైన వనరులుగా మారాయి.
గ్యాంబ్లింగ్‌పైనా ఆమె మూడు పుస్తకాలు రాశారు. అయితే అవి ప్రచురణకు నోచుకోలేదు.

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji
ఆమె జ్యోతిష్య నిపుణురాలు కూడా. జ్యోతిష్కులు కావాలంటే గణితం బాగా రావాలని, చాలా వేగంగా ఆలోచించ గలగాలని ఆమె చెప్పేవారు. లేదంటే కుండలిని కంప్యూటర్ కూడా చేయగలదు.. మనతో పనేంటి అని ఆమె అనేవారు.
తేదీ, సంవత్సరం చెబితే అది ఏ వారమో ఆమె ఇట్టే చెప్పేసేవారు.
తను ఎప్పుడూ అధికారికంగా చదువుకోనప్పటికీ ఇంగ్లిష్, తమిళంలో పుస్తకాలు రాశానని 1973లో బీబీసీ హిందీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
బాల్యం నుంచే అసామాన్య ప్రతిభను కనబరిచే బాల మేధావిగా ఆమెను అందరూ చెబుతుంటారు. చిన్నప్పటి నుంచే ఆమె గణితంలో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2
ఇలాంటి పిల్లలు ప్రతిభ వల్లే బాల్యాన్ని కోల్పోతారని అందరూ అంటుంటారు. అందరిలా బాల్యాన్ని ఆస్వాదించే అవకాశం వీరికి దక్కదని అంటుంటారు. మరి శకుంతల విషయంలో ఇవి ఎంత వరకూ నిజమో ఆమెకే తెలియాలి.
అందరికీ ప్రతిభావంతురాలిగా కనిపించే శకుంతలా దేవి జీవితంలోనూ ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె కుమార్తెతో సంబంధాల్లో ఇవి కనిపిస్తాయి.
వీరిద్దరి మధ్య బంధాల్లో సంక్లిష్టత సినిమా ట్రైలర్‌లోనూ కనిపిస్తోంది. చాలాసార్లు కుమార్తెతో ఆమె గొడవ పడుతూ కనిపిస్తున్నారు.
శకుంతలా దేవి కుమార్తె అనుపమ బెనర్జీ లండన్‌లో ఉంటున్నారు.
"ఏ బంధమూ అంత నిక్కచ్చిగా ఉండదు. ఆమె నన్ను ఒంటరిగా పెంచారనే విషయాన్ని అందరూ మరచిపోతుంటారు. ఆమె చాలా ముందుచూపుతో ఆలోచించేవారు. అవును, మా బంధాలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అందరి తల్లీకూతుళ్లలానే మేం కూడా గొడవలు పడ్డాం. విభేదాలను కూర్చుని పరిష్కరించుకున్నాం. ఈ సినిమా కోసం అన్ని సంగతులనూ వివరించి చెప్పలేను కదా" అని బీబీసీతో అనుపమ చెప్పారు.
సినిమా తీయడం కోసం డైరక్టర్ అను మేనన్.. చాలా సమయం అనుపమతో గడిపారు.

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji
ఆమె లెక్కలు ఎప్పుడూ తప్పలేదు
"శకుంతలపై పరిశోధన చేపట్టేటప్పుడు చాలా విషయాలు తెలిశాయి. శకుంతల అంటే గణితం మాత్రమే కాదు. వ్యక్తిగత జీవితంలో ప్రతిభావంతురాలిగా ఉండటం చాలా కష్టం. అలానే జీనియస్ కూమార్తె జీవితం కూడా అంత తేలిగ్గా గడవలేదు. ప్రతిభావంతులకూ సమస్యలు ఉంటాయి" అని అను వివరించారు.
గణితంపై పట్టు, సులువుగా గణనలు చేసే విధానాలతో ఆమె విద్యార్థుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించినప్పటికీ, ఆమె ప్రతిభను గణిత సూత్రాలను తయారుచేయడానికి వాడలేదని నిపుణులు భావిస్తుంటారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 3
ఈ విషయాన్ని సినిమాలోనూ అను మేనన్ ప్రస్తావించారు. "ఒక రోజు ఇంగ్లిష్.. అమ్మాయిల కోసం, లెక్కలు.. అబ్బాయిల కోసం అని మా అమ్మాయి వచ్చి నాతో అంది. వెంటనే ఇలాంటి ఆలోచనలు ఎలా మార్చాలా అని ఆలోచించాను. గణితంలో ప్రముఖ మహిళల గురించి ఉదాహరణగా చెబుదామని అనుకున్నా. అప్పుడే శకుంతలా దేవి నాకు గుర్తొచ్చారు" అని అను వివరించారు.
వీటన్నింటినీ పక్కనపెడితే.. తనకు నచ్చినట్లు జీవించిన మహిళగా శకుంతలను చెప్పుకోవచ్చు. గణితంలో ఆమె వినోదాన్ని వెతుక్కునేవారు. రంగురంగుల చీరలు, లిప్‌స్టిక్‌లు అంటే ఆమెకు చాలా ఇష్టం. ఎప్పుడూ ఆమె ఆత్మవిశ్వాసంతో ఉండేవారు.
"ఒకసారి లండన్‌లోని ప్రముఖ పత్రిక రిపోర్టర్ నా దగ్గరకు ఇంటర్వ్యూ కోసం వచ్చారు. ఆయన కొన్ని గణనలు అడిగారు. నేను సమాధానాలు చెప్పాను. అయితే ఆ సమాధానం తప్పని ఆయన మొండిగా చెప్పారు. వెంటనే సంబంధిత పత్రిక అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి అదే ప్రశ్నను అడిగాం. అప్పుడు నా జవాబే సరైనదని తేలింది" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శకుంతల వివరించారు.

ఫొటో సోర్స్, Shakuntala Devi/Anupama Banerji
ఆత్మవిశ్వాసం ఆమెకు ఓ ఆభరణం
బీబీసీకి సంబంధించి లెస్లీ మిచెల్ షోలో ఒకసారి శకుంతల చెప్పిన సమాధానాన్ని తప్పని ప్రకటించారు. అయితే శకుంతల ఒప్పుకోలేదు. మళ్లీ గణనలు చేయగా.. శకుంతల చెప్పినదే సరైన సమాధానమని రుజువైంది. ఆత్మ విశ్వాసాన్ని ఆమె ఎప్పుడూ ఆభరణంలా ధరించేవారు.
కెనడా షోలోనూ ఓ ప్యానెల్ కఠినమైన ప్రశ్నతో ఆమెను ఇరుకున పెడదామని ప్రయత్నించింది. అయితే "నాకు ఎవరూ సవాల్ విసరలేరు. నాకు నేనే ఓ సవాల్" అని ఆమె వ్యాఖ్యానించారు.
గణితంతో ఇన్ని విన్యాసాలు ఎలా చేయగలిగారనే ప్రశ్నకు ఆమె దగ్గర కూడా సమాధానం లేదు.
అది చెప్పడం చాలా కష్టం. "నంబర్లు చూసిన వెంటనే నేను లెక్కపెట్టడం మొదలు పెడతా" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.
"నువ్వు అందరి తల్లుల్లా ఎందుకు ఉండవు?" అని ఓ సీన్‌లో శకుంతలను ఆమె కుమార్తె అడుగున్నట్లు ట్రైలర్‌లో కనిపిస్తోంది.
దీనిపై శకుంతల స్పందిస్తూ.. "నేను అద్భుతాలు చేయగలిగినప్పుడు సాధారణంగా ఎలా ఉండగలను" అని ఆమె చెబుతారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- 'నా భర్త వీర్యం సేకరించేందుకు అనుమతి ఇవ్వండి'
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- నూర్ జహాన్: ఏకైక మొఘల్ సామ్రాజ్ఞి
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..!
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









