ఔరంగజేబ్ నిజంగానే హిందూ దేవాలయాలను కూల్చారా?

ఫొటో సోర్స్, Penguin India
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ గురించి కొన్నేళ్ల క్రితం ఆండ్రీ ఓ పుస్తకం రాశారు.
‘‘ఔరంగజేబ్ నియంత కాదు. నిరంకుశ పాలకుడు కాదు. ఫాసిస్టు కాదు. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లాంటివాడు కూడా కాదు. ఆయన ప్రీ మోడర్న్ మొఘల్ చక్రవర్తి’’ అని ఆండ్రీ ట్వీట్ చేశారు.
ఆమె వ్యాఖ్యలపై చాలా మంది స్పందించారు. ఔరంగజేబ్ ఎలాంటివాడన్న విషయమై భిన్నమైన వాదనలు చేశారు.
మొఘల్ చక్రవర్తుల్లో జనంలో బాగా చెడ్డపేరు సంపాదించుకున్నవారిలో ఔరంగజేబ్ ఒకరు. హిందువులను ద్వేషించే వ్యక్తిగా, మత ఛాందస చక్రవర్తిగా ఔరంగజేబ్‌కు పేరుంది. పదవి కోసం తన అన్న దారా షికోహ్ ప్రాణాలను కూడా వదలని వ్యక్తిగా ఆయన్ను అందరూ చూస్తారు.
తన తండ్రి షాజహాన్‌ను ఆగ్రా కోటలో ఖైదీగా పెట్టి, జీవితం చివరి ఏడేళ్లు బందీగా గడిపేలా ఔరంగజేబ్ చేశారు.
జవహర్‌లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలో ఔరంగజేబ్‌ను మత ఛాందసవాదిగా వర్ణించారు.
ఆండ్రీ ట్రస్చకే నెవార్క్‌లోని రట్జర్స్ యూనివర్సిటీలో దక్షిణ ఆసియా చరిత్ర అధ్యాపకురాలిగా ఉన్నారు. ఆమె రాసిన ‘ఔరంగజేబ్: ద మ్యాన్ అండ్ ద మిత్’ పుస్తకం కొన్ని నెలల క్రితం అచ్చైంది.

ఫొటో సోర్స్, Penguin India
49 ఏళ్ల పాటు పాలన
హిందువులపై ద్వేషంతోనే హిందూ దేవాలయాలను ఔరంగజేబ్ కూల్చారన్న వాదనను ఆండ్రీ ఈ పుస్తకంలో తిరస్కరించారు.
బ్రిటీష్ పాలన కాలంలో హిందువులు, ముస్లింల మధ్య వైషమ్యాలు పెంచేందుకు చరిత్రకారులు ఔరంగజేబ్‌ను తప్పుగా చిత్రీకరించారని ఆమె అభిప్రాయపడ్డారు. ఔరంగజేబ్ పాలన కాలం 20 ఏళ్లు తక్కువగా ఉండుంటే, చరిత్రకారులు ఔరంగజేబ్‌ను మరోలా చిత్రించి ఉండేవారని ఆండ్రీ అంటున్నారు.
15 కోట్ల మంది ప్రజలను ఔరంగజేబ్ 49 ఏళ్ల పాటు పాలించారు. ఆయన పాలనలోనే దాదాపు ఉపఖండమంతా మొఘల్ సామ్రాజ్యం విస్తరించింది.
మహారాష్ట్రలోని ఖుల్దాబాద్‌లోని మాములు స్థితిలో ఔరంగజేబ్ సమాధి ఉందని... ఇందుకు భిన్నంగా దిల్లీలో హుమాయూన్ సమాధి ఎర్ర రాతితో కట్టారని, షాజహాన్‌ను తాజ్‌మహల్‌లో సమాధి చేశారని ఆండ్రీ రాశారు.
‘‘ఔరంగజేబ్ వేల హిందూ దేవాలయాలను నాశనం చేశారన్నది తప్పుడు అభిప్రాయమే. ఎక్కువలో ఎక్కువ పదుల సంఖ్యలో దేవాలయాలను ధ్వంసం చేసేందుకు నేరుగా ఆయన ఆదేశాలు ఇచ్చి ఉంటారు. హిందువుల నరమేధం అని చెప్పేవి ఔరంగజేబ్ పాలన కాలంలో జరగలేదు. నిజానికి, ఆయన హయాంలో చాలా ఉన్నతమైన పదవుల్లో హిందువులు ఉన్నారు’’ అని ఆండ్రీ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Penguin India
సాహిత్యం అంటే మక్కువ
1618 నవంబర్ 3న ఔరంగజేబ్ పుట్టారు. అప్పుడు ఆయన తాత జహంగీర్ పాలన నడుస్తోంది.
షాజహాన్‌కు ఔరంగజేబ్ మూడో కొడుకు. మొత్తంగా షాజహాన్‌కు నలుగురు కొడుకులు. వీరందరూ ముంతాజ్ మహల్‌కే పుట్టారు.
ఇస్లాం మత సాహిత్యంతోపాటు తుర్కీ సాహిత్యాన్ని కూడా ఔరంగజేబ్ చదువుకున్నారు. చేతిరాతలో మంచి నైపుణ్యాన్ని సాధించారు. మొఘల్ చక్రవర్తులందరిలాగే చిన్నప్పటి నుంచే హిందీలో అనర్గళంగా మాట్లాడేవారు.
షాజహాన్ కొడుకుల మధ్య సింహాసనం కోసం చిన్న వయసు నుంచే పోటీ ఉండేది. సింహాసనంపై రాజు కొడుకులందరికీ సమానమైన హక్కు ఉంటుందన్న మధ్య ఆసియా సంప్రదాయాన్ని మొఘలులు పాటించేవారు.
షాజహాన్ తన కొడుకుల్లో అందరికన్నా పెద్దవాడైన దారా షికోహ్ తన తదనంతరం రాజు కావాలని ఆశించేవారు. కానీ, ఔరంగజేబ్ రాజు అయ్యేందుకు అందరి కన్నా తనకే ఎక్కువ అర్హత ఉందని భావించేవారు.
‘‘షికోహ్ వివాహం తర్వాత షాజహాన్.... సుధాకర్, సూరత్-సుందర్ అనే రెండు ఏనుగుల మధ్య పోరాటం ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఏనుగుల పోరాటాన్ని చూసేందుకు మొఘలులు బాగా ఇష్టపడేవారు. పోరాటం జరుగుతున్నప్పుడు ఔరంగజేబ్ గుర్రంపై ఉన్నారు. సుధాకర్ అనే ఏనుగు ఆయనవైపు కోపంతో పరిగెత్తుకువచ్చింది. దీంతో ఔరంగజేబ్ తన వద్ద ఉన్న బల్లెంతో ఏనుగు తలపై దెబ్బ కొట్టారు. దీంతో ఏనుగుకు మరింత కోపం వచ్చింది. తొండంతో ఔరంగజేబ్ గుర్రాన్ని కింద పడేసింది. ఔరంగజేబ్ సోదరుడు శుజా, జయ్ సింగ్ రాజు అప్పుడు అక్కడే ఉన్నారు. వారు ఔరంగజేబ్‌ను కాపాడేందుకు ప్రయత్నించేలోపే ఆ ఏనుగు దృష్టిని శ్యామ్ సుందర్ అనే మరో ఏనుగు మళ్లీ పోరాటం వైపు మళ్లించింది. షాజహాన్ దర్బారులో కవిగా ఉన్నా అబూ తాలిబ్ ఖా ఈ ఘట్టం గురించి తన కవితల్లో రాశారు’’ అని ఆండ్రీ తెలిపారు.
ఈ మొత్తం ఘటన జరుగుతున్న సమయంలో షికోహ్ వెనుకే నిల్చొని ఉన్నారని, ఔరంగజేబ్‌ను కాపాడే ప్రయత్నమే చేయలేదని అకిల్ ఖా రజీ అనే చరిత్రకారుడు ఓ పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Penguin India
ప్రేమ కథ
‘ఔరంగజేబ్ సంగీతాన్ని నిషేధించారా?’ అన్న శీర్షికతో చరిత్రకారిణి కేథరిన్ బ్రౌన్ ఓ వ్యాసం రాశారు.
‘‘ఓసారి ఔరంగజేబ్ బుర్హాన్‌పుర్ వెళ్లినప్పుడు హీరాబాయీ జైనాబాదీ అనే మహిళను చూసి మనసు పారేసుకున్నారు. హీరాబాయీ గాయకురాలు, నర్తకి. ఆమెను ఔరంగజేబ్ చాలా ప్రేమించారు. ఆమె చెప్పారని, మద్యం తాగనన్న తన మాట తప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. అయితే, హీరాబాయీనే మళ్లీ ఆపారు. కానీ, ఒక ఏడాది తర్వాత హీరాబాయీ చనిపోయారు. ఆ ప్రేమ కథ అంతటితోనే ముగిసింది. ఆమెను ఔరంగాబాద్‌లో సమాధి చేశారు’’ అని కేథరిన్ అందులో పేర్కొన్నారు.
ఛాందసవాది ఔరంగజేబ్ స్థానంలో ఉదారవాది షికోహ్ చక్రవర్తి అయ్యుంటే ఏం జరిగి ఉండేది?
‘‘మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించే, గెలుచుకునే సామర్థ్యం షికోహ్‌కు లేదు. సింహాసనం కోసం నలుగురు కొడుకుల మధ్య జరిగిన సంఘర్షణలో షికోహ్‌కు తండ్రి మద్దతు ఉంది. అయినా, ఔరంగజేబ్ ఎత్తులు, చిత్తుల ముందు ఆయన నిలవలేకపోయారు’’ అని ఆండ్రీ ట్రస్చకే అన్నారు.
1658లో ఔరంగజేబ్, ఆయన తమ్ముడు మురాద్ కలిసి ఆగ్రా కోటను చట్టుముట్టారు. ఆ సమయంలో షాజహాన్ కోట లోపలే ఉన్నారు.
ఔరంగజేబ్ కోటకు నీటి సరఫరాను నిలిపివేయించారు. కొన్ని రోజుల్లో షాజహాన్ కోట ద్వారాలు తెరిచి, తమ ఖజానాను, ఆయుధాలను ఔరంగజేబ్, మురాద్‌లకు ఇచ్చేశారు.
షాజహాన్ తన సామ్రాజ్యాన్ని ఐదు భాగాలుగా చేసి... వాటిని నలుగురు కొడుకులకు, ఔరంగజేబ్ పెద్ద కొడుకు మహమ్మద్ సుల్తాన్‌కు పంచుతానని ప్రతిపాదించారు. అయితే, ఔరంగజేబ్ ఇందుకు ఒప్పుకోలేదు.
ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయిన షికోహ్... మొదట దిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి పంజాబ్, తర్వాత అఫ్గానిస్తాన్ వెళ్లారు. షికోహ్‌కు విశ్వాసపాత్రుడైన మలిక్ జీవన్ అనే వ్యక్తే, ఆయన్ను కుట్ర చేసి, ఔరంగజేబ్ సైన్యానికి అప్పగించాడు.
షికోహ్‌ను సైనికులు దిల్లీ తీసుకువచ్చారు. దిల్లీ వీధుల్లో అవమానకరంగా తిప్పుకుంటూ తీసుకువెళ్లారు.
ఆ సమయంలో భారత్‌లో పర్యటించిన ఇటలీ చరిత్రకారుడు నికోలాయీ మానుచీ ఈ సందర్భం గురించి ‘‘స్టోరియా దో మోగోర్’ అనే పుస్తకంలో రాశారు.
‘‘షికోహ్ మరణించిన రోజు ఔరంగజేబ్ ఆయన్ను ఓ ప్రశ్న అడిగారు. ‘మనం ఒకరి స్థానంలో మరొకరం ఉంటే నువ్వు ఏం చేసేవాడివి’ అని అడిగారు. ‘నీ శరీరాన్ని నాలుగు ముక్కలుగా చేసి, దిల్లీలోని నాలుగు ప్రధాన ద్వారాలకు వేలాడదీసేవాడిని’ అని షికోహ్ బదులు చెప్పారు’’ అని ఆయన పేర్కొన్నారు.
షికోహ్‌ను హుమాయున్ సమాధి పక్కనే సమాధి చేయించారు ఔరంగజేబ్. అయితే ఆ తర్వాత కొంత కాలానికి ఔరంగజేబ్ తన కూతురు జబ్దాతున్నిసాను షికోహ్ కొడుకు సిఫిర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఉత్తర భారత్‌కు ఇక తిరిగిరాలేదు
తన తండ్రి షాజహాన్‌ను ఔరంగజేబ్ ఆగ్రా కోటలో బంధించి పెట్టారు. షాజహాన్ తన జీవితం ఆఖరి ఏడేళ్లు అక్కడే బంధీగానే గడిపారు.
అయితే, దీని ఫలితంగా ఔరంగజేబ్‌ను భారత చక్రవర్తిగా గుర్తించేందుకు మక్కా శరీఫ్ నిరాకరించారు. ఔరంగజేబ్ పంపిన కానుకులను కూడా చాలా ఏళ్ల వరకూ స్వీకరించలేదు.
1679లో ఔరంగజేబ్ దిల్లీ వదిలి దక్షిణ భారతానికి వచ్చారు. ఆయన వెంట కుమారులు సహా పరివారమంతా వచ్చింది.
ఆ సమయంలో దిల్లీలోని ఎర్ర కోట మొత్తం ఖాళీ అయిపోయింది. గదులు దుమ్ము పట్టిపోయాయి.
‘‘మొఘల్ చక్రవర్తులు అందరూ మామిడి పండ్లను ఇష్టపడేవారు. దక్షిణ భారతంలో ఔరంగజేబ్ ఆ లోటును అనుభవించేవారు. తన దర్బారులో వారితో ఉత్తర భారత మామిడి పండ్లను తెప్పించాలని చెప్పేవారు. సుధారస్, రస్నాబిలాస్ లాంటి పేర్లను కూడా మామిడి పండ్లకు ఆయన పెట్టారు’’ అని ఆండ్రీ ట్రస్చకే తన పుస్తకంలో రాశారు.
ఆ తర్వాత ఆయన ఉత్తర భారతానికి తిరిగి వెళ్లలేదు.
చివరి రోజుల్లో ఔరంగజేబ్ వెంట ఆయన మూడో భార్య ఉదయపురీ ఉన్నారు. ఔరంగజేబ్ మరణశయ్యపై నుంచి తన కుమారుడు కామ్‌బఖ్ష్‌కు రాసిన లేఖలో... ‘‘జబ్బులోనూ ఉదయపురీ నా వెంట ఉంది. మరణంలోనూ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
89 ఏళ్ల వయసులో మహారాష్ట్రలోని భింగర్‌లో ఔరంగజేబ్ కన్నుమూశారు. ఆయన అన్నట్లుగానే ఉదయ్‌పురీ కూడా కొద్ది రోజుల తర్వాత మరణించారు.
ఇవి కూడా చదవండి:
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ఇల్లు, ఫర్నీచర్ అమ్మేసి ఓ వ్యాన్ కొనుక్కున్నారు... ఇప్పుడు ఆ వ్యానే వారి ఇల్లు
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








