మహిళలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు ఒప్పుకోవాలా? వారి శరీరాలు అందుకు సిద్ధంగా ఉంటాయా?

అఫ్గానిస్తాన్ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మహజోబా నౌరోజీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''పద్నాలుగేళ్ల వయసులోనే మా అమ్మకు పెళ్లై, అత్తగారింటికి వెళ్లిపోయింది. అప్పటికి ఇంకా ఆమెకు శారీరకంగా గానీ, మానసికంగా గానీ అంతటి పరిపక్వత రాలేదు'' అని ఫిరోజా (పేరు మార్చాం) చెప్పారు.

''యుక్త వయసులో మా అమ్మ చేయాలనుకున్నవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. పెళ్లి తర్వాత ఆమె చదువు కొనసాగించలేకపోయింది. నిజానికి ఈ పెళ్లి మా నాన్న నిర్ణయం ప్రకారం జరిగింది కూడా కాదు'' అని ఆమె అన్నారు.

ఫిరోజాకు మొత్తం 14 మంది తోబుట్టువులు. అందరిలోకెల్లా ఆమె చిన్నవారు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఆమె చదువుకుంటున్నారు.

''మా అమ్మ తక్కువ వ్యవధిలోనే గర్భం దాల్చుతూ వచ్చారు. ఆమెతో మా నాన్న చాలా క్రూరంగా ప్రవర్తించేవారు. 14 మంది పిల్లలను కనే పరిస్థితిలో ఆమె లేరు. కానీ, మా నాన్న గర్భ నిరోధక పద్ధతులు ఏవీ పాటించేవారు కాదు. ఎలాంటి నివారణ చర్యలు లేకుండా లైంగిక చర్యలను కొనసాగిస్తూ వచ్చారు. ఫలితంగా మా అమ్మ 14 మంది పిల్లలను కనాల్సి వచ్చింది. అనారోగ్యం పాలైంది'' అని ఫిరోజా చెప్పారు.

తనకు చదువుకు తండ్రి ఎప్పుడూ అడ్డు చెప్పలేదని, తన తల్లితో మాత్రం ఆయన క్రూరంగా ఉంటారని ఫిరోజా అన్నారు.

''14 మందిలో నేనే ఆఖరి సంతానం. నేను పుట్టిన తర్వాత నా బాగోగులు చూసే పరిస్థితిలో కూడా అమ్మ లేదు. అందుకే, ఆమె ప్రేమను నేను పొందలేకపోయా. ఇప్పటికీ ఆమె అనారోగ్యంతో ఉన్నా, నాన్న చెప్పిన పనల్లా చేయాల్సి వస్తుంది'' అని వివరించారు.

అఫ్గానిస్తాన్ మహిళలు

విధేయత అంటే...

భార్య ఎప్పుడూ భర్తకు విధేయతతో ఉండాలని అఫ్గానిస్తాన్‌లోని ఇస్లాం కట్టుబాట్లు చెబుతున్నాయి.

అఫ్గానిస్తాన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఫజల్లుర్రహమన్ ఫకీహీ 'విధేయత' అంశం గురించి మరింత విడమర్చి చెప్పారు.

''ఒకరి పట్ల విధేయతతో ఉండటం అంటే, వారికి మన మీద అధికారాలు ఇవ్వడం. భార్యాభర్తల బంధంలో భర్తకు భార్యపై అధికారాలు ఉంటాయి. భార్య తనతో పాటు ఉండేలా, తన దగ్గర పడుకునేలా అధికారాలు ఉంటాయి. దీనికి భార్య మొహమాటపడకూడదు. భర్తతో వారించకూడదు. భర్తతో శారీరక సంబంధాన్ని నిరాకరించే భార్యకు విధేయత లేనట్లుగా పరిగణించాలని ఇస్లామిక్ మత చట్టాలు చెబుతున్నాయి'' అని ఆయన అన్నారు.

''మహిళ తన ఆనందం కోసం, సంతోషం కోసం ఎప్పుడూ భర్తను ఆశ్రయించాలి. ఇక భర్త ఆనందం పొందుతానంటే... అది సమయం కాదనో, సరైన చోటు కాదనో ఆమె పరిమితులు పెట్టకూడదు. భార్య ఇలా చేసినా, అనుమతి లేకుండా ఇంటి నుంచి వెళ్లినా, భర్తతో విభేదించినా... ఇస్లామిక్ చట్టాల ప్రకారం ఆమె బాగోగులకు భర్త బాధ్యత ఉండదు. భార్య విధేయతతో లేకపోతే, భర్త రెండో పెళ్లి చేసుకోవచ్చు'' అని అన్నారు.

అఫ్గానిస్తాన్ మహిళలు

అంటే, మహిళలు ఎప్పుడు అంటే అప్పుడు సెక్స్‌కు ఒప్పుకోవాలా? వారి శరీరం అందుకు సిద్ధంగా ఉంటుందా?

బ్రిటన్‌కు చెందిన మహిళల హక్కుల కార్యకర్త, శిశు వైద్యురాలు డాక్టర్ ఎవిడ్ డిహార్‌ను మేం ఇదే ప్రశ్న అడిగాం.

తక్కువ అంతరంతో పిల్లలను కనడం వల్ల మహిళల ఆరోగ్యం దెబ్బతింటుందని, వారి పిల్లలకు కూడా ఇది మంచిది కాదని ఆమె అన్నారు.

''మహిళలు వెంటవెంటనే గర్భం ధరిస్తూ ఉంటే, రక్తహీనత (ఎనీమియా) వంటి వాటిని బారినపడతారు. వారి శరీరం బలహీనమైపోతుంది. గర్భం ధరించింది మొదలు కాన్పు వరకూ తల్లి శక్తి అంతా శిశువుకే వెళ్లిపోతుంది. కాన్పు తర్వాత తిరిగి మహిళ శరీరం ముందులా మారడానికి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. ఒకవేళ శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేయాల్సి వస్తే, అంతకన్నా ఎక్కువ సమయం పడుతుంది'' అని ఆమె వివరించారు.

రుతుస్రావం సమయంలో మహిళల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. ఈ మార్పుల ప్రభావం వారి ప్రవర్తన తీరుపై, శారీరక సామర్థ్యంపైనా ఉంటుంది. సెక్స్ విషయంలో ఆసక్తి పెరగొచ్చు, తగ్గొచ్చు.

డాక్టర్ ఎవిడ్ డిహార్‌

ఫొటో సోర్స్, DR EDWARD

ఫొటో క్యాప్షన్, డాక్టర్ ఎవిడ్ డిహార్‌

ఇలాంటి పరిస్థితుల్లో మహిళను భర్త అర్థం చేసుకోగలిగితే, వారి మధ్య బంధం ఇంకా బలపడుతుంది.

హార్మోన్ల హెచ్చుతగ్గులుంటాయి కాబట్టి మహిళ శరీరం ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్దంగా ఉండదు.

''కాన్పు తర్వాత, పిల్లలకు పాలు పట్టేందుకు రాత్రంతా తల్లి మేల్కొని ఉండాల్సి వస్తూ ఉంటుంది. వారికి నిద్ర సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సెక్స్‌పై పెద్దగా ఆసక్తి ఉండదు. ఇక గర్భంతో ఉన్న సమయంలో అధిక స్థాయిల్లో ఉన్ హార్మన్లు నెమ్మదిగా తగ్గిపోతాయి. అందుకే, కొందరు మహిళలకు కాన్పు తర్వాత సెక్స్‌పై ఆసక్తి పోతుంది. ఇలాంటి వాటిని భర్త అర్థం చేసుకోవాలి. భార్యకు తోడ్పాటు అందించాలి. పిల్లల పోషణలో ఆమెకు సాయంగా ఉండాలి. హార్మోన్ మార్పుల వల్ల వచ్చే అలసట తగ్గేందుకు ఆమెకు విశ్రాంతి దొరికేలా చూడాలి'' అని ఎవిడ్ డిహార్ అన్నారు.

మెనోపాజ్ సమయంలోనూ మహిళల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయని, ఈ విషయంపై పురుషులకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

మహమ్మద్ మోహిక్

ఫొటో సోర్స్, M MOHIQ

ఫొటో క్యాప్షన్, మహమ్మద్ మోహిక్

''మెనోపాజ్ సమయంలో రుతుస్రావం ఆగిపోవడమే కాదు, నిద్ర సమస్యలూ రావొచ్చు. ఒకే చోట దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. అలసటగా అనిపిస్తుంది. తలనొప్పి కూడా రావొచ్చు. ఇలా రకరకాల కారణాలతో మహిళలకు సెక్స్‌పై ఆసక్తి తగ్గొచ్చు. ఇలాంటి సమయంలో సెక్స్ కోసం బలవంతం చేయడం శారీరకంగా, మానసికంగా వారిపై దుష్ప్రభావం చూపుతుంది'' అని ఆమె అన్నారు.

అయితే, భర్త చెప్పిన ప్రతి విషయాన్నీ భార్య తప్పక పాటించాల్సిన అవసరం లేదని, అ విషయంలో భర్తకు అపరిమిత అధికారాలేవీ లేవని అఫ్గానిస్తాన్‌లో ఇస్లాం సమాజంలోని వైవిధ్యం గురించి పరిశోధనలు చేస్తున్న మహమ్మద్ మోహిక్ అంటున్నారు.

''ఇద్దరు కలిసి జీవితం పంచుకుంటున్నారంటే, వారి మధ్య పరస్పర గౌరవం ఉండటం ముఖ్యం. ఇస్లామిక్ చట్టాల ప్రకారం చూసినా... భార్య, భర్త వివిధ విషయాలపై చర్చించి, ఓ అవగాహనకు రావొచ్చు. వారి వారి హద్దులు నిర్ణయించుకోవచ్చు'' అని ఆయన అన్నారు.

అఫ్గానిస్తాన్ మహిళలు

ఫొటో సోర్స్, WAKIL KOHSAR

ఒకవేళ ఫిరోజా తల్లి ఇలా 14 మంది పిల్లలను కనేందుకు నిరాకరించి ఉంటే, ఏం జరిగి ఉండేది?

భర్త చేతిలో ఆమె గృహ హింస ఎదుర్కోవాల్సి వచ్చేది కావొచ్చు. లేదంటే ఆమె భర్త రెండో వివాహం చేసుకునేవారేమో? ఆమెకు విడాకులిచ్చి, విడిచిపెట్టేవారేమో?

పిల్లల అవసరాలను తీర్చుతోంది ఆయనే కాబట్టి, అక్కడి ఇస్లామిక్ చట్టాల ప్రకారం పిల్లలను కూడా తన వద్దే ఉంచుకునే వెసులుబాటు ఆయనకు ఉంటుంది.

''చిన్నతనంలోనే పెళ్లై, చదువు కూడా లేని మహిళకు ఎలాంటి స్వేచ్ఛ ఉంటుంది? భర్త లైంగిక కోరికలను తీర్చడం తప్ప, ఆమెకు కాదని చెప్పే అవకాశం ఉందా? ఇస్లాం వాస్తవ వ్యాఖ్యానంలో మహిళలకు చాలా గౌరవం ఇచ్చారు. కానీ, అఫ్గానిస్తాన్‌లో ఆ పరిస్థితి లేదు'' అని ఫిరోజా అన్నారు.

‘‘అఫ్గాన్ సమాజంలో మహిళలకు చదువుకునే హక్కు లేదు. నచ్చిన విషయం చెప్పే భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. మత నిబంధనల పేరుతో శారీరకంగా హింసించే శిక్షలు అమలు చేస్తారు. ఎప్పుడూ పురుషుడు చెప్పింది చేయాలన్న కట్టుబాటు నేటి సమాజంలో ఉండాల్సింది కాదు’’ అని అన్నారు ఫిరోజా.

అఫ్గానిస్తాన్‌లో ఇప్పటికీ ఫిరోజా తల్లి లాంటి వాళ్లెందరో, భర్త మాటను ధిక్కరించలేక నిత్యం నరకం అనుభవిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)