వీరప్పన్: గంధపు చెక్కల స్మగ్లర్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. వీరప్పన్ నేరాల్లో వారి పాత్రేమిటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎం.హరిహరన్
- హోదా, బీబీసీ కోసం
వీరప్పన్ కేసులో గత 25 ఏళ్లకు పైగా జైల్లో ఉన్న ఖైదీలను మానవతా దృష్టితో విడుదల చేయాలని తమిళనాడు అంతటా డిమాండ్లు వస్తున్నాయి.
కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో ముగ్గురు, మైసూర్ జైల్లో నలుగురు ఖైదీలు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వల్ల మరో ఇద్దరు ఖైదీలు చనిపోయారు.
మిగతా ఖైదీలు కూడా వయసు పైబడడంతో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో మిగతా జీవితం కుటుంబంతో గడిపేలా వారిని మానవతా దృష్టితో విడుదల చేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
ఖైదీ జ్ఞానప్రకాశం కొడుకు రాజా తనకు ఆరేళ్లప్పుడు తండ్రిని విచారణ కోసం తీసుకెళ్లారని ఆ రోజును గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న ఆయన ఇప్పటికీ తన తండ్రి విడుదలయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
“నేనప్పుడు ఒకటో తరగతిలో ఉన్నా. మా ఊళ్లో ఒక చర్చి ఉండేది. ఫాదర్ ఇంట్లోని తోటలో మా నాన్న పనిచేస్తున్నారు. పాలార్ బాంబ్ పేలుడులో విచారణ కోసం ఆయన్ను తీసుకెళ్లారు. తర్వాత ఆయన ఇంటికొచ్చేస్తాడనే మేం అనుకున్నాం. కానీ ఆయన్ను మైసూర్ పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. తర్వాత వదల్లేదు” అన్నారు.
“మా నాన్న అరెస్టైన తర్వాత మేం చాలా కష్టాలు పడ్డాం. నాకు ముగ్గురు తోబుట్టువులు. వారిలో ఒకరు చనిపోయారు. మిగతా వాళ్లందరికీ పెళ్లిళ్లు అయినా మా నాన్న రాలేదు. ఏవైనా వేడుకలు జరిగితే మేం మా నాన్నను ఇప్పటికీ గుర్తుచేసుకుంటాం. ఇటీవల ఆయన కాలికి గాయమై ఆస్పత్రిలో ఉన్నారు. మేం ఆయన్ను కలిశాం. మమ్మల్ని, మనవళ్లు, మనవరాళ్లను చూసి ఆయన చాలా సంతోషించారు. తన విడుదల గురించి బాధపడ్డారు” అన్నారు రాజా.
“నేను, మా ఇంట్లో అందరూ కూలి పనులకు వెళ్తుంటాం. మా నాన్న మమ్మల్ని బాగా చదివించాలనుకున్నారు. కానీ ఆయన అరెస్టైన తర్వాత మేం స్కూలు చదువు కూడా పూర్తి చేయలేకపోయాం. సత్యం గెలుస్తుందని, నేను బయటికొస్తానని ఆయన అంటూనే ఉన్నారు. మేం కూడా అదే ఆశతో ఉన్నాం” అన్నారు రాజా

ఫొటో సోర్స్, Getty Images
కేసు నేపథ్యం ఏంటి
1993లో తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో మహదేశ్వరం కొండల్లో పాలార్ వంతెనను పేల్చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ప్లాన్ ప్రకారం జరిగిన ఈ పేలుడులో 22 మంది పోలీసులు చనిపోయారు.
ఈ కేసులో సైమన్, పిలవేంద్రన్, మీసై మాధవన్, నాగ ప్రకాశంలు అరెస్టయ్యారు. మైసూర్ టాడా కోర్ట్ వీరికి యావజ్జీవ శిక్ష విధించింది. దానిని తర్వాత మరణశిక్షగా మార్చడంతో శిక్ష తగ్గించాలని వారు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దాంతో దానిని మళ్లీ జీవిత ఖైదుగా మార్చారు.
1987లో ఈరోడ్ జిల్లాలోని బంగ్లాపుడూర్ దగ్గర ఫారెస్టు గార్డులపై వీరప్పన్ కాల్పులు జరిపించాడు.
ఈ కేసులో మథైయన్, ఆండియప్పన్, పెరుమాళ్‌ను అరెస్ట్ చేశారు. వీరికి కూడా యావజ్జీవ శిక్ష పడింది. కోయంబత్తూరు జైల్లో 31 ఏళ్లకు పైగా ఉన్న శిక్ష అనుభవిస్తున్న ముగ్గురినీ విడుదల చేయాలనే తమ డిమాండ్లను తమిళనాడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయచ్చా
‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ లాయర్ బాల మురుగున్ వీరప్పన్ కేసులో ఖైదీలను విడుదల చేయాలని కోరారు.
కోయంబత్తూర్ జైల్లో ఉన్న ముగ్గురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయపరమైన ఎలాంటి చిక్కులు లేవని, వారికి వీరప్పన్‌తో నేరుగా సంబంధాలు కూడా లేవని చెప్పారు.
“మైసూర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడే సైమన్, పిలవేంద్రన్ చనిపోయారు, మరో ఇద్దరు ఇంకా అక్కడే ఉన్నారు, కోయంబత్తూరు జైల్లో ముగ్గురు ఖైదీలు ఉన్నారు. వీరందరినీ వెంటనే విడుదల చేయాలి. జీవితాంతం జైల్లోనే గడపాలని వారికి కోర్టు శిక్ష విధించినా, రాష్ట్ర ప్రభుత్వం వారిని విడుదల చేయవచ్చని స్పష్టంగా చెప్పారు.
రాజీవ్ గాంధీ హత్య కేసులో రాజ్యాగంలోని ఆర్టికల్ 161 ప్రకారం ఖైదీలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాలు ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు 2018లో చెప్పింది.
కానీ వారి విడుదల గురించి తమిళనాడు, కర్ణాటక గవర్నర్లు ఇప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వీరప్పన్ కేసులో ఖైదీల పట్ల కూడా అదే జరుగుతోంది” అన్నారు.
టాడా కేసు అనే కారణంతో మైసూరు జైల్లో ఉన్న ఖైదీల విడుదలకు నిరాకరించారు. కానీ శిక్ష ఎదుర్కుంటున్న ఖైదీలు మళ్లీ నేరాలు చేస్తారా, చేయరా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి.
చాలా కేసుల్లో ఖైదీల వయసు, వారి ప్రవర్తనను బట్టి విడుదల చేయవచ్చు. బహిరంగ వేదికలపై ఎవకూ దీని గురించి మాట్లాడ్డం లేదు.
దీని వెనుక రాజకీయ కారణాలు కూడా లేవు. అయినా, వారిని న్యాయం జరగడం లేదు” అంటారు బాల మురుగన్.
మథైయన్ కోయంబత్తూర్ జైలు నుంచి తనను విడుదల చేయాలంటూ 2017లో సుప్రీంకోర్టుకు వెళ్లాడని, తమిళనాడు ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోవచ్చని అప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పిందని లాయర్ చెప్పారు.

రాజకీయ అడ్డంకులు
న్యాయపరమైన చిక్కులు లేకపోయినా, వీరప్పన్ కేసులో ఖైదీల విడుదలకు రాజకీయ కారణాలు అడ్డొస్తున్నాయని విళుప్పురం ఎంపీ, విడుదలై సిరుతైగళ్ పార్టీకి చెందిన రవికుమార్ చెప్పారు.
“మనం ఎప్పుడూ రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉన్న ఏడుగురి విడుదల గురించి చాలా మాట్లాడతాం. కానీ, వీరప్పన్ కేసులో తప్పుడు ఆరోపణలతో జైళ్లలో ఉన్న తమిళుల గురించి మనలో ఎవరూ మాట్లాడరు.
తమిళనాడు-కర్ణాటక మధ్య ఏదైనా సమస్య వచ్చినపుడు మాత్రమే దీనిని పైకి తీసుకొస్తారు. అదే నిజం” అన్నారు.
“పెరుమాళ్ ప్రస్తుతం కోయంబత్తూర్ జైల్లో ఉన్నారు. అరెస్ట్ చేసినపుడు ఆయన వయసు 20 ఏళ్లు ఇప్పుడు ఆయనకు 50 ఏళ్లొచ్చాయి. ఆండియప్పన్‌కు ఇప్పుడు 60 ఏళ్లు. అయినా న్యాయపరమైన సమస్యలంటూ వారిని విడుదల చేయడం లేదు.
దీని వెనుక రాజకీయ సమస్యలు కూడా ఉన్నాయి. రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ, వీరప్పన్ కేసులో ఖైదీల కోసం పెరోల్ కూడా ఇవ్వలేదు. అది గవర్నర్ పని అని చెబుతున్నారు” అన్నారు.
“ఇక్కడ ఖైదీల విడుదలకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేకపోయినా, అధికార పార్టీలు దీనిని రాజకీయం చేస్తున్నాయి.
ఇక్కడ మేలవలవు హత్య కేసులో ఖైదీలను విడుదల చేయడం కంటే ప్రమాదం ఏం లేదు.
కానీ, వీరప్పన్ కేసులో ఉన్న వారు నిర్దోషులని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయినా తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని తాత్సారం చేస్తోంది. అన్ని పార్టీలూ అధికార పార్టీపై ఒత్తిడి తెస్తున్నాయి” అన్నారు రవికుమార్.

ఆశ వదులుకున్న ఖైదీలు
20 ఏళ్ల క్రితం సైమన్, పిలవేంద్రన్, మీసై మాధవన్, జ్ఞానప్రకాశంతో పాటూ అరెస్టైనా ఇటీవల జైలు నుంచి విడుదలైన అన్బురాజ్ బీబీసీతో మాట్లాడారు.
“దేశంలో సుదీర్ఘ శిక్ష పడిన కేసుల్లో ఇదొకటి. వీరప్పన్ కేసులో జైల్లో ఉన్న ఖైదీల వయసంతా దాదాపు జైల్లోనే గడిచిపోయింది.
వాళ్లిప్పుడు మిగతా జీవితాన్ని తమ కుటుంబంతో గడపాలనుకుంటున్నారు. నేను మైసూర్ జైల్లో ఉన్నప్పుడు వారితో అప్పుడప్పుడూ మాట్లాడేవాడిని. తమను ఇక విడుదల చేయరని తెలిసి పిలవేంద్రన్, సైమన్ అనారోగ్యానికి గురయ్యారు.
చనిపోయే కొన్నినెలల ముందు సైమన్ చాలా ఒత్తిడికి గురయ్యారు. చనిపోతే మృతదేహాన్ని తన కుటుంబానికి అప్పగించాలని కోరాడు.
పిలవేంద్రన్ విడుదల అవుతాననే ఆశలు వదులుకున్నాడు. ఆయన కూడా శారీరకంగా, మానసికంగా కుంగిపోయి చనిపోయారు” అన్నారు.
జ్ఞానప్రకాశం వయసు 75 ఏళ్లకు పైనే ఉంటుంది. ఆయన, మీసై మాధవన్ ఇప్పుడు మైసూరు జైల్లోనే ఉన్నారు.
“జ్ఞానప్రకాశం ఇప్పుడు రోజంతా చర్చిలోనే ఉంటున్నారు. మీసై మాధవన్ మానసిక స్థితి సరిగా లేదు. మేం కోయంబత్తూర్ ఖైదీల వివరాలు తెలుసుకున్నప్పుడు, వారు ముగ్గురికీ 50 ఏళ్లు పైబడినట్లు తెలిసింది.
వారంతా చాలా మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో ఉన్నారు. కనీసం, ఇప్పటికైనా మిగతా నలుగురినీ విడుదల చేయడం గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల”ని అంబురాజ్ కోరుతున్నాడు.
గతంలో యావజ్జీవం అంటే ఖైదీలు మొత్తం జీవితం జైల్లో గడపాల్సి వచ్చేది. ఇప్పుడు వారిని 10 లేదా 15 ఏళ్లకే విడుదల చేస్తున్నారు. కోర్టు, దానికి అనుమతిస్తున్నప్పటికీ, వీరప్పన్ కేసును రాజకీయం చేసి తొక్కిపెడుతున్నారు. ఇది మానవత్వాన్ని కించపరిచినట్లేనని మానవ హక్కుల కార్యకర్తలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- కరోనావైరస్ ఇంతలా పెరగడానికి ఎవరు కారణం.. గబ్బిలాలా? మనుషులా?
- కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?
- కరోనావైరస్: కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లపై '28 రోజుల వరకూ బతుకుతుంది'
- దళితులపై దాడులు: ఎన్ని చట్టాలు ఉన్నా ఈ అఘాయిత్యాలు ఎందుకు ఆగడం లేదు? లోపం చట్టాలదా? వ్యక్తులదా?
- కోవిడ్-19 టీకా కోసం ప్రపంచమంతా భారత్ వైపు ఎందుకు చూస్తోంది?
- బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్ పేరుతో శరీరాల్లో చిప్స్ అమర్చడానికి కుట్ర చేస్తున్నారా
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








