కరోనావైరస్ వ్యాక్సీన్: వందేళ్ల నాటి ఈ టీకా మందు కోవిడ్-19 నుంచి కాపాడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
1920ల్లో అభివృద్ధి చేసిన బీసీజీ వ్యాక్సీన్ కరోనావైరస్‌పై పనిచేస్తుందో లేదో తెలుసుకొనేందుకు బ్రిటన్‌లోని శాస్త్రవేత్తలు ఓ ప్రయోగం నిర్వహిస్తున్నారు.
క్షయను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ టీకాను అభివృద్ధి చేశారు. అయితే, ఇది కోవిడ్-19ను అడ్డుకోగలదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
యూనివర్సిటీ ఎక్స్‌టెర్ చేపడుతున్న ఈ ప్రయోగంలో దాదాపు వెయ్యి మంది వలంటీర్లు పాలుపంచుకుంటున్నారు.
బ్రిటన్‌లో లక్షల మందికి చిన్నప్పుడే బీసీజీ టీకా ఎక్కించారు. అయితే ఇప్పుడు కరోనావైరస్ నుంచి రక్షణలో భాగంగా వారికి మరోసారి టీకా ఇస్తున్నారు.
సమర్థంగా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించడమే లక్ష్యంగా వ్యాక్సీన్‌లు తయారుచేస్తారు. దీంతో ఆ ఇన్ఫెక్షన్ నుంచి ఏళ్ల వరకూ రక్షణ ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, ఈ క్రమంలో వ్యాధి నిరోధక వ్యవస్థలో చాలా మార్పులు వస్తుంటాయి. కొన్నిసార్లు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణకూ ఈ టీకాలు పనిచేస్తాయి. ప్రస్తుతం కరోనావైరస్ విషయంలోనూ ఇలాంటి ప్రభావాన్నే శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.
- గినియో బిసావులోని నవజాత శిశువుల్లో మరణాలు ఈ క్షయ టీకా వల్ల 38 శాతం వరకు తగ్గాయని ఇదివకరటి పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా న్యుమోనియా, సెప్సిస్ వ్యాధులను ఈ టీకా తగ్గించిందని వెల్లడైంది.
- మరోవైపు దక్షిణాఫ్రికాలో ఈ టీకాతో చెవి, గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు 73 శాతం వరకు తగ్గినట్లు వెల్లడైంది. నెదర్లాండ్స్‌లోనూ శరీరంలో యెల్లో ఫీవర్ వైరస్ స్థాయిలను తగ్గించడంలో బీసీజీ టీకా పనిచేస్తుందని తేలింది.
''ప్రపంచ వ్యాప్తంగా ఈ టీకాకు ప్రత్యేక ప్రాధాన్యముంది''అని ఎక్స్‌టెర్ మెడికల్ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్ జాన్ కాంప్‌బెల్.. బీబీసీతో చెప్పారు.
''కోవిడ్-19పై కచ్చితంగా పనిచేస్తుందని మేం చెప్పలేం. కానీ కోవిడ్-19కు సమర్థమంతమైన టీకా వచ్చేలోపు ఇది కొంత అవకాశం, సమయాన్ని మనకు ఇవ్వగలదు''
ప్రస్తుతం ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, స్పెయిన్, బ్రెజిల్‌లతో కలిపి అంతర్జాతీయంగా పది వేల మందిపై జరుగుతున్న పరిశోధనలో బ్రిటన్‌లో జరుగుతున్న అధ్యయనం కూడా ఒక భాగం.
ముఖ్యంగా ఆరోగ్య సేవల సిబ్బందిపై ఈ అధ్యయనంలో దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే వీరికి కరోనావైరస్ సోకే ముప్పు చాలా ఎక్కువ. అందుకే వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుందో వేగంగా తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
కొంతవరకు మాత్రమే
ఎక్స్‌టెర్ యూనివర్సిటీకి చెంది సామ్ హిల్టన్ ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటారు. ఆయన వైద్యుడు. అందుకే కోవిడ్-19సోకే ముప్పు ఆయన ఎక్కువ.
''బీసీజీ టీకా వేసుకుంటే కోవిడ్-19 సోకిన తర్వాత అనారోగ్యం పాలయ్యే అవకాశాలు తక్కువ''అని ఆయన బీబీసీతో చెప్పారు.
''అందుకే కొంతవరకూ రక్షణ లభిస్తుందని ఈ టీకా తీసుకుంటున్నా. ఈ శీతాకాలంలో నేను మళ్లీ కోవిడ్-19 విధుల్లోకి వెళ్లే అవకాశముంది''.
కోవిడ్-19కు సమర్థమంతమైన టీకా రావడానికి పట్టే సమయాన్ని బీసీజీ టీకా భర్తీ చేయగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్, లాన్సెట్ జర్నల్ రచయిత, డాక్టర్ టెడ్రోస్ అడనోమ్ వ్యాఖ్యానించారు.
''కోవిడ్-19తోపాటు భవిష్యత్‌లో రాబోయే మహమ్మారులను అడ్డుకోవడంలో ఈ టీకా అస్త్రంలా పనిచేస్తుంది''
అయితే, బీసీజీని ఓ దీర్ఘకాల పరిష్కారంలా చూడలేం.
చిన్నప్పుడు బీసీజీ వ్యాక్సీన్ తీసుకున్నా రక్షణ లేని వారు మరోసారి టీకా తీసుకున్నా కోవిడ్-19 నుంచి అంత రక్షణ ఉండకపోవచ్చు. అయితే, 2005 తర్వాత బ్రిటన్‌లో క్షయ కేసులు బాగా తగ్గిపోవడంతో ఈ టీకాను ఇవ్వడం చాలావరకు తగ్గించారు.
మరోవైపు కరోనావైరస్‌పై పోరాడే యాంటీబాడీలు, తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేసేలా వ్యాధి నిరోధక వ్యవస్థను ఈ టీకా ప్రేరేపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి దశలోనే
కరోనావైరస్‌పై సమర్థంగా పోరాడే వ్యాక్సీనే ఇప్పుడు పరిశోధకుల మొదటి లక్ష్యం. ఇలాంటి పది వ్యాక్సీన్‌లు క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ కూడా ఒకటి.
''మనం అడ్డుకోవాలనుకున్న వ్యాధి కారక సూక్ష్మ జీవులపై రోగ నిరోధక శక్తి దాడిచేసేలా ప్రేరేపించడమే వ్యాక్సీన్ల లక్ష్యం. అయితే వ్యాధి నిరోధక శక్తిని అలా ప్రేరేపించే సమయంలో.. శరీరంలోని రోగ నిరోధక శక్తి స్పందనలు, పోరాడే విధానమూ మారుతుంది''అని అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ ఆండ్ర్యూ పోలార్డ్ వ్యాఖ్యానించారు.
''అసలు సమస్య ఏమిటంటే.. ఏ వ్యాక్సీన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలియదు. అందుకే కరోనావైరస్‌పై రక్షణ ఏమైనా కల్పిస్తుందేమోనని అన్ని టీకాలనూ పరీక్షిస్తున్నారు''
ఇవి కూడా చదవండి:
- ‘రిపబ్లిక్ టీవీ డబ్బులు ఇచ్చి టీఆర్పీ పెంచుకుంటోంది’: ముంబయి పోలీసులు
- నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, చిరాగ్ పాశ్వాన్ తెర వెనక కథ నడిపిస్తున్నారా?
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- ఈ డ్రెస్సులే లైంగిక వేధింపులకు కారణమా?
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








