కరోనావైరస్: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ అభివృద్ధిలో ముందడుగు, రోగ నిరోధక వ్యవస్థను పోరాటానికి సిద్ధం చేస్తున్న టీకా

ఫొటో సోర్స్, Oxford University
- రచయిత, జేమ్స్ గళ్లఘెర్
- హోదా, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి
బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సీన్.. వైరస్‌పై పోరాడేలా రోగ నిరోధక వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది సురక్షితమని కూడా నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాక్సీన్ 1077 మందికి ఎక్కించారు. వారిలో యాంటీబాడీలు, తెల్లరక్త కణాలకు.. కరోనావైరస్‌తో పోరాడే సామర్థ్యం వచ్చినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ ఫలితాలు ప్రపంచ దేశాల్లో ఆశలు నింపుతున్నాయి. అయితే తగిన రక్షణ కల్పించగలవా? అని పూర్తిగా తెలుసుకునేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఇప్పటికే ఇలాంటి 100 మిలియన్ డోసుల వ్యాక్సీన్ తయారుచేయాలని బ్రిటన్ ఆదేశించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యాక్సీన్ ఎలా పని చేస్తుంది?
సీహెచ్ఏడీఓఎక్స్1 ఎన్‌సీవోవీ-19గా పిలుస్తున్న వ్యాక్సీన్‌ను మెరుపు వేగంతో అభివృద్ధి చేశారు.
చింపాంజీల్లో జలుబుకు కారణమయ్యే వైరస్‌లో జన్యు మార్పులుచేసి దీన్ని తయారుచేశారు.
ఈ వైరస్‌లో చాలా మార్పులు చేశారు. అందుకే ఇది మనుషుల్లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌కూ కారణం కాదు. అదే సమయంలో ఇది కరోనావైరస్‌లా కనిపిస్తుంది.
కరోనావైరస్‌తో మన శరీరంలోని కణాలపై దాడిచేసేందుకు ఉపయోగించే ప్రోటీన్(స్పైక్ ప్రోటీన్)కి సంబంధించిన జన్యుపరమైన సంకేతాలను ఈ వైరస్‌లోకి చొప్పించారు.
అంటే ఈ వ్యాక్సీన్ కరోనావైరస్‌కు డమ్మీ లాంటిది. ఇది కరోనావైరస్‌తో ఎలా పోరాడాలో మన రోగ నిరోధక వ్యవస్థకు నేర్పిస్తుంది.
యాంటీబాడీలు, టీ-కణాలు అంటే?
కరోనావైరస్‌పై జరుగుతున్న పరిశోధనల్లో చాలావరకు యాంటీబాడీలపైనే దృష్టి కేంద్రీకరించారు. రోగ నిరోధక వ్యవస్థలో ఇవి ఒక భాగం మాత్రమే.
రోగ నిరోధక వ్యవస్థ తయారుచేసే చిన్న ప్రోటీన్లే యాంటీబాడీలు. ఇవి వైరస్ ఉపరితలంపై అతుక్కుంటాయి.
ఈ యాంటీబాడీలకు వైరస్‌లను హతమార్చే సామర్థ్యం ఉంటుంది.
టీ-కణాలు.. ఒక రకమైన తెల్లరక్తకణాలు. ఇవి రోగ నిరోధక వ్యవస్థ సమన్వయంలో కీలకపాత్ర పోషిస్తాయి. శరీరంలో ఏ కణం ఇన్ఫెక్షన్‌కు గురైందో గుర్తించడం, దాన్ని నాశనం చేయడంలో ఇవి పాలుపంచుకుంటాయి.
దాదాపు అన్ని శక్తిమంతమైన వ్యాక్సీన్లూ.. యాంటీబాడీలు, టీ-కణాలను క్రియాశీలం చేస్తాయి.
వ్యాక్సీన్ వేసుకున్న 14 రోజుల తర్వాత టీ-కణాల స్థాయిలు పతాక స్థాయికి చేరుకుంటాయి. యాంటీబాడీలు 28 రోజుల తర్వాత ఈ స్థాయికి వెళ్తాయి. అయితే ఈ వ్యాక్సీన్‌తో దీర్ఘకాలంలో రోగ నిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో అంచనావేసే స్థాయిలో ఈ అధ్యయనం జరగలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది సురక్షితమేనా?
అవును, అయితే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.
అయితే ఈ దుష్ప్రభావాలు అంత ప్రమాదకరమైనవి కాదు. ఈ వ్యాక్సీన్ తీసుకున్న 70 శాతం మందిలో జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించాయి.
ఇవి పారాసెటమాల్‌తో తగ్గిపోతాయని పరిశోధకులు చెబుతున్నారు.
కోవిడ్-19పై పోరాటంలో ఈ వ్యాక్సీన్ సాయం చేస్తుందని ధ్రువీకరించేందుకు మరిన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే తాజా ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి అని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సారా గిల్‌బర్ట్ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










