రిలయన్స్‌ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?

అంబానీ జియో

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్‌ అహ్మద్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రిలయన్స్‌ జియో "మేడ్ ఇన్ ఇండియా" 5జీ టెక్నాలజీ ప్రయోగానికి పూర్తిగా సిద్ధంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సమావేశంలో కంపెనీ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశంలో 1000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన ఈ మధ్యే ప్రకటించారు.

గూగుల్‌ పెట్టే పెట్టుబడిలో 450 కోట్ల డాలర్లను జియో ప్లాట్‌ఫామ్‌లోనే వినియోగిస్తామని పిచాయ్‌ ప్రకటించారు.

గూగుల్, జియోల భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లో చౌకగా స్మార్ట్‌ఫోన్‌లు అందించే ప్లాన్‌ గురించి ఆయన సమాచారం ఇచ్చారు.

దీంతో దేశంలో ప్రస్తుతం 2జీ ఫీచర్ ఫోన్‌లను ఉపయోగిస్తున్న 35 మిలియన్ల మంది స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయగలుగుతారు.

"ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను, ప్లేస్టోర్‌ను వాడుకునే వీలున్న చవకైన ప్రారంభ స్థాయి స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడానికి గూగుల్, జియో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారతదేశంలో కోట్లమంది ప్రజలు ఈ స్మార్ట్‌ఫోన్‌లను కొనగలరని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము" అని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ అన్నారు.

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్

స్వయం సమృద్ధి - చైనాను వదిలించుకోవడం ఒక్కటేనా?

భారతీయ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో 5జి టెక్నాలజీని తయారు చేస్తామని జియో పేర్కొంది.

ఇది ప్రధాని స్వయం సమృద్ధ భారత్‌ నినాదానికి దగ్గరగా ఉందని సిలికాన్‌ వ్యాలీలో పని చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన 5జి నిపుణుడు సతీశ్‌ కుమార్‌ అన్నారు.

అంబానీ ప్రకటనను ఆయన గేమ్-ఛేంజర్‌గా భావిస్తున్నారు.

అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీయో బ్రిటన్‌ ప్రభుత్వం చైనా 5జీ కంపెనీపై విధించిన నిషేధాన్ని స్వాగతించారు. 5జీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో చైనా కంపెనీల సహాయం తీసుకోనందుకు జియోను ప్రశంసించారు.

భారతీయ మీడియాలోని ఒక విభాగం "మేడ్ ఇన్ ఇండియా" జియో 5జీని హువావే కిల్లర్‌గా ఆకాశానికెత్తేస్తోంది.

5జీ టెక్నాలజీ రూపకల్పనలో జియో లోకల్‌ టెక్నాలజీని మాత్రమే ఉపయోగిస్తే, దేశంలో మిగిలి రెండు పెద్ద టెలికాం కంపెనీలు వోడాఫోన్, ఎయిర్‌టెల్ కూడా 5జీ నెట్‌వర్క్‌లను స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించాల్సి ఉంటుంది. కానీ వాటి దగ్గర ఈ సామర్థ్యం లేదు.

5జీ ప్రయోగంలో కొత్తగా పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అవసరంలేదని నిపుణులు అంటున్నారు. అంటే అనధికారికంగా, భారతదేశం కూడా చైనాను నిషేధించిన, నిషేధించాలనుకుంటున్న దేశాల జాబితాలో చేరింది.

హువావే కంపెనీ చైనా ప్రభుత్వంతో డేటాను పంచుకోవచ్చని అమెరికా భయపడుతోంది. అందుకే అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించాలని అనేక దేశాలకు ప్రైవేటుగా సలహా ఇస్తున్నట్లు చెబుతున్నారు.

హువావే

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, హువావే

గూగుల్‌, జియోలు సంయుక్తంగా తీసుకురావాలనుకుంటున్న "ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్" ప్రాజెక్ట్ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీకి బ్యాడ్‌న్యూస్‌ అని చెప్పక తప్పదు.

షావోమీ ఇప్పుడు భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ రంగంలో ఒక ముఖ్యమైన సంస్థ నిలిచింది.

మరోవైపు ఫేస్‌బుక్ ఇటీవల జియో ప్లాట్‌ఫాంపై 5.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్, రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌పై కనిపించడంవల్ల చైనా ప్లాట్‌ఫాం వీచాట్‌కు పోటీ ఏర్పడుతుంది.

స్వయం సమృద్ధిలో చైనాను లేకుండా చేయడమే ఎక్కువగా కనిపిస్తోందని సతీశ్‌కుమార్ అన్నారు.

"గూగుల్ జియో ప్లాట్‌ఫామ్‌లో డబ్బును పెట్టుబడి పెడుతోంది. పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. దీనిని ఒక భారతీయ సంస్థ స్వయం సమృద్ధి అని అనరు. చైనా కంపెనీ రహిత భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నం అని చైనీయులు అంటున్నారు" అని సతీశ్‌ కుమార్‌ అన్నారు.

5జి

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో 5జీ లాంచ్ ఎప్పుడు?

ఈ ప్రశ్నకు ఎవరి దగ్గరా సమాధానం లేదు. కానీ 2022-23కి ముందు సాధారణ వినియోగదారులు దీనిని ఉపయోగించలేరని పరిశ్రమ అంచనా వేస్తోంది.

దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడిప్పుడే అమ్ముడవుతున్నాయి. అయితే ఈ సర్వీస్‌ ఇంకా అందుబాటులో లేదు. అంటే భారతదేశంలో 5జీ పరిస్థితి “ తినడానికి అన్నం ఉంది, తినేవాళ్లు ఉన్నారు. కానీ డైనింగ్‌ టేబుల్‌ మాత్రం ఇంకా సెట్‌ కాలేదు’’ అన్నట్లుంది.

ముకేశ్‌ అంబానీ బుధవారం చెప్పినట్లుగా జియో ప్లాట్‌ఫామ్ వచ్చే ఏడాది 5జీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ 5జీకి సంబంధించిన కీ ప్రభుత్వం వద్ద ఉంది. రెండు ముఖ్యమైన ప్రీ-లాంచ్ ప్రక్రియలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

2020 రెండవ త్రైమాసికంలో ఈ 5జీ స్పెక్ట్రంను వేలం వేయాలని భారత ప్రభుత్వం ప్రణాళిక వేసింది. కానీ ఇప్పుడు కోవిడ్ -19 కారణంగా ఇది ఆలస్యం కావచ్చు.

వచ్చే ఏడాది మధ్యలో వేలం జరిగినా, స్పెక్ట్రంను పొందిన కంపెనీలు మౌలిక సదుపాయాలను సిద్ధం చేసి పరీక్షించడానికి ఒక సంవత్సరంకన్నా ఎక్కువ సమయం పడుతుంది. అంటే 2022కి ముందు 5జీ ప్రజలకు అందుబాటులోకి రాదు.

5జి

ఫొటో సోర్స్, Getty Images

ఖరీదైన స్ప్రెక్టమ్‌ ఫీజు-కస్టమర్ల మీదే భారం

5జీ ఎయిర్‌వేవ్స్ వేలం కోసం ట్రాయ్ రిజర్వ్ ధరను నిర్ణయించింది. దీని మూలధర 70 మిలియన్ డాలర్లు.

నిపుణులు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల అంచనాల ప్రకారం ఇది చాలా ఖరీదైనది. అదే అమెరికాలో ఇది 26 మిలియన్‌ డాలర్లు కాగా, ఇటలీ, దక్షిణ కొరియాలలో 18, బ్రిటన్‌లో 10, ఆస్ట్రేలియాలో 5 మిలియన్‌ డాలర్ల ధర ఉంది.

ఈ ధరను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) భారత ప్రభుత్వాన్ని కోరింది.

అప్పుల బాధలో ఉన్న రెండు పెద్ద కంపెనీలు, వోడాఫోన్-ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు ఈ ధర కారణంగా స్పెక్ట్రంలో పాల్గొనలేకపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది జియోకు వరంగా మారొచ్చు.

అయితే జియో కూడా స్పెక్ట్రం మూల ధరను తగ్గించాలని పట్టుబడుతోంది. కాని ఆర్థికంగా జియో మిగతా కంపెనీల కంటే బలమైన స్థితిలో ఉంది. విదేశీ కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్‌లో 118 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం దీనికి పెద్ద రుజువు.

భారత ప్రభుత్వం వేలం మూల ధరను తగ్గించకపోతే, సాధారణ వినియోగదారులు ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది. 5జీ సర్వీసులు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)