లాక్‌డౌన్‌లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’

“భగవంతుడు మాత్రమే నన్ను కాపాడాలి - గృహ హింస బాధితురాలు

ఫొటో సోర్స్, Illustration: Nikita Deshpande/BBC

ఫొటో క్యాప్షన్, “భగవంతుడు మాత్రమే నన్ను కాపాడాలి - గృహ హింస బాధితురాలు
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఒక వైపు దేశ వ్యాప్త లాక్‌డౌన్, మరో వైపు ఎంతో మంది మహిళలకి ఇంట్లో హింసాత్మక భాగస్వాములతో కూడిన లాక్ డౌన్. బయటకి వెళ్లలేక, ఇంట్లో ఉండలేక, ఎవరికి చెప్పాలో అర్ధంకాక సతమతమవుతున్న వందలాది మహిళలు. అటువంటి కొంత మంది మహిళలతో బీబీసీ ప్రతినిధి పద్మ మీనాక్షి మాట్లాడారు.

తారకి (ఆమె అభ్యర్ధన మేరకు పేరుని మార్చడమైనది) వివాహమై 15 సంవత్సరాలు కావస్తోంది. ఎప్పటి నుంచో ఇంట్లో చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌లో ఇంట్లో అందరూ ఒకే చోట ఉండటం ఆమెకి కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది.

భర్త పెట్టే మానసిక, శారీరక హింస భరించలేక తన బాధకి పరిష్కారం దొరుకుతుందేమోనని ఏప్రిల్ 18 వ తేదీన ఆన్‌లైన్‌లో వెతకడం మొదలు పెట్టింది తార.

అప్పటికి లాక్‌డౌన్ మొదలయి 3 వారాలు కావస్తోంది.

గతంలో ఆమె ఉద్యోగానికి వెళ్లిపోవడం వలన, ఆమె భర్త ఉద్యోగ రీత్యా ప్రయాణాలలో ఎక్కువ సమయం గడుపుతూ ఉండటం వలన.. కలహాలు అప్పుడప్పుడూ తలెత్తే సమస్యగా మాత్రమే ఉండేది.

కానీ, లాక్‌డౌన్ వారి జీవితంలో కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. "ఏ సమయంలో నా భర్త స్వభావం ఎలా మారుతుందోననే భయంతో గడుపుతూ ఉంటాను" అని తన భర్త, అత్తగారు ఎక్కడ తన మాటలు వింటారోననే భయంతో ఒక గదిలో గడియ పెట్టుకుని చిన్న స్వరంతో నాతో ఆమె భయాన్ని పంచుకున్నారు.

ఆమె భర్త, అత్తగారు కూడా తనని ఎప్పుడూ మానసికంగా హింసిస్తూ ఉంటారని చెప్పారు.

“నేను ఒక మంచి తల్లిని కాదనీ, మంచి భార్యని కాదనీ విమర్శిస్తూ ఉంటారు. ప్రతి రోజూ వాళ్లకి కావల్సినవన్నీ వండి పెట్టాలని ఆదేశాలు జారీ చేస్తూ నన్ను ఇంటిలో మనిషిలా కాకుండా ఒక పని మనిషిలా చూస్తూ ఉంటారు’’ అని వివరించారు.

లాక్‌డౌన్‌లో కుటుంబ సభ్యులందరూ ఒకే చోట ఉండటంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో ఆన్‌లైన్‌లో ఏవైనా హెల్ప్‌లైన్లు ఉంటాయేమో అని వెతకడం మొదలు పెట్టారు.

ఫేస్‌బుక్‌లో గృహ హింసకి వ్యతిరేకంగా బాధితులకి మద్దతు ఇచ్చే ‘ఇన్విజిబుల్ స్కార్స్' అనే గ్రూప్‌ని చూసి వారిని సంప్రదించారు.

"లాక్ డౌన్ లాగే నా జీవితం కూడా అనిశ్చితంగా ఉంది" - గృహ హింస బాధితురాలు

ఫొటో సోర్స్, Illustration: Nikita Deshpande/BBC

ఫొటో క్యాప్షన్, "లాక్ డౌన్ లాగే నా జీవితం కూడా అనిశ్చితంగా ఉంది" - గృహ హింస బాధితురాలు

"మా దగ్గరకి ఇలాంటి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి’’ అని ‘ఇన్విజిబుల్ స్కార్స్’ వ్యవస్థాపకురాలు ఏక్తా వివేక్ వర్మ బీబీసీకి చెప్పారు.

చట్టపరంగా తారకి అందుబాటులో ఉన్న మార్గాలని ఏక్తా వివరించారు. ఆమె భర్తపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం గాని, చట్టపరంగా విడిపోవడానికి చర్యలు తీసుకోవడం గాని కౌన్సిలింగ్ కేంద్రాన్ని సంప్రదించడం గానీ చేయవచ్చని సూచించారు.

ఏక్తా మాటలతో ధైర్యం తెచ్చుకున్న తార మరొక్కసారి తనపై చేయి తగిలితే పోలీసులకి ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు చెప్పారు. కొన్ని రోజులు మౌనంగా ఉన్నప్పటికీ మళ్ళీ పరిస్థితి యథాతథంగానే ఉందని తార చెప్పారు.

ఇప్పుడు ఇల్లు వదిలి పెట్టి వెళ్లాలని తార అనుకోవటం లేదు.

“భగవంతుడు మాత్రమే నన్ను కాపాడాలి. ఈ వయసులో నేను నా తల్లిదండ్రులకి, కూతురికి బాధని కలిగించలేను” అంటారామె.

"చాలా మంది మహిళలు.. తమను హింసిస్తున్న భాగస్వామి నుంచి విడిపోవాలని అనుకోరు. వాళ్లకి తగిన గుణ పాఠం ఎలా నేర్పాలని మమ్మల్ని సలహా అడుగుతూ ఉంటారు” అని ఏక్తా చెప్పారు.

"విడాకులు అంటే భారతదేశంలో ఇంకా తప్పు విషయంగా పరిగణించడం వలనే ఈ పరిస్థితి నెలకొని ఉంది” అని ఆమె పేర్కొన్నారు. అలాగే, మహిళలు భర్త నుంచి విడిపోతామంటే వారికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించటం కూడా చాలా అరుదే.

లాక్‌డౌన్‌లో ఎటువంటి రవాణా సౌకర్యాలు లేకపోవడం వలన తాత్కాలికంగా ఇల్లు వదిలి ఆమె తల్లి తండ్రులతో ఉండటం కూడా కష్టమైన పనే.

హింసకి గురవుతున్న మహిళలకి వేరే దారి లేక హెల్ప్‌లైన్లని ఆశ్రయిస్తున్నారు.

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

లాక్‌డౌన్‌లో రెట్టింపయిన గృహ హింస ఫిర్యాదులు...

లాక్‌డౌన్ సమయంలో జాతీయ మహిళా కమిషన్‌కి వచ్చే ఫిర్యాదులు ఎక్కువయ్యాయని, కమిషన్ చైర్మన్ రేఖ శర్మ బీబీసీకి చెప్పారు. దాంతో ప్రత్యేకమైన వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ని ప్రారంభించాల్సి వచ్చినట్లు చెప్పారు.

భారతదేశంలో సందేశాలు పంపడం కోసం వాట్సాప్‌ని విరివిగా వాడతారు. ఫోన్ చేసే సౌలభ్యం లేని వారికి వాట్సాప్ ఒక సాధనంగా పని చేస్తుంది.

లాక్‌డౌన్‌కి ముందు నెలలో గృహ హింసకి సంబంధించిన ఫిర్యాదులు 123 ఉండగా మార్చ్ 23వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ మధ్యలో జాతీయ మహిళా కమిషన్‌కి మొత్తం 239 ఫిర్యాదులు వచ్చినట్లు రేఖ శర్మ తెలిపారు.

"లాక్‌డౌన్ వలన ఇంట్లోనే బంధించి ఉండటంతో హింసకి గురి చేసే వారు నియంత్రణ కోల్పోయి అసహనంతో ప్రవర్తిస్తుంటారు’’ అని అశోక యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న అశ్విని దేష్పాండే అన్నారు.

దీంతో ఇంట్లో ఉండేవారిని హింసించడం ద్వారా వారి అధికారం చూపించాలని అనుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు.

జాతీయ మహిళా కమిషన్‌కి ఈ ఏడాది మార్చి - ఏప్రిల్ మధ్యలో వచ్చిన ఫిర్యాదులని గత సంవత్సరంలో ఇదే సమయంలో వచ్చిన ఫిర్యాదులతో పోల్చి చూసేందుకు ఒక అధ్యయనం చేశారు. గత సంవత్సరంలో సగటున రోజుకి 5 ఫిర్యాదులు వస్తే ఇప్పుడు అవి సగటున 9కి పెరిగినట్లు ఆమె అధ్యయనంలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 21వ తేదీ వరకు 41 గృహ హింస కేసులు నమోదు అయినట్లు దిశ చట్టాన్ని అమలు చేసే అధికారి కృతిక శుక్లా బీబీసీకి తెలిపారు.

తమ దగ్గరకి వచ్చే ప్రతి కేసులో కౌన్సెలింగ్, వైద్య, చట్టపరమైన సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో గృహ హింస బాధితులకి సహాయం అందించేందుకు కౌన్సెలర్లతో కూడిన విభాగాలున్నాయన్నారు.

తెలంగాణలో గృహ హింస ఫిర్యాదులకు సంబంధించిన వివరాలు లభ్యం కాలేదు.

గృహహింస

ఇది ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. లాక్‌డౌన్‌లలో గృహ హింస పెరిగిన విషయాన్ని ఏప్రిల్ నెలలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరేజ్ కూడా గుర్తించారు.

హెల్ప్‌లైన్‌లకి వచ్చే ఫోన్ కాళ్ళు లెబనాన్, మలేషియా లాంటి దేశాలలో రెట్టింపు కాగా, చైనాలో మూడింతలు పెరిగాయని ఐక్య రాజ్య సమితి ప్రచురించిన ఒక నివేదికలో పేర్కొంది.

భారతదేశం లాంటి దేశంలో మహిళలు బయటకి వచ్చి ఫిర్యాదు చేయడం అంత సులభమైన పని కాదని స్నేహ స్వచ్ఛంద సంస్థకి చెందిన నైరీన్ దారువాలా అభిప్రాయపడ్డారు.

గృహ హింసకి గురయ్యేవారి కోసం ఆమె నిధులను సమీకరించడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీని కూడా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చినట్లు ఆమె చెప్పారు.

కరోనా వైరస్ లాక్‌డౌన్ విధుల్లో భాగంగా పోలీసులు, వైరస్ వ్యాప్తి చెందకుండా, ప్రజలు ఇంటిలోంచి బయటకి రాకుండా, పర్యవేక్షణ చేసే ఫ్రంట్ లైన్ పనుల్లో నిమగ్నమైపోయారు.

కానీ, ఆపదలో ఉన్న మహిళలకి భద్రత కల్పించడానికి అదొక నెపంగా చెప్పడానికి లేదని అశ్విని దేష్పాండే అంటారు. గృహ హింసకి చేసే సహాయాన్ని కూడా అత్యవసర సేవల్లోకి చేర్చాలని ఆమె అభిప్రాయపడ్డారు.

గృహహింస

ఫొటో సోర్స్, Getty Images

లక్ష్మి (ఆమె అభ్యర్ధన మేరకు పేరు మార్చడమైనది) తన విషయంలో పోలీసులు సహాయం చేయలేకపోయారని చెప్పారు. ఆమె భర్త విపరీతంగా తాగి వచ్చి తనని విపరీతంగా కొట్టేవారని, చాలా సార్లు తనపై మానభంగం కూడా చేసేవారని చెప్పారు.

"నన్నొక భాగస్వామి కంటే తన శారీరక అవసరాలు తీర్చుకోవడానికి ఉన్న ఒక యంత్రంలాగే చూసేవారు” అని తెలిపారు.

గతంలో హింస తీవ్ర స్థాయికి చేరినప్పుడు ఆమె పుట్టింటికి వెళుతూ ఉండేది. కానీ, లాక్‌డౌన్‌లో ఆమె ఆ పని చేయలేకపోయింది.

లాక్‌డౌన్‌లో కూడా ఆమె భర్త ఒక వేశ్య దగ్గరకి వెళుతుండటం ఆమెని భయానికి గురి చేసింది. కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఎక్కడి నుంచి ఏమి ఇన్ఫెక్షన్ వస్తుందోననే భయంతో ఆమె భర్త గురించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు అతనిని పట్టుకుని, అతని మోటార్ బైక్‌ని తీసుకుని ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పారు. కానీ, అతనిని స్టేషన్‌లో బంధించి ఉంచలేదు. ఇంటికి వచ్చిన తర్వాత అతని కోపాన్నంతా భార్యపై చూపించాడు.

"నేను చనిపోయాననే అనుకున్నాను.. అతను ఆ రోజు కొట్టిన దెబ్బలకి" అని ఆమె తెలిపారు.

ఆమె తొమ్మిదేళ్ల కూతురు పక్కింటికి వెళ్లి చెప్పడంతో ఆమె పొరుగింటి వారొచ్చి ఆమెని భర్త దెబ్బల నుంచి విడిపించి కాపాడారు. ఆమె వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు.

“నన్ను నా గాయాలను చూసి పోలీసులు ఫిర్యాదు నమోదు చేస్తారనుకున్నాను. కానీ, వారు ఇంటికి తిరిగి వెళ్లిపొమ్మని చెప్పారు. నాకు చాలా నిస్సహాయంగా అవమానకరంగా అనిపించింది. ఒక వేళ నా భర్త నన్ను చంపేసి ఉంటే?’’ అని ప్రశ్నిస్తున్నారు.

ఆ మరుసటి రోజే ఆమె పిల్లలని తీసుకుని తెల్లవారు జామున పుట్టింటికి తన సొంత బండి మీద వెళ్లిపోయారు. ఆమె ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఆమె భర్త ఇప్పటి వరకు ఆమెతో తిరిగి మాట్లాడలేదని చెప్పారు.

"లాక్ డౌన్ లాగే నా జీవితం కూడా అనిశ్చితంగా ఉంది".

భారతదేశంలో గృహ హింసకి సంబంధించి హెల్ప్ లైన్ 1091/1291 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు.

జాతీయ మహిళా కమిషన్ వాట్సాప్ నెంబర్: 72177-35372

ఇతర హెల్ప్ లైన్ల గురించిన సమాచారం కోసం జాతీయ మహిళా కమిషన్ వెబ్సైట్ లో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)