టాకింగ్ బాక్స్: కెన్యాలో బాలికలపై వేధింపులకు ఇవి ఎలా పరిష్కారం చూపిస్తున్నాయి?

కెన్యాలోని అతిపెద్ద మురికివాడలో నివసించే బాలికలు తమపై జరుగుతున్న లైంగిక వేధింపులపై, పితృస్వామిక ధోరణిపై మౌనాన్ని వీడుతున్నారు.
పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 'టాకింగ్ బాక్స్'లు వారి వేదనకు వేదికవుతున్నాయి. పరిష్కారానికి మార్గం చూపిస్తున్నాయి.
దీనిపై నౌరోబి నుంచి బీబీసీ ప్రతినిధి అష్లే లైమ్ అందిస్తున్న కథనం...
''మా నాన్న బార్‌కు వెళ్లి మందు తాగి వచ్చాక నన్ను, మా చెల్లిని, అమ్మను చంపేస్తానని బెదిరిస్తుంటాడు. చాలా ఏళ్ల నుంచి నా బాధను ఎవరికీ చెప్పలేదు. కానీ, ఎప్పుడైతే టాకింగ్ బాక్సులు స్కూల్‌కు వచ్చాయో, నా బాధను మీతో పంచుకోవాలనుకుంటున్నా. నా పేరు, గుర్తింపు చెప్పకుండా ఈ బాక్సులో నేను రాసిన ఉత్తరం వేస్తున్నా'' అని ఓ 14 ఏళ్ల బాలిక తన బాధను ఒక ఉత్తరంలో రాసుకొచ్చింది.
నైరోబి మురికివాడల్లోని ఒక స్కూల్‌లో ఉన్న టాకింగ్ బాక్సులో ఈ ఉత్తరం కనిపించింది.

గుండె బరువెక్కే సమస్యలు వారివి..
ఐక్యరాజ్యసమితి ఆర్థికసాయంతో పాలికామ్ డెవలప్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ మురికివాడలోని 50 పాఠశాలల్లో మెటల్ బాక్సులను ఏర్పాటు చేసింది.
బాలికలు తమ సమస్యలను, ప్రశ్నలను పేపర్ మీద రాసి టాకింగ్ బాక్స్‌ల్లో వేస్తారు. ఈ బాక్సులు స్కూల్లోని బాత్‌రూంలు, గోప్యత ఉండే ఇతర ప్రదేశాలలో ఉంచుతారు.
"నేను అమ్మాయిలతో పనిచేయడం ప్రారంభించినప్పుడు, వారికి ఎన్నో బాధలు ఉన్నా కూడా వాటి గురించి వారెప్పుడూ మాట్లాడటం లేదని గమనించాను'' అని పాలికామ్ డెవలప్‌మెంట్ వ్యవస్థాపకుడు జేన్ అన్యాంగో బీబీసీకి చెప్పారు.

'లైంగిక వేధింపుల గురించే ఎక్కువ'
పోస్ట్ చేసేన వందలాది ఉత్తరాలని ప్రతి వారం శిక్షణ పొందిన స్థానిక వాలంటీర్లు చదివి, వాటిపై ఎలా వ్యవహరించాలో నిర్ణయించుకుంటారు.
ముందుకు స్కూల్ పిల్లలు, వారి తల్లిదండ్రులను పాఠశాలకు పిలుస్తారు. వారితో చర్చిస్తారు. పిల్లలు, భార్యను వేధించవద్దని అక్కడికి వచ్చిన మగవారిని హెచ్చరిస్తారు.
టాకింగ్ బాక్సుల్లో వచ్చే ఉత్తరాల్లో ఎక్కువగా లైంగిక వేధింపులకు సంబంధించినవే ఉంటాయి.
మురికివాడలలోమహిళలు, బాలికలపై హింస విస్తరిస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2010 నివేదిక పేర్కొంది.
పారిశుధ్యం, భద్రత లేకపోవడం కూడా దీనికి కారణమని తెలిపింది.
ఆఫ్రికన్ పాపులేషన్ అండ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్ 2014 లో విడుదల చేసిన మరో నివేదిక ప్రకారం, కెన్యాలో 10 నుంచి 24 ఏళ్లున్న యువకులలో 30 శాతం మంది పట్టణ మురికివాడల్లోనే నివసిస్తున్నారు.
''వారు దారుణ పేదరికంలో ఉన్నారు. పాఠశాల విద్య సరిగా లేకపోవడం, బాల్య వివాహం, నిరక్షరాస్యత, లైంగిక వేధింపులు, లింగ ఆధారిత హింస, ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడం వంటి ప్రమాదాలకు గురవుతున్నారు'' అని ఆ నివేదిక తెలిపింది.

బాలికల్లో సాధికారత
మెంటర్ లేహ్ అధియాంబోతో కలిసి బీబీసీ ఒక పాఠశాలని సందర్శించింది. అక్కడ ఆమె నలిగిన కాగితపు ముక్కలను తెరిచారు. వెలుతురు తక్కువ ఉన్న తరగతి గదిలోకి వెళ్లి ఆ లేఖలో ఏం ఉందో చదివారు.
''గర్భం అంటే ఏమిటి? గర్భిణి ఎలా అవుతారు?" అని ఓ అమ్మాయి అడిగింది.
మేం దానికి సమాధానం చెబుతామంటూ కొన్ని చేతులు లేచాయి. వారంతా 13 నుంచి 15 ఏళ్ల లోపున్న విద్యార్థులు. లేహ్ అధియాంబో అందులో ఒకరిని లేపి ఏం తెలుసు చెప్పు అని కోరారు.
''గర్భం అంటే కడుపులో ఎవరైనా నివసిస్తుండటం'' అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ సమయంలో మిగిలిన విద్యార్థుల గుసగుసలు, ముసిముసి నవ్వులు కనిపించాయి.
''శుక్ర కణాలు, అండాలతో కలిసినప్పుడు గర్భం వస్తుంది'' అని మరో బాలిక చెప్పింది.
దానికి అధియాంబో తలూపుతూ గర్భానికి సంబంధించిన మరిన్ని వివరాలను బాలికలకు వివరించారు.
ఈమెతో పాటు అనేక మంది స్వచ్ఛంద కార్యకర్తలు కెన్యాలోని మురికివాడల్లో బాలికలపై వేధింపులకు వ్యతిరేకంగా వారిని రక్షించడంలో కృషి చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'మన పెద్దాపురం': 'కిలో ప్లాస్టిక్ తెస్తే... కిలో బియ్యం ఇస్తాం'
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








