ఒక దేశం, ఒక వర్గం అన్న తేడా లేకుండా యూరప్‌లో వందల సంఖ్యలో ఆడవాళ్లను చంపేస్తున్నారు.. ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రోజీ బ్లంట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దక్షిణ ఫ్రాన్స్‌లోని కాగ్నెస్-సర్-మెర్‌లో గత సెప్టెంబర్ 1న ఒక చెత్త కుప్పలో ఓ మహిళ మృతదేహం కనిపించింది. ఆమెపై క్రూరంగా దాడి జరిగి ఉండొచ్చని చెప్పేందుకు తగిన ఆనవాళ్లు ఆ శరీరంపై కనిపించాయి.
మృతురాలిని 21 ఏళ్ల సలోమేగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది ఫ్రాన్స్‌లో జరిగిన వందో 'ఫెమిసైడ్'గా ఈ ఘటనను వారు పరిగణిస్తున్నారు.
ఫెమిసైడ్ అంటే ఓ మహిళ హత్యకు గురవడం. భర్త, బాయ్ ఫ్రెండ్, పార్ట్‌నర్ లేదా ఇతర కుటుంబ సభ్యుల చేతులో హతమవుతున్న ఘటనలు అక్కడ పెరుగుతున్నాయి.
సలోమే హత్య గురించి తనపై వచ్చిన నేరారోపణలను మాత్రం ఆమె పార్ట్‌నర్ అంగీకరించడం లేదు.
సలోమే మృతదేహం లభించిన మరుసటి రోజే 101వ ఫెమిసైడ్ ఘటన కూడా నమోదైంది. 92 ఏళ్ల ఓ మహిళను ఆమె భర్త (94 ఏళ్లు) హత్య చేశాడు.
ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించింది. గృహహింస నుంచి మహిళలకు రక్షణ కల్పించేందుకు వివిధ చర్యలను ప్రకటించింది.
ఒక దేశం, ఒక వర్గం తేడా లేకుండా, యూరప్ అంతటా ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌లాగే మిగతా ఐరోపా దేశాలు కూడా ఇలాంటి హత్యలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
గృహ హింస బాధితులకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఓ హెల్ప్‌లైన్ సెంటర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయెల్ మాక్రోన్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ చర్యల గురించి ప్రకటించారు.
ఆ సమయంలో ఆ కేంద్రానికి వచ్చిన ఓ ఫోన్ కాల్‌ను ఆయన విన్నారు.
తనను తీవ్రంగా హింసిస్తున్న భర్తను వదిలి వచ్చానని, అయితే ఆ ఇంట్లో ఉన్న తన వస్తువులను తెచ్చుకునేందుకు తోడుగా ఓ పోలీస్ అధికారిని పంపాలని ఓ మహిళ అభ్యర్థిస్తూ ఆ ఫోన్ కాల్ చేశారు.
కోర్టు ఆదేశం ఉంటే తప్ప తాము అలా రాలేమని పోలీస్ అధికారి ఈ అభ్యర్థనపై ఆపరేటర్‌కు బదులిచ్చారు.
కానీ, నిజానికి కోర్టు ఆదేశం అవసరం లేకుండానే పోలీస్ అధికారి ఆ మహిళ వెంట వెళ్లేందుకు వీలు ఉంది. హెల్ప్‌లైన్ కేంద్రానికి మాత్రం పోలీసులను అలా వెళ్లమని ఆదేశించే అధికారం లేదు.
దీంతో బాధితురాలికి ఓ స్వచ్ఛంద సంస్థ వివరాలు అందించి, వాళ్ల నుంచి సాయం అందే అవకాశం ఉందని చెప్పి ఆపరేటర్ కాల్ కట్ చేశారు.
ఈ సంభాషణంతా విన్న మాక్రోన్ విస్మయం వ్యక్తం చేశారు.
''ఇలా తరచూ జరుగుతుంటాయా?'' అని ఆయన ఆపరేటర్‌ను ప్రశ్నించారు.
''అవును. చాలా సార్లు జరుగుతుంటాయి'' అని ఆ ఆపరేటర్ సమాధానమిచ్చారు.
రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ఒకరిని మరొకరు చంపుకున్న కేసుల్లో చాలా వరకూ బలవుతోంది మహిళలే. యురోపియన్ దేశాల్లోకెల్లా ఫ్రాన్స్‌లో ఇలాంటి కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రొమేనియా, నార్తర్న్ ఐర్లాండ్‌లో తీవ్రం..
రొమేనియా, నార్తర్న్ ఐర్లాండ్‌లో సమస్య మరింత దారుణంగా ఉంది.
గృహ హింస తగ్గడం లేదని, ఏటా బలవుతున్న మహిళల సంఖ్య పెరుగుతోందని నార్తర్న్ ఐర్లాండ్‌లో మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న సోన్యా మెక్‌మల్లన్ చెప్పారు.
యూకేలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే నార్తర్న్ ఐర్లాండ్‌లో గృహ హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వ చర్యలు అంత బలంగా లేవు.
గత మార్చిలో ఇక్కడి కౌంటీ డౌన్ ప్రాంతంలో గిసెల్ మారిమోన్ అనే మహిళ, ఆమె కుమార్తె అలిసన్ హత్యకు గురయ్యారు. గిసెల్ పార్ట్‌నర్ ఈ నేరం చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతడి మృతదేహం కూడా ఘటన జరిగిన స్థలంలోనే దొరికింది.
లింగ సమానత్వం విషయంలో ఫిన్లాండ్ చాలా ముందున్నట్లుగా విశ్లేషకులు చెబుతుంటారు. కానీ ఆ దేశంలోనూ ఫెమిసైడ్‌ల సంఖ్య అధికంగానే నమోదవుతోంది.
''నోర్డిక్ దేశాల్లో సమాన హక్కుల కోసం బయట ఉద్యమాలు జరుగుతుంటాయి. కానీ, లోలోపల పరిస్థితి అలా ఉండదు'' అని లాప్లాండ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న పైవీ నస్కాలీ అన్నారు.
''సంక్షేమంపై దృష్టి పెట్టే ఫిన్లాండ్.. మహిళలకు చాలా హక్కులు కల్పించింది. కానీ, ఆ విధానాల ప్రభావం కార్యాలయాల వరకే. ప్రైవేటు జీవితాల్లో సమానత్వం లేదు'' అని ఆమె అన్నారు.
''వ్యక్తుల మనస్తత్వమే ఈ సమస్యకు మూల కారణం. తప్పు మహిళలదే అని సమాజం నిందిస్తూ ఉంటుంది'' అని లిథువేనియాలో గృహ హింస బాధితుల సహాయ కేంద్రంలో పనిచేస్తున్న మోడెస్టా కైరైట్ బీబీసీతో చెప్పారు.
''వేధింపులకు గురవుతూ భాగస్వామితో కలిసి ఉండటం ఎందుకని మహిళలనే సమాజం నిందిస్తుంది. విడిపోయి ఒంటరిగా ఉన్నవారిని జీవితంలో విఫలమైనవారిగా చూస్తుంది. కుటుంబంలోని చిన్నారుల కోసం కష్టమైనా, నష్టమైనా కలిసే ఉండాలని కూడా సమాజం చెబుతుంటుంది'' అని కైరైట్ అన్నారు.

ఫొటో సోర్స్, PSNI
వెయ్యికి చేరుకుంది
స్పెయిన్‌లో 2003 నుంచి ఈ ఫెమిసైడ్‌ల రికార్డులను నమోదు చేస్తున్నారు. గత జూన్ 10న ఆ దేశంలో 1000వ ఫెమిసైడ్ ఘటన జరిగింది.
తన నుంచి విడిపోతానన్నందుకు 29 ఏళ్ల బియాట్రిజ్ అరోయోను ఆమె బాయ్‌ఫ్రెండ్ హత్య చేశాడు. అతడు కూడా భవనం పై నుంచి దూకి చనిపోయాడు.
స్పెయిన్‌లో మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారు జూన్ 10ని 'చీకటి రోజు'గా జరుపుకున్నారు.
ఫెమిసైడ్‌లకు వ్యతిరేకంగా ఆ దేశంలో నిరసనలు జరిగాయి.
మృతిచెందిన వెయ్యి మందిలో 607 మందిని వారి ఎక్స్‌పార్ట్‌నర్‌లు హత్య చేశారు. మరో 168 మంది బ్రేకప్ సమయంలో చనిపోయారు.
స్పెయిన్‌లో ఫెమిసైడ్‌ల సంఖ్య 2018తో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటికే రెండింతలు నమోదైంది.

ఫొటో సోర్స్, Getty Images
చర్యలు ఏం తీసుకుంటున్నారు?
ఫెమిసైడ్‌లను అరికట్టే చర్యల కోసం రూ.39 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ ఫిలిప్ తాజాగా ప్రకటించారు. వీటి ద్వారా గృహ హింస బాధిత పునరావాస కేంద్రాల్లో మరో వెయ్యి మందికి తగ్గట్లు ఏర్పాట్లు చేయనున్నారు.
మహిళల ఫిర్యాదులపై పోలీసులు చర్యలు ఏ విధంగా తీసుకన్నారన్నది విశ్లేషించేందుకు 400 పోలీస్ స్టేషన్లలో ఆడిట్ నిర్వహించనున్నారు.
గృహ హింస నేరాల నిందితులు తిరిగి బాధితులు, ఇతర కుటుంబ సభ్యుల జోలికి వెళ్లకుండా చేసేందుకు వారితో ఎలక్ట్రానిక్ ట్యాగ్‌లు ధరింపజేయనున్నారు.
గృహ హింసను అరికట్టాలంటే ఇంకా పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపుల అవసరమని మహిళల హక్కుల కోసం ఉద్యమిస్తున్న సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
పాఠశాల విద్యలోనూ దీనిపై అవగాహన పెంచేలా పాఠాలు ఉండాలని అంటున్నాయి.
లిథువేనియాలో గృహ హింసపై చిన్నారులకు అవగాహన కల్పించేలా ఓ కామిక్ పుస్తకాన్ని మోడెస్టా కైరైట్ రూపొందించారు.
ఇవి కూడా చదవండి:
- ఈ అక్కాచెల్లెళ్లు కన్నతండ్రినే హత్యచేశారు.. కారణమేంటి
- గూఢచారితో పారిపోయి పట్టుబడిన దుబాయ్ యువరాణి కథ
- మారిటల్ రేప్ చట్టానికి ఉన్న అడ్డంకులేంటి?
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- రియల్ లైఫ్ అపరిచితురాలు: ఒక్క మహిళలో 2500 మంది
- అనుష్కతో హానీమూన్‌కు సంబంధించి కోహ్లీ బయటపెట్టిన ఆసక్తికర విషయం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








