మహిళల హత్యలు: మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఆమె ఇల్లే

ప్రపంచంలో ప్రతి రోజూ సగటున 137 మంది మహిళలను వారి జీవిత భాగస్వాములో, కుటుంబ సభ్యులో హత్య చేస్తున్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ (యూఎన్ఓడీసీ) తాజాగా విడుదల చేసిన లెక్కలు చెప్తున్నాయి.
‘‘ఒక మహిళ హత్యకు గురయ్యే అవకాశం అత్యధికంగా ఉన్న ప్రాంతం ఆమె ఇల్లే’’ అని ఆ సమాచారం స్పష్టం చేస్తోంది.
ఆ నివేదిక ప్రకారం.. 2017లో హత్యకు గురైన 87,000 మంది మహిళల్లో సగం కన్నా ఎక్కువ మంది.. వారికి అత్యంత సన్నిహితుల చేతుల్లోనే చనిపోయారు.
అందులో సుమారు 30,000 మంది సన్నిహిత భాగస్వాముల చేతుల్లో హత్యకు గురవగా.. మరో 20,000 మంది బంధువుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఈ సంఖ్యల వెనుక ఉన్న మహిళల గురించి తెలుసుకోవాలని బీబీసీ 100 మంది మహిళలు భావించింది. అక్టోబర్ నెల మొదటి రోజున హత్యకు గురైన మహిళలు, పురుషుల గురించిన వార్తా కథనాలను మేం ఆ నెలంతా పరిశీలించాం. వారి కథలు కొన్నిటిని ఈ కింద పంచుకుంటున్నాం. ఈ హత్యలను ఎలా ప్రచురించారన్న దాని గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

పురుషుల హత్యలే ఇంకా అధికం
యూఎన్ఓడీసీ సేకరించిన సమాచారం.. ‘‘ఉద్దేశపూర్వక హత్యల ఫలితంగా ప్రాణాలు కోల్పోయే అవకాశమున్న పురుషుల సంఖ్య మహిళల కన్నా దాదాపు నాలుగు రెట్లు అధికంగా ఉంది’’ అనే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 హత్యల్లో ఎనిమిది మంది పురుషులే అని ఐరాస సూచిస్తోంది.
అయితే.. సన్నిహిత భాగస్వాముల వల్ల హత్యకు గురైన ప్రతి 10 మందిలో ఎనిమిది కన్నా ఎక్కువ మంది మహిళలేనని అదే నివేదిక చెప్తోంది.
‘‘సన్నిహిత భాగస్వామి హింసే మహిళలను అధికంగా బలి తీసుకుంటోంది’’ అని ఆ నివేదిక ఉద్ఘాటించింది.

47 మంది మహిళలు.. 21 దేశాలు.. ఒక్క రోజు
2017లో హత్యలకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు అందించిన గణాంకాలను క్రోడీకరిస్తూ ఐక్యరాజ్యసమితి గణాంకాలను రూపొందించింది.
‘‘మహిళలు, బాలికల హత్యలు’’ లేదా ‘‘స్త్రీ హత్యల’’కు సంబంధించిన అంకెలను.. సన్నిహిత భాగస్వామి/కుటుంబ సంబంధిత హత్య అనే ప్రాతిపాదికన క్రోడీకరించారు.
ఈ అంకెల వెనుక ఉన్న మహిళల గురించి మరింత తెలుసుకోవటానికి బీబీసీ 100 మంది మహిళలు, బీబీసీ మానిటరింగ్ రంగంలోకి దిగింది.
2018 అక్టోబర్ 1వ తేదీన హత్యకు గురైన మహిళలకు సంబంధించి మీడియాలో ప్రచురితమైన కథనాలను మేం పరిశీలించాం. ఆ రోజున 21 వేర్వేరు దేశాల్లో 47 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. వీటిలో చాలా హత్యలపై ఇంకా దర్యాప్తు జరుగుతూనే ఉంది.
స్థానిక మీడియాలో ప్రచురితమై, అనంతరం బీబీసీ సంప్రదించగా స్థానిక అధికారులు నిర్ధారించిన ఐదు ఉదంతాలు ఇవీ...

ఫొటో సోర్స్, Manohar Shewale
నేహా శరద్ చౌదరి (18 ఏళ్లు), ఇండియా
నేహా శరద్ చౌదరి.. తన 18వ పుట్టిన రోజు నాడు హత్యకు గురైంది. ఆమెది ‘పరువు’ హత్యగా అనుమానిస్తున్నారు.
నేహా తన బోయ్‌ఫ్రెండ్‌తో పుట్టినరోజు వేడుకలు జరపుకోవటానికి బయటకు వెళ్లింది. అతడితో ఆమె సంబంధాన్ని ఆమె తల్లిదండ్రులు ఆమోదించలేదని పోలీసులు బీబీసీకి నిర్ధారించారు.
ఆ రోజు సాయంత్రం ఆమె ఇంట్లోనే ఆమె తల్లిదండ్రులు, మరొక మగ బంధువు ఆమెను హత్య చేశారన్నది ఆరోపణ.
ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ముగ్గురు నిందితులూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ప్రేమించినందుకు, కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకు.. ప్రతి ఏటా వందలాది మంది హత్యకు గురవుతున్నారు. ఇటువంటి నేరాలు తరచుగా నమోదు కాకపోవటం, వెలుగు చూడకపోవటం వల్ల.. ‘పరువు హత్యలు’ అని పిలిచే ఈ దురాగతాల గురించి అధికారిక లెక్కలు లభించటం కష్టం.

ఫొటో సోర్స్, Family handout
జుడిత్ చెసాంగ్ (22 ఏళ్లు), కెన్యా
అక్టోబర్ ఒకటో తేదీ, సోమవారం నాడు.. జుడిత్ చెసాంగ్, ఆమె సోదరి నాన్సీలు.. తమ పొలంలో జొన్న పంట కోస్తున్నారు.
జుడిత్.. ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఇటీవల తన భర్త లబాన్ కామురెన్ నుంచి విడిపోయి.. తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వీరు పొలంలో పనులు ప్రారంభించిన కొద్ది సేపటికే.. భర్త పొలం దగ్గరికి వచ్చి జుడిత్ మీద దాడి చేసి ఆమెను చంపేశాడు.
అనంతరం అతడిని గ్రామస్తులు చంపేశారని స్థానిక పోలీసులు చెప్తున్నారు.

మహిళలు తమ సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యే ప్రమాదం అత్యధికంగా ఉన్న ప్రాంతం ఆఫ్రికా అని ఐరాస నివేదిక చెప్తోంది. ఆఫ్రికాలో ఇలాంటి హత్యల రేటు ప్రతి 1,00,000 మందికి 3.1 గా ఉంది.
ఇక 2017లో సన్నిహిత భాగస్వాముల చేతిలో హత్యకు గురైన మహిళల సంఖ్య అత్యధికంగా ఆసియాలో నమోదైంది. ఆసియాలో మొత్తం 20,000 మంది ఈ రకంగా చనిపోయారు.

ఫొటో సోర్స్, Private via Amnesty International
జైనాబ్ సెకాన్వాన్ (24 ఏళ్లు), ఇరాన్
జైనాబ్ సెకాన్వాన్.. తన భర్తను హత్య చేసిందన్న ఆరోపణతో ఇరాన్ అధికారులు ఆమెకు మరణశిక్ష అమలు చేశారు.
జైనాబ్.. వాయువ్య ఇరాన్‌లోని ఒక పేద, సంప్రదాయ కుర్దు కుటుంబంలో పుట్టారు. మంచి జీవితం లభిస్తుందన్న ఆశతో ఆమె టీనేజీ వయసులో ఇల్లు వదిలి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
అయితే.. ఆమె భర్త తరచూ వేధించేవాడని, ఆమెకు విడాకులు ఇవ్వటానికి నిరాకరించాడని, ఆమె ఫిర్యాదులను పోలీసులు విస్మరించారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెప్తోంది.
ఆమె తన భర్తను హత్య చేసినందుకు గాను 17 ఏళ్ల వయసులో అరెస్ట్ చేశారు.
కానీ.. భర్తను హత్య చేసినట్లు ఒప్పుకోవటానికి ఆమెను హింసించారని, పోలీసులు కొట్టారని, ఆమెకు న్యాయమైన విచారణ లభించలేదని ఆమ్నెస్టీ సహా ఆమె మద్దతుదారులు అంటున్నారు.
సన్నిహిత భాగస్వాములను చంపిన మహిళలు తరచుగా ‘‘దీర్ఘకాలం భౌతిక హింసను ఎదుర్కొన్నారు’’ అని యూఎన్ఓడీసీ నివేదిక సూచిస్తోంది.
మరోవైపు.. పురుష హంతకులు సాధారణంగా చెప్పే కారణాల్లో.. ‘‘స్వాధీనత, అసూయ, వదిలి వెళ్లిపోతారన్న భయం’’ వంటివి అధికంగా ఉన్నాయని ఆ నివేదిక చెప్తోంది.
జైనాబ్‌ను ఉరితీసిన రోజునే బ్రెజిల్‌లో ఒక జంట చనిపోవటానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Reproduction / Facebook
సాండ్రా లూసియా హామర్ మోరా (39 ఏళ్లు), బ్రెజిల్
సాండ్రా లూసియా హామర్ మోరా పదహారేళ్ల వయసులో అగస్టో ఆగ్వియర్ రిబీరోను పెళ్లి చేసుకుంది.
రిబీరో ఆమెను హత్య చేయటానికి ఐదు నెలల ముందు ఆ జంట విడిపోయింది.
ఆమెను మెడపై కత్తితో పొడిచినట్లు జార్దిమ్ టకారీ పోలీసులు బీబీసీ జ్రెజిల్‌కు నిర్ధారించారు.
తన నేరాన్ని అంగీకరించిన వీడియో రిబీరో మొబైల్ ఫోన్‌లో వారికి దొరికింది. సాండ్రా అప్పటికే మరొక పురుషుడితో డేటింగ్ చేస్తోందని.. తనను వంచించినట్లు భావించానని అతడు ఆ వీడియోలో చెప్పాడు.
తమ జంట ఉమ్మడిగా ‘దేవుడి దగ్గరకు’ వెళుతుంది కాబట్టి తనను అరెస్ట్ చేయబోరని కూడా అతడు ఆ వీడియోలో చెప్పాడు. అనంతరం అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒక వ్యక్తి.. ఒకరు లేదా ఎక్కువ మందిని హత్య చేసి తనను తాను చంపుకునే ‘హత్య - ఆత్మహత్య’ అనే తరహా హత్యలను సాండ్రా ఉదంతం ప్రముఖంగా చాటుతోంది.

ఫొటో సోర్స్, PHOTOPQR/LE PROGRES/Photo Jean-Pierre BALFIN
మేరీ-అమేలీ వైలా (36 ఏళ్లు), ఫ్రాన్స్
మేరీ-అమేలీని ఆమె భర్త సెబాస్టియన్ వైలా కత్తితో పొడిచి చంపాడు.
ఈ దంపతులు వివాహమైన నాలుగేళ్లకు విడిపోయారు.
మేరీని చంపేసిన తర్వాత అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత జైలులో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
గృహ హింస మీద చర్యలకు సంబంధించి ఫ్రాన్స్ ప్రభుత్వం కొత్త ప్రణాళికలను ప్రకటించిన రోజునే మేరీ అమేలీ హత్య జరిగింది.

ఫొటో సోర్స్, PHOTOPQR/LE PROGRES/Photo Jean-Pierre BALFIN

ఒక మహిళ హత్య గురించి వార్త రాయాలంటే ఏం కావాలి?
ఈ కథనాలను సేకరించటానికి బీబీసీ మానిటరింగ్ జర్నలిస్టులు, పరిశోధకుల అంతర్జాతీయ నెట్‌వర్క్.. లింగ సంబంధిత కారణాల వల్ల జరిగినట్లు పరిగణించగల మహిళల హత్యకు సంబంధించిన వార్తల కోసం ప్రపంచవ్యాప్తంగా టీవీ, రేడియో, ప్రింట్, ఆన్‌లైన్, సోషల్ మీడియాను విశ్లేషించింది.
ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా 47 మంది మహిళలు హత్యకు గురైనట్లు గుర్తించింది. వాటిలో కేవలం కొన్ని కేసులను మాత్రమే మేం ఇక్కడ వివరించాం. కారణాలు అస్పష్టంగా ఉన్న ఉదంతాలు, హంతకులను గుర్తించని ఉదంతాలు ఇంకా చాలా ఉన్నాయి.
మహిళలపై హింసలో సింహభాగం ‘‘అధికారులకు సక్రమంగా నివేదించటం లేదు.. అటువంటి హింసలో అధిక భాగం మరుగున పడిపోతోంది’’ అని యూఎన్ఓడీసీ తాజా నివేదిక చెప్తోంది.
మహిళల హత్యలకు సంబంధించిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ‘‘వారి జీవితాలు, మరణాల గురించి మీడియా ఏ విధంగా చెప్పింది.. ప్రపంచంలోని వివిధ సమాజాల్లో మహిళలను ఎలా చూస్తారనే దాని గురించి చాలా విషయాలు వెల్లడిస్తోంది’’ అని బీబీసీ మానిటరింగ్ కోసం ఈ ప్రాజెక్టుకు సారథ్యం వహించిన రెబెకా స్కిపేజ్ పేర్కొన్నారు.
‘‘ఒకే రోజు జరిగిన హత్యల గురించి మేం వెదుకుతున్నాం. ఆ ఒక్క రోజు వార్తల కోసం ఒక నెలంతా మేం శోధించాం. ఆ హత్యల వార్తలను ఇవ్వటంలో జాప్యం, వార్తల స్వరం, సమాచార కొరత.. ఆ ప్రాంతంలో మహిళల హోదా గురించి మరింత విస్తృత విషయాన్ని చెప్పాయి’’ అని ఆమె వివరించారు.
ఈ పరిశోధన తుది సమాచారంలో చాలా భాగాన్ని బీబీసీ మానిటరింగ్ కోసం పనిచేస్తున్న మర్యామ్ అజ్వర్ క్రోడీకరించారు.
‘‘మీడియాలో వార్తలుగా వచ్చిన హత్యల గురించి ఇది ఎంత చెప్తోందో.. వార్తలకు ఎక్కని హత్యల గురించే అంతే చెప్తోంది’’ అని ఆమె అంటారు.
‘‘మీడియాకు చేరని వారి కథలు, బయట పడని కథలు.. నిర్ధారణ కానివి. లేదా వాటిపై దర్యాప్తు జరిగే వీలులేదు. దీనిని చూస్తే.. ఒక మహిళ హత్య గురించి వార్తగా నివేదించటానికి ఏం కావాలి? అనే ఆశ్చర్యం కలుగుతుంది’’ అని ఆమె చెప్పారు.
బీబీసీ మానిటరింగ్ ఈ పరిశోధనను ఎలా నిర్వహించిందో మరింత తెలుసుకోండి.

సహాయం, సలహా...
మీరు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా.. గృహ హింస లేదా హింసకు గురైనట్లయితే.. బ్రిటన్‌లో ఈ సంస్థలు సహాయపడగలవు.
హింస, దాడుల ప్రమాదంలో ఉన్న వారికి సలహా, రక్షణ అందించే ఇతర సంస్థలు బ్రిటన్ వెలుపలా ఉన్నాయి. మీరు ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తుంటే.. మీకు మంచి సలహా, సహాయం అందించగల స్థానిక సంస్థలు ఏవనేది తెలుసుకోండి.

ఫొటోలన్నీ కాపీరైట్‌కు లోబడినవి
రిపోర్టర్: కృపా పాధీ
ప్రొడ్యూసర్: జార్జియానా పియర్స్
రీసెర్చ్: బీబీసీ మానిటరింగ్
డాటా జర్నలిజం: క్రిస్టీన్ జీవాన్స్, క్లారా గిబోర్గ్. డిజైన్: జో బార్తొలోమేవ్. డెవలప్‌మెంట్: అలెక్జాండర్ ఇవనోవ్


100 మహిళలు అంటే ఏమిటి?
బీబీసీ 100 మంది మహిళలు.. ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 100 మంది ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయకమైన మహిళలను గుర్తించి, వారి కథనాలను పంచుకుంటుంది.
ప్రపంచమంతటా మహిళల హక్కుల విషయంలో ఈ ఏడాది ముఖ్యమైన సంవత్సరం. 2018లో బీబీసీ 100 మంది మహిళలు.. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో నిజమైన మార్పును రగిలించటానికి ఉద్వేగం, ఆక్రోశం, ఆగ్రహాలను ఉపయోగిస్తూ మార్గదర్శకులుగా నిలుస్తున్న వారిని ప్రతిబింబిస్తుంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








