చాబహార్: భారత్, ఇరాన్‌ల స్నేహం బీటలు వారుతోందా?

ఫొటో సోర్స్, Getty/Hindustan Times
- రచయిత, అపూర్వ్ కృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతర్జాతీయ మీడియాలో చాబహార్ గురించి ఈ వారం చాలా చర్చ జరిగింది. ఓ ప్రాజెక్టు నుంచి ఇరాన్ భారత్‌ను తప్పించిందని, దాన్ని తానే సొంతంగా చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.
భారత్‌కు ఇదో ‘షాక్’ అని, చైనాకు ‘మంచి అవకాశం’ అనే విశ్లేషణలూ వచ్చాయి.
ఈ చర్చలన్నీ చాబహార్ ప్రాజెక్టు చుట్టూ తిరిగాయి.
ఈ చాబహార్ ప్రాజెక్టు అంటే ఏంటి? దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది?
భారత్ మిత్ర దేశంగా భావించే ఇరాన్‌కు కోపం ఎందుకు వచ్చింది? రెండు మిత్ర దేశాల మధ్య దూరం పెంచేందుకు మూడో పక్షమేదైనా జోక్యం చేసుకుందా?

ఫొటో సోర్స్, Getty Images
చాబహార్ ఒప్పందం
చాబహార్ ఓ తీర పట్టణం. ఒమన్ గల్ఫ్ పక్కనే, ఇరాన్‌లోని ఆగ్నేయ ప్రావిన్సు సిస్తాన్ బలూచిస్తాన్‌లో ఇది ఉంది. ఈ నగరంలో ఓ ఓడ రేవు కూడా ఉంది.
ఈ ఓడ రేవు అభివృద్ధికి భారత్, ఇరాన్‌ల మధ్య 2003లో ఓ కీలక ఒప్పందం కుదిరింది. కానీ, ఇరాన్ అణు కార్యక్రమాల విషయంలో అంతర్జాతీయ ఆంక్షలతో దీనికి అవరోధాలు తలెత్తుతూ వచ్చాయి.
మోదీ తొలి విడత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులో పురోగతి కనిపించింది. 2016లో భారత ప్రధాని మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
దీని ప్రకారం ఓడ రేవులోని కొన్ని భాగాల అభివృద్ధికి భారత్‌కు పదేళ్ల లీజు లభించింది. సిస్తాన్ బలూచిస్తాన్ రాజధాని జాహెదాన్ వరకూ రైలు మార్గం ఏర్పాటులోనూ భారత్‌కు భాగస్వామ్యం కల్పించారు.

ఫొటో సోర్స్, Getty/Anadolu Agency
రైలు లింక్ ప్రాజెక్టు
జాహెదాన్ నుంచి అఫ్గానిస్తాన్ సరిహద్దు దాదాపు 40 కి.మీ.ల దూరంలో ఉంటుంది. అక్కడి వరకు రైలు లింక్ ఏర్పాటైతే, గూడ్సు రైళ్లలో సులువుగా వస్తువులను తరలించవచ్చు.
500 కి.మీ.ల పొడవైన రైలు మార్గం ప్రాజెక్టు ఇది.
అయితే, దీని ఏర్పాటు విషయంలో భారత్ జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ ఇరాన్ ఈ ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించినట్లు చెబుతున్నారు.
చాబహార్ ఓడరేవు అభివృద్ధికి భారత్ చాలా ప్రాధాన్యతను ఇచ్చింది. 2018లో ఓడరేవులో ఒక టెర్మినల్ నిర్వహణను కూడా తన చేతుల్లోకి తీసుకుంది.
ఆ తర్వాత అక్కడి నుంచి అఫ్గానిస్తాన్‌కు కొన్ని వస్తువులను కూడా ఎగుమతి చేస్తోంది. ధాన్యం, ఆహార పదార్థాల వంటివి వాటిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, PIB
భారత్‌కు ఎంత ముఖ్యం?
యుద్ధనీతి పరంగా చాబహార్ ఒప్పందం భారత్‌కు చాలా కీలకమైంది. ఈ ప్రాంతంలో పాకిస్తాన్, చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు దీని ద్వారా భారత్‌కు వీలు కలుగుతుంది.
ఈ ప్రాంతంలోనే పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులోని గ్వాదర్ ఓడరేవు ఉంది. ఇది చైనా నిర్వహణలో ఉంది.
చాబహార్ నుంచి గ్వాదర్ రోడ్డు మార్గంలో దాదాపు 400 కి.మీ.ల దూరం ఉంటుంది. సముద్ర మార్గంలో వంద కి.మీ.ల దూరం ఉంటుంది.
ఆర్థికపరంగానూ భారత్‌కు చాబహార్ ముఖ్యమైనదే. ఈ ఓడరేవు ద్వారా భారత్ నేరుగా అఫ్గానిస్తాన్ వరకూ ఉత్పత్తులను పంపించగలుగుతుంది. ప్రస్తుతం అఫ్గానిస్తాన్, భారత్‌ల మధ్య పాకిస్తాన్ అడ్డంకిగా ఉంది.
చాబహార్ ప్రాజెక్టు ద్వారా భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యే అవకాశం ఉంది.
రష్యా, యూరప్, మధ్య ఆసియా దేశాలతో కూడా భారత్ ఎగుమతులు, దిగుమతులు చేసుకోవచ్చు. దిగుమతులపై అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు.
చాబహార్ ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి ఇరాన్‌లోని భారత రాయబారి అలీ చెగెనీ గత ఏడాది ఫ్రంట్‌లైన్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘భారత్‌కు ఇరాన్ ఓ బంగారు ద్వారం. చాబహార్ పనులు పూర్తయ్యాయంటే, యూరప్‌కు కేవలం రెండు రోజుల్లో ఎగుమతులు చేరవేయొచ్చు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty/ATTA KENARE
రైలు ప్రాజెక్టుపై ‘సంక్షోభం’
చాబహార్ రైలు ప్రాజెక్టు నుంచి ఇరాన్ భారత్‌ను తప్పించినట్లు భారత మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇరాన్ ఈ కథనాలను ఖండిచింది. కానీ, భారత్ రైల్ లింక్ ఏర్పాటు చేస్తుందని కూడా ఆ దేశం చెప్పలేదు.
చాబహార్-జాహెదాన్ రైల్వే లింక్ కోసం భారత్‌తో అసలు ఒప్పందమే కుదుర్చుకోలేదని ఇరాన్ పోర్ట్స్ అండ్ మెరిటైమ్ ఆర్గనైజేషన్ అధికారి ఫర్హద్ ముంతసిర్ అన్నారు.
‘‘చాబహార్ కోసం భారతీయ పెట్టుబడులు చాలా వచ్చాయి. చాబహార్ రైల్వేకు సంబంధించి కూడా పెట్టుబడులు వచ్చాయి. కానీ, అవి ఒప్పందంలో భాగం కాదు’’ ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది.
‘‘ఓడ రేవు అభివృద్ధి, 15 కోట్ల డాలర్ల భారత పెట్టుబడులు... ఈ రెండు అంశాలపైనే ఒప్పందం జరిగింది’’ అని ఫర్హద్ ముంతసిర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty/Hindustan Times
భారత్ ఏమంటోంది?
చాబహార్ రైలు ప్రాజెక్ట్‌పై మీడియాలో వచ్చిన కథనాలను భారత ప్రభుత్వం కూడా వదంతులుగా కొట్టిపారేసింది.
2016 తర్వాత ప్రతికూలతలు ఉన్నా, చాబహార్ ప్రాజెక్ట్ విషయంలో చాలా అభివృద్ధి జరిగిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు.
‘‘2018 నుంచి ఓ భారతీయ సంస్థ ఈ ఓడరేవు నిర్వహణను చూస్తోంది. అక్కడ రద్దీ చాలా పెరిగింది. కొన్ని సాంకేతిక, ఆర్థిక అంశాలకు తుది రూపు ఇచ్చేందుకు ఇరాన్ ఓ అధికారిని నియమించాల్సి ఉంది. అందుకోసం ఇంకా వేచిచూస్తున్నాం’’ అని చెప్పారు.
ఓ సహజ వాయువు క్షేత్రం ప్రాజెక్టు నుంచి కూడా ఇరాన్ భారత్‌ను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపైనా అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టతను ఇచ్చారు.
ఫర్జాద్ బీ సహజవాయువు క్షేత్రం నుంచి భారతీయ సంస్థ ఓఎన్‌జీసీని తప్పించినట్లుగా వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ... ‘‘ఆ సహజవాయువు క్షేత్రాన్ని ఇరానే అభివృద్ధి చేయాలనుకుంటుందని, తర్వాత దశలో భారత్‌కు భాగస్వామ్యం కల్పించాలనుకుంటుందని ఈ ఏడాది జనవరిలో మాకు సమాచారం ఇచ్చారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయి’’ అని శ్రీవాస్తవ వివరించారు.
చాబహార్ రైల్వే ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించినట్లుగా వచ్చిన వార్తలను భారత్, ఇరాన్ రెండూ ఖండించాయి. కానీ, ఈ ప్రాజెక్టులో భారత్ ఉందా, లేదా అన్న విషయం కూడా తేటతెల్లం చేయలేదు.
ఇదంతా ఆరంభమేనని కొందరు నిపుణులు అంటున్నారు. భారత్, ఇరాన్ సంబంధాలు ముందులా లేవని, భారత్ కొత్త స్నేహితుల కారణంగా ఇరాన్‌తో మైత్రికి అడ్డుగోడలు తయారయ్యాయని అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, AFP
మూడో పక్షం ఎవరు?
భారత్, ఇరాన్ మధ్య విభేదాల్లో మూడో పక్షం పాత్ర ఉందని దిల్లీలోని జేఎన్‌యూ ప్రొఫెసర్ ఏకే పాషా అంటున్నారు.
‘‘భారత్, ఇరాన్ బయటకు ఇప్పటికీ మిత్రులుగానే ఉన్నాయి. కానీ, వీటి మధ్య ఏర్పడుతున్న విభేదాలు ఏదో మూడో పక్షం కుట్ర అని నాకు అనిపిస్తోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్, ఇరాన్‌ల మధ్య స్నేహం బలపడటానికి రెండు దేశాల తటస్థ వైఖరే కారణం.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో భారత్... అమెరికాకు, అప్పటి సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు శక్తులకు సమదూరం వహించింది.
కానీ, ఇప్పుడు అమెరికాకు భారత్ దగ్గరవుతుండటం ఇరాన్‌కు రుచించట్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘తాము సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు, అమెరికా తమ ఆర్థికవ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని ఇరాన్ భావిస్తోంది. అలాంటప్పుడు ఆ దేశానికి భారత్ సాయపడలేదు. మరి, ఆ దేశం చాబహార్‌ను ఎందుకు అప్పగించాలనుకుంటుంది’’ అని ఇరాన్‌లో భారత రాయబారిగా ఉన్న కేసీ సింగ్ బీబీసీతో అన్నారు.
‘‘కష్టకాలంలో భారత్ ఏదో ఒక సాయం చేస్తుందని ఇరాన్ ఆశించింది. కానీ, భారత్ అమెరికా ఒత్తిడిలో ఉంది. భారత్‌తో మైత్రి వల్ల తమకు ఇక ప్రయోజనం లేదని ఇప్పుడు ఇరాన్‌కు అర్థమైంది’’ అని ప్రొఫెసర్ పాషా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, TWITTER@VIKAS SWARUP
చాబహార్ భవిష్యతు ఏంటి?
చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు విషయంలో అంతా సజావుగా సాగుతోందని, పురోగతి కూడా ఉందని భారత విదేశాంగ శాఖ అంటోంది.
కానీ, భారత్ అమెరికాకు దగ్గరవుతుండటం పట్ల కోపంతో ఇరాన్ చైనా వైపు వెళ్తోందని విశ్లేషకులు అంటున్నారు.
‘‘రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుంటేనే ఇలాంటి ప్రాజెక్టులు సాధ్యమవుతాయి. అమెరికాకు భయపడి ఆ దేశంతో మాట్లాడమే మానేస్తే, భారత్‌తో కలిసి ప్రాజెక్టు ఎందుకు చేపడుతుంది. ఒకవేళ చైనా నుంచి డబ్బులు వస్తే, వాటితో ప్రాజెక్టును పూర్తి చేస్తుంది’’ అని కేసీ సింగ్ అన్నారు.
వ్యవహారాలు ఇలాగే ఉంటే, ఓడరేవు లీజు పొడగింపు కూడా ప్రమాదంలో ఉన్నట్లేనని ప్రొఫెసర్ పాషా అభిప్రాయపడ్డారు.
‘‘పెద్ద షాక్‌లు ఇలాంటి చిన్న, చిన్న షాక్‌లతోనే మొదలవుతాయి. రైల్వే ప్రాజెక్టు, సహజవాయువు క్షేత్రం ప్రాజెక్టు, ఇంకా చాలా ప్రాజెక్టులు అవ్వడం లేదు. వాణిజ్యం కూడా తగ్గిపోయింది’’ అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- టిండర్, డంబుల్ వంటి డేటింగ్ యాప్‌లు పాతపడిపోయాయా?
- బీటిల్ మోసుకెళ్లే బుల్లి కెమెరా.. కీటకాల సాహసాలు లైవ్ స్ట్రీమింగ్
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








