కుక్క మాంసం: నాగాలాండ్, మిజోరంలలో ఎన్నో ఏళ్లుగా తింటున్న ఆహారాన్ని ఇప్పుడు ఎందుకు నిషేధించారు?

ఫొటో సోర్స్, EPA/HARISH TYAGI
- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, గువాహాటి నుంచి బీబీసీ కోసం
వ్యాపారం కోసం కుక్కమాంసం ఎగుమతి, దిగుమతులను నిషేధించాలని నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కుక్క మాంసం అమ్మకంపై నిషేధంతో పాటు కుక్కల మార్కెట్లను పూర్తిగా తొలగించాలని కూడా ముఖ్యమంత్రి నెఫ్యూ రియో అధ్యక్షతన జరిగిన కీలకమైన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.
నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి టెమ్‌జెన్ టాయ్ శుక్రవారం ఒక ట్వీట్‌లో "వాణిజ్యపరంగా కుక్కలను మార్కెట్‌లోకి దిగుమతి చేయడం, కుక్కలను అమ్మడం, పచ్చి లేదా ఉడకబెట్టిన కుక్క మాంసాన్ని అమ్మడంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది" అని పేర్కొన్నారు.
ఈ ఏడాది మార్చిలో మరో ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం ప్రభుత్వం జంతు వధ నిర్వచనం నుంచి కుక్కలను తొలగిస్తూ చట్టం సవరించింది. ఇప్పుడు నాగాలాండ్ ప్రభుత్వం మిజోరాం బాటలో నడుస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
వాస్తవానికి నాగాలాండ్, మిజోరాంలలో కుక్కల మాంసాన్ని అమ్మడం తినడం చాలా పాత విషయం. కాని ఇది చాలా దారుణమని, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ నాగాలాండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ముఖ్యమంత్రి నెఫ్యూ రియోకు లేఖ రాసిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ నాగాలాండ్‌లో కుక్క మాంసం అమ్మకం, సరఫరా, వినియోగాలను నిషేధించడానికి తక్షణం చర్య తీసుకోవాలని కోరింది. "నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఇటీవల పశువుల మార్కెట్‌కు సంబంధించిన ఫోటోలు చూశాము. ఇది మాకు షాకిచ్చింది. అమ్మకానికి భారీస్థాయిలో మార్కెట్‌కు తీసుకువచ్చిన కుక్కలను బస్తాలలో మూటకట్టి పెట్టారు. ఇది చాలా దారుణం" అని తన లేఖలో ఆ సంస్థ పేర్కొంది.
కుక్క మాంసం వ్యాపారం పూర్తిగా చట్టవిరుద్ధమని, ఇది భారతీయ శిక్షాస్మృతి 1860వంటి వివిధ చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తోందని నాగాలాండ్‌లో జంతు సంరక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఆరోపించింది. కుక్కలను పట్టుకోవడం, వాటి మాంసాన్ని తినడంవల్ల కొన్నిసార్లు రాబిస్‌వంటి వ్యాధులు వస్తాయని ఆ సంస్థ వాదిస్తోంది. ఈ వ్యాధి సోకిన కుక్కల మాంసాన్ని తాకడం, తినడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
జూన్ 30న పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా "రాష్ట్రంలో కుక్కల మార్కెట్లను, కుక్క మాంసాన్ని నిషేధించాల్సిందిగా నాగాలాండ్ ప్రధాన కార్యదర్శికి ఈ-మెయిల్స్ పంపండి'' అని లోక్‌సభ ఎంపీ మేనకాగాంధీ ప్రజలను కోరారు.
క్రైస్తవ ఆధిపత్య రాష్ట్రాల్లో ప్రజలు క్రమం తప్పకుండా కుక్క మాంసాన్ని చికెన్, మటన్‌లాగా ఇష్టంగా తింటుంటారు. నాగాలాండ్ తెగలలో కుక్క మాంసం తినడం వందల సంవత్సరాల నుంచి ఉంది. నాగాలాండ్‌లోఅతిపెద్ద నగరమైన దిమాపూర్ సూపర్ మార్కెట్‌లో బుధవారం వరకు కుక్కమాంసం బహిరంగంగానే అమ్మారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దిమాపూర్‌లో నివసిస్తున్న మావో కొన్నేళ్లుగా దిమాపూర్ సూపర్ మార్కెట్ నుంచి కుక్కమాంసం కొంటున్నారు. అయితే ఇప్పుడు కుక్క మాంసంపై నిషేధాన్ని గురించి ఆయన్ను ప్రశ్నించినప్పుడు "నాగాలాండ్‌లో 17ప్రధాన తెగలు ఉన్నాయి. దాదాపు ప్రతి తెగకు కుక్క మాంసం తినడం అలవాటు. దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రజలు చికెన్, మటన్ తిన్నట్లు మేం కుక్కమాంసం తింటాం" అని ఆయన అన్నారు.
"మొదట్లో మేం వారానికి ఒకసారి రాజామిర్చి (ఈశాన్య రాష్ట్రంలో పండే ప్రధానమైన మిరపకాయ రకం)తో కుక్క మాంసం వడుకునే వాళ్లం. కొన్ని నెలలుగా మేం అలా తినలేకపోతున్నాము. మేము స్థానిక జాతి కుక్కలను ఎక్కువగా ఇష్టపడతాం. కానీ ఇప్పుడు దిమాపూర్ మార్కెట్‌కు అసోం నుంచి కుక్కలను తీసుకువస్తున్నారు'' అని మావో అన్నారు.
నాగాలాండ్‌లో కుక్క మాంసం తినడానికి నేపథ్యం ఏంటి?
"నాగాలాండ్‌లో కుక్కమాంసాన్ని మంచి పోషకాహారంగా భావిస్తారు. కుక్కమాంసం లైంగిక శక్తిని పెంచుతుందని కూడా ఇక్కడ కొంతమంది నమ్ముతారు. ఈ నమ్మకాలే చాలామంది కుక్కమాంసం తినడానికి ప్రోత్సహించాయి'' అని మావో అన్నారు.
నాగాలాండ్ రాజధాని కోహిమాలో నివసించే నోథో థాపర్ ఈ మాంసాన్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిన తరువాత తన ఫేస్‌బుక్ పేజ్‌లో "కుక్క మాంసం నిషేధించటానికి మంచి కారణం ఒకటి చెప్పండి ?" అని ప్రశ్నించారు.
దిమాపూర్ నివాసి మంచాంగ్ అవెన్నో కూడా దీనిపై స్పందించారు. "దీని వెనక ఏమి జరిగిందో తెలియదు. దీనివల్ల వారు పొందేది ఏంటో కూడా తెలియదు. కుక్క మాంసం తినడం ఇక్కడి రాజకీయాలకన్నా, రాజకీయ పార్టీలకన్నా ప్రాచీనమైన అలవాటు''అని అన్నారు.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
గువహాటిలోని పీపుల్ ఫర్ యానిమల్స్ అనే ఎన్జీఓ సంస్థ నాయకురాలు సంగీతా గోస్వామి, కుక్క మాంసం తినడం అమానవీయమని అంటారు. నాగాలాండ్‌లో ఆమె అనేకసార్లు కుక్కమాంసం అమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు.
కుక్కమాంసాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ మిజోరాం, నాగాలాండ్‌లలో సంగీతా గోస్వామి చాలాకాలంగా ఉద్యమిస్తున్నారు. బీబీసీతో మాట్లాడిన ఆమె "కుక్క మాంసం నోటిఫైడ్ ఆహార పదార్థం కాదు. కాబట్టి ఇది మొదటి నుండి చట్టవిరుద్ధమే. కాని నాగాలాండ్‌లో బహిరంగంగా కుక్క మాంసాన్ని అమ్ముతున్నారు. మిజోరంలో కుక్క మాంసం అమ్మే 28 దుకాణాలను మా సంస్థ మూసేసింది. దారుణం ఏంటంటే గువహాటిలోని మిజోరం భవన్ మెనూలో కుక్కమాంసం వడ్డిస్తున్నారు. కానీ ఇప్పుడు మిజోరాంలో కుక్క మాంసాన్ని అమ్మలేరు. ఆ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది" అని అన్నారు.
కుక్కల అక్రమ వ్యాపారాన్ని, కుక్క మాంసం అమ్మకాలను నిషేధించాలని నాగాలాండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంగీతా గోస్వామి స్వాగతించారు. "అసోం నుంచి అనాథ కుక్కలను నాగాలాండ్‌కు తరలించే వ్యాపారం ఆగిపోతుంది. ముఖ్యంగా అసోంలోని గోలఘాట్ జిల్లాలో కొంతమంది కుక్కల నోరు, కాళ్లు కట్టేసి బస్తాలలో కుక్కి నాగాలాండ్‌కు రవాణా చేస్తారు. ఇలా తాళ్లతో కట్టేయడం వల్ల ఒక్కోసారి అవి చనిపోతాయి" అని సంగీతా గోస్వామి అన్నారు.
"ఒక కుక్కను అమ్మితే యజమానికి 100 నుంచి 150 రూపాయలు మాత్రమే లభిస్తాయి. నాగాలాండ్‌లో వాటిని కొనే వ్యాపారులు అక్కడ కిలోమాంసాన్ని రూ.300కు అమ్ముతారు. ఆ విధంగా వారు ఒక కుక్కను అమ్మడం ద్వారా రూ.1500కు పైగా సంపాదిస్తారు. మేము పోలీసులు సహాయంతో అసోంలో కుక్కలను అక్రమంగా తరలించే చాలామందిని పట్టుకున్నాము. ఇప్పుడు నాగాలాండ్ ప్రభుత్వం అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది" అని గోస్వామి అన్నారు.

ఫొటో సోర్స్, EPA
హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ (హెచ్ఎస్ఐ) కూడా భారతదేశంలో కుక్క మాంసం అమ్మకాలను నిషేధించాలంటూ సంవత్సరాలుగా ప్రచారం చేస్తోంది. ఈ సంస్థ కూడా నాగాలాండ్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. "నాగాలాండ్‌లో కుక్కల దారుణ వధ పాపం భారతదేశానికి అంటుకుని ఉంది. ఇప్పుడు ఈ నిర్ణయం ఆ పాపానికి దూరం చేస్తుంది" అని హెచ్‌ఎస్‌ఐ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్‌పర్ణ సేన్‌గుప్తా బీబీసీతో అన్నారు.
హెచ్‌ఎస్‌ఐ అంచనా ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు 30,000 కుక్కలను నాగాలాండ్‌కి అక్రమంగా రవాణా చేస్తున్నారు. వీటిని మార్కెట్‌లో అమ్ముతారు. కర్రలతో కొట్టి దారుణంగా చంపుతారు అని హెచ్‌ఎస్‌ఐ చెబుతోంది.
అయితే మిజోరాంలో కూడా కుక్క మాంసం తినడానికి నేపథ్యం ఉంది. "మిజోరాం, నాగాలాండ్‌లోని చాలామంది గిరిజనులు మంగోలాయిడ్ తెగకు చెందినవారు. ఈ తెగల సంస్కృతి, ఆహారపు అలవాట్లు చైనా, కొరియా, వియత్నాం ప్రజల అలవాట్లకు దగ్గరగా ఉంటాయి. కొరియాలో కూడా ప్రజలు కుక్క మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు" అని నాగాలాండ్‌లో సామాజిక సమస్యలను చాలాకాలంగా కవర్ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సమీర్‌కర్ పురకాయస్థ వ్యాఖ్యానించారు.
మంగోలాయిడ్ తెగ ప్రజల రక్తంలో ఐరన్ పరిమాణం తక్కువగా ఉంటుందని చెబుతారు. ఇతర మాంసాలకంటే కుక్కు మాంసంలో ఐరన్ శాతం ఎక్కువని, మంగోలాయిడ్ తెగకు చెందిన వారు కుక్క మాంసం ఇష్టపడటానికి కారణాలలో ఇది కూడా ఒకటని అంటారు.
ఈ ఏడాది మార్చి 4న మిజో నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వం మిజోరాంలో కుక్కలను పశువులుగా పరిగణించబోమని పేర్కొంది. పాత చట్టాన్ని ఏకగ్రీవంగా సవరించి మిజోరాం యానిమల్ స్లాటర్ (సవరణ) బిల్లు, 2020ను ఆమోదించి కుక్కల అమ్మకాన్ని నిషేధించింది.
కానీ కుక్కల మాంసం ప్రపంచంలోని అనేక దేశాలలో విస్తృతంగా తింటారు. వీటిలో చైనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌వంటి దేశాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- చైనా వైద్య పరికరాలు భారత్‌లో ఓడల నుంచి దిగటం లేదు.. ఎందుకంటే...
- Chingari, Roposo: టిక్‌టాక్ స్థానాన్ని ఈ దేశీయ యాప్‌లు దక్కించుకుంటాయా?
- ‘కశ్మీర్‌పై భారత్‌కు ఇజ్రాయెల్ దారి చూపిస్తోందా?’
- హాంకాంగ్ - జుహాయ్ మార్గం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ప్రారంభం
- హాంకాంగ్: ఇక్కడ పాఠశాల విద్య ఖర్చు ఏడాదికి రూ.94 లక్షలు
- హాంకాంగ్ ప్రజల నిరసనలకు కారణమైన మర్డర్ స్టోరీ.. ఎందుకింత వివాదాస్పదమైంది? హోటల్లో ఆ రాత్రి ఏం జరిగింది
- హాంకాంగ్ నిరసనల ముఖ చిత్రం ఇతడే.. పేరు జాషువా.. వయసు 22 ఏళ్లు.. లక్షలాది మందిని ఎలా కదిలించాడు?
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- చైనా దాడిపై భారత్‌కు నిఘా సమాచారం అందలేదా?
- హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు జరుగుతాయా? ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి?
- కరోనావైరస్ మహమ్మారి తర్వాత భవిష్యత్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








