చైనా వైద్య పరికరాలు భారత్‌లో ఓడల నుంచి దిగటం లేదు.. ఎందుకంటే...

- రచయిత, నితిన్ శ్రీవాత్సవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనావైరస్ ఊహించని విపత్తు లాంటిది. దీనిపై ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి.
భారత్‌లో కోవిడ్-19 కేసులు ఐదు లక్షలను మించిపోయాయి. మరణాలు కూడా 16,000ను దాటిపోయాయి.
ఈ వైరస్‌ను కట్టడిచేసే ఔషధం కానీ, టీకా కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. అయితే కరోనా రోగుల నిర్ధారణ, చికిత్సలో మూడు అంశాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వాటిలో మొదటిది వెంటిలేటర్లు, రెండోది ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు, మూడోది ఆక్సీమీటర్లు.
ఈ మూడు వైద్య పరికరాలు భారత్‌లోనూ తయారుచేస్తారు. మరోవైపు చైనా నుంచి పెద్ద మొత్తంలో వీటిని దిగుమతి చేసుకుంటున్నారు.
సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్‌లో ఈ వైద్య పరికరాల కొరత ఏర్పడుతుందా? అనే ప్రశ్న వైద్యుల నుంచి సామాన్యుల వరకూ అందరినీ తొలిచేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-చైనా వివాదం
మే మొదటివారంలో లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ (ఎల్‌సీఏ) వెంబడి సరిహద్దుల్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. జూన్ 15-16 తేదీల్లో ఈ ప్రాంతంలోని గాల్వన్ లోయలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. వీటిలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. మరో 76 మందికి గాయాలయ్యాయి.
తమవైపు మరణించిన లేదా గాయపడిన వారి విషయంలో చైనా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఎల్ఏసీ వెంబడి ఒక దేశం మరో దేశం సైనికుల్ని హతమార్చడం 45ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతో అందరి దృష్టీ దీనిపై పడింది.
చైనా దాడిని ఖండిస్తూ.. ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై నిషేధం విధించాలని భారత్‌లో డిమాండ్‌లు ఎక్కువయ్యాయి.
చైనా వస్తువులపై నిషేధం లేదా వాణిజ్యంలో ఆంక్షలపై ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. అయితే రైల్వేతోపాటు టెలికాం శాఖ కూడా.. భవిష్యత్తులో చైనా నుంచి ఎలాంటి వస్తువులనూ దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సంకేతాలు ఇచ్చాయి.
నిషేధం ఆందోళనల నడుమ, నౌకాశ్రయాలు లేదా విమానాశ్రయాల్లో చైనా నుంచి వచ్చే దిగుమతులను త్వరగా క్లియర్ చేయకపోతే దేశంలో అత్యవసర వైద్య పరికరాల కొరత సంభవించే ముప్పుందని భారతీయ ఫార్మా ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ ఫార్మాఎక్సిల్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది.

వైద్య పరికరాల పాత్ర
గత రెండు దశాబ్దాల్లో చైనా-భారత్‌ల మధ్య వాణిజ్యం దాదాపు 30 రెట్లు పెరిగింది. వాణిజ్యంలో ఔషధాలు, వైద్య పరికరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
భారత్.. భారీ స్థాయిలో చైనా నుంచి ఔషధాలను, ఔషధాల తయారీకి అవసరమయ్యే పదార్థాలను, వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోంది. భారత్‌లో మెరుగైన వైద్య సదుపాయాలు, వైద్య పర్యటకంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
2019-20లో రూ.1,150 కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుందని భారత వాణిజ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలతోపాటు ఔషధాలు, వైద్య పరికరాలను భారత్ దిగుమతి చేసుకుంటున్నట్లు వివరిస్తున్నాయి.
అయితే, ప్రధాన వైద్య పరికరాలన్నీ భారత్‌కు అమెరికా నుంచే వస్తుంటాయి. కానీ భారత్‌లో తయారీకి అవసరమయ్యే విడి భాగాల విషయంలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
వెంటిలేటర్లు, థర్మామీటర్లు, ఆక్సీమీటర్లు
కరోనావైరస్ చెలరేగుతున్న తరుణంలో ఈ మూడు వైద్య పరికరాలు కీలక పాత్ర పోషించగలవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు.
"కరోనావైరస్ రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తుతాయి కాబట్టి వారికి వెంటిలేటర్లపై చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను కొలవడానికి ఆక్సీమీటర్లను వాడతారు. కరోనారోగుల్లో కనిపించే లక్షణాల్లో జ్వరం కూడా ఒకటి. దీన్ని కొలవడంలో ఇన్‌ఫ్రారెడ్ థెర్మామీటర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని కోవిడ్-19పై డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక రాయబారి డేవిడ్ నబారో.. బీబీసీ న్యూస్‌కు తెలిపారు.
చైనా నుంచి భారత్‌కు దిగుమతయ్యే వైద్య పరికరాల్లో వెంటిలేటర్లు, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు, ఆక్సీమీటర్లు ప్రధానంగా ఉంటాయి.
అయితే, వీటి మీద కంటే బల్క్ డ్రగ్స్ కోసమే చైనాపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. కానీ భారత్‌లో తయారీకి అవసరమయ్యే వైద్య పరికరాల విడిభాగాలైన హార్డ్‌వేర్ చిప్‌లు, మదర్‌బోర్డులు, ఎల్‌సీడీ, ఎల్ఈడీ తెరలు ఎక్కువగా చైనా నుంచే వస్తాయి. ఇవి చిన్నవే అయినా కీలకమైనవి.

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళన ఎందుకు?
"పోర్టుల్లో క్లియరెన్స్ ఆలస్యం కావడంతో భారత్‌లోని ప్రధాన నగరాలకు వైద్య పరికరాలు చేరుకోవడం ఆలస్యం అవుతోంది" అని ఫార్మా ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ కౌన్సిల్ ఫార్మాఎక్సిల్ అధిపతి దినేశ్ దువా వివరించారు.
భారత్‌లో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ పెరుగుతున్నప్పటికీ... కొన్ని నెలలుగా మన నౌకాశ్రయాలు, విమానాశ్రయాలకు వచ్చి చేరిన సరకులను ఏం చేయాలి? అనే విషయం గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నారు.
చైనా నుంచి వచ్చే దిగుమతుల క్లియరెన్స్‌కు ఇంత ఆలస్యం అయితే నష్టపోయేది చైనా కాదు.. భారతే అని ఫార్మా రంగ వ్యాపారవేత్త ఒకరు చెప్పారు.
ఆస్పత్రులు లేదా హోల్‌సేల్ వ్యాపారులకు ఈ అత్యవసర వైద్య పరికరాలు చేరడంలో ఆలస్యమైతే.. ఇది కరోనా రోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
చాలావరకు చైనా నుంచి సరకులను దిగుమతి చేసుకునే వ్యాపారులు ముందుగానే 70 నుంచి 75 శాతం రుసుమును అడ్వాన్స్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. సరకుల క్లియరెన్స్‌లో ఎంత ఆలస్యమైతే.. భారత వ్యాపారులకు అంత ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒకవేళ అలా కాకపోయినా.. కొందరు వ్యాపారులు బ్యాంకుల పూచీకత్తుపై లెటర్ ఆఫ్ క్రెడిట్లు తీసుకుంటారు. ఏకపక్షంగా దిగుమతులను రద్దుచేస్తే.. వీరి క్రెడిట్ రేటింగ్ కూడా పడిపోతుంది.
మరోవైపు చైనా నుంచి సరకుల రవాణాకు అవసరమైన ఖర్చు కూడా వ్యాపారులు ముందే చెల్లిస్తారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
ఆలస్యం ఎందుకు?
ఒకవైపు భారత్‌లో చైనా సరకులు, పరికరాలను నిషేధించాలని డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్-19 రోగుల సంఖ్య, వారికి అవసరమైన సదుపాయాల డిమాండ్ ఎక్కువవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో.. కరోనావైరస్ చికిత్సలో ప్రధాన పాత్ర పోషించే వెంటిలేటర్లు, థర్మామీటర్లు, ఆక్సీమీటర్లకు పోర్టుల్లో క్లియరెన్స్ ఇచ్చేందుకు ఎందుకు ఇంత ఎక్కువ సమయం పడుతుందనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
పోర్టుల్లో నిలిచిపోయిన ఇలాంటి ఉత్పత్తులను త్వరగా క్లియర్ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఇలాంటి పరిణామాలు వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.
దిగుమతులకు క్లియరెన్స్ ఇచ్చేందుకు తమకు కొన్ని తప్పనిసరి విధివిధానాలు ఉంటాయని, వాటన్నింటినీ పాటించాకే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని కస్టమ్స్ శాఖ సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనా నుంచి వచ్చే పిల్లల బొమ్మలు, దీపావళి సామగ్రి, చవకైన బట్టలు, బ్యాగ్‌లపైనే అందరూ దృష్టి సారిస్తున్నారని ఎగుమతి-దిగుమతి వ్యవహారాలను పర్యవేక్షించే సంస్థ ఇన్‌వెస్ట్రెక్ గ్లోబల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.
"చైనా నుంచి వచ్చే దిగుమతులు రెండు రకాలు. ఒకటి ముడి సరకులు.. రెండోవి ఇంజినీరింగ్ గూడ్స్. ఈ రెండింటికీ అవాంతరాలు ఏర్పడితే... అంతా అస్తవ్యస్తం అవుతుంది. వైద్య పరికరాల కొరతా ఏర్పడుతుందని అందరూ గుర్తు పెట్టుకోవాలి." అని ఆయన అన్నారు.
నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో సరకుల క్లియరెన్స్ ఆలస్యం కావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి.
వుహాన్‌లో వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ చైనా నుంచి వచ్చే ప్రతి వస్తువునూ పరీక్షిస్తున్నారు. రెండోది నిఘా పరికరాలు ఉన్నాయేమోనని తనిఖీలు చేపడుతున్నారు.
ఈ విషయంపై ప్రభుత్వం అధికారికంగా స్పందించనప్పటికీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ సెక్యూరిటీల గురించి అందరికీ తెలిసిందే.
"ఎలాంటి నిఘా పరికరాలూ దేశంలోకి రాకుండా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలనూ భారత్ క్షుణ్నంగా తనిఖీ చేస్తోంది" అని విజయ్ కుమార్ వివరించారు.
"ఇదివరకు కస్టమ్ క్లియరెన్స్‌లో కొన్ని వస్తువులను మాత్రమే పరీక్షించేవారు. ఇప్పుడు వంద శాతం తనిఖీలు జరుగుతున్నాయి."

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- పెంగ్విన్ సినిమా రివ్యూ: కీర్తి సురేశ్ అద్భుత నటనతో సాగిన క్రైమ్ థ్రిల్లర్
- అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం: జీన్స్, మొబైల్.. ఇంకా వేటి ధరలు పెరగొచ్చు?
- చైనాలో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ 'బెగ్గింగ్'
- కరోనావైరస్ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్న చైనా కంపెనీలు
- కరోనావైరస్ కోరల్లో చైనా ఆర్థిక వ్యవస్థ.. దశాబ్దాల కాలంలో తొలిసారి కుదేలు
- 996 విధానం అంటే ఏంటి? ‘ఆలీబాబా’ జాక్ మా దీన్ని ఎందుకు సమర్థిస్తున్నారు?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- భారీగా పతనమవుతున్న చైనా కరెన్సీ యువాన్.. కారణాలివే
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం: ఆర్థిక వ్యవస్థలోకి మరింత నగదును చొప్పిస్తున్న చైనా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








