కరోనావైరస్: ఆస్పత్రి బిల్లు చెల్లించలేదని ‘రోగిని కొట్టి చంపారు’.. అసలు ఏం జరిగింది?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, దిల్ నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌లో ఒక ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది బిల్లు చెల్లించలేదని ఒక రోగిని కొట్టి చంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
పోలీసులు దీనిని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
మృతుడి బంధువులు ఆస్పత్రి నిర్వాహకులపై ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని అలీగఢ్ ఎస్పీ(సిటీ) అభిషేక్ బీబీసీతో చెప్పారు.
“మాకు సీసీటీవీ ఫుటేజ్ లభించింది. అందులో రోగిని కొట్టడం కనిపిస్తోంది. బంధువులు తమ ఫిర్యాదులో ఆస్పత్రి సిబ్బంది రోగిపై, తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు” అని చెప్పారు.
ప్రాథమిక దర్యాప్తులో ఫీజు గురించి ఆస్పత్రి నిర్వాహకులు, రోగి బంధువుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. మృతుడి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు.
మృతుడు సుల్తాన్ ఖాన్ బంధువులు మాట్లాడుతూ.. ఆయనకు మూత్రం రాక ఇబ్బంది పడుతుండడంతో ఎన్‌బీ ఆస్పత్రికి తీసుకొచ్చామని, అక్కడ ఆస్పత్రిలో ఎక్కువ ఖర్చవుతుందని చెప్పడంతో, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో గొడవ జరిగిందని, ఆస్పత్రి సిబ్బంది కొందరు తమపై దాడి చేశారని అన్నారు.
రోగి బంధువులు ఏం చెబుతున్నారు?
“మేం ఆయన్ను ఎన్‌బీ ఆస్పత్రికి తీసుకెళ్లాం. చేర్పించే ముందు ఎంత ఖర్చవుతుందో చెప్పమని అడిగాం. దాన్ని బట్టి చేర్పించాలని అనుకున్నాం. కానీ మొదట పరీక్షలు చేసిన తర్వాతే ఖర్చు గురించి చెబుతాం అని ఆస్పత్రిలో చెప్పారు” అని మృతుడు సుల్తాన్ ఖాన్ బంధువు చమన్ ఖాన్ తెలిపారు.
తర్వాత ఆయన “అల్ట్రా సౌండ్ చేయకుండానే వాళ్లు ఐదు వేల రూపాయల మందు ఇచ్చారు. రోజుకు 5 వేల రూపాయల పైనే అవుతుందన్నారు. మేం అంత భరించలేం అని చెప్పాం. ఇచ్చిన మందు తిరిగి ఇచ్చేసి, 3700 రూపాయలు కూడా చెల్లించాం” అన్నారు.
“ఆస్పత్రి వాళ్లు అడ్మిషన్ చార్జీలు ఇంకా నాలుగు వేలు ఇవ్వాలని అడిగారు. మేం ఇవ్వలేమని చెప్పాం. ఆయన్ను వేరే ఆస్పత్రికి తీసుకెళ్తామన్నాం. కానీ వాళ్లు మమ్మల్ని వెళ్లనీయలేదు. పావు గంట వరకూ అక్కడే ఆపేశారు. మేం ఎంత చెప్పినా వినకపోవడంతో, నేను వాళ్లను తోశాను. దాంతో, వాళ్లు మాపై దాడి చేశారు. మా చిన్నాన్నను కర్రలతో కొట్టడంతో ఆయన చనిపోయారు” అంటారు చమన్ ఖాన్.
ఆస్పత్రి యాజమాన్యం ఏం చెప్పింది?
చమన్ ఖాన్ ఆరోపణలను ఆస్పత్రి యాజమాని షాన్ మియా తోసిపుచ్చారు. బీబీసీతో మాట్లాడిన ఆయన ఆస్పత్రి చేయించిన పరీక్షల బిల్లు గురించే గొడవ వచ్చిందన్నారు.
“వాళ్లు రోగిని తీసుకొచ్చారు. పరీక్షలు చేయించారు. ఆస్పత్రి సిబ్బంది ఎంత ఖర్చు అవుతుందో వారికి పూర్తిగా చెప్పారు. రోగికి ఆపరేషన్ చేయాలని, దానికి ముందు అతడికి కరోనా పరీక్షలు కూడా చేయాలన్నారు. కరోనా పరీక్షలు వద్దు, ఆయన్ను వేరే దగ్గరికి తీసుకెళ్తాం అన్నారు” అని చెప్పారు.
తర్వాత షాన్ మియా “వాళ్లు బిల్లు చెల్లించకుండానే అతడిని తీసుకుని వెళ్లబోయారు. మా సిబ్బంది డబ్బులు ఇవ్వాలని అడిగితే, వారిపై దాడి చేశారు. రోగిని ఆటోలో ఎక్కడికో తీసుకెళ్లారు. తర్వాత అర్థరాత్రి సమయంలో తిరిగి వచ్చి, ఆస్పత్రి సిబ్బంది కొట్టడం వల్ల ఆయన చనిపోయాడని గొడవ మొదలెట్టారు” అన్నారు.
“వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం దానికి పూర్తిగా సహకరిస్తోంది. మృతుడి పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదు. కర్రలతో కొట్టడం వల్లే ఆయన చనిపోయుంటే పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఈలోపు మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు” అన్నారు.
కరోనా పరీక్షలంటే రోగులు భయపడతారని షాన్ మియా చెప్పారు. తమ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు జరగడం లేదని, కరోనా ఉన్న రోగులను మెడికల్ కాలేజీకి పంపించేస్తామని తెలిపారు.
ఆస్పత్రిలో ఏ ఆపరేషన్ చేయాలన్నా, మొదట రోగులకు కరోనా పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
ఆస్పత్రి ఫీజులు ఎలా ఉన్నాయి?
షాన్ మియా తెలిపిన వివరాల ప్రకారం ఆస్పత్రిలోని ఎవరైనా ఒక రోగిని చూడ్డానికి డాక్టరును పిలిపిస్తే, వారికి ప్రతి విజిట్‌కు వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తారు. అది కాకుండా మిగతా పరీక్షలకు నిర్ణీత ధరలు ఉన్నాయి. వాటి వివరాలను రోగికి మొదట్లోనే చెబుతారు.
ఈ కేసులో రోగితో పాటూ వచ్చిన వారు తాము చేయించిన పరీక్షలకు డబ్బు ఇవ్వలేదని, అందుకే గొడవ జరిగిందని షాన్ మియా చెప్పారు. వారు ఆస్పత్రికి ఒక్క పైసా కూడా చెల్లించలేదన్నారు.
అలీగఢ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ భాను ప్రతాప్ బీబీసీతో మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం ఆస్పత్రి ఫీజులు పెంచారని చెప్పారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ధరలే నిర్ణయించారని తెలిపారు.
ఈ ఘటన గురించి మాట్లాడిన ఆయన “ఎలాంటి పరిస్థితుల్లో అయినా రోగిని కొట్టడం అనేది తప్పు. ఆస్పత్రికి నోటీసులు జారీ చేశాం” అన్నారు.
అటు పోలీసులు మాత్రం ప్రస్తుతానికి దాడి సెక్షన్లపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదికలో కొట్టడం వల్లే అతడు మృతి చెందినట్లు తేలితే, దానిని హత్య కేసుగా మారుస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- చైనా న్యూ సిల్క్ రోడ్: పాకిస్తాన్‌తో కలసి పూర్తి చేయాలనుకున్న ప్రాజెక్టే ఇప్పుడు డ్రాగన్ మెడకు చుట్టుకుంది...
- ఆంధ్రప్రదేశ్: పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన లాభమా? నష్టమా?
- ‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు’.. మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు
- అణ్వస్త్రాలు: ''మేం మొదట ఉపయోగించం'' అన్న హామీని ఇండియా ఇప్పుడు ఎందుకు సమీక్షిస్తోంది
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- హైదరాబాద్, విజయవాడల మధ్య హైస్పీడ్ రైలు సాధ్యమేనా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










