కరోనావైరస్ లాక్‌డౌన్: ‘ఉపాధి లేదు.. చేతిలో డబ్బు లేదు..’ మహిళలను టార్గెట్ చేస్తున్న అక్రమ రవాణా ముఠాలు

మహిళల అక్రమ రవాణా బాధితురాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కరోనా వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు విధించిన లాక్ డౌన్ సమయంలో మహిళల మీద వివిధ రకాల హింస పెరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. గృహ హింస వంటి అంశాలతో పాటుగా మహిళల అక్రమ రవాణా సాగించే ముఠాలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నట్టు స్పష్టమవుతోంది. పోలీసులు పూర్తిగా కరోనా, లాక్ డౌన్ సంబంధిత విధుల నిర్వహణలో మునిగి ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారాలకు ఆస్కారం పెరిగిందని మహిళా సంఘాలు చెబుతున్నాయి. ఉపాధి కోల్పోయిన అనేక మంది సామాన్యులు కూడా ఈ వలలో చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమ రవాణా యూనిట్స్‌కి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.

విజయవాడలో మూతపడిన స్పా కేంద్రంగా సాగుతున్న వ్యభిచార ముఠాపై పోలీసులు దాడులు నిర్వహించారు. అందులో ఆరుగురు మహిళలతో పాటుగా 12 మందిని అరెస్ట్ చేశారు. విషయం ఆరా తీస్తే వారంతా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మహిళలని తేలింది. విజయవాడలో వివిధ పనుల్లో ఉపాధి కోసం షిల్లాంగ్, కోహిమా వంటి ప్రాంతాల నుంచి వచ్చారు. కొన్నేళ్లుగా విజయవాడలోని వివిధ బ్యూటీ పార్లర్లు, స్పాలలో విధులు నిర్వహించేవారు. కానీ లాక్ డౌన్ కారణంగా వారి ఉపాధికి గండి పడింది. ఇప్పటికీ ‘స్పా’ లు తెరుచుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లడానికి ఆర్థికంగా పరిస్థితి సహకరించక, ఉపాధి లేని సమయంలో విజయవాడ నగరంలో జీవనం సాగించలేక చివరకు వ్యభిచారానికి అంగీకరించినట్టు విచారణలో తేలింది.

అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం ప్రాంతానికి చెందిన ఓ గిరిజన టీనేజర్‌ని ప్రేమ పేరుతో వంచించి ఓ వ్యక్తి విజయవాడకు తరలించాడు. అక్కడే ఓ ఇంట్లో ఉంచి ఆమెతో వ్యభిచారం నిర్వహించేందుకు చేసిన ప్రయత్నం పోలీసుల దృష్టికి వచ్చింది. మిస్సింగ్ కేసుగా తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులకు బాధితురాలి సమాచారం తెలిసింది. కొందరు సిబ్బంది విజయవాడకు వచ్చారు. కానీ తీరా ఆమె ఉంటున్న ప్రాంతంలో కరోనా సోకడంతో బాధితురాలి వద్దకు వెళ్ళేందుకు కూడా పోలీసులు సాహసం చెయ్యలేదు. కరోనా వైరస్ నేపథ్యంలో అనుమానితుల వద్దకు వెళ్లడానికి అవసరమైన రక్షణ సామాగ్రి వారి వద్ద లేకపోవడంతో బాధితురాలి సమాచారం తెలిసినప్పటికీ రెడ్ జోన్ ప్రాంతంలోకి వెళ్ళి ఆమెను తీసుకెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది.

రాజమండ్రిలో అయితే పునరావాస కేంద్రానికి తరలించిన మహిళలను వ్యభిచార ఊబిలో దింపే ప్రయత్నం చేసిన సిబ్బంది వ్యవహారం సంచలనంగా మారింది. స్త్రీ , శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వధార హోం లో వార్డెన్, వాచ్ మెన్ కలిసి తమతో వ్యభిచారం చేయిస్తున్నారంటూ నలుగురు మహిళలు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఐపీసీ 356 సెక్షన్ కింద నిందితులను అరెస్ట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో తమపై ఒత్తిడి పెంచి తమను వ్యభిచారం ఊబిలోకి దించేందుకు ప్రయత్నించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనావైరస్:లాక్ డౌన్ సమయంలో ఏపీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మహిళల అక్రమ రవాణా ముఠాల కార్యకలాపాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఉపాధి లేక.. మరో దారి కనిపించక..

ఇలాంటివి ఒకటి, రెండు ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని మహిళా సంఘాలు చెబుతున్నాయి. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పునరావాస కేంద్రానికి ‘స్పా’ పై పోలీసులు నిర్వహించిన దాడిలో చిక్కిన బాధితులు ఆరుగురిని తరలించారు. అక్కడే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ బి. కీర్తి బీబీసీతో మాట్లాడారు.

“లాక్ డౌన్ తర్వాత ఉపాధి పోయింది. స్కిల్డ్, అన్ స్కిల్డ్ కూడా ఉద్యోగాలు కోల్పాయారు. వారికి ప్రత్యామ్నాయం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కల్పిస్తున్న ఉపాధి కొంతమేరకు ఉపశమనం ఇస్తున్నా పూర్తిగా ఉపయోగపడడం లేదు. ఇక నగరాల్లో అది కూడా లేదు. దాంతో చాలామంది కుటుంబ పోషణకు మరో దారి లేక దిక్కులేని స్థితిలో ఉన్నారు. వారిని అవసరాలను ఆసరగా తీసుకుంటున్న మహిళల అక్రమ రవాణా ముఠాలు రంగంలో దిగాయి. ఇదే అనువుగా బాలికలు, మహిళలను వ్యభిచారంలో దింపేందుకు ప్రయత్నిస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా రెగ్యులర్ సెక్స్ వర్కర్లు కూడా పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. మా దగ్గర వసతి గృహంలోకి తీసుకొచ్చిన యువతులు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు. విజయవాడ నుంచి సొంత ప్రాంతాలకు వెళ్లాలన్నా, లేక ఇక్కడే ఉంటూ ఇంటి అద్దె చెల్లిస్తూ, తమ కడుపు నింపుకోవాలన్నా మరో దారి కనిపించకపోవడంతోనే అక్రమ రవాణా ముఠాల ప్రలోభాలకు సులువుగా లొంగిపోతున్నారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. కుటుంబాల జీవనానికి భరోసా కల్పించాలి” అంటూ డాక్టర్ కీర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనావైరస్:లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో అక్రమ రవాణా ముఠాలకు సులువగా చిక్కుతున్న బాధితులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

‘కేసులు తగ్గాయి కానీ కార్యకలాపాలు కాదు’

మానవ అక్రమ రవాణా ముఠాల ఇష్టానుసారం తమ కార్యకలాపాలను సాగిస్తున్నా వారిపై ఎలాంటి కేసులు మాత్రం నమోదు కావడం లేదు. కరోనా సమయంలో పూర్తిగా లాక్ డౌన్ సంబంధిత విధులకే పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ పనిలోనే ఊపిరి సలపనంత బిజీగా గడుపుతున్నారు. ఇతర కేసుల నమోదు, దర్యాప్తు చేయడానికి వారికి తగిన సమయం దొరకడం లేదు. అయినప్పటికీ మహిళ కిడ్నాప్ సంబంధిత కేసులు వెలుగులోకి వచ్చిన సమయంలో వెంటనే స్పందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయని ఏపీ పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.

వాస్తవానికి కొన్నేళ్లుగా మహిళలపై హింసలో ఏపీ ముందంజలో ఉంటూ వస్తోంది. సమీప రాష్ట్రాలలోనే కాకుండానే దేశంలోనే మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదయిన నేపథ్యం కూడా ఉంది. 2019లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 53 శాతం ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. పోస్కో చట్టం కింద 2018లో 1169 కేసులు నమోదయితే 2019లో అది 1302 కేసులకు పెరిగింది. 609 మంది ట్రాఫికర్స్‌ని అరెస్ట్ చేయగా, 322 మంది బాధిత మహిళలు, యువతులను వారి బారి నుంచి రక్షించినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

ఈ ఏడాది గడిచిన ఆరు నెలల రికార్డులు పరిశీలిస్తే గత ఏడాదిలో 50శాతం కేసులు కూడా రిజిస్టర్ కాలేదు. దాంతో లాక్ డౌన్ సమయంలో ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు వెలుగులోకి రావడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘ఫిర్యాదు చేసేందుకు కూడా చాలామంది ముందుకు రావడం లేదు’

ఉపాధి లేని అనేక కుటుంబాలు పోషణలో భాగంగా మహిళలను స్వచ్ఛందంగా వ్యభిచారానికి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని వాసవ్య మహిళా సంఘం తెలిపింది. అదే సమయంలో చాలా మంది ఇలాంటి విషయాల్లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు కె.పద్మావతి పేర్కొన్నారు. “కుటుంబాల పోషణకు మరో దారి లేని అనేకమంది ఇలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు. పోలీసులను ఆశ్రయించినా ఫలితం వస్తుందనే నమ్మకం కూడా ఎక్కువ మందికి లేదు. అందుకే ఫిర్యాదు చేయకుండా మౌనంగా ఉంటున్నారు. నేరమే అని తెలిసినా ఎంతో కొంత సంపాదిస్తే తమ జీవనానికి తోడ్పడుతందనే అభిప్రాయం కూడా వారిలో చాలామంది కుటుంబసభ్యుల్లో ఉంది. దానిని అవకాశంగా మలచుకున్న అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. వలస కూలీల మీద కూడా వల వేసి ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అసంఘటిత రంగ పేదలు, వలస కూలీల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్టు మా దృష్టికి వచ్చింది. వాటిని అదుపు చేయాలంటే ఉపాధి కల్పించడం తప్ప మరో దారి లేదు” అని కె.పద్మావతి చెప్పారు.

మహిళల అక్రమ రవాణా బాధితురాలు

నేరస్తులకు శిక్షలు ఏపీలోనే తక్కువ

మహిళల అక్రమ రవాణాలో నిందితులకు శిక్షలు పడే విషయంలో ఏపీ చాలా వెనుకబడి ఉందని రికార్డులు చెబుతున్నాయి. ఈ విషయంపై విముక్తి సంస్థ రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ హసీనా బీబీసీతో మాట్లాడారు. “పట్టణాల్లో ఉపాధి లేక సొంతూళ్లకు చేరిన వలస కూలీలు ఇప్పుడు టార్గెట్ అయ్యారు. ఉద్యోగ అవకాశాలు, రుణాలు, కాల్ మనీ పేరుతో వారిని వంచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ట్రాఫికర్స్ 70 శాతం కేసుల్లో తప్పించుకుంటున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ఏపీలో మాత్రం 90శాతం మంది ఎటువంటి శిక్షలు లేకుండానే బయటపడుతున్నారు. 2018 లెక్కలు పరిశీలిస్తే దేశంలో 29.4 శాతం కేసుల్లో శిక్షలు పడితే ఏపీలో మాత్రం అది 11.7 శాతమే. అంటే శిక్షలు పడతాయనే భయం లేని కారణంగా మహిళలకు వల వేసే ముఠాలు పెరుగుతున్నాయి. దానిని సరిదిద్దేందుకు అక్రమ రవాణా నిరోధక యూనిట్స్ కి పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలి. ఇప్పటికే యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో అలాంటి ప్రయత్నం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అలా చేస్తేనే మహిళలకు రక్షణ కల్పించడం, నిందితులను శిక్షించడం సులువు అవుతుంది” అంటూ వ్యాఖ్యానించారు.

‘మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం’

మహిళల అక్రమ రవాణా విషయంలో చట్టం ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్లా అన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ “లాక్ డౌన్ సమయంలో మహిళా హక్కుల విషయంలో ఎక్కడ రాజీ పడటంలేదు. అనేక చోట్ల బాల్య వివాహాలను అడ్డుకుని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకున్నాం. అక్రమ రవాణాకి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా వెంటనే స్పందిస్తున్నాం. పోలీసులు కూడా దిశ చట్టం వచ్చిన తర్వాత స్పందనలో వచ్చే ప్రతీ ఫిర్యాదు పైనా చర్యలు తీసుకుంటున్నారు. అంతా నిర్ధిష్ట సమయం ప్రకారం సాగుతోంది. ఎవరికీ మినహాయింపు లేదు. మహిళల అక్రమ రవాణాను అడ్డుకుంటాం’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)