కరోనావైరస్: హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా? మూడు, నాలుగు రోజుల్లో నిర్ణయం అంటున్న కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO
హైదరాబాద్‌లో కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కొద్ది రోజుల పాటు మళ్లీ లాక్‌డౌన్ విధించే విషయమై అవసరమైతే మూణ్నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
నగరంలో 15 రోజులపాటు లాక్‌డౌన్ విధించాలని వైద్యశాఖ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని ఆయన అన్నారు.
‘‘హైదరాబాద్ కోటి మంది నివసిస్తున్న పెద్ద నగరం. దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లోనూ ఈ పరిస్థితి ఉండడం సహజం. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత, ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి’’ అని కేసీఆర్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయమని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను ఇందుకు సన్నద్ధం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
రెండు, మూడు రోజుల్లో పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.
‘‘అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్‌ను సమావేశపరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదనతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.
పాజిటివ్ కేసులు ఎక్కువైనంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లూ చేసిందని కేసీఆర్ అన్నారు.

ఫొటో సోర్స్, facebook/EatalaRajendarTRS
‘తీవ్రంగా ఉన్నవారికి ఆసుపత్రిలో... మిగతావారికి ఇంట్లో’
కరోనావైరస్ విషయంలో తెలంగాణలో మరణాల సంఖ్య జాతీయ సగటులో పోలిస్తే తక్కువని, ప్రజలు పెద్దగా భయపడాల్సిందేమీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
‘‘పాజిటివ్‌గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా వేలాది పడకలు సిద్ధం చేశాం. పరిస్థితి తీవ్రంగా ఉన్న రోగులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స చేస్తున్నాం’’ అని ఈటల రాజెందర్ వివరించారు.
‘‘వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కోవిడ్ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది 1.52 మాత్రమే. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌గా తేలిన వారికి తగిన వైద్యం అందిస్తున్నాం’’ అని ఈటల అన్నారు.

ఫొటో సోర్స్, @Eatala_Rajender
'ప్రభుత్వ బాధ్యతా రాహిత్య ధోరణే కారణం' - పొన్నం ప్రభాకర్
హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి రావడానికి ప్రభుత్వ బాధ్యతా రాహిత్య ధోరణే కారణమని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజుకు పది కేసులు ఉన్నప్పుడు లాక్‌డౌన్ ఉండి, వెయ్యి కేసులు వస్తున్నప్పుడు లేకపోవడం ఆలోచించుకోవాల్సిన విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ''కరోనానా.. కాకరకాయనా అన్నారు. పారాసిటమాల్‌తో పోతుందన్నారు. లాక్‌డౌన్‌లో మిలిటరీని దింపుతామన్నారు. ఇప్పుడు కరోనాతో సహజీవనం తప్పదంటున్నారు'' అని పొన్నం ప్రభుత్వాన్ని విమర్శించారు.
ప్రజల ఆరోగ్యం గురించి కాకుండా, ఆర్థిక విషయాల గురించే ఆలోచించి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేసిందని అభిప్రాయపడ్డారు. ''ప్రభుత్వం తీరు గాల్లో దీపం పెట్టిన చందంగా తయారయ్యింది. హైకోర్టు ఆదేశించిన తర్వాత ప్రైవేటు ల్యాబ్‌ల్లో టెస్టులకు అనుమతించారు. కేసులు పెరుగుతున్న కొద్దీ నాణ్యత లోపాలుంటున్నాయని సాకులు చెబుతున్నారు. శాంపిల్స్ పేరుకుపోయాయంటూ ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిలిపివేశారు'' అని పొన్నం ప్రభాకర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- గ్రూప్ 1 ఉద్యోగాలను అర్హత పరీక్షలు, ఎంపిక లేకుండా ప్రభుత్వాలు నేరుగా ఇవ్వవచ్చా?
- హైదరాబాద్ ప్రసూతి ఆస్పత్రిలో వైద్య సిబ్బందికి కరోనా... గర్భిణులు, జూడాల అవస్థలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎంతమంది రాజకీయ నాయకులు కరోనా మహమ్మారి బారిన పడ్డారంటే..
- కరోనావైరస్: సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?
- 'నాకు ఊపిరి ఆడడం లేదు.. దయచేసి నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లండి...ప్లీజ్'
- ప్లేగు మహమ్మారి నేపథ్యంలో మొదలైన బోనాలు కరోనా మహమ్మారి వల్ల ఇంటికే పరిమితం అవుతాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








