తెలంగాణ - చేగుంట: 'నాకు ఊపిరి ఆడడం లేదు.. దయచేసి నన్ను హాస్పిటల్‌కు తీసుకువెళ్లండి...ప్లీజ్'

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
"దయచేసి నన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి. చాలా ఇబ్బందిగా ఉంది. గాలి ఆడటం లేదు. ప్లీజ్, దయ చేసి నన్ను త్వరగా హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళండి."
రోడ్డు పక్కన పడిపోయి, చేతులు జోడించి ప్రాధేయపడుతూ ఆర్. శ్రీనివాస్ బాబు చెప్పిన ఇవి ఆ వీడియోలో అతడి ఆఖరి చివరి మాటలుగా మిగిలిపోయాయి.
మెదక్ జిల్లా చేగుంటలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు పోలిసులు తెలిపారు. “సమాచారం ఇచ్చిన గంట తర్వాత వచ్చిన 108 సిబ్బంది శ్రీనివాస్ బాబుకు కరోనా ఉందనే అనుమానంతో, తమ దగ్గర పీపీఈ కిట్ లేదని, మరో అంబులెన్సు కోసం కబురు పెట్టారు. అది అక్కడకు చేరుకునేలోపే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయారు” అని జిల్లా అధికారులు తెలిపారు.
ఆ వీడియోలో పోలీస్ సిబ్బంది, చుట్టూ చాలా మంది గుమిగూడి ఉండడం కనిపిస్తోంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శ్రీనివాస్ బాబును వీడియో తీస్తున్న వారు వరస ప్రశ్నలు అడుగుతున్నారు. ఆయన పదే పదే అంబులెన్స్ పిలిపించి, తనను ఆస్పత్రికి పంపాలని వేడుకుంటున్నారు.
మెదక్ జిల్లా డిఎంఎచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్ రావు బీబీసీతో మాట్లాడుతూ, అతడి కుటుంబం ఇచ్చిన వివరాల ప్రకారం శ్రీనివాస్ బాబు సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్‌పల్లి వాసి అని తెలిసింది అన్నారు.
ఘటన గురించి చెబుతూ “ఆయన కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కి ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారు. ఆయన శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతుండడంతో బస్సును చేగుంట దెగ్గర బైపాస్ దగ్గర ఆపి, ఆయన్ను దించి వెళ్లారు. అక్కడ నుంచి చేగుంట పీహెచ్‌సీ 400 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రాథమిక ఆరోగ్య కేద్రంలో పని చేస్తున్న స్టాఫ్ నర్స్ ఇంజక్షన్, మందులు ఇచ్చారు. అతడిని జిల్లా ఆస్పత్రి లేదా హైదరాబాద్ గాందీ ఆస్పత్రికి పంపించేందుకు అంబులెన్సు పిలిపించారు. కానీ ఆలస్యంగా స్పందించిన వారు, అతడిని తరలించడంలో నిర్లక్ష్యం చూపడం వల్లే శ్రీనివాస బాబు మరణించారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC VIDEO
ఆ బాధ్యత వారిదే: డీఎంహెచ్ఓ
108 అంబులెన్సులు జీవీకే ఈఎంఆర్ఐ అద్వర్యం లో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్నాయని, అందుకే వారికి పీపీఈ కిట్లు అందించాల్సిన బాధ్యత వారిదే అని డిఎంఎచ్ఓ చెప్పారు.
"మెదక్ జిల్లాలో మొత్తం ఎనిమిది 108లు ఉన్నాయి. వాటిలో రెండు కేవలం కోవిడ్ అనుమానితులు, కోవిడ్ రోగుల కోసం కేటాయించాం. వాటన్నిటికీ పిపిఈ సరఫరా చేస్తున్నాం. అయితే, ఏ అంబులెన్సు బాధ్యత అయినా, పేషెంట్లను ఆస్పత్రికి చేర్చడం వరకే. పీపీఈ కీట్లు లేకపోవడం వల్ల ఇలా జరిగింది”
నిజానికి, ముందుగా వచ్చిన అంబులెన్సులో రెండు కిట్లు ఉన్నాయని బీబీసీ పరిశోధనలో తేలింది. అయితే, పేషెంటుకు కోసం మరొకటి లేదని వారు రోగిని అలా వదిలేశారు. మరో అంబులెన్స్ కోసం కాల్ చేశారు.
“ముందే అతడికి శ్వాసకోశ సమస్యలు ఉండటం వల్ల, కోవిడ్ రోగి అనే భయంతో వారు తమ బాద్యత నిర్వహించలేదు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారందరికీ కోవిడ్ ఉండదు. అయినా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే ఆ 108 సిబ్బందిని తక్షణం విధుల నుంచి తొలగించాలని నేను జిల్లా కలెక్టర్‌ను కోరాను. ఇలాంటి ఘటన ఇటీవల మరొకటి జరిగింది. తర్వాత అతడికి కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చింది” అని డిఎంఎచ్ఓ చెప్పారు.
అయితే, శ్రీనివాస్ బాబుకు కోవిడ్ పరీక్షలు చేయలేదు. చనిపోయిన వారికి కూడా కోవిడ్ పరీక్షలు చేయాలని రాష్ట్ర హైకోర్ట్ మే 26న ఆదేశాలు జారీ చేసింది.
అయితే, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం "ఏ కారణంతో చనిపోయినా, మృతులు ప్రతీ ఒక్కరికీ కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలనే హైకోర్టు ఆదేశాలు అమలు సాధ్య కాదు. రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల రోజూ సగటున 1000 మంది వరకూ మరణిస్తుంటారు. వారికి పరీక్షలు చేయడమే పనిగా పెట్టుకుంటే, ఆస్పత్రుల్లో ఇతర వైద్య సేవలు అందించడం సాధ్యం కాదు అని చెప్పింది. డబ్ల్యుహెచ్ఓ, ఐసీఎంఆర్ కూడా మృతదేహాలకు పరీక్షలు నిర్వహించాలని చెప్పలేదు” అని చెప్పింది.
కరోనా అని నర్సులే భయపడ్డారు: 108 సిబ్బంది
అయితే శ్రీనివాస బాబు కోసం వచ్చిన 108 డ్రైవర్‌తో బీబీసీ మాట్లాడింది. తడి వివరాల ప్రకారం వారి దగ్గర తగినన్ని పీపీఈ కిట్లు లేకపోవడంతో మరో అంబులెన్సు పిలిపించామని అని చెప్పారు.
"మాకు ఫోన్ వచ్చింది. మేము ఘటనా స్థలానికి 15 కిలోమీటర్ల దూరంలో తూప్రాన్‌లో ఉన్నాం. అరగంటలో అక్కడికి చేరుకున్నాము. అక్కడ అప్పటికే పోలీసులు, పీహెచ్‌సి సిబ్బంది ఉన్నారు. వారంతా గ్లోవ్స్, మాస్కులు పెట్టుకొని వున్నారు. రోడ్డు మీద ఉన్న అతడు ఆయాస పడుతున్నాడు. కానీ వారెవరూ, అతడి దగ్గరికెళ్లడం లేదు. పక్కనే ఆస్పత్రి ఉన్నా, అక్కడికి తీసుకెళ్లలేదు. దగ్గరకు వెళ్లడానికి నర్సులే భయపడుతున్నారు. మా మెడికల్ సిబ్బందితో అతడికి కరోనా ఉండచ్చని చెప్పారు. దాంతో, కరోనా కేసుల కోసం వేరే రెండు అంబులెన్సులు ఉన్నాయని మా పై అధికారికి ఫోన్ చేశాం” అన్నాడు.
అప్పుడు తమ దగ్గర రెండే పీపీఈ కిట్లే ఉన్నాయని 108 సిబ్బంది చెప్పారు. ఒక వేళ అతడిని తీసుకెళ్లినా అంబులెన్సు శానిటైజ్ చేసేందుకు శానిటైజర్ కూడా లేదని తెలిపారు. అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ కూడా అదే విషయం చెప్పారు.
"మేము ఇప్పటివరకూ కరోనా రోగుల కోసం పనిచేయలేదు. అతడు క్వారంటైన్ నుంచి వచ్చినట్లు అనుమానం ఉందని నర్స్ చెప్పింది. దాంతో మాకు భయం వేసింది. అందుకే వేరే అంబులెన్స్ పిలిపించాం” అని అతడు చెప్పాడు.

కల్యాణీ అయిపోయింది... అంతా అయిపోయింది
"కల్యాణీ అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంకో ఐదు నిమిషాలేనేమో.... అంబులెన్స్ రాలేదు. పిల్లలు జాగ్రత్త, నానా జాగ్రత్త. నేను ఇంటికి రాలేను ఇంక' అని ఫోన్లో నాతో చెప్పారు. అవే మా ఆయన నాకు చెప్పిన ఆఖరు మాటలు" అ అని శ్రీనివాస్ బాబు భార్య కల్యాణి చెప్పారు. ఆమె కుమిలి కుమిలి ఏడుస్తూ, తన భర్త మరణానికి మనుషులలో మానవత్వం చనిపోవడమే కారణమన్నారు.
హైదరాబాద్ లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ వయసు 60 ఏళ్ళు. వారికి ఒక కూతురు, ఒక కొడుకు. కుమార్తె కు మానసిక వైకల్యం. ఆయన తండ్రి కూడా వారితోనే ఉంటున్నారు.
"నా కూతురికి 26 ఏళ్ళు. కానీ వాళ్ళ నాన్న జో కోట్టందే నిద్ర పోదు. రెండు రోజుల నుంచి పడుకోలేదు. ఈ పాపను ఇప్పటి దాక ఇద్దరం కలిసి పెంచుకోగలిగాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఎలా" అని కల్యాణి బాధతో ప్రశ్నించారు.
శ్రీనివాస్ కుమారుడు భానుచందర్ తన తండ్రి చనిపోతూ కనిపించిన వీడియో చూసి తట్టుకోలేక పోతున్నానన్నారు. "మా నాన్న 1987 నుంచి రకరకాల సంస్థలలో పని చేస్తూ వచ్చారు. తనకు రావలసిన డబ్బు కోసం కరీంనగర్‌కు వెళ్లారు. దారిలో ఇలా జరిగింది" అని చెప్పారు.

సిబ్బందిపై చర్యలు తీసుకున్నాం
జీవీకే ఈఎంఆర్ఐ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పి.బ్రహ్మానందరావుతో కూడా బీబీసీ మాట్లాడింది.
ఆయన “రాష్ట్రంలోని అన్ని అంబులెన్సులకు సరిపడా పీపీఈ కిట్లు సరఫరా చేశాం. రాష్ట్రంలో 108 అంబులెన్సులు మొత్తం 351 ఉన్నాయి. వాటిలో 92 ప్రత్యేకంగా కోవిడ్ సేవల కోసమే కేటాయించాం. వాటిలో 30 జీహెచ్ఎంసీ కింద, మిగతా 62 జిల్లాల్లో ఉన్నాయి. వీటిలో ఒక్కో అంబులెన్సుకు 10 పీపీఈ కిట్లు ఇచ్చాం” అన్నారు.
మిగతా 108 అంబులెన్సుల్లో కూడా అత్యవసస్థితిలో ఉపయోగించేందుకు 4 పీపీఈ కిట్లు ఇచ్చామని, వారికి కరోనా జాగ్రత్తల గురించి కూడా సూచించామని ఆయన చెప్పారు.
అయితే ఈ ఘటనా స్థలానికి వెళ్లిన అంబులెన్సులో ఆ పీపీఈ కిట్లు ఎందుకు లేవు, వాటిని ఎందుకు వాడలేవు అనేది తెలీడం లేదు. కరోనా ఉందేమో అనే అనుమానంతో రోగిని ఆస్పత్రికి తరలించకపోవడం తప్పు.అందరికీ కరోనా జాగ్రత్తల గురించి ఇప్పటికే సమాచారం ఇచ్చాం. ఈ ఘటనలో బాధ్యులైన సిబ్బందిని తక్షణమే హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ చర్యలు కూడా తీసుకున్నాం" అని బ్రహ్మానంద రావు చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో సరిపడా పీపీఈ కిట్లు ఉన్నాయని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇదే విషయాన్ని ఆయన జూన్ 2 న హైకోర్టుకు అందించిన నివేదికలో పేర్కొన్నారు.
ఆ నివేదికలో ఆయన 7 లక్షలకు పైగా పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లోవ్స్ ఉన్నాయని చెప్పారు. అయితే, అందుబాటులో ఉన్నవి ఎన్ని? ఏయే ఆస్పత్రులకు సరఫరా చేశారో చెప్పడం ముఖ్యం అని ధర్మాసనం చెప్పింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
అయితే, ఇప్పుడు శ్రీనివాస్ బాబు మృతికి కారణం ఎవరు? పీపీఈ కొరతే కారణమా? సిబ్బంది నిర్లక్ష్యమా? ఇవేవీ పట్టించుకోని అధికారులా? సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవటమా?
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ చైనాలోని వూహాన్లో డిసెంబర్ కన్నా ముందే బయటపడిందా... శాటిలైట్ చిత్రాలు ఏం చెబుతున్నాయి?
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే స్వర్ణలత ఎవరు?
- #గమ్యం: రైల్వేలో ఉద్యోగం పొందడం ఎలా?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- కరోనావైరస్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌తో మీ మీద అడుగడుగునా నిఘా పెడుతున్నారా?
- కరోనావైరస్: ‘హీరో’ల నిర్వచనాన్ని ఈ మహమ్మారి మార్చేస్తుందా?
- కరోనావైరస్ రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయి
- కరోనా లాక్డౌన్: సూర్యుడు కనిపించని చీకటి జీవితం ఎలా ఉంటుంది
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- గుజరాత్: బ్రెజిల్‌కు ఆనాడు ఆవుల్ని, ఎద్దుల్ని ఇచ్చి.. ఇప్పుడు వీర్యం అడుగుతోంది
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- సీతారాం ఏచూరి బోనం ఎందుకు ఎత్తుకున్నారు? ఈ ‘చిత్రం’ వెనుక కథేంటి?
- BBC Special: పోతురాజు - బోనాల పండుగలో ఈ వేషం ఎవరు వేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








