కేజ్రీవాల్: దిల్లీలో కోవిడ్19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు ఇస్తున్నారు? అసలు ఇవి ఎలా పనిచేస్తాయి?

ఫొటో సోర్స్, WHO
- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్‌లో స్వల్ప లక్షణాలున్న కరోనావైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతోంది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ తీవ్రమైన రోగులతోపాటు స్వల్ప లక్షణాలున్నవారు కూడా ఆసుపత్రులకు పోటెత్తడంతో వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.
దిల్లీలో అయితే కేవలం నగరానికి చెందిన రోగులను మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
మరోవైపు స్వల్ప లక్షణాలతో ఇంట్లో క్వారంటైన్ అయిన కరోనావైరస్ రోగులకు పల్స్ ఆక్సీమీటర్లు ఇవ్వబోతున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
అసలు ఈ పల్స్ ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుంది? దీనితో కోవిడ్-19 చికిత్సకు సంబంధం ఏమిటి? దీన్ని ఎలా ఉపయోగిస్తారు? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వివరాల ప్రకారం.. క్లిప్‌లా కనిపించే ఈ పరికరాన్ని ఎక్కువగా చూపుడు వేలికి అమరుస్తుంటారు. కొన్నిసార్లు మిగతా చేతి వేళ్లతోపాటు, కాలి వేళ్లు, చెవికి కూడా అమరుస్తుంటారు. దీన్నే పల్స్ ఆక్సీమీటర్ అంటారు.
మన శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సీజన్‌ను గుండె ఎలా సరఫరా చేస్తుందో ఈ ఆక్సీమీటర్‌తో తెలుసుకోవచ్చు. రక్తంలోని ఆక్సీజన్ స్థాయిలు తగ్గే వ్యాధులతో బాధపడే రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీవోపీడీ), ఆస్థమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, రక్త హీనత, గుండె జబ్బుల చికిత్సలో దీని అవసరం ఎక్కువ ఉంటుంది.
మరోవైపు ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో భాగంగా ఇచ్చే ఔషధాలు ఎలా పనిచేస్తున్నాయి? కృత్రిమ శ్వాస ఏమైనా అవసరం అవుతుందా? వెంటిలేటర్ ఎలా పనిచేస్తుంది? శస్త్రచికిత్సల సమయంలో మత్తుమందులు ఇచ్చిన అనంతరం రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు ఎలా ఉన్నాయి? కృత్రిమ శ్వాసపై అందిస్తున్న చికిత్సలు ఎలా పనిచేస్తున్నాయి? శారీరక ఒత్తిడిని రోగి ఎంతవరకు తట్టుకుంటున్నాడు? నిద్ర పోయేటప్పుడు శ్వాసలో వచ్చే తేడాల పర్యవేక్షణకూ దీన్ని ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ఎలా పనిచేస్తుంది?
ఆరోగ్య సమాచారం అందించే అమెరికా వెబ్‌సైట్ హెల్త్‌లైన్ ప్రకారం.. వేలికి ఆక్సీమీటర్‌ను అమర్చినప్పుడు.. వేళ్లలోని రక్తం గుండా సన్నని కాంతి ప్రసరిస్తుంది. ఫలితంగా రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు ఏ విధంగా ఉన్నాయో తెలుస్తుంది. కాంతి పుంజాలను రక్తం ఎలా శోషించుకుంటుందో విశ్లేషించి ఈ పరికరం ఫలితాలను ఇస్తుంది. దీన్ని ఉపయోగించేటప్పుడు శరీరంపై ఎలాంటి నొప్పీ లేకుండా ఇది పని పూర్తిచేస్తుంది.
ఆక్సీమీటర్ రీడింగ్స్ దాదాపు అన్నీ కచ్చితంగానే ఉంటాయి. రెండు శాతం వరకు మాత్రమే రీడింగ్ తేడా వచ్చే అవకాశం ఉందని హెల్త్‌లైన్ వెల్లడించింది. ఉదాహరణకు మీ రీడింగ్ 92గా వచ్చిందంటే.. మీ రక్తంలోని ఆక్సీజన్ స్థాయిలు 90 నుంచి 94 శాతం మధ్య ఉన్నట్లు లెక్క. అయితే ఈ రీడింగ్‌ను కదలికలు, ఉష్ణోగ్రత, గోర్లకు వేసుకునే రంగు లాంటివి ప్రభావితం చేసే అవకాశముంది. అయితే తాత్కాలికంగా ఈ రీడింగ్ తగ్గినంత మాత్రన ముప్పు ఉన్నట్లు కాదు. మళ్లీమళ్లీ రీడింగ్ తగ్గినా.. లేదా తగ్గిపోయి అలానే ఉండిపోయినా వెంటనే అప్రమత్తం కావాలి. ఆరోగ్యవంతుల్లో ఈ రీడింగ్ 95 నుంచి 97 మధ్యలో ఉంటుంది.
కోవిడ్-19తో సంబంధమేంటి?
కరోనావైరస్ సోకిన రోగుల్లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. దీంతో ఇన్ఫెక్షన్ తీవ్రమైన రోగులకు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అయితే కృత్రిమ శ్వాస ఎవరికి అవసరం అవుతుందో గుర్తించడంలో పల్స్ ఆక్సీమీటర్ కీలకంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాశ్చాత్య దేశాల్లో వైద్యులు సూచించినా, సూచించకపోయినా ఎక్కువ మంది పల్స్ ఆక్సీమీటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో వీటి కొరత కూడా ఏర్పడింది. దీంతో లక్షణాలు బయటకు కనిపిస్తూ.. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్న కరోనావైరస్ రోగుల దగ్గర ఈ పరికరం ఉంటే సరిపోతుందని యేల్ వర్సిటీకి చెందిన ఊపిరితిత్తుల నిపుణురాలు డెనీస్ లచ్‌మాన్‌సింగ్ తెలిపారు.
"అందరూ ఆక్సీమీటర్‌ను కొనుక్కోవాల్సిన పనిలేదు. కానీ కరోనావైరస్ సోకిన తర్వాత ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటే.. వారికి ఆసుపత్రి వైద్యం ఎప్పుడు అవసరం అవుతుందో ఆక్సీమీటర్ సాయంతో తెలుసుకోవచ్చు."

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
"చాలా మందికి అవగాహన ఉండదు"
ఈ ఆక్సీమీటర్ రీడింగ్ విషయంలో ఒక్కో దేశం ఒక్కో ప్రమాణాలు పాటిస్తుంది. ఇది 90 కంటే తక్కువ ఉంటే అత్యవసర చికిత్స అవసరం అని అమెరికన్ లంగ్ అసోసియేషన్ తెలిపింది. అయితే ఈ రీడింగ్‌ను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్, సీనియర్ వైద్యుడు సంజీవ్ సింగ్ వివరించారు.
"ప్రస్తుతం మార్కెట్‌లో చాలారకాల పల్స్ ఆక్సీమీటర్లు అందుబాటులో ఉన్నాయి. వన్-పారా, టూ-పారా, మల్టీ పారా ఇలా చాలా రకాలుంటాయి. ప్రభుత్వం ఏం పంపిణీ చేస్తుందనే దానిపై ఈ ఆక్సీమీటర్ రీడింగ్, ఉపయోగించే విధానం ఆధారపడి ఉంటాయి."
"పల్స్ ఆక్సీమీటర్‌లో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉంటాయి. చాలా మంది వైద్యులే దీన్ని ఉపయోగించలేరు. ఆక్సీమీటర్ల వల్ల ప్రజలు భయాందోళనలకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 98.4 అనేది సాధారణం అంటారు. అయితే అలాంటిదేమీ ఉండదు. దీనికంటూ ఒక రేంజ్ ఉంటుంది. 98.4కు అటూఇటూగా ఉన్నా సాధారణమే. అదే విధంగా ఆక్సీమీటర్ రీడింగ్‌లోనూ కచ్చితంగా ఇంతే ఉండాలనేది ఏమీ ఉండదు. పరిసరాలు, గది ఉష్ణోగ్రత, గోర్లకు వేసుకొనే రంగు.. ఇలా చాలా అంశాలు రీడింగ్‌ను ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ రీడింగ్‌ను విశ్లేషించేందుకు వైద్యులు అవసరం."

ఫొటో సోర్స్, REUTERS
"అలా చేస్తే మంచిదే"
"నేరుగా రోగులకు ఈ పరికరాలు ఇచ్చే కంటే మొహల్లా క్లీనిక్స్‌లో వీటిని పెట్టడం మంచిది. అలానే నైపుణ్యం కలిగిన వైద్యులను అక్కడ అందుబాటులో ఉంచాలి. ప్రజలకు ఆక్సీమీటర్లు వాడటం తెలియకపోతే భయాందోళనలకు గురవుతారు. వారు ఆక్సీమీటర్ రీడింగ్‌ను చూసి వేర్వేరు ఆసుపత్రులకు పరిగెడితే.. అక్కడ కరోనావైరస్ చెలరేగే ముప్పుంది."అని సంజీవ్ అభిప్రాయపడ్డారు.
"ఒకవేళ ఇంట్లో ఉండే రోగులకు ఆక్సీమీటర్లు పంచితే.. వాటిపై సమాచారం అందించేందుకు ఒక టోల్ ఫ్రీ నంబరు పెట్టొచ్చు. మొహల్లా క్లీనిక్స్‌లో వీటిపై అవగాహన ఉండే వైద్యులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడు ఆక్సీమీటర్లకు సంబంధించిన సమాచారం కోసం దగ్గర్లోని మొహల్లా క్లీనిక్స్‌కు మాత్రమే వస్తారు. ఫలితంగా రోగులు పెద్ద ఆసుపత్రుల కోసం నగరం అంతటా తిరగాల్సిన అవసరం ఉండదు. కేసులు పెరగకుండా ఉండేందుకు ఇది దోహదపడుతుంది."
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆక్సీమీటర్లను ఇచ్చే అవకాశం దాదాపుగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. "ఇక్కడ పరిస్థితులను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాగానే పర్యవేక్షిస్తున్నాయి. ఇక్కడి ఆరోగ్య నిపుణులతోపాటు ప్రభుత్వాధికారులూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవచ్చు."

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- ఉత్తర ప్రదేశ్‌లో వైద్యం అందక గర్భిణి మృతి.. కరోనా పాజిటివ్ కేసుల్లో ఐదో స్థానానికి చేరుకున్న భారత్
- ఇకిగాయ్: జీవిత పరమార్థం తెలిపే జపాన్ ఫార్ములా
- భారత్-నేపాల్ సంబంధాలు: 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- కరోనావైరస్: కోవిడ్-19 సోకిన తల్లులకు పుట్టిన 100 మంది బిడ్డలు ఎలా ఉన్నారు...
- రోడ్డుపైనే మహిళా వలస కూలీ ప్రసవం, రెండు గంటల విరామంతో మళ్లీ సొంతూరికి నడక... సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
- కరోనావైరస్: ప్రత్యేక రైళ్లలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- బిహార్ రైల్వే స్టేషన్లో విషాదం: తల్లి చనిపోయిందని తెలియక మృతదేహం దగ్గర ఆడుకున్న చిన్నారి
- ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉండటానికి నిరాకరించిన రైలు ప్రయాణీకులు.. తిరిగి దిల్లీ పంపించిన కర్ణాటక
- ‘భారత్’ అనే పేరు వెనుక దాగిన శతాబ్దాల ‘నీరు’, ‘నిప్పు’ల కథ
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








