కరోనావైరస్ సూపర్ స్ప్రెడర్: తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి.. ఎలా వ్యాపించింది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
దేశంలోని అనేక రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంత కాలంగా కరోనావైరస్ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తోంది. కర్నూలు, గుంటూరు, విజయవాడ వంటి నగరాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కోయంబేడు కారణంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా విస్తరించింది.
కానీ.. తాజాగా తూర్పు గోదావరి జిల్లోని పెదపూడి మండలంలోని గొల్లలమామిడాడ గ్రామంలో ఏకంగా 100కి పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఒక వ్యక్తి ద్వారానే చుట్టు పక్కల ఐదు మండలాల్లో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళన కలిగించే విషయం.
ఈ గ్రామానికి ఇప్పుడు ఓ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి పరిస్థితిని అదుపు చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు.
ఒక్కసారిగా పెరిగిన కేసులు...
మార్చి నెల నుంచి కోవిడ్ 19 కేసులలో తూర్పు గోదావరి జిల్లా చాలా దిగువ స్థాయిలో కనిపించింది. రెండున్నర నెలల పాటు చాలా తక్కువగా కేసులు నమోదయ్యాయి. అది కూడా కేవలం రాజమహేంద్రవరం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కాకినాడ, తుని వంటి పట్టణ ప్రాంతాల్లోనే నమోదుకావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కానీ మే 20 తర్వాత హఠాత్తుగా పరిస్థితి మారిపోయింది. పెద్ద సంఖ్యలో కేసులు పెరగడం ప్రారంభమయ్యింది. ఒక్కసారిగా జిల్లాలో కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తం కావాల్సి వచ్చింది.
మే 20 నాటికి తూర్పు గోదావరి జిల్లాలో కేసులు 70 లోపే ఉన్నాయి. కానీ మే 21 నుంచి నేటికి కేసుల సంఖ్య 239కి చేరింది. అందులో అనపర్తి నియోజకర్గంలో నమోదయిన కేసుల సంఖ్య ఏకంగా 130 వరకూ ఉంది. గొల్లల మామిడాడలోనే 108 కేసులు నమోదయ్యాయి.

హోటల్ నుంచి వ్యాప్తి...
గొల్లలమామిడాడలో ఓ కాఫీ హోటల్ నడుపుతున్న 55 ఏళ్ల వ్యక్తి ఈ నెల 20న తీవ్ర అనారోగ్య సమస్యలతో కాకినాడ జనరల్ ఆస్పత్రిలో చేరారు. 21వ తేదీన ఆయన మరణించారు. మరణించిన తర్వాత ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కాంటాక్టు కేసులపై అధికారులు దృష్టి పెట్టారు.
మృతుడి కుమారుడు తొలుత రామచంద్రాపురంలో ఓ ప్రైవేటు పార్టీకి హాజరయినట్టు స్థానిక విలేకరి గంగాధర్‌రెడ్డి బీబీసీకి తెలిపారు. ఆయన ద్వారా తండ్రికి వైరస్ వ్యాప్తి చెందిందని భావిస్తున్నట్టు ఆయన వివరించారు. తనయుడి నుంచి తండ్రికి వైరస్ వ్యాపించడంతో ఆ తర్వాత మరింత మందికి చేరడానికి కారణం అయ్యింది.
ఫొటోగ్రాఫర్ కూడా అయిన వ్యక్తి మరణించడంతోనే విషయం బయటకు వచ్చింది. ఆయనకు ఆస్తమా సహా ఆరోగ్య సమస్యలు చాలాకాలంగా ఉన్నాయి. అయినా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లకుండా స్థానికంగా ఆర్‌ఎంపీని ఆశ్రయించారు. దాంతో అది ముదిరిపోయి, ప్రాణాల మీదకు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి తనయుడు కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. కొడుకు నుంచే తండ్రికి ఈ సమస్య వచ్చిందని అంచనా. ఆ తర్వాత ఆయన నడుపుతున్న హోటల్‌కి వచ్చిన వారు, తాను విస్తృతంగా అనపర్తి, బిక్కవోలు వంటి ప్రాంతాల్లో తిరగడం వల్ల తెలియకుండానే వైరస్‌ని ఎక్కువ మందికి వ్యాపించడానికి దోహదపడ్డారు.
ఇప్పుడు ఐదు మండలాల్లో మూడు నెలలుగా ఒక్క కేసు కూడా లేని చోట వందల కేసులు నమోదవుతున్నాయి అంటూ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
రోజురోజుకి పెరుగుతున్న కేసులు...
ఈ నెల 21న మృతుడికి కరోనా నిర్ధారణ అయిన తర్వాత.. గ్రామంలో వరుసగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 14,000 మంది జనాభా కలిగిన ఈ మేజర్ గ్రామపంచాయితీలో ఎక్కువగా వ్యాపార, వ్యవసాయ వర్గాలు ఉంటాయి.
సమీపంలోని పలు మండలాల్లో ఫైనాన్స్ వ్యాపారులకు జి మామిడాడ ప్రసిద్ధి. అలాంటి గ్రామంలో ఇప్పుడు కరోనా పాజటివ్ కేసులు ఎక్కువగా నమోదుకావడంతో కంటైన్మైంట్‌జోన్‌గా మార్చారు. 760 మందిని క్వారంటైన్ కి తరలించారు. ఇప్పటి వరకూ 108 పాజిటివ్ కేసులుగా నిర్దారణ అయ్యాయి. సుమారుగా 5 వేల మందికి పరీక్షలు నిర్వహించినట్టు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి బీబీసీకి తెలిపారు.
''మొదటి పాజిటివ్ కేసుగా నమోదయిన వ్యక్తి కొంత నిర్లక్ష్యం వహించడం వలన కేసుల సంఖ్య పెరిగింది. ప్రజలు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా అనుమానిత లక్షణాలున్న వారు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోల్సిన అవసరం ఉంది. జి.మామిడాడకు సంబంధించి సుమారు 5 వేల మందికి పరీక్షలు పూర్తయ్యాయి. ఇంకా కొందరికి ఫలితాలు రావాల్సి ఉంది'' అని ఆయన చెప్పారు.
''కుటుంబం లేదా చుట్టుపక్కల ఎవరికైనా పాజిటివ్ వచ్చినా భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. అనుమానిత లక్షణాలుంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చు అంటూ అవగాహన పెంచే ప్రయత్నంలో ఉన్నాం'' అని తెలిపారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా


ప్రత్యేక అధికారిగా డిప్యూటీ కలెక్టర్...
కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలుగానూ జాగ్రత్తలు పాటిస్తున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ తెలిపారు. ''గొల్లల మామిడాడ కేసు విషయంలో నిర్లక్ష్యానికి కారణాలు కూడా తెలుసుకుంటున్నాం. అన్ని చోట్లా ముందస్తు చర్యల్లో తీసుకుంటున్నాం. జి మామిడాడని కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించి, ప్రత్యేకంగా కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం'' అని చెప్పారు.
ఈ కంట్రోల్ సెంటర్ లో రెవెన్యూ, వైద్య, శానిటేషన్, సివిల్ సప్లై ,ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలకు వైద్య సదుపాయం నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను కూడా ఉపయోగించుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
''కేసుల సంఖ్య తగ్గేంతవరకు ఇక్కడే పర్మినెంట్ గా శాంపిల్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు అయ్యింది. ఇక్కడి పరిస్థితులను పర్యవేక్షించడానికి గాను డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది'' అని కలెక్టర్ వివరించారు.
'లాక్‌డౌన్ సమయంలో హోటల్‌కి ఎలా అనుమతించారు?'
దేశమంతా లాక్‌డౌన్ ఉంటే మామిడాడలో హోటల్‌కి ఎవరు అనుమతి ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ''మే 14 వరకూ అన్ని చోట్లా లాక్‌డౌన్ ఉంది. అయినా అక్కడ హోటల్ తెరిచారు. యధావిధిగా కార్యకలాపాలు సాగడంతో వైరస్ వ్యాప్తి చెందింది'' అని తప్పుపట్టారు.
''శానిటేషన్ నిర్వహణా వైఫల్యం కూడా ఉంది. ఇప్పటికయినా పరిస్థితిని చక్కదిద్దాలి. ప్రజలు భయాందోళనతో ఉన్నారు. వారికి అవగాహన కల్పించి, తగిన అవసరాలు అందించాలి. నిత్యావసర సరుకులు ఇతరాలు ఏర్పాటు చేయాలి'' అని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్రంలోనే ఎక్కువ మందికి వ్యాప్తికి కారణమయిన సూపర్ స్ప్రెడర్
కరోనా లక్షణాలతో ఉన్న వారిని పరీక్షలకు పంపించాల్సి ఉండగా, చికిత్స అందించేందుకు సిద్ధపడిన ఆర్ఎంపీ డాక్టర్‌పై కేసు నమోదు చేసినట్టు పెదపూడి సీఐ ఆకుల మురళీ కృష్ణ తెలిపారు. మృతుడితో ఉన్న ప్రత్యక్ష సంబంధాల కారణంగా ఎక్కువ మందికి వైరస్ వ్యాపిస్తే, చికిత్స చేసిన డాక్టర్ వద్ద వైద్య సహాయం పొందిన వారిలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
దాంతో ఆర్ఎంపీ తీరు మీద దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జి మామిడాడ కేసు ద్వారా సమీప మండలాలయిన రంగంపేట, అనపర్తి, బిక్కవోలు, కరప మండలాల్లో కూడా కేసులు నమోదయ్యాయి.
జి మామిడాడలో ఒక్కరి ద్వారా సుమారు 130 కి పైగా ఇప్పటికే పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలోనే అత్యధికంగా వైరస్ వ్యాప్తికి కారకుడైన సూపర్ స్ప్రెడర్‌గా చెబుతున్నారు. ప్రైమరీ కాంటాక్టులు, సబ్ ప్రైమరీ కాంటాక్ట్ కేసులతో కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే అనేక మందికి పరీక్షలు నిర్వహించగా, వారికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉండడంతో ఈ సంఖ్య ఎంతకు చేరుతుందోననే సందేహాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో 3,000 దాటిన కేసులు...
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ 3,042 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉదయం వెల్లడించింది. వీరిలో 2,135 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, 62 మంది మరణించారని పేర్కొంది. 845 మంది ఆసుపత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నట్లు వివరించింది.
ఇక దేశ వ్యాప్తంగా ఆదివారం వరకూ నమోదైన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,82,143. వీటిలో 89,995 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి.
ఇప్పటివరకూ 86,983 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 5,164 మంది చనిపోయారు. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








