జగన్ ఏడాది పాలన: సంక్షేమానికి, వివాదాలకూ రారాజు

- రచయిత, జీఎస్ రామ్మోహన్
- హోదా, ఎడిటర్, బీబీసీ తెలుగు
తొలి ఏడాది లోనే హామీల అమలుపై ఇంతగా దృష్టిపెట్టిన సీఎం అరుదు. ఎన్నికల హామీలైన నవరత్నాల అమలులో వేగం ఉంది. ఆ ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతం. అలాగే తొలి ఏడాదే ఇన్ని వివాదాలను కొని తెచ్చుకునే నేతలూ అరుదే. ఆ ఘనత కూడా ఆయన సొంతమే.
పథకాల అమల్లోలాగే విమర్శకులను అణగదొక్కడంలోనూ దూకుడే. దూకుడు విషయంలో ఆరునెలల క్రితం చెప్పుకున్నదే మళ్లీ చెప్పుకోవాల్సి వస్తున్నది.
విపక్షంలో ఉన్నపుడు దూకుడు అవసరమే కావచ్చు కానీ అధికారంలో ఉన్నపుడు సహనమే ఆభరణం. పాలకులకు బ్యాలెన్స్ అవసరం. కొన్ని మంచి పనులే చేపట్టినప్పటికీ ప్రభుత్వ వ్యవహార శైలిలోని నిరంకుశ ధోరణి వల్ల ఇది మొదటి దాన్ని కప్పేస్తున్నది. ప్రజాస్వామ్యంలో మొండితనం నడవదు.
ప్రభుత్వానికి ఎజెండా ఉండడం దాని అమలుపై పట్టుదల ఉండడమూ తప్పేం కాదు. కానీ కోరుకున్న టైంలో కోరుకున్న రీతిలో జరగకపోతే అసహనంగా ఉండడం, అడ్డు అనుకున్న కోర్టులపైనా, ఇతర రాజ్యాంగ అంగాలపై పరిధి దాటి అసహనం వ్యక్తం చేయడం, ఘర్షణ పెట్టుకోవడం పరిపాలనను వెనక్కు లాగుతుంది. విమర్శలోమంచీ ఉండొచ్చు. ఉద్దేశపూర్వకంగా బురదజల్లడమూ ఉండొచ్చు. అది చేసేవారిని బట్టి చూసేవారిని బట్టి మారుతూ ఉంటుంది.
కానీ విమర్శ అయితే పాలనకు అవసరం. అది లేకపోతే ప్రభుత్వం తనను తాను సరిదిద్దుకునే అవకాశం ఉండదు. విమర్శను సహించలేకపోవడం ప్రజాస్వామికం కాదు. ఆ బాలెన్స్ ప్రస్తుతం మిస్సయినట్టు అనిపిస్తుంది. అన్నింటా. అది సంక్షేమానికి అభివృద్ధికి మధ్య కావచ్చు. తాత్కాలిక చర్యలకు దీర్ఘకాలిక చర్యలకు మధ్య కావచ్చు. పరిపాలనకు రాజకీయానికి మధ్య ఉండాల్సిన సంబంధం కావచ్చు. పరిపాలనా బాధ్యుడిగా తనకు మిగిలిన యంత్రాంగానికి కావచ్చు. అన్ని విషయాల్లో సమన్వయలోపం కనిపిస్తుంది.
వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లో పోరాడి పోరాడి తన ఎజెండా నడిచేలా స్వతంత్రం సంపాదించుకున్నారు. జగన్ అట్లా కాదు. తండ్రి ఇమేజ్‌నే పెట్టుబడిగా పాదయాత్రే లక్ష్యసాధనకు మార్గంగా ఎంచుకుని అధికారం చేపట్టిన జగన్ తానే ఏకం సర్వం తనపార్టీలోనూ, ప్రభుత్వంలో కూడా.

ఫొటో సోర్స్, ysrcp
సలహాదారుల రాజ్యం
సలహాలు వింటారో లేదో తెలీదు గానీ ఏ ప్రభుత్వానికి లేనంత మంది సలహాదారులున్నారు జగన్ ప్రభుత్వంలో. దేశ చరిత్రలో అనొచ్చో లేదో తెలీదు గానీ, తెలుగు నేల వరకైతే ఇంతకుముందెన్నడూ లేనంత మంది ఉన్నారు అని కచ్చితంగా చెప్పుకోవచ్చు.
నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్ అని మంచి సూత్రం తీసుకువచ్చారు. అది సామాజిక న్యాయానికి సంబంధించిన మంచి విషయమే. బీసీ ఎస్సీ ఎస్టీలో పాజిటివ్ ఇమేజ్ తెచ్చేదే. కాకపోతే సలహాదారుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సన్నిహిత కోటరీలో పరిస్థితి వేరే. అక్కడ ఎక్కువభాగం సొంతమనుషులే. కోస్తాలో అంతకుముందు ఎక్కువగా వినపడే ఊతపదం ఒకటుంది. మనాళ్లేరా అని. ఇపుడు కూడా అంతే. తేడా ఏమీ లేదు. అపుడు వాళ్లైతే ఇపుడు వీళ్లు. ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులు, అనేకానేక మంత్రులు వివిధ సెక్షన్లనంచి ఉండొచ్చు గానీ పాలనలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేదెవరో అక్కడ ఎవరున్నారో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లే. అది గోడమీద రాతలాగా కనిపిస్తూనే ఉంది.

ఫొటో సోర్స్, www.ysrcongress.com
సంక్షేమానికి పెద్దపీట
పేదలకు జంట గుదిబండలుగా మారిన విద్య, వైద్యం మీద దృష్టిపెట్టడం ప్రశంసించాల్సిన విషయం.
పేదల బడుల్లో ఇంగ్లిష్ మీడియం, పాఠశాలల్లో బాత్రూమ్స్ లాంటి మౌలిక సదుపాయాలకు అవసరమైన నిధుల కేటాయింపు అవసరమైన విషయాలు. విద్యారంగంలో దిల్లీని మార్గదర్శకంగా తీసుకుని సంస్కరణలకు బాటలు వేస్తున్నారు.
ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణకు మాజీ జడ్జితో కమిషన్ వేయడం ఆహ్వానించాల్సిన విషయం.
ఆరోగ్యశ్రీని విస్రృతం చేశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ అంటున్నారు. అది ఆచరణరూపం దాలిస్తే చాలామంచి విషయం.
అమ్మ ఒడి, రైతుల భరోసా, చేనేత కార్మికులకు, ఆటో డ్రైవర్లకు, లాస్టూడెంట్స్కు నేరుగా ధనసాయం చేయడం వంటి నవరత్న పథకాలు, గ్రామ సచివాలయాల పేరుతో లక్షల మందికి ఉపాధి కల్పించడం వంటివన్నీ ప్రజల్లో ఇమేజ్ పెంచేవే.
సంక్షేమం సరే, ఉపాధి సంగతేంటి అనే ప్రశ్న వచ్చినపుడు ప్రభుత్వం గ్రామీణవలంటీర్లను కలుపుకుని ప్రభుత్వ ప్రైవేటు లెక్కలు వేసి ఘనంగా నాలుగున్నల లక్షల మందికి ఉపాధి అని ఈ సంఖ్యను ప్రధానంగా చూపిస్తూ ఉంటుంది.
వలంటీర్లకు ఐదువేలు చేతిలో పెట్టి సంఖ్య ఎక్కువ చూపించే బదులు సంఖ్య అటూ ఇటూ అయినా సరే, నిర్దుఫ్ట బాధ్యతలు అప్పగించి పనిచేయడానికి కొంత ఏరియా అప్పగించి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలిస్తే బాగుండేది.

ఫొటో సోర్స్, ANDRAPRADESHCM/FB
గ్రామ సచివాలయాలు మౌలికం
కాకపోతే ఈ పరిధికి మించిన ప్రాధాన్యం గ్రామ సచివాలయ వ్యవస్థకు ఉంది. ఎన్టీఆర్ తాలూకానుంచి మండలానికి తెచ్చి పాలనను ప్రజలదగ్గరకు తీసుకువచ్చారు. రాజకీయ కోణంలో కాకుండా పరిపాలనా కోణంలోనే జగన్ ఈ చర్యతీసుకుని ఉంటే ఎన్టీఆర్ చేపట్టిన ఒక సంస్కరణను మరింత ముందుకు తీసుకునిపోయిన వారవుతారు.
పంచాయతీరాజ్ ను పటిష్టం చేసిన కేరళ మోడల్ సాధిస్తున్న ఫలితాలను చూస్తున్నాం. ఇపుడు దిల్లీలో సంస్కరణలను చూస్తున్నాం.
కాబట్టి విపక్షాలు, విమర్శకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ అభిమానులకు పాక్షిక ఉపాధి ఇచ్చి అవసరమైన సమయంలో ఉపయోగించుకోవడం అనే రాజకీయ లక్ష్యం కాకుండా నిజంగా గ్రామ సచివాలయాలను పటిష్టం చేయడం కనుక ప్రభుత్వం లక్ష్యమైతే అది మంచి ఫలితాలనివ్వగలదు. గ్రామీణ ప్రజలకు ఉపశమనం ఇవ్వగలదు.

ప్రచారానికి చెరోవైపు
పాలనా శైలి విషయానికి వస్తే చంద్రబాబు హయాంలో పాలన మొత్తం టీవీలో ఉండేది. నిద్రపోవడం తప్ప మిగిలిన టైం అంతా టీవీల్లో ఉన్నారా అన్నట్టు చెణుకులు, విమర్శలు, కామెంట్లు వినిపించేవి. పూర్తిగా విరుద్ధం జగన్. మీడియాకు దూరం. పాలకులు పొద్దస్తమానూ మీడియాలో కనిపిస్తూ ఉండనక్కర్లే. పాలకులు కనిపించనక్కర్లే, పాలన కనిపిస్తే చాలు.
అంతవరకూ అవసరమైన విషయమే. కానీ ఈ ప్రభుత్వానికి మీడియా పట్ల అసహనం కూడా ఉంది. తన ఎజెండాకు భిన్నంగా ఉండేది ఏదైనా అసహనమే. అది కట్టుదాటి ఆంక్షల దాకా వెళ్లింది.
సోషల్ మీడియా పోస్టుల మీదా, మీడియా మీద విరుచుకుపడుతున్నారు. విమర్శకులను కట్టడి చేయడానికి ప్రత్యేక జీవోలు తెస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
చంద్రబాబు హయాంలో పొద్దునలేస్తే పోలవరం, అమరావతి అనే జంటపదాలు అదేపనిగా వినిపించేవి. ఈ ప్రపంచంలో ఆ రెండు తప్ప మరేమీ లేవేమో అన్న రీతిలో చెవుల్లో చిల్లులు పడేంత గట్టిగా వినిపించేవి.
ఆ రెండూ వార్తల్లో లేకుండా చేయగలిగారు జగన్. తాను కోరుకున్నది తప్ప మరోటి మీడియాలో ఉండకుండా చేయాలనే పట్టుదలా ప్లాన్ జగన్ సొంతం అనిపిస్తుంది.
చంద్రబాబుతో అసోసియేట్ అయినదేదీ కనిపించడానికి వినిపించడానికి వీల్లేదు. ఆ వాసన తగలడానికి వీల్లేదు. అలాంటి అనుమానమున్న వారుకూడా పాలనలోనూ చుట్టపక్కలా ఉండడానికి వీల్లేదు అన్నట్టు ఉంటుంది పరిపాలన తీరు చూస్తే. గతంలో కూడా ఏదో ఒక మోతాదులో ఉండేదేకానీ దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది ప్రస్తుత ప్రభుత్వం.
మాట తప్పరా, మడమ తిప్పరా!
మాట తప్పరు మడమ తిప్పరు అని వైకాపా వీరాభిమానులు అంటే అంటుండొచ్చు. కానీ ప్రత్యేకహోదానే ఆదీ అంతం- అది లేకపోతే ఇంకేదీ లేదు, అంతా అంధకారమే అన్నట్టు ఎన్నికల్లో దాన్ని బ్రహ్మపదార్థం చేసి అధికారంలోకి వచ్చాక అదంటూ ఒకటుంటదని కూడా మర్చిపోయిన ఘనత కూడా జగన్మోహనుల వారిదే.
ఇపుడు అడిగితే చెపుతున్నారు కేంద్రంలో బిజెపికి సొంత బలముంది, మనం చేయగలిగింది ఏమీ లేదు అని. బలం లేని ప్రభుత్వం ఏర్పడితే మాత్రమే ప్రత్యేక హొదా సాధిస్తాం అని చెప్పలేదే ఆరోజు.
అపుడులేని కొత్తనిబంధన ఇపుడేల. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తే తప్ప చేర్చుకోం అని చెప్పి ఇపుడు ఇంకో పద్ధతిలో అసోసియేట్స్ గా మార్చుకుంటున్న తీరు చూస్తున్నాం.
రాజధాని అమరావతిగా అసెంబ్లీ సాక్షిగా అంగీకరించి ఇపుడు తూచ్ అన్నది కూడా జగన్మోహనులవారే. రివర్స్ టెండరింగ్ పేరుతో ఇన్నిన్ని కోట్లు మిగిల్చామని చెప్పి తెలుగుదేశం వారికి అనువైన కాంట్రాక్టర్లను తప్పించి ఆ ప్లేసులో ఎవరికి కాంట్రాక్టులు దక్కించారో అందరూ చూస్తున్నదే.
చంద్రబాబు హయాంలో నవయుగ కాంట్రాక్టుల్లో సింహభాగం దక్కించుకుంటే ఇపుడే మేఘా దక్కించుకుంటున్నది.
కులము రాజకీయము అల్లుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి విడిగా ఏమీ లేరు. ఆయనా ఆ తానులో ముక్కే. కాబట్టి అభిమానులు, విమర్శకులు వాడే అలంకారాలు అతి విశేషణాలు వదిలేసి పాలనలో మంచిచెడుల గురించి మాట్లాడుకోవడం ఉత్తమం.
మాట తప్పరు, మడమ తిప్పరు లాంటి ఫ్యూడల్ పొగడ్తలైనా, ఫ్యాక్షన్ లీడర్, రాక్షస పాలన లాంటి అతి తీవ్రమైన నిందలైనా రెండూ వాస్తవాన్ని పట్టివ్వవు. అలాంటి విశేషణాలను వదిలేసి పాలనలో ప్రాక్టికల్ అంశాగురించి మట్లాడుకోవడం మంచిది.
పాలనలో ప్రాధామ్యాల ప్రకారం విధానాలను మార్చుకోవడంలో తప్పేమీ లేదు. అంతకుముందు ఏదైనా చెప్పి చేయలేకపోయి ఉంటే బేషజాలకు పోకుండా దాన్ని నేరుగా అంగీకరించడం అవసరం.
రాజకీయాల్లో కులం కంపు విశ్వరూపం
ఆ మాటకొస్తే రాజకీయాల్లో కులం కంపు ఇపుడు పతాక స్థాయికి చేరింది. ఒక్క నాయకుడినో ఒక్క పార్టీనో బాధ్యులని చెప్పలేం కానీ వాతావరణం అయితే ఘోరంగా ఉంది.
అసెంబ్లీలో కొత్త బూతులు కనిపెట్టి మరీ తిట్టుకోవడం చూస్తున్నాం.
సోషల్ మీడియాలో అయితే కులాల విశ్వరూపం ఎన్నడూలేనంత అసహ్యంగా తయారైంది.
కులం కొత్తగా వచ్చిందనికాదు, చాన్నాళ్లుగా ఉన్నదే, కానీ దానికి సాధికారత చేకూర్చి అధికార ముద్ర వేసిన ఘనత మాత్రం వీరిదే.
స్వయంగా ముఖ్యమంత్రే రాజ్యాంగససంస్థల బాధ్యుల కులాన్ని ప్రస్తావించితే ఏం చేస్తాం. సార్, ఏం చేసినా ఎక్స్ ట్రీమే.

ఫొటో సోర్స్, Getty Images
ఏది అభివృద్ధి మోడల్
అమరావతి ప్రాజెక్టును పక్కనబెట్టడం పాలనా పరమైన అవసరమా, లేక రాజకీయంగా తీసుకున్న కక్ష సాధింపు చర్యా అనేదానిమీద బొలెడంత చర్చ నడుస్తోంది.
అయితే ప్రభుత్వ సలహాదారులతో మాట్లాడినపుడు ''మనకు పెద్ద నగరాలు లేవు. భారీనగరాల మోడల్ మనకు సరిపడదు, మనది చిన్న చిన్న నగరాలకు గ్రామాలను అనుసంధానం చేసే మోడల్'' అని కొన్ని యూరోపియన్ దేశాల నమూనా ను చూపిస్తున్నారు.
అది కేవలం అమరావతిమీద తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి చేస్తున్న వాదన మాత్రమేనా, లేక నిజంగానే అలాంటి ప్రత్యామ్నాయ మోడల్ అమలు గురించి పట్టింపు ఉందా అనేది తెలీడం లేదు.
అదే అయితే ఈ పాటికి రాష్టంలో అగ్రిబేస్డ్, ఆక్వాబేస్డ్ ఇండస్ట్రీస్ వెల్లువెత్తి ఉండాలి. అలాంటిది ఇప్పటికైతే అంతగా కనిపించడం లేదు.
ముందు ముందు ఏంచేస్తారో తెలీదు. ఖజానాలో కాసింత డబ్బు చేరగానే ఏదో ఒక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తున్నారు తప్ప దీర్ఘకాలికంగా ఉపాధి కల్పించే అంశాలమీద తగినంత దృష్టి ఉన్నదా అనేది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది.
కారణం ఏదైనా రివర్స్ టెండరింగ్ పేరుతో చేపట్టిన చర్యలు, రాజధానిగా అమరావతి ప్రాజెక్టును అటకెక్కించడం, అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం వంటివి ప్రభుత్వం పారిశ్రామికంగా ప్రభుత్వ విశ్వసనీయతను బోనులో పెట్టాయి.
ప్రభుత్వం అనేది కంటిన్యుయస్ ప్రాసెస్ అనే సూత్రాన్నిఅవి దెబ్బతీశాయి. ఇపుడు ప్రభుత్వంతో ఏదైనా ఒప్పందం కుదుర్చుకుంటే రేపటి ప్రభుత్వం దాన్ని గౌరవిస్తుందని నమ్మకమేంటి అనే అనుమానాల్ని రేకెత్తించాయి.
పోయిన విశ్వాసాన్ని ఎట్లా పునరుద్ధరిస్తారు అనేది యక్షప్రశ్న. దీంతో పాటు కరోనా సంక్షోభం వల్ల ఆదాయాలు పడిపోయిన ప్రస్తుత కాలంలో ఉన్న సంక్షేమ పథకాలను ఎలా కొనసాగిస్తారు దీర్ఘకాలిక పథకాలను ఎలా ముందుకు తీసుకుపోతారు అనేది అర్థంకాకుండా ఉంది.
రాష్ర్టం ఇపుడు క్రాస్ రోడ్స్లో ఉంది. ప్రత్యర్థుల మీద అణిచి వేత చర్యలకు, ప్రతిదాన్నీ రాజకీయ కోణంలోనే చూసే ధోరణికి, కొత్త సంక్షేమ పథకాలకూ కూసింత విరామం ఇచ్చి మొత్తంగా పాలనను దీర్ఘకాలిక దృష్టితో రీవ్యూ చేసుకోవాల్సిన సమయం అయితే ఇదే. ఎందుకంటే కొత్త రాష్ట్రానికి అత్యంత కీలకమైన సంధి దశ ఇది.
ఇవి కూడా చదవండి
- బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక: విశాఖపట్నంలోనే సెక్రటేరియట్, సీఎం, అన్ని హెచ్ఓడీల కార్యాలయాలు
- చంద్రబాబు సాధిస్తారా? జగన్ అస్త్రంగా మలుచుకుంటారా?
- 'అమరావతి'పై పుస్తకాల పాలిటిక్స్!
- చంద్రబాబు: ఏపీకి కేంద్రం ఇచ్చింది.. పావలా.. అర్ధణా!
- ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. హైకోర్టు తీర్పుతో బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ
- ప్రజావేదికపై వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య వివాదం ఎందుకు..
- ప్రత్యేక హోదా అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








