ప్రజావేదికపై వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్య వివాదం ఎందుకు?

చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/tdp.ncbn.official

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. పాలక, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ప్రజా వేదిక కేంద్రంగా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం వివాదానికి కారణం అవుతోంది. ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఇంటిని ఆనుకుని కార్యక్రమాలకు పూనుకోవడంపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సచివాలయం నుంచి ప్రజావేదికకు మారిన సమావేశం

అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఈ నెల 24న కలెక్టర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి వేదికగా తొలుత వెలగపూడిలోని సచివాలయం అనుకున్నారు. సచివాలయం ఐదో బ్లాక్‌లోని సమావేశ మందిరంలో ఈ సమావేశం ఉంటుందని నోటీసులు కూడా పంపించారు.

తాజాగా వేదికను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సమావేశం కరకట్ట మీద ఉన్న ప్రజావేదికలో జరుగుతుందని వెల్లడించింది. ఇది వివాదానికి ఆజ్యం పోసింది.

చంద్రబాబు రాసిన లేక

ఫొటో సోర్స్, Shankar

ఫొటో క్యాప్షన్, ప్రజావేదిక తమకు కేటాయించాలంటూ చంద్రబాబు లేఖ

ప్రజావేదిక కోసం ఈ నెల 4న చంద్రబాబు లేఖ

ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రికి జూన్ 4న రాసిన ఆ లేఖలో తన నివాసానికి ఆనుకుని ఉన్న ప్రజావేదికను ప్రతిపక్ష నేత నివాసంగా కేటాయించాలని కోరారు. సాధారణంగా ప్రతిపక్ష నేతకు ప్రభుత్వం నివాసం కేటాయించాల్సి ఉంటుంది.

గత శాసనసభ కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌కు చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌ను నివాసంగా కేటాయించింది. దానిపట్ల అప్పట్లో జగన్ నిరసన వ్యక్తం చేశారు.

ప్రజావేదిక

ఫొటో సోర్స్, Shankar

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

ప్రజావేదికలోనే గత సమావేశాలు

చంద్రబాబు హయాంలో పలుమార్లు కలెక్టర్లతో సమీక్షలు ప్రజావేదిక కేంద్రంగానే నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవసరాల కోసం నిర్మించిన ఈ భవనం పలు సమావేశాలకు వేదికయ్యింది.

ఇక ప్రభుత్వం మారిన తర్వాత జగన్ నివాసం కేంద్రంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లోనే పలుమార్లు అధికారిక సమావేశాలు జరిగాయి.

చంద్రబాబు నివాసంగా ఉన్న లింగమనేని ఎస్టేట్స్ కూడా కరకట్ట పరిధిలో ఉన్న అక్రమ నివాసం కాబట్టి చర్యలు తప్పవని అధికార పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృషారెడ్డి, ఇతరులు ప్రకటించారు.

చంద్రబాబు నివాసానికి భద్రత ఎలా: టీడీపీ నేతలు

ప్రజావేదిక‌లో ప్రభుత్వ సమావేశాలు నిర్వహిస్తే, దానిని అనుకుని ఉన్న చంద్రబాబు నివాసానికి భద్రత ఎలా అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ- "ప్రభుత్వ తీరుని నిరసిస్తున్నాం. ఇప్పటికీ చంద్రబాబు రాసిన లేఖకు సమాధానం లేదు. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు నివాసంలో నిత్యం టీడీపీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. అలాంటప్పుడు దానిని ఆనుకుని ఉన్న భవనంలో సమావేశాలు అంటే సమంజసం కాదు. మా సామాన్లు కూడా తీసుకోనివ్వకుండానే ప్రజావేదికను స్వాధీనం చేసుకున్నారు" అని ఆరోపించారు.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, fb/AndhraPradeshCM

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే..

సచివాలయంలో కలెక్టర్ల సమావేశానికి స్థలాభావం కారణంగానే వేదిక మార్చినట్టు ప్రభుత్వం చెబుతోంది. తాజా ఉత్తర్వులను అనుసరించి తాము వ్యవహరిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కార్యదర్శి సిసోడియా వెల్లడించారు. ప్రొటోకాల్ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్, గుంటూరు జిల్లా కలెక్టర్‌తో కలిసి ఆయన ప్రజావేదికను పరిశీలించారు. సమావేశం ఏర్పాట్ల కోసం ఆదేశాలు జారీ చేశారు

టీడీపీవి అర్థంలేని ఆరోపణలు: శ్రీకాంత్ రెడ్డి

కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశ వేదికను వివాదాస్పదం చేయడం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

"ప్రజావేదిక ప్రభుత్వ అవసరాలకు నిర్మించారు. ప్రభుత్వ సమావేశం జరుగుతుంది. దానిని రాజకీయం చేయడం సమంజసం కాదు. ఏపీలో అందరికీ రక్షణ ఉంటుంది. ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది. అపోహలతో అనవసరంగా ఆందోళన సరికాదు" అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)