కోర్టులకు వేసవి సెలవులు అవసరమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అనఘా పాఠక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్కూళ్లు, కాలేజీలకే కాదు కోర్టులకూ ఎండాకాలం సెలవులుంటాయి. కోర్టు సెలవుల జాబితా, పనిదినాలు చూస్తే అదృష్టం అంటే అక్కడ పనిచేసే వారిదే అన్న భావన ఎవరికైనా కలుగుతుంది.
2018లో సుప్రీం కోర్టు పనిచేసిన రోజుల సంఖ్య 193. దేశంలోని వివిధ హైకోర్టుల సగటున 210 రోజులు పని చేశాయి. మిగతా న్యాయస్థానాలు 254 రోజుల వరకూ పనిచేశాయి.
జిల్లా, తాలూకా స్థాయి కోర్టుల్లో క్రిమినల్ వ్యవహారాలు చూసేవి సెలవుల సమయంలోనూ పనిచేస్తుంటాయి. అయితే, ఇదివరకటి కేసులకు కొత్త విచారణ తేదీలను ప్రకటించవు. బెయిల్ అభ్యర్థనలు, ఇతరత్రా అవసరమైన అంశాలను మాత్రమే పరిష్కరిస్తాయి.
కోర్టులు మినహా మరే ప్రభుత్వ విభాగాలకూ ఈ స్థాయిలో సెలవులు లేవు. అందుకే, ఈ విషయం ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.
సామాన్యులకు న్యాయం జరగడంలో జాప్యానికి ఈ సెలవులే కారణమన్నది కొందరి అభిప్రాయం.
2018 వరకూ ఉన్న లెక్కల ప్రకారం భారత్‌లోని కోర్టుల్లో 3.3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెలవుల వల్ల ఈ సంఖ్య పెరుగుతూనే పోతుందని నిపుణులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో కోర్టులకు ఇన్ని రోజులు ఎందుకు సెలవులు ఎందుకు ఉండాలన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
'సౌలభ్యం కోసం ఆంగ్లేయులు పెట్టుకున్న పద్ధతి'
బ్రిటిష్ పాలకుల తమ సౌలభ్యం కోసం కోర్టులకు వేసవి సెలవులు పెట్టుకున్నారని కొందరు చెబుతున్నారు.
మహారాష్ట్రకు చెందిన మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి అనేయ్ ఈ సెలవుల విధానాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
''బ్రిటిష్‌వాళ్లు ఈ పద్ధతిని పెట్టుకున్నారు. వేసవి సెలవుల్లో చల్లటి కొండ ప్రాంతాలకో, లండన్‌కో ఆంగ్లేయ జడ్జిలు వెళ్లిపోయేవారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇవే నియమాలు కొనసాగుతున్నాయి. వేరే ఏ దేశంలోనూ కోర్టులకు ఇన్ని రోజులు సెలవులుండవు'' అని ఆయన అన్నారు.
పెండింగ్ కేసులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పరిస్థితుల్లో జడ్జిలు వేసవి సెలవులకు వెళ్లడం సరికాదని న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త అసీమ్ సరోదే అభిప్రాయపడ్డారు.
కోర్టుల్లో ఇచ్చే సెలవులు బ్రిటీష్ పాలనలో భారతీయులు అనుభవించిన బానిసత్వానికి చిహ్నమని ఆయన అన్నారు.
''కోర్టులకు సెలవులు ఉండొద్దని నేనట్లేదు. కానీ, సెలవుల వల్ల వాటి పని పూర్తిగా ఆగిపోకూడదు. దాని స్థానంలో పనిచేసే వ్యవస్థ ఏదో ఒకటి ఉండాలి. మానవహక్కులకు సంబంధించి చాలా కేసుల్లో కొన్ని సార్లు న్యాయ వ్యవస్థ తక్షణం అవసరం ఏర్పడుతుంది. కానీ, కోర్టులు సెలవుల్లో ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణం తమకు న్యాయం ఎందుకు అవసరమో మేం నిరూపించాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం. జడ్జిల సంఖ్య పెరగాలి. అందరూ ఒకేసారి సెలవులపై వెళ్లకూడదు'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
'జడ్జిలు, న్యాయవాదులపై చాలా ఒత్తిడి'
బాంబే హైకోర్టులో న్యాయవాద ప్రాక్టీస్‌లో ఉన్న ప్రవర్తక్ పాఠక్ లాంటి వారు మాత్రం సెలవుల విధానం కొనసాగాలని అంటున్నారు.
జడ్జిలు, న్యాయవాదులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ పనిచేస్తారని, వారికి ఇలా సెలవులు ఉండటం చాలా అవసరం అని ప్రవర్తక్ అభిప్రాయపడ్డారు.
కోర్టులో లేనప్పుడు కూడా జడ్జిలు వేరే తీర్పులు, చట్టాలను అధ్యయనానికి, ఆదేశాలను రచించేందుకు సమయం వెచ్చించాల్సి వస్తుందని ఆయన అన్నారు.
సెలవుల విషయంలో కోర్టులను మిగతా ప్రభుత్వ విభాగాలతో పోల్చడం సరికాదని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పరందామన్ వ్యాఖ్యానించారు.
మిగతా ఉద్యోగాలకు, కోర్టుల్లో పనిచేయడానికి చాలా తేడా ఉందని అన్నారు.
''పెండింగ్ కేసుల సమస్యకు సెలవులు కారణం కాదు. సుప్రీం కోర్టు, హైకోర్టులు ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అసవరం లేకపోవడం. కేసుల జాప్యంపై కింది కోర్టులను హైకోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ, హైకోర్టు, సుప్రీం కోర్టును ఎవరూ అడిగే వీలులేదు. అందుకే కేసులు ఏళ్లకేళ్లు కొనసాగుతున్నాయి'' అని పరందామన్ చెప్పారు.

'న్యాయవ్యవస్థ ఉద్యోగాలు, ఉపాధి కోసం కాదు'
జడ్జిలు, న్యాయవాదులకు కలిపి ఇచ్చే సెలవుల విధానాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని శ్రీహరి అనేయ్ అన్నారు.
''అందరికీ ఒకేసారి సెలవులు ఇచ్చే విధానాన్ని న్యాయవాదులు వ్యతిరేకించడం లేదు. ఎందుకంటే తాము మాత్రమే సెలవులో ఉంటే క్లయింట్లు మరో న్యాయవాదిని వెతుక్కుంటారన్న భయం వారికి ఉంది'' అని వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా ఉన్న సమయంలో శ్రీహరి సెలవుల తగ్గింపు విషయమై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాశారు.
అప్పుడు ఈ విషయంపై అభిప్రాయాలు తెలియజేయాలని కోరుతూ సీజేఐ అన్ని బార్ కౌన్సిళ్లు, అసోసియేషన్లకు నోటీసు పంపారు.
అప్పటి ఛత్తీస్‌గఢ్ అడ్వకటే జనరల్, తాను మినహా అన్ని రాష్ట్రాల అడ్వకటే జనరళ్లు, బార్ కౌన్సిళ్లు, అసోసియేషన్లు సెలవులు ఉండాలనే అభిప్రాయం తెలిపాయని శ్రీహరి వివరించారు.
''జడ్జిలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు, న్యాయవాదులకు ఆదాయం కల్పించేందుకు న్యాయవ్యవస్థ ఏర్పాటు కాలేదు. సామాన్య ప్రజల సమస్యలు పరిష్కరించడం, వారికి న్యాయం అందించడం దాని ప్రధాన ఉద్దేశం. అందరూ దీన్ని విస్మరిస్తున్నారు'' అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సెలవులకు వ్యతిరేకంగా పిటిషన్
సెలవుల విషయంపై 2018లో సుప్రీం కోర్టు న్యాయవాది, బీజేపీ నేత అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ కోర్టును ఆశ్రయించారు.
ఉన్నత స్థాయి న్యాయస్థానాలు ఏటా 225 రోజులు నడవాలని, కనీస దినసరి పనిగంటలు కూడా ఉండాలని అభ్యర్థిస్తూ పిటిషన్ వేశారు.
వేసవి సెలవుల సమయంలోనూ ప్రయోగాత్మకంగా కొన్ని కేసుల విచారణ జరగాలని మాజీ సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకుర్ 2017లో సూచన చేశారు.
పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం జడ్జిల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మాత్రం అన్ని పక్షాలూ అంగీకరిస్తున్నాయి.
సెలవులపై నెపాన్ని నెట్టడానికి బదులుగా, జడ్జిల కొరతను తీర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జస్టిస్ పరందామన్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








