పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీ

ఫొటో సోర్స్, Getty Images
ఆసియాలో అత్యంత బలహీనమైన కరెన్సీ పాకిస్తాన్ రూపాయేనని ప్రముఖ ఆర్థిక సమాచార పోర్టల్ బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.
గతేడాది కాలంలో పాక్ రూపాయి విలువ 20 శాతానికిపైగా పతనమై, ఆసియాలోని 13 ప్రధాన కరెన్సీల్లో అత్యంత బలహీనమైన కరెన్సీగా మారింది.
జంగ్ దినపత్రిక నివేదిక ప్రకారం ఒక్క మే నెలలోనే పాక్ రూపాయి విలువ 29 శాతం పడిపోయింది.
పాక్‌తో పోల్చితే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కరెన్సీలు స్థిరంగా, మెరుగ్గా ఉన్నాయి.
డాలర్‌తో పోల్చుకుంటే భారత రూపాయి మారకం విలువ రూ.70గా ఉంది. అఫ్గానిస్తాన్ కరెన్సీ 79 అఫ్గానీలు, బంగ్లాదేశ్ కరెన్సీ 84 టకాలు, నేపాల్ కరెన్సీ 112 నేపాలీ రూపాయిలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం పాక్ షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. శుక్రవారం ఏకంగా 800 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. గత దశాబ్దన్నర కాలంలో ఇదే అత్యధిక పతనం.
తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ఇంటర్ బ్యాంక్ మార్కెట్‌లో వదంతులు వ్యాపించాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ 149కి పడిపోయింది. బహిరంగ మార్కెట్‌లో ఇది 151కు చేరుకుందని ఎక్స్ఛేంజ్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ పేర్కొంది.
రెండు రోజుల్లోనే పాక్ రూపాయి విలువను 5 శాతం తగ్గించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఆర్థిక సలహాదారుడిగా ఉన్న డాక్టర్ హఫీజ్ షేక్ షేర్ మార్కెట్ అధికారులను కలిసేందుకు గురువారం కరాచీ వచ్చినట్లు డాన్ దినపత్రిక పేర్కొంది.
ఒడిదుడుకులను నియంత్రించేందుకు 'మార్కెట్ సపోర్ట్ ఫండ్'ను ఏర్పాటు చేయాలని షేర్ మార్కెట్ అధికారులు హఫీజ్‌కు విజ్ఞప్తి చేశారని, దీని ఏర్పాటుకు 20 బిలియన్ పాక్ రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు హఫీజ్ పేర్కొన్నారని పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ భేటీ అనంతరం హఫీజ్, మార్కెట్ అధికారులు పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్‌ను కలిశారు.
సపోర్ట్ ఫండ్, ఎక్స్ఛేంజ్ రేటు, వడ్డీ రేటుపై వీరి మధ్య చర్చ జరిగినట్లు డాన్ పత్రిక పేర్కొంది.
నగదు విధానం గురించి సోమవారం ప్రకటన చేస్తామని పాక్ స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. నిజానికి ఈ ప్రకటన ఈ నెలాఖరులో చేయాల్సి ఉంది. తేదీ మార్పునకు బ్యాంకు కారణాలేవీ వెల్లడించలేదు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఒప్పందం వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి పాక్ రూపాయి విలువ పడిపోతూ వస్తోంది.
సమీప భవిష్యత్తులో వచ్చే 6 బిలియన్ల డాలర్ల ప్యాకేజీపై ఒప్పందంలో కరెన్సీ విలువ తగ్గింపు ఓ భాగమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరెన్సీ విలువను రోజూ తగ్గించడం, రాబోయే రోజుల్లోనూ మరింత తగ్గిస్తారన్న వార్తలు వస్తుండటం మార్కెట్‌పై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయని ఆరిఫ్ హబీబ్ రీసెర్చ్ డైరెక్టర్ సైముల్లాహ్ తారీక్ అన్నారు. ఇంతటితో ఇది ఆగాలని అభిప్రాయపడ్డారు.
ఆటో, సిమెంట్, ఫార్మాసూటికల్స్ వంటి రంగాల్లో ముడి పదార్థాల ధరలు పెరగనున్నాయని, ఫలితంగా వినియోగదారులపై భారం పడబోతుందని ఆయన అన్నారు.
ఆర్థిక వ్యవస్థతోపాటు సాధారణ పౌరులపైనా దీని ప్రభావం ఉంటుందని చెప్పారు.
కరెన్సీ విలువ తగ్గింపు తప్పనిసరేనని మరికొందరు నిపుణులు అంటున్నారు.
అయితే, ఒక్కసారిగా దీన్ని చేసేయాలని, సాగదీత మంచిది కాదని అభిఫ్రాయపడుతున్నారు.
''ఒప్పందం ఏదైనా దాన్ని ముందుకు తేవాలి. మొత్తం ఏడాదికి తగ్గట్లుగా కరెన్సీ విలువ తగ్గింపును ఒకేసారి చేసేయాలి'' అని ఓ ప్రముఖ బ్యాంకర్ అన్నారు.
ఇవి కూడా చదవండి
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'
- భారత్, దక్షిణాసియా అమ్మాయిలపై ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు
- 'లైంగిక దాడుల బాధితులను ఆదుకోవడంలో విఫలం' అనే కథనంపై స్పందించిన భారత క్యాథలిక్ చర్చి
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








