పాకిస్తాన్ గగనతలంపై నిషేధంతో భారత విమానాలు ఎలా ప్రయాణిస్తున్నాయి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, తాహిర్ ఇమ్రాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్ము కశ్మీర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనాలపై మిలిటెంట్ దాడి, ఆ తర్వాత భారత వైమానిక దళం బాలాకోట్‌లో ఎయిర్ స్ట్రైక్స్ జరిపి దాదాపు మూడు నెలలు అవుతోంది.
దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగా ఉంది. ఫలితంగా పాకిస్తాన్ తమ గగనతలంలో విమానాల రాకపోకలు నిషేధించింది. దీనివల్ల అంతర్జాతీయ విమానయాన సంస్థలపై తీవ్ర ప్రభావం పడింది.
ఈ ఘటనలు జరిగిన నెల చివరి వారంలో పాకిస్తాన్ తమ గగనతలంపై విమానాలు ఎగరకుండా చేసింది. తర్వాత పాక్షికంగా దాన్ని తొలగించినా భారత్ సరిహద్దులతో ఉన్న గగనతలంలో మాత్రం నిషేధం ఇంకా కొనసాగుతోంది. భారత విమానాలు తమ గగనతలంలో ప్రవేశించడంపై ఉన్న నిషేధాన్ని మే 30 వరకూ పొడిగించాలని పాక్ తాజాగా నిర్ణయించింది.
పాకిస్తాన్ తీసుకున్న ఈ చర్యలతో తూర్పు నుంచి పశ్చిమం, పశ్చిమం నుంచి తూర్పు దిశగా వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో చాలావాటిపై తీవ్ర ప్రభావం పడింది.
దీనివల్ల ఒకవైపు ఎయిర్ లైన్స్ ఖర్చులు పెరగడంతోపాటు విమాన ప్రయాణం సమయం కూడా పెరుగుతోంది. నాన్-స్టాప్ విమానాలు కూడా ఇప్పుడు ఇంధనం నింపుకోడానికి మధ్యలో ఆగాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నిషేధంతో పాకిస్తాన్ పొరుగు దేశాలపై ప్రభావం తీవ్రంగా ఉంది. ఇంతకు ముందు తక్కువ సమయంలో గమ్యం చేరుతూ వచ్చిన విమనాలు ఇప్పుడు చుట్టు తిరిగి సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నాయి. అయితే దీనివల్ల తూర్పుగా, అమెరికా వైపు వెళ్లే విమానాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం పాకిస్తాన్ తూర్పు, భారత్ పశ్చిమ సరిహద్దుల పైనుంచి విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తున్న విమానాలన్నీ ఈ సరిహద్దులకు దూరంగా ప్రయాణిస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకూ దీని గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ మాత్రం తాము ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తున్నామని చెబుతోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ గగనతలంపై ఏ విమానమైనా పశ్చిమ సరిహద్దుల నుంచి తూర్పుకు, లేదా తూర్పు నుంచి పశ్చిమ సరిహద్దులవైపు వెళ్లలేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఉదాహరణకు కాబూల్ నుంచి దిల్లీ వెళ్లే విమానం ఇప్పుడు పాకిస్తాన్ పైనుంచి కాకుండా ఇరాన్ నుంచి అరేబియా సముద్రం మీదుగా దిల్లీ చేరుకోవాల్సి ఉంటుంది.
పాకిస్తాన్ వచ్చే విమానాలు లేదా పాకిస్తాన్ పైనుంచి వెళ్లే చైనా, కొరియా, జపాన్ విమానాలు ఆ దేశ గగనతలం ఉపయోగించుకోవచ్చు. అయితే అవి పశ్చిమ సరిహద్దులకు దూరంగా పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, FLIGHTRADAR24
ఈ నిషేధంతో పాకిస్తాన్‌పై ప్రభావం
ఈ నిషేధంతో పాకిస్తాన్ నుంచి తూర్పు వైపు వెళ్లే ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాకిస్తాన్ నుంచి తూర్పుగా, ఆస్ట్రేలియా వైపు వెళ్లే ప్రయాణికులు తరచూ థాయ్ ఎయిర్ వేస్ విమానాల్లో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు అది తమ విమానాలను ఆపివేసింది.
కౌలాలంపూర్ నుంచి లాహోర్ వెళ్లేందుకు చౌక ధరకే టికెట్లు అందించే మలేసియాలోని ప్రైవేటు విమానయాన కంపెనీ 'మాలిండో ఎయిర్' కూడా తమ విమానాలను నిలిపివేసింది. దాంతో ఈ విమాన సంస్థ నుంచి టికెట్లు తీసుకునే ప్రయాణికులపై ఈ ప్రభావం పడింది.
విమానాలు రద్దు చేసిన ఎయిర్ లైన్స్ సంస్థ ఆ యాత్రికులకు డబ్బు తిరిగివ్వకుండా తమ ఇతర విమానాల్లో ఉపయోగించుకునేలా వోచర్స్ అందించింది. కానీ పాకిస్తాన్‌కు ఆ సంస్థ విమానాలే లేకపోవడంతో అవి పనికిరాకుండా పోయాయి.
హాంకాంగ్ ఎయిర్ లైన్ 'కేథే పసిఫిక్' పాకిస్తాన్‌కు విమానాలు ప్రారంభించే ఏర్పాట్లలో ఉంది. కానీ ప్రస్తుత స్థితితో అది ఇప్పుడు కష్టంగా కనిపిస్తోంది.
పాకిస్తాన్ తూర్పు గగనతలంపై నిషేధం వల్ల ఎయిర్ లైన్స్ కంపెనీలకు, యాత్రికులకే కాకుండా సివిల్ ఏవియేషన్ అథారిటీకి సుమారు 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మొత్తం ఆదాయం 6 వేల కోట్ల నుంచి 7 వేల కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. అందులో 30 నుంచి 35 శాతం ఆదాయం పాక్ గగనతలం ఉపయోగిస్తున్నందుకు వివిధ అంతర్జాతీయ విమానయాన కంపెనీలు చెల్లించే అద్దె రూపంలో వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరెవరిపై ప్రభావం
ఈ నిషేధంతో ప్రభావితమైన దేశాల్లో భారత్ కూడా ఉంది. పశ్చిమ దేశాల నుంచి భారత్ వచ్చే విమానాల టికెట్ ధర, ప్రయాణ సమయం చాలా పెరిగింది.
ఉదాహరణకు చుట్టు తిరిగి వెళ్లడం వల్ల భారత్ నుంచి యూరప్ వెళ్లే విమానాల దూరం 913 కిలోమీటర్లు పెరిగింది. దాంతో మొత్తం ప్రయాణ దూరం దాదాపు 2 గంటలు పెరిగింది.
లండన్ నుంచి దిల్లీ లేదా ముంబయి వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు తమ గమ్యం చేరుకోడానికి సగటున 300 పౌండ్లు (27 వేల రూపాయలు) అదనంగా ఖర్చుపెట్టాల్సి వస్తోంది. లండన్ నుంచి దిల్లీకి చేరడానికి ప్రయాణ సమయం కూడా దాదాపు రెండు గంటలు పెరిగింది.
"మాకు ఒక టికెట్‌పై దాదాపు 200 పౌండ్లు పెరిగింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ప్రయాణ దూరం. దూరం పెరిగిందనే విషయం మాకు ఎవరూ చెప్పలేదు" అని వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్ లైన్స్ విమానంలో లండన్ నుంచి దిల్లీకి ప్రయాణించే ఒక ప్రయాణికుడు బీబీసీతో అన్నారు.
"పాకిస్తాన్ గగనతలంపై నిషేధం ఉండడంతో ప్రయాణ సమయం పెరిగిందని, దానికి ఎయిర్‌లైన్స్ క్షమాపణ కోరుతోందని విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకటించారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతే కాదు, భారత్ పక్కనే ఉన్న అప్గానిస్తాన్‌కు వెళ్లే దూరం కూడా చాలా పెరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అప్గానిస్తాన్ నుంచి భారత్‌కు విమానాలు నడుపుతున్న అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలూ తమ విమానాలు రద్దు చేయడం, లేదా సంఖ్య తగ్గించడం చేశాయి. ఇంతకు ముందు గంటలో పూర్తయ్యే ప్రయాణానికి ఇప్పుడు కనీసం గంటన్నర పట్టడమే దీనికి కారణం. దానివల్ల టికెట్ రేట్లు కూడా పెరిగాయి.
అంతే కాదు నిషేధం ప్రభావం పడ్డ ఎయిర్ లైన్స్‌లో ఆసియా, యూరప్, అమెరికా, తూర్పుగా సుదూర ప్రాంతాలకు విమానాలు నడిపే సింగపూర్ ఎయిర్ లైన్స్, బ్రిటిష్ ఎయిర్ లైన్స్, లుఫ్తాన్సా, థాయ్ ఎయిర్ వేస్, వర్జిన్ అట్లాంటిక్ కూడా ఉన్నాయి.
అంతర్జాతీయ విమానాల ఆపరేషన్లను గమనించే ఓపీఎస్ గ్రూప్ ఇంటర్నేషనల్, సివిల్ ఏవియేషన్ సంస్థల ద్వారా అందిన డేటాను బట్టి ఈ నిషేధం వల్ల రోజుకు కనీసం 350 విమానాలపై ప్రభావం పడుతోందని అంచనా వేసింది.
ఉదాహరణకు లండన్ నుంచి సింగపూర్ వెళ్లే విమానం ఇప్పుడు రూట్ మార్చుకోవడం వల్ల 451 కిలోమీటర్ల దూరం పెరిగింది. అటు ప్యారిస్ నుంచి బ్యాంకాక్ వెళ్లే విమానాలు 410 కిలోమీటర్లు ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తోంది. కేఎల్ఎం, లుఫ్తాన్సా, థాయ్ ఎయిర్ వేస్ విమానాలు ఇంతకు ముందు కంటే కనీసం రెండు గంటలు ఎక్కువ ప్రయాణిస్తున్నాయి.
ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి ఎయిర్ లైన్స్ కంపెనీలు.. ఎక్కువ దూరం ఎగిరేలా, వీలైనంత ఇంధనం తీసుకెళ్లగలిగేలా విమానాల బరువులో కఠిన నియమాలు అమలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- లోక్-సభ ఎన్నికలు 2019- 'మోదీ భారత్'లో హామీలు నెరవేరాయా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ప్రధాని రేసులో చంద్రబాబు, కేసీఆర్: చరిత్ర పునరావృతం అవుతుందా?
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ఎందుకు విధించింది? వాటి ప్రభావం ఎలా ఉంటుంది?
- ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది
- ఆసియా బీబీ: దైవదూషణ కేసులో మరణశిక్ష తప్పించుకుని పాకిస్తాన్ వదిలివెళ్లిన క్రిస్టియన్
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- ఒసామా బిన్ లాడెన్ సాయంతో జైష్-ఎ-మొహమ్మద్ ఎలా ఏర్పాటైంది?
- గోరక్షకుడికి వివేకానందుడి ప్రశ్నలు: గోరక్షణ కోసం భిక్షకు వచ్చినపుడు వివేకానందుడు ఏమన్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








