కెనడాలో బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు

నెమళ్ల బెడద

నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు.

కానీ అలాంటి నెమళ్లు పదుల సంఖ్యలో మీ ఊరిపై పడి, మీ ఇంటి చుట్టూ చేరి గోల చేస్తుంటే మాత్రం చికాగ్గా ఉంటుంది.

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ప్రజలు ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.

వీడియో క్యాప్షన్, కెనడాలో బ్రిటిష్ కొలంబియాకు నెమళ్ల బెడద

మనకు కోతుల బెడదలా వీళ్లకు ఎక్కడ చూసినా నెమళ్లే కనిపిస్తుండడంతో వీటిని ఎలా వదిలించుకోవాలా అని స్థానికులు సతమతం అవుతున్నారు.

నెమళ్ల గుంపుల పెంట నుంచి వచ్చే దుర్గంధం స్థానికులను ఇబ్బంది పెడుతోంది.

గత పదేళ్ల నుంచి ఎగువన ఉండే సల్లీవాన్ ప్రాంతానికి నెమళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు.

నెమళ్ల బెడద

గ్యారేజీలే నెమళ్లను పట్టే బోను

జాటిండర్ షెర్గిల్ అనే స్థానికుడు 'ఇక రెండు మూడు వారాల్లో ఇక్కడంతా ఇళ్ల చుట్టూ నెమళ్ల గుడ్లు కనిపిస్తాయి. ప్రతి ఏడాదీ ఈ సమయంలో ఇలా జరుగుతుంటుంది" అన్నారు.

ఒక్కోసారి వందకు పైగా నెమళ్లు ఒకే చోట కనిపిస్తాయని కూడా వారు చెబుతున్నారు. వసంత కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.

నెమళ్లను పట్టుకుని తిరిగి అడవుల్లో వదిలేయాలని నగర కౌన్సిల్ గత ఏడాది నిర్ణయించింది. వాటిని పట్టుకోడానికి స్థానికుల సాయం తీసుకుంది.

"నెమళ్లను పట్టుకునేందుకు కొంత మంది వాళ్ల కారు గ్యారేజీలు ఇచ్చారు. ఏదైనా ఆహారం ఆ గ్యారేజిలో పెట్టాలి. వాటిని తినడానికి నెమళ్లు లోపలికి రాగానే తలుపులు మూసేస్తారు" అని స్థానికురాలు మరోసెవిచ్ చెప్పారు.

అయితే చాలా నెమళ్లు తప్పించుకుంటున్నాయి. దీంతో కొంతమంది నెమళ్లు పట్టుకునే ఈ పద్ధతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొందరు నెమళ్ల ఆగడాలను భరించలేమని చెబుతుంటే మరికొందరు మాత్రం వాటిని పెంపుడు పక్షుల్లా చూస్తున్నారు.

మొత్తానికి వీటిని ఏం చేయాలన్న దానిపై ప్రజల్లో ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఈ నెమళ్లు కులాసాగా కూతలు వేసుకుంటూ చుట్టుపక్కల విహరిస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)