కాల్పుల మోతలకు అలవాటు పడ్డ శ్రీనగర్ వాసులు సైతం ఆ ఫిబ్రవరి చలికాలపు రాత్రి ఫైటర్ జెట్ల మోతకు ఉలిక్కిపడి నిద్ర లేచారు. చిక్కటి నీలాకాశంలో గిరికీలు కొడుతూ కనిపించాయవి.
ఇంకేముంది... యుద్ధం వచ్చేసినట్లే అనుకున్నారందరూ.
కశ్మీర్లోని జనమంతా హడావిడిగా ఆహార పదార్థాలను జాగ్రత్త చేసుకోవడం మొదలుపెట్టారు. డాక్టర్లు మందులు నిల్వచేసుకోవడం మొదలుపెట్టారు. పెట్రోల్ బంకులు ఖాళీ అయిపోసాగాయి. భయం, ఆందోళనలతో ఇంటి వెనక బంకర్లు తవ్వుకోవడం గురించి ఆలోచించసాగారు. అనవసరంగా ఎయిర్ పోర్టు దగ్గర ఇల్లు కొనుక్కున్నానని ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు వాపోయారు కూడా.
కొద్ది రోజులు గడవకముందే ఇండియన్ మిరాజ్ 2000 యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలోనికి చొచ్చుకుని వెళ్ళాయి.

భారత్‌కు చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమాన విన్యాసాలు
లేజర్ నియంత్రిత బాంబులు అమర్చిన భారత జెట్ విమానాలను ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రాంతంలోని బాలాకోట్ వద్ద గల ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ధ్వంసం చేయడానికి ప్రయోగించినట్టు భారత్ చెప్పింది.
1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్‌పై భారత్ వైమానిక దాడులు చేయడం ఇదే మొదటిసారి.
అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇరుగు పొరుగు దేశాలు ఇలాంటి విషయాల్లో బహుజాగ్రత్తగా వ్యవహరించాలని కదా సంప్రదాయ రాజనీతి చెపుతోంది!
కాని భారత ప్రధాని నరేంద్ర మోదీ దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
కశ్మీర్‌లో భద్రతా దళాలపై జరిగిన ప్రాణాంతక దాడికి తగు రీతిలో, దవడలు పగల కొట్టే లాంటి జవాబు ఇచ్చేందుకే ఈ దాడులకు ఆదేశించినట్టు 68 ఏళ్ళ ఈ నాయకుడు తన సహజ సిద్ధ ఆర్భాటశైలిలో ప్రకటించారు. సైన్యానికి ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చినట్టు కూడా ఆయన ప్రజలకు తెలిపారు.
ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన “దేశ ప్రజల రక్తం మరుగుతోంది” అని, మరో సమావేశంలో “మీలో రగులుతున్న ఆవేశమే నాలోనూ రగులుతోంది” అనీ వ్యాఖ్యానించారు.
ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య స్పర్థలకు కశ్మీర్ సుదీర్ఘ కాలంగా యుద్ధభూమిగా ఉంది.
అత్యంత సుందరమైన ఈ ముస్లిం మెజారిటీ ప్రాంతాన్ని ఇరు దేశాలూ తమవిగానే ప్రకటించుకుంటాయి. కానీ వాస్తవానికి అందులోని కొన్ని భాగాలే వారి అధీనంలో ఉన్నాయి. వాటిని అవతలి వాళ్ళు లాక్కుంటారనే భయం ఇద్దరిలోనూ ఉంది. ఇప్పటికే కశ్మీర్ కోసం వారి మధ్య రెండు యుద్ధాలు జరిగాయి, మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడింది.


తాజా ‘ఉద్రిక్తత’ ఇండియాకు చాలా నష్టమే చేసింది. ఫిబ్రవరి 14న పేలుడు పదార్థాలతో నిండిన ఒక మినీ వ్యాన్ భారత భద్రతా దళాలను తీసుకువెళుతున్న78 బస్సుల కాన్వాయ్ పైకి దూసుకొచ్చింది. అదీ గట్టి బందోబస్తు ఉన్న రహదారి మీద, శ్రీనగర్‌కు 12 మైళ్ళ దూరంలో.
ఈ దాడిలో 46 మంది జవాన్లు చనిపోయారు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా ఘర్షణ వాతావరణం ఉన్నా ఇంత ప్రాణాంతకమైన దాడి జరగడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ దాడి చేసింది తామేనని పాకిస్తాన్ వేదికగా పనిచేసే ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ వెంటనే ప్రకటించింది.

ఫిబ్రవరి 2019: 46మంది జవాన్ల మృతికి కారణమైన పుల్వామా దాడి
దీనిపై మోదీ స్పందన వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఆయన పార్టీ బీజేపీ మొదటి నుంచి ‘జాతీయవాదం, జాతీయ ఐక్యత’ లను తమ ‘పరమోన్నత విలువలు’గా ప్రకటించుకుంటూ వస్తోంది. మోదీ తన వీర జాతీయవాదంతో ఈ భావనను మరింత ధృడపరిచారు.
బాలాకోట్ దాడి ద్వారా మోదీ తన మాట నిలబెట్టుకుని పాకిస్తాన్‌ను ‘చావుదెబ్బ’ కొట్టారనే ఆయన మద్దతుదారుల నమ్ముతున్నారు.
బాలాకోట్ వైమానిక దాడులు జరిగిన 24గంటల్లోపే పాకిస్తాన్ తన అధీనంలోని కశ్మీర్‌లో ఒక భారత యుద్ధ విమానాన్ని కూల్చి, పైలట్‌ను బందీగా పట్టుకుంది. అయితే ఉద్రిక్తతల నివారణకు చర్యలు తీసుకోవాలంటూ ఇరు దేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగడంతో భారత పైలట్‌ను వదిలి పెడతామని పాకిస్తాన్ ప్రకటించింది. చెప్పినట్టుగానే భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను తర్వాత రోజు భారత్‌కు అప్పగించింది.

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విడుదలను
టీవీలో చూస్తున్న ఓ వ్యక్తి
మోదీ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు.
“దేశం ఇప్పుడు సురక్షిత హస్తాల్లో ఉంది” అని ప్రకటించారు.
ఇది మోదీకి ఎన్నో విధాలుగా విజయమే అనుకోవచ్చు.
రాష్ట్రాల ఎన్నికల్లో వరస పరాజయాల తర్వాత తగ్గిన రేటింగ్స్ మళ్ళీ పుంజుకున్నాయి.
మోదీ నాయకత్వంలో హిందూ జాతీయవాద బీజేపీ 2014లో అపూర్వమైన విజయం సాధించింది. 1984 తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి.

2014 సాధారణ ఎన్నికల ఫలితాలు
అంత ఘనవిజయం సాధించినా.. మోదీ పని తీరుపై ఇప్పుడు ప్రజాభిప్రాయం మిశ్రమంగానే ఉంది.
కొంత మంచి జరిగింది. ఎన్నో రోడ్లు, గ్రామీణాభివృద్ధి పనులు, పేదలకు చవకగా వంట గ్యాస్, పల్లెల్లో మరుగుదొడ్లు, ఒకే రకమైన అమ్మకపు పన్ను, దాదాపు 50కోట్ల మందికి మేలు చేయగల ఆరోగ్య బీమా పథకం, కొత్త దివాళా చట్టం వంటివి.
కానీ ఆర్థికాభివృద్ధి మందకొడిగా సాగుతోంది. అత్యధిక జనాభాకు జీవనాధారమైన వ్యవసాయ రంగంలో సంక్షోభం తీవ్రంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. పెద్ద నోట్ల రద్దు వివాదాస్పదమై పేదలకు పెనుభారంగా పరిణమించింది.
సామాజికంగా చూస్తే బీజేపీ అనుసరిస్తున్న తీవ్ర జాతీయవాద విధానాలు దేశాన్ని రెండు శిబిరాలుగా చీల్చివేసి మైనారిటీలను అభద్రతలోకి నెట్టివేశాయి. చవకగా లభిస్తున్న మొబైల్ డేటా, సెల్ ఫోన్ల కారణంగా ఇప్పుడు దేశం అసత్య వార్తల గుప్పిట్లో ఉంది. వీటన్నిటినీ విమర్శించిన కొందరిని జాతీయవాద వ్యతిరేకులుగా ముద్ర వేసి జైళ్లలో పడేశారు.
ఇప్పుడు మోదీ మరో కీలక సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు.
ఈ ఎన్నికలు కొన్ని విషయాల్లో మోదీ పాలనపై రెఫరెండం అనే అనుకోవాలి. ఆయన దేశాన్నే తన ‘ఇమేజ్’లోకి ఇమడ్చాలని చూస్తున్నట్టు చాలామంది భావిస్తున్నారు. ఆయన ఇమేజ్ ఏంటంటే – బలమైన జాతీయవాదం, సామాజిక సంప్రదాయవాదం, బాహాటంగా దేశభక్తి ప్రదర్శన.


ఈ ఏప్రిల్-మే నెలల్లో 40 రోజులకు పైగా సాగే ఎన్నికల ప్రక్రియలో 90 కోట్ల మంది భారతీయులు 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇంత భారీ, సుదీర్ఘ, బహుశా అత్యంత ఖరీదైన ఎన్నికలు ఇంతకు ముందెక్కడా జరిగి ఉండకపోవచ్చు.
"ఏ పార్టీపైనా భారీ అంచనాలు లేని భారీ ఎన్నికలు ఇవి" అని భారత్‌కు చెందిన ప్రముఖ విశ్లేషకుడు ప్రతాప్ భాను మెహతా అభిప్రాయపడ్డారు.
మరైతే ఈ ఎన్నికలను కొందరు అంటున్నట్టు “భారతీయ ఆత్మ కోసం జరిగే యుద్ధం” అనుకోవాలా?
గుజరాత్ లోని వడోదరా (బరోడా)లో ఎండల తీవ్రతకు సెగలు కక్కుతున్న వీధుల్లో సాగుతోంది రంజన్‌బెన్ ధనంజయ్ భట్ ఎన్నికల ప్రచారం.
56 ఏళ్ళ భట్ బీజేపీ అభ్యర్ధిగా వడోదరా నుంచి పోటీ చేస్తున్నారు.
ఆమె తళతళా మెరుస్తున్న ఒక నల్లటి జీపు మీద చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నారు.
రోడ్డు మీద గుంపులు గుంపులుగా నిలబడి ఉన్న ఆడ, మగ, పిల్లలు ఆమెకు స్వాగతం చెబుతున్నారు. బంతి పూలు చల్లుతున్నారు. ఆమె విజయం కోసం ప్రార్ధనలు చేస్తున్నారు. తమ ఇళ్ళల్లో చేసిన స్వీట్లు, పళ్ల రసాలు ఆమెకు ఇస్తున్నారు. ఆమె చూపిస్తున్న విజయ చిహ్నాన్నే వరండాల్లో, ఇళ్ళ పైకప్పుల మీద నిలబడి తిరిగి ఆమెకు చూపిస్తున్నారు.
వీధులన్నీ బీజేపీ జెండా రంగైన కాషాయంతో నిండిపోయి ఉన్నాయి. కాషాయం తలపాగాలు, ఉత్తరీయాలు, టోపీలు, రుమాళ్ళు ధరించిన కార్యకర్తలు మోటారు సైకిళ్ళ మీద ఊరేగింపుకు నాయకత్వం వహిస్తున్నారు. ఒక ట్రక్కులో కూర్చుని సంగీతం జోరుగా వినిపిస్తున్నాడు డీజే. మధ్య మధ్యలో బాణసంచా పేలుళ్లు.
ఈ వర్ణ శబ్దమయ ఉత్సవంలో ఒక పేరు పదే పదే జపం చేస్తున్నట్టుగా వినిపిస్తోంది.
అది ‘మోదీ, మోదీ, మోదీ’. పార్టీ యువ కార్యకర్తల గొంతులోంచి ఆ పేరు బిగ్గరగా ముక్తకంఠంతో వెలువడుతోంది.

అదే క్రమంగా బీజేపీ 2019 ఎన్నికల ప్రచార నినాదమైన ‘మోదీ హై తో ముంకిన్ హై ’ (మోదీ సాధ్యం చేశారు) నినాదంగా మారుమోగుతోంది.
టీ షర్టుల మీద, టోపీల మీద, కారు స్టిక్కర్ల మీద, హోర్డింగుల మీద ఎక్కడ చూసినా మోదీ ముఖమే కనిపిస్తోంది. ఆయన అక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా ఎక్కడ చూసినా ఆయన చిత్రాలే కనిపిస్తున్నాయి. ప్రచారానికి ఆయన రాగలరో లేదోననే సందేహం కార్యకర్తల్లో ఉంది.
“ఈసారి మోదీ ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు. కానీ ఆయన అన్ని చోట్లా ఉంటారు. నాకు ఓటు వేయడమంటే ఆయనకు కూడా వేసినట్టే” అని భట్ చెపుతున్నారు.
2014లో ఆయన వడోదరా నుంచి 5,70,128 వోట్ల భారీ మెజారిటీతో గెలుపొందినా వారణాసి సీటు ఉంచుకుని దీనికి రాజీనామా చేశారు. (భారత్‌లో అభ్యర్ధులకు ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసి, గెలిచాక ఏదో ఒక దానిని ఉంచుకుని, మిగతా వాటికి రాజీనామా చేసే సౌలభ్యముంది.)
ఫలితంగా జరిగిన ఉపఎన్నికలో భట్ పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఆ నగరానికి ఒకప్పుడు మునిసిపల్ కౌన్సిలర్‌గాను, డిప్యూటీ మేయర్‌గాను పని చేశారు.

రంజన్‌బెన్ ధనంజయ్ భట్ బీజేపీ తరఫున వడోదరా నుంచి పోటీ చేస్తున్నారు.
ఇప్పుడు ఆమె రెండోసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ కంచుకోట అయిన గుజరాత్‌లో దీన్ని పోటీ అనడానికే లేదు. బీజేపీ 1996 నుంచి గుజరాత్‌లో అధికారంలో ఉండడంతో అక్కడ రానురాను ప్రతిపక్షమనేదే కనబడకుండా పోయింది.
“నేను గెలుపు గురించి ఆలోచించడం లేదు, ఎంత మెజారిటీతో గెలుస్తాననేదే ముఖ్యం. కనీసం 6 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచి గుజరాత్‌లో కొత్త రికార్డు నెలకొల్పాలనేదే నా లక్ష్యం” అన్నారామె.
“మేం ఇక్కడ చేసేవన్నీ నరేంద్ర భాయికే అంకితం. ఇక్కడ వచ్చే ఓట్లన్నీ ఆయనవే. గుజరాత్ ఆయన స్వస్థలమైతే వడోదరా ఆయన కార్యస్థలం.”

మోదీ ఎంతో పేరున్న రాజకీయ నాయకుడైనా ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ కావడం ఆశ్చర్యం అనిపిస్తుంది.
మోదీ స్వస్థలం వడోదరాకు 200 కి.మీ. దూరంలో ఉన్న వడ్‌నగర్. తండ్రి చిన్న టీ కొట్టు యజమాని.
అయితే కుటుంబంతో గాని, స్నేహితులతో గాని ఆయనకు ఎప్పుడూ ప్రత్యేక అనుబంధం లేదని ఆయన జీవిత చరిత్ర రచయిత అంటారు. యువకుడిగా ఉన్నప్పుడే ఆయన తన ఊరును ‘పూర్తిగా వదిలేసి’ వెళ్లిపోయారని ఆయన రాశారు.
చిన్న వయస్సులోనే ఆయనకు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగిందనేది 2014 ఎన్నికల వరకు ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన తన ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నప్పుడే ఆ విషయం అందరికీ తెలిసింది. భార్య జశోదాబెన్‌తో ఆయన కలిసి జీవించింది మూడేళ్ళు మాత్రమే.
బీజేపీ మాతృ సంస్థగా అందరూ భావించే ఆర్ఎస్ఎస్‌లో మోదీ చాలా చిన్న వయసులోనే చేరి పూర్తి స్థాయి కార్యకర్తగా పని చేయడం ప్రారంభించారు.

భోపాల్‌లో 2015లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పరేడ్
1925లో ఏర్పడ్డ ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత్‌లోని మెజారిటీ మతస్థులైన హిందువుల ఐక్యత, రక్షణల కోసం పని చేస్తుంది. అది తనను తాను మౌలికంగా రాజకీయ సంస్థ అనుకోదని, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణే తన ధ్యేయంగా చెప్పుకుంటుందని ఒక అధ్యయనం పేర్కొంది.
అయితే బ్రిటిష్ కాలం నుంచీ అది హిందూ జాతీయవాదానికి చిరునామాగానే ఉంది. 1948లో మహాత్మా గాంధీని హత్య చేసింది ఈ సంస్థకు చెందిన ఓ మాజీ సభ్యుడే.
ప్రస్తుతం ఈ సంస్థకు 6000మంది దాకా పూర్తి స్థాయి కార్యకర్తలున్నారు. దాదాపు 20 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్న వారి 80,000 శాఖల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఈ ఆర్ఎస్ఎస్‌కు రాజకీయ అనుబంధ సంస్థే బీజేపీ. అది హిందుత్వను నమ్ముతుంది.అంటే హిందువుల ఆధిపత్యాన్ని, హిందువుల జీవన విధానాన్ని ఉన్నతంగా భావించే సిద్ధాంతాన్నినమ్ముతుంది.
ఆర్ఎస్ఎస్‌లో ఉన్న తొలిరోజుల్లో మోదీ వడోదరాలో ఎక్కువ కాలం పని చేశారని, ఆర్ఎస్ఎస్‌కే చెందిన ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్‌లో మరికొంత మందితో కలిసి ఉండేవారని బీజేపీ కార్యకర్తలు చెపుతారు. “ఆయన కొన్నిసార్లు బైక్ మీద తిరుగుతూ కార్యకర్తలను కలుస్తుండేవారు. ఆయనకు ఈ ఊరిలో ప్రతి వీధీ తెలుసు. ఇప్పటికీ ఆయనకు ఈ నగరంలో స్నేహితులు ఉన్నారు” అని పార్టీ అధికారి ఒకరు చెప్పారు.
ఆయన దిల్లీ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన 13 ఏళ్ళలో సమర్థుడిగా, వ్యాపారవర్గాలకు అనుకూల నాయకుడిగా పేరుపొందారు.
గుజరాత్‌ను ఆర్థికంగా పరిపుష్టం చేసిన ఘనతను పొందారు. అయితే మోదీనామిక్స్‌గా పేరుపొందిన ఆయన విధానాలను చాలామంది ఆర్థికవేత్తలు తప్పుబడతారు.
2002లో గుజరాత్‌లో వెయ్యిమందికి పైగా - వారిలో అత్యధికులు ముస్లింలు - మరణానికి కారణమైన మత ఘర్షణలను ఆపడానికి ఆయన తగిన ప్రయత్నాలు చేయలేదన్న ఆరోపణ కూడా ఆయన మీద ఉంది. ఈ హింసకు కారణం 60 మంది హిందూ కరసేవకుల మరణానికి దారి తీసిన గోధ్రా సంఘటన. ఆ రోజు గోధ్రాలో రైలు బోగీకి ముస్లింలే నిప్పు పెట్టారనే ఆరోపణలే దీనికి కారణం.

2002లో గుజరాత్‌లో జరిగిన ఘర్షణల్లో 1000 మందికిపైగా మరణించారు.
2013లో మోదీని తమ నాయకుడిగా బీజేపీ ప్రకటించింది. సంవత్సరం తర్వాత ఆయన దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు.
మోదీ అభిమానులు ఆయనను కష్టజీవి అని, మైనారిటీలను బుజ్జగించడం లాంటి పనులు ఆయనకు నచ్చవని చెబుతారు. ఇక్కడ మైనారిటీలంటే వాళ్ళ ఉద్దేశం 17 కోట్ల మంది ముస్లింలే.
ఈ దేశాన్ని అర్ధ శతాబ్దం పాటు పరిపాలించిన నెహ్రూ-గాంధీ వంశస్తులతో పోల్చి చూస్తే మోదీ గొప్పతనం అర్ధమవుతుందని, ఆయన పేద కుటుంబం నుంచి స్వయంకృషితో పైకి వచ్చిన నాయకుడని వాళ్ళు సగర్వంగా చెప్తారు.

నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఇటీవలే రాజకీయాల్లోకి
ప్రవేశించిన మరో వ్యక్తి ప్రియాంక గాంధీ
“ఇక్కడ బీజేపీ కంటే మోదీకే ఎక్కువ పేరుంది. ఆయన చాలా శక్తిమంతమైన నాయకుడు. గుజరాత్‌లో అత్యంత విజయవంతమైన ముఖ్యమంత్రి. ఇప్పుడు భారత్‌లోనే అతి పెద్ద నాయకుడు. గుజరాతీలు గర్వపడే వ్యక్తి” అని బీజేపీ సీనియర్ నాయకుడొకరు అన్నారు.
వడోదరాలోని ఎంఎస్ యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ అమిత్ ధోలాకియా ప్రకారం, "హిందుత్వ రాజకీయాల విషయంలో గుజరాత్‌కు చాలా సుదీర్ఘ చరిత్రే ఉంది. మోదీ అధికారంలోకి రావడానికి కూడా అదే దోహదపడింది". ఆయన ఇంకా ఏమంటారంటే –
“హిందువుల్లో ఉన్న విభజనల కారణంగా రాజకీయ హిందుత్వకు అనేక పరిమితులున్నాయని మోదీకి తెలుసు. గుజరాత్‌లో సైతం బీజేపీకి 48 శాతానికి మించి ఎప్పుడూ ఓట్లు రాలేదు. అందుకే ఆయన ఇప్పుడు జాతీయవాదం, అభివృద్ధి గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. ప్రచారంలో ఖాళీలను నింపడానికి మాత్రమే హిందుత్వనువాడుకుంటున్నారు.
మోదీ సిద్ధాంతవేత్త కాదు.ప్రయోజనవాది. ఆయన అధికారాన్ని ప్రేమిస్తారు. ఇక్కడి ప్రజలు ఆయన్ను ప్రేమిస్తారు.”
కోల్‌కతాలో 2016 నవంబర్‌లో ఒక సాయంత్రం పూట అంబరీష్ నాగ్ బిశ్వాస్ అనే వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా ఆయన జేబులో ఉన్న మొబైల్ మోగింది.
అవతల ఆయన స్నేహితుడు చాలా ఆందోళనగా మాట్లాడుతున్నారు.
“నరేంద్ర మోదీ టీవీలో మాట్లాడుతున్నారు. ఆయన మన డబ్బంతా తీసేసుకుంటున్నారు” గట్టిగా అరుస్తూ చెప్పారు.
“ఏం మాట్లాడుతున్నావు?” బిశ్వాస్ అయోమయంగా అడిగారు.
వెంటనే ఆయన కొంచెం కుదుటపడి అసలు విషయం వివరించి చెప్పారు.

“ప్రధాన మంత్రి మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకో నాలుగు గంటల్లో 1000, 500 రూపాయల నోట్లను చలామణీలో నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.”
నగదు ప్రధానంగా నడిచే భారత ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీలో 80 శాతం ఈ రెండు నోట్లే ఉంటాయి.
కోట్లాది రూపాయల నల్ల ధనాన్ని వెలికి తీయడానికే ఈ చర్య చేపట్టినట్టు మోదీ పేర్కొన్నారు. పాత నోట్లు బ్యాంకులో ఇస్తేనే కొత్త నోట్లు లభిస్తాయి కాబట్టి నల్ల ధనాన్ని ఆ రకంగా రూపుమాపొచ్చని ఆయన ఉద్దేశం.
నకిలీ కరెన్సీని రూపుమాపడానికి, నగదు స్థానంలో డిజిటల్ లావాదేవీలను తీసుకురావడానికి కూడా ఈ చర్య దోహదం చేస్తుందని ప్రభుత్వ భావన. నగదుపై ఆధారపడని ఆర్థిక వ్యవస్థను సాధించాలనే కోరిక గత ప్రభుత్వాలకు కూడా ఉండేది. (ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం భారత జీడీపీలో ‘షాడో ఎకానమీ’ ఐదో వంతు ఉంటుంది.)
ఆ రాత్రి బిశ్వాస్ కు నిద్ర పట్టలేదు.

అంబరీష్ నాగ్ బిశ్వాస్
ఒక డైరీ ఫార్మ్‌లో పని చేసే ఈ 48 ఏళ్ళ ఉద్యోగి అత్యవసర ఖర్చుల నిమిత్తం ఇంట్లో 24,000 రూపాయలు ఉంచుకున్నారు.
తర్వాత రోజు బ్యాంకుకు వెళ్లి ఆ డబ్బు డిపాజిట్ చేసి కొత్త నోట్లు తెచ్చుకోవాలి. ఆయన భార్య రింకు గృహిణి. కూతురు సబోర్ని హైస్కూల్ విద్యార్ధి.
ఉదయం బిశ్వాస్ బ్యాంకుకు వెళ్లేసరికి బ్యాంకు ఇంకా తెరవలేదు. కానీ అప్పటికే అక్కడ పెద్ద గుంపు ఉంది. ఎవరికీ ఆ పాత నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియదు.
బిశ్వాస్ రోజంతా క్యూలో నిలబడ్డా ఫలితం లేకపోయింది. మర్నాడు తనకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న మరో బ్యాంకుకు వెళ్లి చూశారు, కానీ అక్కడి క్యూ ఇంకా పొడుగ్గా ఉంది.


తిరిగి మొదటి బ్యాంకు దగ్గరికి వచ్చారు. ఉన్నట్టుండి ఏదో గందరగోళం వినిపించింది.
దగ్గరకు వెళ్లి చూస్తే ఒక పెద్దాయన కింద పడిపోయి ఉన్నారు. బ్యాంక్ పత్రాలు, దాచుకున్న డబ్బు ఒక ప్లాస్టిక్ కవరులో పట్టుకుని కర్ర సాయంతో అప్పటిదాకా నిలబడి ఉన్న ఆయన గంటల కొద్దీ ఎండలో నిలబడి ఉండడం వల్ల అలిసిపోయి పడిపోయారు.
బిశ్వాస్ ఒక కారును ఆపి, ఆ వృద్ధుడ్ని ఎత్తుకెళ్ళి పడుకోబెట్టి హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు. రెండు గంటలైనా ఆ పెద్దాయన స్పృహలోకి రాలేదు.
“క్యూలో నిలబడాల్సి రావడం వల్ల అప్పటికే రెండు రోజులు ఉద్యోగానికి వెళ్ళలేదు. కానీ, పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లూ తెచ్చుకోలేకపోయాను.”
యజమానికి ఫోన్ చేసి ఆ రోజూ రాలేనని చెప్పారు బిశ్వాస్.
తిండీ నీళ్ళూ లేకుండా మరో 8 గంటలు క్యూలో నిలబడ్డాక పాత నోట్లయితే డిపాజిట్ చేయగలిగారు కానీ కొత్త నోట్లలో 2000కి సమానమైన కరెన్సీ మాత్రమే తెచ్చుకోగలిగారు. కారణం బ్యాంకుల్లో నగదు చాలా వేగంగా అయిపోతోంది.
“చాలా విచిత్రంగా అనిపించింది. ఆ క్యూల్లో మాలాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. సంపన్నులు, పలుకుబడి గల వాళ్ళ దగ్గర కదా కట్టలు కట్టలు డబ్బు ఉంటుందని అనుకునేది!” అని బిశ్వాస్ అనుకున్నారు.

మోదీ తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టింది.
దేశంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో బ్యాంకుల దగ్గర జనమే జనం. వారంతా భయాందోళనలతో పాత నోట్లు పట్టుకుని కొత్త నోట్ల కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నారు.
ఏటీఎంలు పని చేయడం మానేశాయి. ఓవైపు నల్ల ధనాన్ని సంచుల కొద్దీ తగలబెడుతున్నారని కథనాలు; మరోవైపు వైద్యం కోసం, అంత్యక్రియల కోసం కూడా డబ్బులు లేక జనం అల్లాడిపోతున్నారని వార్తలు.
దిల్లీలో ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలు విలువ చేసే పాత నోట్లతో ఒక మొబైల్ స్టోర్‌కి వెళ్లి స్టోర్‌లో ఉన్న మొత్తం ఐఫోన్లు కొనేస్తానని చెప్పినట్టు ఒక కథనం.
బిహార్‌లో ఒక రాజకీయవేత్త పాత నోట్లతో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలు కొన్నారని, మరో చోట ఒక డెంగీ రోగి చిల్లర నాణాల రూపంలో హాస్పిటల్ బిల్లు చెల్లించాల్సి వచ్చిందని.. ఇలా రకరకాల కథనాలు.

ఇవి కాక ‘డిస్కౌంట్ స్కాముల’ గురించి కథనాలు. పాత నోట్లకు బదులు వాటి విలువ కంటే తక్కువ విలువలో కొత్త నోట్లు ఇచ్చే వ్యాపారం చాలా చోట్ల జోరుగా సాగింది.
బ్యాంకు క్యూల్లో నిలబడీ నిలబడీ కనీసం వంద మంది గుండెపోటుతో చనిపోయారని వార్తలు వచ్చాయి.
బిశ్వాస్ లాంటి ఎందరికో ఈ చర్య నెలల తరబడి నరకం చూపించింది.
“నేను పని చేసే చోట రోజూ అబద్ధాలు చెప్పడమే. ప్రతి రోజూ ఏదో ఒక నెపంతో బయటికెళ్ళి నా డబ్బులు నేను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించేవాడిని” అన్నారు బిశ్వాస్.
“సాయంత్రం పని అయ్యాక కూడా బైక్ మీద చుట్టుపక్కలున్న పల్లెలకు వెళ్లి డబ్బులున్న ఏటీఎంల కోసం వెతుకుతూ తిరిగేవాడ్ని. రోజూ కనీసం డజను ఏటీఎంలలో నా అదృష్టాన్ని పరీక్షించుకునేవాడిని. తక్కువ మంది ఉపయోగించే ఏటీఎం ఒకటి ఓ డెంటల్ కాలేజీలో ఉందని తెలిసి గార్డుకు డబ్బులిచ్చి మరీ లోపలికి వెళ్లాను. కాని అందులోనూ డబ్బులు లేవు.”


ఈ కరెన్సీ కష్టాలు కేవలం 50 రోజులేనని మోదీ చెప్పారు.
“దయచేసి 50 రోజులు, ఒక్క 50 రోజులు నాకు టైం ఇవ్వండి. డిసెంబర్ 30 తర్వాత మీరు చిరకాలంగా చూడాలనుకుంటున్న భారతదేశాన్ని మీకు చూపిస్తానని వాగ్దానం చేస్తున్నా” అన్నారాయన.
కానీ 2017 వచ్చినా బ్యాంకుల దగ్గర జనానికి ఇవ్వడానికి డబ్బులు లేవు.
మరెన్నో నెలలు పట్టింది మామూలు పరిస్థితులు నెలకొనడానికి.

మోదీ ఆడిన ఈ కరెన్సీ జూదం ఎంతటి ‘ఘోర వైఫల్యమో’ విశ్లేషకులు ఏడాది గడిచాక తేల్చి చెప్పారు.
నగదు ప్రధానంగా నడిచే దేశ ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత రంగాన్నిఇది చావుదెబ్బ తీసింది. చిన్న ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. పేద కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ చర్య ‘రేసింగ్ కారు టైర్ల మీద గురి చూసి కాల్చడంలాంటిది’ అని ఒక ఆర్థికవేత్త అభిప్రాయపడ్డారు.
సాక్షాత్తు మోదీ ఆర్థిక సలహాదారుల్లోనే ఒకరు నోట్ల రద్దును ‘అతి పెద్ద, క్రూరమైన, ద్రవ్యాఘాతం’ అని పేర్కొన్నారు. 2016 చివరి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు కనీసం 2 శాతం తగ్గిందని 'నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్' అనే అమెరికన్ సంస్థ వెల్లడించింది.

జనవరి 2017: నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కోల్‌కతాలో ఓ సభలో ప్రసంగిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ
అలాగే రద్దయిన నోట్లలో 99 శాతం వెనక్కి వచ్చాయని స్వయంగా రిజర్వ్ బ్యాంకే ప్రకటించింది. దాని అర్థమేంటి? మోదీ ఊహించినంతగా దేశంలో నల్ల ధనం లేకుండా అయినా ఉండాలి. లేదా నల్ల ధనవంతులకు తమ డబ్బును తెల్ల ధనంగా మార్చుకునే మార్గాలు పుష్కలంగా ఉండైనా ఉండాలి. రద్దయిన నోట్లలో నకిలీ నోట్ల శాతం చాలా తక్కువని కూడా తేలింది.
మొత్తంగా ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి మోదీ తీసుకున్న చర్య ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వకపోగా చాలామంది అనేక ఇక్కట్ల పాలయ్యారు.
2017 మార్చిలో ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నోట్ల రద్దుపై ప్రజలు తమ వ్యతిరేకతను తెలియజేసే తీర్పుగా ఉంటాయని, బీజేపీ ఓడిపోతుందని చాలామంది భావించారు.
కానీ అది తప్పని తేలింది. ఆ పార్టీ అక్కడ 40 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

మార్చి 2017: రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయాలకు మోదీని
అభినందిస్తున్న పార్టీ నేతలు
ఈ పరిణామానికి అందరూ ఏమీ ఆశ్చర్యపోవడం లేదు. ఒక ఉత్తర్ ప్రదేశ్ విద్యార్ధి నాతో మాట్లాడుతూ... “ఎన్నో విభజనలు, అసమానతలు ఉన్న సమాజంలో తమతోపాటు ధనవంతులకు కూడా ఇబ్బంది కలుగుతోంది అంటే ఆ ఇబ్బందులను కష్టమైనా భరించడానికి పేదలు సిద్ధంగా ఉంటారు. అయితే ధనవంతులు ఇబ్బంది పడతారనేది అబద్ధమని పేదలకు అర్ధం కావడానికి చాలా సమయం పట్టింది.”
మరో విధంగా చెప్పాలంటే మామూలు జనానికి అది schadenfreude లా పనిచేసింది. అంటే ఇతరుల బాధ చూసి ఆనందించే చర్యగా ఉపయోగపడింది.
కాని బిశ్వాస్ లాంటి వాళ్ళు మాత్రం ఇప్పటికీ ప్రధాన మంత్రిని క్షమించలేకపోతున్నారు.
“నా డబ్బును నేను తీసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాల్సి రావడం నాకే నమ్మశక్యంగా లేదు” అన్నారాయన.
“మోదీని నమ్మడం వల్లే మాకు ఇదంతా జరిగింది. అవినీతిపరులైన ధనవంతులకు గుణపాఠం నేర్పడానికే ఈ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాన్ని మేం నమ్మాం. వారిని శిక్షించడం కోసం మా బోటివాళ్ళం కొంత త్యాగం చేయక తప్పదని నమ్మాం.
కానీ ఆ తర్వాత నేను మోదీని నమ్మడం మానేశాను. ఆయన వరస పెట్టి అబద్ధాలే చెబుతున్నారు. అది ఒక ప్రధాన మంత్రికి తగని పని” అన్నారు బిశ్వాస్.
రాజస్థాన్ అంతర్జాతీయంగా పర్యటకులను ఆకర్షించే ప్రాంతం. ఆ పేరు వినపడగానే మన మదిలో మెదిలే దృశ్యాలు పెద్ద పెద్ద కోటలు, భవంతులు, మహళ్లు, రంగురంగుల బజార్లు, కళాత్మకంగా అలంకరించిన హోటళ్లు, ఎడారుల్లో ఒంటె సవారీలు వగైరా.
వాటితో పాటు ‘గో రక్షకులు’ పేరుతో జరిగే హింసకు కూడా ఈ రాష్ట్రం వార్తల్లో నిలుస్తోంది. కరడుగట్టిన హిందూ జాతీయవాదం వారిని పెంచి పోషిస్తుంటుంది.

భారత్‌లోని ప్రముఖ పర్యటక ప్రాంతాల్లో రాజస్థాన్ ఒకటి.
హిందువుల్లో ఎక్కువ మంది ఆవును పవిత్ర జంతువుగా భావించి పూజిస్తారు. ఈ నేల మీద గోరక్షణ ఉద్యమాలు 1870ల నుంచి జరుగుతున్నాయి.
గోవధ కారణంగా ఒకప్పుడు మత ఘర్షణలు, పార్లమెంటు బయట నిరసన ప్రదర్శనలు, నిరాహారదీక్షలు కూడా జరిగాయి.
అయితే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోరక్షక దళాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
మోదీ మద్దతుదారులకు గోవు కుల దేవత లాంటిది. గోవధ చట్టాలను మరింత కఠినతరం చేశారు. శిక్షలను కూడా తీవ్రం చేశారు. రాజస్థాన్‌లో గోవధ – వధించేందుకు గోవులను ఎగుమతి చేయడం – పదేళ్ళు జైలు శిక్షవేయదగ్గ నేరంగా మారింది.
ఉత్తర, పశ్చిమ భారతంలో కొన్ని చోట్ల ఈ గో రక్షక గుంపులు తమకు తామే అధికారాలు దఖలు పరుచుకుని అరాచకంగా ప్రవర్తించడం పెరిగింది. హైవేల మీద చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి, వచ్చే పోయే వాహనాల్లో ఆవులు ఉన్నాయో లేదో తనిఖీ చేయడం, డైరీ రైతులతో, పశువుల వ్యాపారులతో దురుసుగా ప్రవర్తించడం (వీరిలో ముస్లింలే అధికంగా ఉంటారు) వంటి చర్యలకు పాల్పడ్డారు. గో సంరక్షణ అనేది వారికి డబ్బులు వసూలు చేసుకునే ఒక మార్గం అయిపోయింది.

రాజస్థాన్‌లోని గో రక్షక బృందం (2015 నాటి ఫొటో)
ఈ సంఘటనల్లో 2015 నుంచి ఇప్పటి వరకు కనీసం 44 మంది (వారిలో 36 మంది ముస్లింలే) హత్యకు గురయ్యారని 'హ్యూమన్ రైట్స్ వాచ్' సంస్థ తెలిపింది. గాయపడ్డవారి సంఖ్యయితే వందల్లోనే ఉంది.
మోదీ ఈ దాడులను ఖండించడమే కాక, వారిని గోరక్షణ ముసుగులో పని చేస్తున్న ‘యాంటీ సోషల్’ గ్రూపులని కూడా విమర్శించారు.
కానీ మోదీకి సన్నిహితంగా ఉండే బీజేపీ ప్రభుత్వాధినేతలు మాత్రం మరో రకమైన సంకేతాలు ఇస్తున్నారు. ఒక మాంసం వర్తకుడిని కొట్టి చంపిన దోషులకు ఆయన కేబినెట్ సహచరుడే పూలమాల వేసి స్వాగతం పలుకుతున్న ఫొటోలను అందరూ చూశారు. అలాగే ముస్లింలు బీఫ్ తినడం మానేసినప్పుడే కొట్టి చంపడాలు ఆగుతాయని ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
పెహ్లు ఖాన్ తన ఆవుల్ని ఇంటికి తీసుకు వెళ్తుండగా హత్యకు గురయ్యారు.
55 ఏళ్ళ పెహ్లు ఒక పశువుల పెంపకందారుడు. అతని స్వస్థలం హర్యానాలోని నువా జిల్లా. ఆయనకు భార్య, ఐదుగురు పిల్లలున్నారు.
నువా జిల్లా పెద్ద పేరున్న ప్రాంతం కాదు. దుమ్ము కొట్టుకుపోయిన ఒక పట్టణం, కొన్ని ముస్లిం మెజారిటీ గ్రామాలు, పచ్చటి పొలాలతో నిండిన ప్రాంతం. ఇక్కడి వారికి వ్యవసాయం, పశువుల పెంపకమే ప్రధాన జీవనాధారం.
2017 ఏప్రిల్‌లో పెహ్లు తన ఇద్దరు కొడుకులు – ఇర్షాద్, ఆరిఫ్, మరో ఇద్దరు గ్రామస్థులతో కలిసి ఒక అద్దె వాహనంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. రాజస్థాన్‌లోని ఒక పశువుల సంతలో కొన్న ఆవులను ఆయన ఆ వాహనంలో తన స్వగ్రామానికి తరలిస్తున్నారు.
కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత, కొన్ని చెక్ పాయింట్లు దాటిన తర్వాత ఆరుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్ళ మీద తమను వెంబడిస్తున్నట్టు వాళ్ళు గమనించారు. ఈలోగా వారు పెహ్లు వాహనాన్ని దాటి ముందుకెళ్లి వారిని ఆపారు.
“ఆవుల కొనుగోలు పత్రాలను వారికి చూపించాం. తాము భజరంగ్ దళ్ (ఒక హిందూ అతివాద సంస్థ) వాళ్ళమంటూ, ఆ కాగితాలను చింపేశారు” అని 19 ఏళ్ళ ఆరిఫ్ చెప్పారు.

గో రక్షకుల దాడి నుంచి బయటపడిన పెహ్లూ ఖాన్ కుమారుడు ఆరిఫ్
“తర్వాత వారు మమ్మల్ని ట్రక్ లోంచి కిందికి లాగి కొట్టారు. అందరి కంటే మా అబ్బాను ఎక్కువగా కొట్టారు. కర్రలు, బెల్టులు, చేతికి ఏది దొరికితే దానితో కొట్టారు. పిడిగుద్దులు గుద్దారు. క్షణాల్లో ఒక పెద్ద గుంపు పోగై అందరూ కొట్టడం మొదలు పెట్టారు.”
“వాళ్ళు ముస్లింలు. పట్టుకుని కొట్టండి” అని వారంతా ఒకటే అరుపులు.
పోలీసులు వచ్చి వీళ్ళను కాపాడేసరికి పెహ్లు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పటికి ఆ గుంపు వీరి దగ్గర నుంచి ఆవుల్ని, మూడు ఫోన్లను, 45,000 రూపాయల నగదును లాక్కుని పరారైంది.
పోలీసులు వీరిని హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. రెండు రోజుల తర్వాతపెహ్లు చనిపోయారు. కుమారులు బతికారు.
పెహ్లు దైవభక్తి గల వాడని, కష్టజీవి అని గ్రామస్తులు చెబుతారు.
“మాకు మంచి జీవితం ఇవ్వడానికి ఆయన చాలా కష్టపడి పని చేసేవారు” అని భార్య జైబూన చెప్పారు.

పెహ్లూ భార్య జైబూన, వారి కుమారుడు
ఆయన చనిపోయాక కోర్టు ఖర్చుల కోసం ఆ కుటుంబం తమ వద్ద మిగిలిన ఆవులను కూడా అమ్మేసుకుంది. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.
“అతి కష్టం మీద బతుకుతున్నాం” అని చెప్పారు ఆరిఫ్.
గో రక్షక బృందాల దాడులకు సంబంధించి మోదీ ప్రభుత్వంలో న్యాయం దక్కడంలో ఎన్నో అడ్డంకులున్నాయి.
చనిపోవడానికి ముందు కొద్దిగా స్పృహలోకి వచ్చిన పెహ్లు ఖాన్ తనపై దాడికి పాల్పడిన ఆరుగురి పేర్లను వెల్లడించారు.
కానీ వారిని అరెస్టు చేయడానికి ముందే పోలీసులు పెహ్లూ, ఇతర బాధితులపై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆవులను తరలిస్తున్నారనేది వారిపై మోపిన అభియోగం.
దాడిని ప్రత్యక్షంగా చూసిన ఈ ఇద్దరు సోదరులు, మరో ఇద్దరు సాక్షులు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి సెప్టెంబర్‌లో వెళ్తుండగా గుర్తింపు లేని ఓ కారు వీరి వాహనాన్ని వెంబడించింది.
"వాళ్లు మాకు అడ్డంగా కారు ఆపి, వెనక్కి వెళ్లిపోవాలని గట్టిగా అరిచారు. మేం తిరస్కరించాం. దీంతో వారిలోని ఓ వ్యక్తి గాలిలోకి కాల్పులు జరిపాడు. మేం చేసేది లేక మా వాహనాన్ని వెనక్కి తిప్పుకుని ఇంటికి వచ్చేశాం" అని ఆరిఫ్ తెలిపారు.
న్యాయం జరుగుతుందన్న ఆశ నాకు లేదు, నేను బతికి ఉంటే చాలనుకుంటున్నా.
అప్పటి నుంచి కోర్టు నుంచి వచ్చే సమన్లకు తాము స్పందించడం మానేశామని ఆరిఫ్ తెలిపారు. కేసు రాజస్థాన్ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ అయితే తాము స్పందిస్తామని ఈ సోదరులిద్దరూ చెబుతున్నారు.
"నాకు చాలా భయంగా ఉంది. మా తండ్రిని కోల్పోయాం. ఇప్పుడు నేను చనిపోవాలని కోరుకోవడం లేదు. న్యాయంపై నాకు ఆశ లేదు. బతికి ఉంటే చాలనుకుంటున్నా" అని ఆయన అంటున్నారు.
దాడి జరిగిన ఐదు నెలల తర్వాత, దాడికి బాధ్యులనే ఆరోపణలున్న ఆరుగురు వ్యక్తులపై కేసును రాజస్థాన్ పోలీసులు కొట్టివేశారు. "నేరం తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్ర అధికారులు ప్రయత్నించారు" అని ఓ స్వతంత్ర విచారణ నివేదిక ఆరోపించింది.

గత డిసెంబరులో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు అని ఆరిఫ్ అన్నారు.
"ఇప్పటికీ వాళ్లు చెక్ పాయింట్లు నిర్వహిస్తున్నారు. మా సొంత ఆవులతో కలసి వెళ్లాలన్నా మాకు ఇప్పటికీ భయంగానే ఉంది."
ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరం సందు గొందుల్లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో ముగ్గురు యువకులు రోజుకు 10 గంటల పాటు తెగ చదివేస్తున్నారు. వారు కొన్ని నెలలుగా ఇదే పని చేస్తున్నారు.
వాళ్లకు కావాల్సిందల్లా ఓ ఉద్యోగం.
ఆ ముగ్గురూ సన్నకారు రైతుల బిడ్డలు. వారి కుటుంబాల్లో చదువుకున్న వాళ్లు వీళ్లే. ఉద్యోగాల కోసం నగరాలకు వలస వస్తున్న వేలాది మందిలో వీరూ భాగమే. అందరూ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందినవారే. అదేమీ చిన్న రాష్ట్రం కాదు. దేశంలో అధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఇదొకటి.

మిథిలేష్ యాదవ్, కరుణేష్ జైస్వాల్, రామ్ సాగర్ గుప్తా
ఇంజనీరింగ్‌లో డిప్లొమాలు తీసుకుని ఉద్యోగం కోసం ఇప్పటికే ఓ పాతిక పరీక్షలు రాసిన నిరుద్యోగులు వీళ్ళు.
డబ్బులు ఆదా చేయడానికి... వీళ్లు పరీక్షా కేంద్రాలకు వెళ్ళేటపుడు బస్సుల్లో, సెకండ్ క్లాస్ రైళ్ళల్లో ప్రయాణిస్తుంటారు. రైల్వే స్టేషన్‌లలో, బస్టాండుల్లో పడుకుంటుంటారు. లక్షలాది మంది నిరుద్యోగులతో పోటీ పడుతూ కఠినమైన పరీక్షలెన్నో రాస్తుంటారు.
గత ఏడాది రైల్వేలో 63,000 ఉద్యోగాలకు ప్రకటన వెలువడితే 2 కోట్ల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

పుణె, ఫిబ్రవరి 2019: సైనిక ఉద్యోగ పరీక్షల కోసం వచ్చిన అభ్యర్థులు ఆరుబయటే నిద్రిస్తున్న దృశ్యం
పైన చెప్పిన యువకులు ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేశారో లెక్కలేదు. రైల్వే డ్రైవర్, టెక్నీషియన్, లైన్‌మన్, ఇంజనీర్, గుమాస్తా, ప్రభుత్వ పరిపాలనా ఉద్యోగాలు, పోలీసాఫీసర్ ఉద్యోగాలు... ఇలా అన్నింటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విద్యుత్ శాఖ, పబ్లిక్ వర్క్స్, రైల్వే శాఖ పెట్టిన పరీక్షలన్నీ వీరు రాశారు. ఇవన్నీ ఉద్యోగ భద్రత, గౌరవం ఉండే ప్రభుత్వోద్యోగాలు. కాబట్టే వాటికి విపరీతమైన పోటీ ఉంటుంది. కానీ ఖాళీలు చాలా పరిమితంగా ఉంటాయి.
వారి ఆశలు ఇట్టే ఆవిరైపోతుంటాయి.
ఈ ముగ్గురికీ ఇంజనీర్లుగా ఉద్యోగం చేయాలని ఉంది కానీ అదే చేయాలనే పట్టింపేమీ లేదు. ఏ ప్రభుత్వోద్యోగం వచ్చినా చేరడానికి సిద్ధంగా ఉన్నారు. భద్రత ఉన్న ఉద్యోగం దొరకడం బాగా కష్టమైపోయింది. ఈ ముగ్గురిలో ఒకరైన కరుణేష్ జైస్వాల్ గత ఏడాది ఒక ఏవియేషన్ ఆయిల్ కంపెనీలో నెలకు 17,000 రూపాయల జీతానికి కాంట్రాక్ట్ ఇంజనీర్‌గా పని చేశారు. కాంట్రాక్ట్ అయిపోగానే ఉద్యోగం పోయింది. అనుభవం ఉన్నా ఇంకొక చోట ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.
“నాకు వేరే మార్గం లేదు. ప్రయత్నిస్తూ ఉండాల్సిందే. ఇండియాలో నిరుద్యోగులెవరూ ఒంటరి వాళ్ళు కాదు” అని అన్నారు 22 ఏళ్ళ జైస్వాల్.

కరుణేష్ జైస్వాల్: “అలా ప్రయత్నిస్తూ ఉండటమే తప్ప
నాకు వేరే మార్గం లేదు”
ఐదేళ్ళ క్రితం ఎన్నికల ప్రచారంలో బోలెడన్ని ఉద్యోగాలు కల్పిస్తానని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు యువతను బాగా ఆకర్షించాయి. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యే నాటికి దేశం విపరీతమైన నిరుద్యోగ సంక్షోభంలో కూరుకుపోయి ఉంది.
లీకైన ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారమే నిరుద్యోగం రేటు 45 ఏళ్ళలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ఉంది.
'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' అనే స్వతంత్ర మేధావుల సంస్థ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 3 కోట్ల మందికి పైగా ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.

లఖ్‌నవూలోని ధ్యేయ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోని
సివిల్ సర్వీసెస్ పరీక్షల శిక్షణ తరగతి
దశాబ్దాల తరబడి వృద్ధి రేటు బాగున్నా ఉద్యోగ కల్పన మాత్రం చాలా తక్కువగానే ఉంది.
ఇండియాలో టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్స్ పరిశ్రమలు చాలా వేగంగా పెరుగుతున్నప్పటికీ అరకొర చదువులు చదివి, తక్కువ సామర్థ్యం గల పనులు మాత్రమే చేయగల లక్షలాది నిరుగ్యోగ యువతకు అవి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నాయి. దానికి తోడు మోదీ పాలనలో ప్రైవేటు పెట్టుబడి మందగించి, ఆర్థికాభివృద్ధి నిలకడగా లేకపోవడంతో ఉద్యోగ కల్పన ఇంకా తగ్గిపోయింది.
ప్రస్తుతం దేశ శ్రమశక్తిలో 80 శాతం పైగా తక్కువ జీతాలు లభించే, తక్కువ ప్రయోజనాలు ఉండే ‘అసంఘటిత’ రంగంలో పని చేస్తోంది. పది శాతాని కన్నా తక్కువ మంది మాత్రమే అన్ని ప్రయోజనాలు ఉండే ‘ఫార్మల్ ఎకానమీ’లో పని చేస్తున్నారు.
ఉద్యోగం సాధించడం ఇక్కడ ఒక అంతు లేని పోరాటంలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు.


జైస్వాల్, రాం సాగర్ గుప్తా, మిథిలేష్ యాదవ్ రోజూ ఉదయం ఐదింటికి నిద్ర లేచి ఏదో ఒకటి కాస్త తిని చదువుకోవడానికి కూర్చుంటారు. తెల్లటి వారిగది గోడ మీద భారతదేశ పటం వేలాడుతూ ఉంటుంది. ఇంజనీరింగ్, లెక్కలు, ఇంగ్లిష్ గ్రామర్, జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన పుస్తకాలు వాళ్ళ రెండు గదుల అపార్ట్‌మెంట్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తాయి.
అప్పుడప్పుడు ఊరి నుంచి తల్లిదండ్రులు ఫోన్లుచేసి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతుంటారు.

రామ్ సాగర్ గుప్తా
“ఆ ఫోన్లు మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్లకు నిజం చెప్పాలంటే చాలా బాధేస్తుంది. పాపం వాళ్ళు మాత్రం ఏమీ అనరు. ధైర్యం చెబుతారు. వాళ్ళ వల్లే మేం ఇలా ఉండగలుగుతున్నాం” అన్నారు గుప్తా.
మోదీ ఏదో ఒక రోజు ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకంతోనే ఉన్నారు ఆయన. ఆశ చావలేదు ఆయనలో.
“ఆయన కనీసం యువత కలలు, ఆకాంక్షల గురించి మాట్లాడుతూ ఉంటారు. స్వయంగా చాలా కష్టపడతారు. ఆయన మీద మాకు ఇంకా చాలా ఆశలున్నాయి” అన్నారు గుప్తా. మిగతా ఇద్దరిలో అంత నమ్మకం కనిపించలేదు. “ఆయన కడతానన్న ఫ్యాక్టరీలు ఏవీ?” అని అడిగారు వారిలో ఒకరు.

మిథిలేష్ యాదవ్
పదేళ్ళ ప్రయత్నం తర్వాత తన మామయ్యలలో ఒకరికి పోలీసు ఉద్యోగం వచ్చిందని యాదవ్ చెప్పారు. అప్పటికి ఆయనకు 27 ఏళ్ళు వచ్చాయి. “ఏదో ఒక రోజు నేను కూడా అలాగే ఉద్యోగం తెచ్చుకోవచ్చు. కానీ అంతకాలం ఓపిక పట్టాల్సి రావడం కూడా కష్టమే” అన్నారు యాదవ్.
మోదీ తొలి ప్రచార సభ ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేశారు.
పూలతో అలంకరించిన వేదిక మీదకి అడుగు పెట్టి వేలాది సభికులకు అభివాదం చేసిన వెంటనే ఆయన తనదైన శైలిలో ఉపన్యాసం మొదలుపెట్టారు.


“130 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నారు. ఇండియాను మరోసారి మోదీ సర్కారే పరిపాలిస్తుంది.”
అసాధారణమైన ఆత్మవిశ్వాసం ఉన్న రాజకీయవేత్త మోదీ. శక్తిమంతుడైన ఆయన సహచరుడు అమిత్ షా ముందు జాగ్రత్తగా కొన్ని పొత్తులు పెట్టుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ మోదీ 2019 ఎన్నికలను తన పనితీరుపై తీర్పుగా మలచదలచుకున్నారు.
ఆయన అలుపూ సొలుపూ లేకుండా ప్రచారం చేయగలరు. బీజేపీ లెక్కల ప్రకారం 2014లో ఆయన ‘ప్రజలను కలుసుకోవడానికి’ 25 రాష్ట్రాల్లో 3 లక్షల కిలోమీటర్లు (1.86 లక్షల మైళ్ళు) ప్రయాణించారు. ఈసారి కూడా ప్రచారం ఆ స్థాయిలోనే ఉంటుంది. కనీసం 150 బహిరంగ సభల్లో ఆయన మాట్లాడేందుకు ప్రణాళికలు వేశారు.

మోదీ పోరాటవాదానికి ముందుంటారు. జాతీయవాదాన్ని, ప్రజలు మెచ్చే వాగ్దానాలను కలగలిపి తాను లక్ష్యం చేసుకున్న ఓటర్లను నర్మగర్భ వ్యాఖ్యల ద్వారా ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది.
దేన్నయినా ద్వంద్వాల రూపంలో ప్రజల ముందుంచడం ఆయన శైలి. జాతీయవాదులు (తన మద్దతుదారులు) కు జాతీయవాద వ్యతిరేకులు (ఆయన రాజకీయ ప్రత్యర్ధులు, విమర్శకులు) కు మధ్య పోరు; వాచ్ మాన్ (దేశాన్ని అంతరిక్షంతో సహా అన్ని వైపుల నుంచి తానే రక్షిస్తున్నట్టు ఆయన చెప్పుకుంటారు) కు, వారసత్వంగా నాయకులై అవినీతికి పాల్పడుతున్నవారు (ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి) కి మధ్య పోరు... ఇలా సాగుతాయి ఆయన ఉపన్యాసాలు.
కొన్నిసార్లు ఆయన ఈ దేశంలోని అన్ని గత ప్రభుత్వాలే కారణమన్నట్టు మాట్లాడతారు. కానీ తన దగ్గరున్న పరిష్కారాలేమిటో చెప్పరు.
2019 ఎన్నికల ప్రచారం చాలా తీవ్రంగా, హింసాత్మకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
2014లో అతి తక్కువ స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో బలమైన ప్రతిపక్షంగానైనా నిలబడేందుకు తీవ్రంగా పోరాడుతోంది.
విమర్శకులు ఏమన్నప్పటికీ మోదీ రెండోసారి కూడా గెలిచి ప్రధాన మంత్రి అవుతారని, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా పని చేసిన కొలంబియా యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ అరవింద్ పనగరియా అభిప్రాయపడుతున్నారు.
మోదీకి అత్యంత ప్రజాదరణ ఉందని, దానితో పాటు అపరిమితమైన చురుకుదనం, జనాలతో సంబంధాలు నెలకొల్పుకోగల సామర్థ్యం ఉందని ఆయన అభిప్రాయం.
అంతే కాదు ఆయన “తాను కష్టజీవినని, చిత్తశుద్ధి గలవాడినని, నిర్ణయాలు తీసుకోగల సమర్థుడినని ఆయన సగటు భారతీయుడికి నమ్మకం కలిగించగలిగారు” అని చెప్పారాయన.
భారత్‌లో ఎన్నికలు పెద్దగా సిద్ధాంతాల ప్రాతిపదిక మీద జరగవు కాబట్టి ఫలితాల గురించి ముందుగా ఊహించడం చాలా సంక్లిష్టమైన పని.

ఈసారి బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ఆ పార్టీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ అదే పనిని నాలుగు దశాబ్దాలు చేసింది.
అయితే ఒకటి మాత్రం స్పష్టం.
మోదీ పట్ల ప్రజల్లో ఆరాధన ఇంకా ఉందా లేదా అనేది మాత్రం ఈ ఎన్నికలు స్పష్టంగా తెలియజేస్తాయి.







