మోదీ, అమిత్ షాల తెగింపుకు అడ్డుకట్ట వేసి, వెనక్కు తగ్గేలా చేసిన నాథూరామ్ గాడ్సే - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ జోషి
- హోదా, బీబీసీ హిందీ రేడియో ఎడిటర్
నరేంద్ర మోదీ, అమిత్ షాలను నిస్సహాయులుగా మీరెప్పుడైనా చూశారా? దేనిపైనైనా వారు వివరణ ఇచ్చుకోవడం చాలా అరుదు. నిర్ణయాలపై వెనక్కితగ్గని తెగింపు వారిలో కనిపిస్తుంది.
2002లో గుజరాత్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్, జడ్జి లోయా మృతి, నోట్ల రద్దు, మూక దాడుల వంటి విషయాలపై గానీ.. బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్ఞా ఠాకూర్‌ను భోపాల్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిలపడంపై గానీ మోదీ, షాలను వెనకడుగు వేయడం ఎప్పుడూ చూసి ఉండరు.
దూకుడైన రాజకీయ శైలిని అనుసరించే ఈ నేతలు చరిత్రలో వెనక్కతగ్గాల్సిన అవసరం వచ్చింది ఒక్క గాడ్సే విషయంలోనే కావొచ్చు.
కాషాయ తీవ్రవాదం అంటూ హిందూ సంస్కృతిని అవమానించినవారికి గట్టిగా బదులు చెప్పేందుకే ప్రజ్ఞా ఠాకూర్‌ను ఎన్నికల బరిలో నిలిపామని మోదీ, షా చెప్పారు.
మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ప్రజ్ఞా ఠాకూర్‌పై ఆరోపణలు ఇంకా అలాగే ఉన్నాయి. బెయిల్‌పైనే ఆమె బయటకు వచ్చారు. అయితే, ఈ విషయాలేవీ మోదీ, షా ఆలోచనలపై ప్రభావం చూపించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు అదే ప్రజ్ఞా ఠాకూర్ కారణంగా మోదీ, షా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
మొదట ముంబయి దాడుల్లో మరణించిన పోలీసు అధికారి హేమంత్ కర్కరేకు తాను శాపం పెట్టానని ఆమె అన్నారు.
గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశ భక్తుడంటూ తాజాగా వర్ణించారు.
దేశ భక్తిపై తమకే కాపీరైట్‌లు ఉన్నాయని చెప్పుకొనే పార్టీకి చెందని ఓ ప్రముఖ అభ్యర్థి గాడ్సేను దేశ భక్తుడంటూ పొగిడినప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. బీజేపీది, సంఘ్ పరివార్‌కు చెందిన గాడ్సేది ఒకే తరహా జాతీయవాదమా? నరేంద్ర మోదీ, గాడ్సేలది ఒకే లాంటి దేశ భక్తా?
ప్రజ్ఞా వ్యాఖ్యలు పూర్తి స్పష్టంగా ఉన్నాయి.
అందుకే, ప్రజ్ఞా క్షమాపణలు కోరినప్పటికీ మనస్పూర్తిగా ఆమెను ఎన్నటికీ క్షమించలేనని ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నలను తప్పించుకునేందుకు మోదీ చెప్పాల్సి వచ్చింది.
మోదీ వ్యక్తిత్వం, ఆయన బ్రాండు రాజకీయాలకు ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా భిన్నమైనవి. సుబ్రమణ్య స్వామి లాంటి నేతలు ఏవైనా వ్యాఖ్యలు చేసినప్పుడు మోదీ సున్నితంగా విభేదించారే తప్ప క్షమాపణల విషయంలో పెద్దగా పట్టింపు ప్రదర్శించలేదు. వివాదాస్పద వ్యాఖ్యలపై మౌనం వహించడం లేదా వాటితో తాను విభేదిస్తున్నట్లు చెప్పే ప్రయత్నం మాత్రమే చేసేవారు.
అయితే, హిందూ అతివాదానికి ఐకాన్‌గా మారిన ప్రజ్ఞా ఠాకూర్‌తో క్షమాపణలు చెప్పించడం తప్పనిసరిగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శామ్ పిత్రోదాను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని బహిరంగంగా స్పష్టం చేసిన తీరు తర్వాత ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై కప్పిపుచ్చుకునేందుకు బీజేపీకి ఏమీ మిగల్లేదు.
తాజా పరిణామాల తర్వాత ప్రజ్ఞా ఠాకూర్ పోటీ విషయంలో మోదీ, షా పునరాలోచనలో పడి ఉంటారు. వారెప్పుడూ దాన్ని అంగీకరించకపోవచ్చు. ఎన్నికల ఆఖరి దశ మిగిలున్న సమయంలో తమ నిర్ణయం తప్పని బయటకు తెలియజేయడాన్ని బీజేపీ ఇష్టపడదు.
అందుకే, ప్రధాని మోదీ కూడా హాజరైన పత్రికా సమావేశంలో ప్రజ్ఞా ఠాకూర్ అభ్యర్థిత్వాన్ని కాషాయ తీవ్రవాద ఆరోపణలు చేసేవారికి వ్యతిరేకంగా జరుపుతున్న సత్యాగ్రహంగా అమిత్ షా వర్ణించారు.
సత్యాగ్రహం కోసం మోదీ నమ్ముకున్న వ్యక్తులు గాడ్సేను దేశ భక్తులుగా భావించేవాళ్లు.
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే, మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత నిలన్ కతీల్‌లు కూడా గాడ్సే విషయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ప్రజ్ఞా ఠాకూర్‌తో పాటు ఈ నేతలను కూడా ఆయా వ్యాఖ్యలపై అమిత్ షా వివరణ కోరారు. గాంధీ హంతకుడిని పొగిడితే దేశ ప్రజల దృష్టిలో ఏ స్థాయికి దిగజారిపోవాల్సి వస్తుందో ఆయనకు తెలుసు.

ఫొటో సోర్స్, PTI
గాంధీపై దృక్పథం మారాలని, ఇలాంటి చర్చ జరగడంపై గాడ్సే సంతోషిస్తారని అనంత్ కుమార్ ట్వీట్ చేశారు. అయితే, కాసేపటికే ఈ ట్వీట్‌ను డిలీట్ చేశారు. తన ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైందని చెప్పారు. ప్రజ్ఞా ఠాకూర్ ఇప్పటికే తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు.
గాడ్సేని పొగిడి, అనంతరం క్షమాపణలు కోరడం బీజేపీ నేతలకు ఇదేమీ కొత్త కాదు.
మోదీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలలకే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ''గాంధీ దేశ భక్తుడైతే, గాడ్సే కూడా దేశ భక్తుడే'' అని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత క్షమాణలు చెప్పారు.
''అఖండ భారత్ ఆలోచనతో గాడ్సే ప్రభావితమయ్యారు. ఆయన ఎంచుకున్న దారి తప్పు, ఉద్దేశం కాదు'' అని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన దివంగత నాయకుడు ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ ఓ సారి అన్నారు.
గాంధీ కన్నా మోదీ పెద్ద బ్రాండు అని హరియాణాలో బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. ఖాదీ గ్రామోద్యోగ్ క్యాలెండర్‌లో గాంధీ బొమ్మ లేకుండా చేశామని, నెమ్మదిగా కరెన్సీ నోట్లపైనా ఆయన చిత్రం మాయమవుతుందని అన్నారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ విజ్ వివరణ ఇచ్చుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గాడ్సే విషయంలో బీజేపీ సహా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ ఎప్పుడూ ఓ అయోమయంలో ఉంటాయి. పూర్తిగా బయటకు వచ్చి ఆయన్ను పొగడవు. అలా అని తప్పు పట్టవు.
మోదీ, షా వ్యాఖ్యలను తరచి చూస్తే గాంధీపై ప్రశంసలు, భక్తి ఉన్న మాటలు కనపడతాయి. గాంధీ హత్యకు గాడ్సేను ప్రేరేపించిన ఆలోచనలను బలపరిచే అంశాలూ వాటిలో ఉంటాయి.
సంఘ్, బీజేపీ, మోదీ సమర్థకుల్లో చాలా మంది సోషల్ మీడియా ద్వారా బహిరంగంగానే గాడ్సేను సమర్థిస్తుంటారు. వారిలో కొందరిని స్వయంగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా అనుసరిస్తుంటారు.
గాడ్సే, ఆయన సానుభూతిపరులను విమర్శించి సమర్థకులను దూరం చేసుకోవడం మోదీ, షాలకు ఇష్టం లేదు. అందుకే వారి మాటల్లో గాంధీ పట్ల భక్తి వినిపించినా, గాడ్సేకు వ్యతిరేకంగా స్పష్టమైన వైఖరి కనిపించదు.
సంఘ్ పరివార్‌లోని ఓ వర్గానికి గాడ్సేకు వందనాలు సమర్పించాలని ఆశ. కానీ, గాంధీకున్న గొప్ప ఇమేజ్ వారికి అడ్డు వస్తుంది. అయినా, గాడ్సే పట్ల తమకున్న ప్రేమను ఆపుకోలేక చాలా సార్లు బీజేపీ నేతలు బయటపడిపోతుంటారు. వారి వల్ల మొత్తం పార్టీ ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.
గాడ్సే ఉరికంబం ఎక్కిన 70 ఏళ్ల తర్వాత కూడా ఆయన విషయంలో బీజేపీ ఇంత నిస్సహాయంగా ఎందుకు కనిపిస్తోంది?
ఇవి కూడా చదవండి
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- 1948 జనవరి 30: మహాత్మా గాంధీ చివరి రోజు ఎలా గడిచిందంటే...
- గాంధీ బొమ్మను 'షూట్' చేసిన హిందూ మహాసభ నాయకురాలి అరెస్టు
- ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా?
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
- కేంద్రంలో ఎవరి ప్రభుత్వం వచ్చినా.. ఈ సమస్య ఎదుర్కోవాల్సిందే
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










