‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ ఫ్రెంచి జర్నలిస్టు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, లియోమన్ లిమా
- హోదా, బీబీసీ న్యూస్ ముండో
ప్రార్థనల్లో తాము నిత్యం విమర్శించే స్వలింగ సంపర్కమే తమ జీవనశైలిగా ఉన్న వేలాది మంది క్రైస్తవ పూజారుల బండారం తన నాలుగేళ్ల పరిశోధనలో బట్టబయలైందని ఫ్రెంచ్ జర్నలిస్ట్ ఫ్రెడెరిక్ మార్టెల్ చెప్తున్నారు.
''స్వలింగ సంపర్కం గురించి వారు ఎంత తీవ్రంగా విమర్శిస్తే.. వారి రహస్య స్వలింగ సంపర్క జీవితంలో వారి కామోద్రేకాలు అంత తీవ్రంగా ఉన్నాయని అర్థం'' అని ఆయన పేర్కొంటున్నారు.
ఇటలీ రాజధాని రోమ్‌లో గల చాలా చర్చిల్లో ''వేలాది మంది'' రోమన్ క్యాథలిక్ పూజారులు.. ప్రార్థనలు పూర్తిచేసిన తర్వాత స్వలింగ సంపర్కం నెరపుతున్నారని మార్టెల్ 'ఇన్ ద క్లోసెట్ ఆఫ్ ద వాటికన్' అనే తన పుస్తకంలో ఆరోపించారు.
వాటికన్ చర్చి తన మత పెద్దలు బాలలపై అత్యాచారానికి పాల్పడుతుండటానికి వ్యతిరేకంగా వ్యూహరచన కోసం గురువారంలో రోమ్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అదే రోజున ఫ్రెంచ్ జర్నలిస్ట్ మార్టెల్ తన పుస్తకాన్ని విడుదల చేశారు.

ఫొటో సోర్స్, AFP
పరిశోధన...
''నాలుగేళ్ల పాటు నేను చేసిన పరిశోధన ఫలితం ఈ పుస్తకం. నేను పలు దేశాలకు వెళ్లి కార్డినళ్లు, బిషప్‌లు, వాటికన్‌కు సన్నిహితంగా ఉండేవారిని చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను'' అని మార్టెల్ బీబీసీకి వివరించారు.
తన పరిశోధనలో మొత్తంగా 41 మంది కార్డినళ్లు, 52 మంది బిషప్‌లు, 200 మందికి పైగా పూజారులు, దౌత్యాధికారులను ఇంటర్వ్యూ చేసినట్లు చెప్పారు.
చారిత్రక, సామాజిక పరిస్థితుల వల్ల.. తమ లైంగికత కారణంగా తమ తమ గ్రామాల్లో తీవ్ర వివక్షకు, విద్వేషానికి గురైన వందలాది మంది యువకులు దానిని నుంచి తప్పించుకోవటానికి క్రైస్తవ మత పూజారిత్వం ఆశ్రయంగా మారిందని ఆయన విశ్లేషిస్తున్నారు. దీని ఫలితంగా చర్చి అనేది ''స్వలింగ సంపర్కులు మెజారిటీగా ఏర్పాటైన సంస్థగా తయారైంది'' అని ఆయన పేర్కొన్నారు.
''వాటికన్ అనేది అత్యున్నత స్థాయిలో ఒక గే సంస్థ అని నేను కనుగొన్నాను. ఇది చాలా వరకూ స్వలింగ సంపర్కులు నిర్మించిన వ్యవస్థ. వారు పగటిపూట తమ లైంగితను అణచివుంచుతారు.. సాయంత్రంలో క్యాబ్ తీసుకుని గే బార్లకు వెళుతుంటారు'' అని మార్టెల్ వ్యాఖ్యానించారు.
వాటికన్‌లో 80 శాతం మంది పూజారులు స్వలింగ సంపర్కులేనని మార్టెల్‌తో మాట్లాడిన వారిలో ఒకరు గట్టిగా చెప్పారు. అయితే.. ఈ లెక్కను ఆయన స్వతంత్రంగా నిర్ధారించుకోలేకపోయారు.

ఫొటో సోర్స్, AFP
రహస్య జీవితాలు
అయితే.. పూజలు, ప్రార్థనల సమయంలో తాము తీవ్రంగా విమర్శించే స్వలింగ సంపర్క జీవనశైలిని స్వయంగా పాటించే పూజారులు వేలాది మంది ఉన్నారనటానికి తనకు ఆధారాలు లభించాయని మార్టెల్ చెప్పారు.
మార్టెల్ ఆరోపణల మీద స్పందన కోసం వాటికన్‌ను బీబీసీ సంప్రదించింది. అయితే వెంటనే ఎటువంటి జవాబూ రాలేదు.
ఇదిలావుంటే.. మార్టెల్ తన ఇంటర్వ్యూల్లో సేకరించిన సమాచారాన్ని తనిఖీ చేసుకోవటానికి ఉపయోగించిన పద్ధతిని ప్రముఖ థియాలజీ నిపుణుడు జేమ్స్ మార్టిన్ ప్రశ్నిస్తున్నారు.
''మార్టెల్ తన పుస్తకం కోసం చాలా లోతైన దర్యాప్తే చేశారు. స్వలింగ సంపర్కం విషయంలో చర్చిలో ఉన్న హిపోక్రసీ, హోమోఫోబియా గురించి ఆయన పుస్తకం కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావిస్తోంది'' అని మార్టిన్ బీబీసీతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
''కానీ ఆ అంశాలు వదంతులు, ప్రచారాల కింద సమాధై ఉన్నాయి. ఇది పాఠకుడిని గందరగోళానికి గురిచేస్తుంది. కల్పనలేవో వాస్తవాలేవో వేరుచేసి గుర్తించటం కష్టమవుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
పూజారిత్వం - స్వలింగ సంపర్కం
పిల్లలపై అకృత్యాల గురించి చర్చించటానికి చర్చి సమావేశాన్ని పోప్ ఫ్రాన్సిస్ ఏర్పాటు చేశారు. దాదాపు 190 మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. స్వలింగ సంపర్కులైన పూజారుల మీద తరచుగా ఈ ఆరోపణలు వస్తున్నాయి.
అయితే.. చర్చిలో అంతర్గతంగా సమస్య ఈ పూజారుల లైంగికతలు కాదని.. లైంగికతకు సంబంధించి చర్చి ద్వంద్వ ప్రమాణాలే సమస్య అని స్వయంగా గే అయిన మార్టెల్ అంటారు.
''లైంగిక దాడి అనేది స్వలింగ సంపర్కత్వానికి సంబంధించినది కాదు. పరలింగ లైంగిత (హెటెరోసెక్సువల్) కుటుంబాల్లోనూ ఈ తరహా లైంగిక దాడులు జరగవచ్చు. పైగా ప్రపంచంలో ఈ బాధితుల్లో అత్యధికులు మహిళలు. అయితే.. చర్చి విషయాన్నే పరిశీలిస్తే అత్యధిక కేసుల్లో స్వలింగ సంపర్క పూజారుల ప్రమేయం కనిపిస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.
చర్చిలో అంతర్గతంగా ఉన్న 'గోప్యతా సంస్కృతి' ఈ లైంగిక దాడి కేసులను దాచేసేందుకు కారణమవుతోందన్నది ఆయన వాదన.

ఫొటో సోర్స్, Getty Images
తమను తాము రక్షించుకుంటున్నారు
''చాలా మంది బిషప్‌లు స్వలింగ సంపర్కులు. వారికి స్కాండల్స్, మీడియా అంటే భయం. తమకు తామే భయపడతారు కూడా. దానివల్ల వాళ్లు ఈ దాడులకు పాల్పడేవారిని కాపాడుతారు. దాడికి పాల్పడేవారిని రక్షించటానికో, దాడిని దాచేయటానికో కాదు.. తాము స్వలింగసంపర్కులమనే విషయం బయటపడకుండా ఉండటానికి. వాళ్లు తమను తాము రక్షించుకుంటున్నారు'' అని మార్టెల్ వ్యాఖ్యానించారు.
ఈ పూజారులు చాలా మంది బహిరంగంగా మాట్లాడేటపుడు స్వలింగ సంపర్కాన్ని విమర్శిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ లాటిన్ అమెరికన్ కార్డినల్ ఒకరు తమకు సెక్స్ కోసం డబ్బులు చెల్లించారని చెప్తున్న పలువురు సెక్స్ వర్కర్లను మార్టెల్ ఇంటర్వ్యూ చేశారు.
అయితే.. మార్టెల్ తన పుస్తకంలో రాసిన ఆరోపణలకు మద్దతుగా ఆధారాలు చూపటంలో విఫలమయ్యారని విమర్శకులు అంటున్నారు.
- పిల్లలపై లైంగిక నేరాలు నిజంగానే పెరుగుతున్నాయా?
- లైంగిక దాడుల బాధితులకు క్షమాపణ చెప్తాం: ఆస్ట్రేలియా
- నన్ రేప్ కేసు: కేరళలో చర్చిలపై విశ్వాసం తగ్గుతోందా?
- కొన్ని చర్చిల్లో మహిళలను 'సెక్స్ బానిసలు'గా చేశారు - అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్
- పాకిస్తాన్‌పై 'నీటి సర్జికల్ స్ట్రైక్స్' వెనుక అసలు నిజం
- జాకబ్ డైమండ్: హైదరాబాద్ నిజాం 'పేపర్ వెయిట్'గా వాడిన రూ.900 కోట్ల వజ్రం ఇదే
- భోజనం చేయగానే పొట్ట ఉబ్బరంగా ఉంటోందా? పెరిటోనియల్ కేన్సర్ కావచ్చు
- ‘పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేతిలో మరణించిన మిలిటెంట్ల ఫొటో నిజమేనా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









