కొన్ని చర్చిల్లో మహిళలను సెక్స్ బానిసలుగా చేశారు - అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్

పోప్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పోప్ ఫ్రాన్సిస్

చర్చిల్లో మతాధికారులు నన్లను(క్రైస్తవ సన్యాసినులను) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే విషయాన్ని పోప్ ఫ్రాన్సిస్ అంగీకరించారు.

మతాధికారులు వారిని ఒక విధంగా తమ దగ్గర సెక్స్ బానిసల్లా ఉంచేశారన్నారు.

ఇలా జరిగినందుకే తనకు ముందు పోప్‌గా ఉన్న పోప్ బెనెడిక్ట్ మతాధికారుల వల్ల వేధింపులకు బలైన నన్ల సమాజాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని చెప్పారు.

మతాధికారులు నన్లపై చేస్తున్న లైంగిక వేధింపుల గురించి పోప్ ఫ్రాన్సిస్ తెలియజేయడం ఇదే మొదటిసారి అని భావిస్తున్నారు.

"ఈ సమస్యను వాటికన్ పరిష్కరించాలని ప్రయత్నిస్తోంది, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది" అన్నారు.

వేధింపుల గురించి బయటికి చెప్పకుండా నోరు నొక్కేస్తున్న "కల్చర్ ఆఫ్ సైలెన్స్ అండ్ సీక్రెసీ"ని గత ఏడాది నవంబర్‌లో "కాథలిక్ చర్చ్ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ నన్స్" ఖండించింది.

చర్చిల్లో మతాధికారులు పిల్లలు, యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు చాలాకాలం నుంచీ ఆరోపణలు వస్తున్న సమయంలో పోప్ నన్ల వేధింపులపై ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

pope

ఫొటో సోర్స్, EPA

పోప్ ఫ్రాన్సిస్ ఏం అన్నారు?

మంగళవారం ఒక చారిత్రక పర్యటన కోసం మధ్యప్రాచ్యం వెళ్లిన పోప్ ఒక మీడియా సమావేశంలో "చర్చికి ఒక సమస్య ఉంది. దాని మూలం మహిళలను రెండో తరగతిగా చూడడంలోనే ఉంది" అని అంగీకరించారు.

"ప్రీస్టులు, బిషప్‌లు నన్లను వేధింపులకు గురిచేశారు, చర్చి 'అపఖ్యాతి' గురించి నాకు తెలుసు, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం. చాలా మంది మతాధికారులను సస్పెండ్ కూడా చేశాం" అన్నారు.

"పోప్ బెనెడిక్ట్ ఒక స్థాయిలో ఉన్న మహిళా సమాజాన్ని కూడా రద్దు చేయగలిగే ధైర్యం చేశారు. ఎందుకంటే అందులోకి 'మహిళా బానిసత్వం' ప్రవేశించింది. ఆ బానిసత్వాన్ని మతాధికారులు, వ్యవస్థాపకుల కోణంలో 'సెక్స్ బానిసత్వం' అని కూడా అనచ్చు".

"నన్లపై లైంగిక వేధింపులు అనేది కొనసాగుతున్న సమస్య, కానీ అది కొన్ని సమాజాల్లో, ప్రధానంగా కొత్తగా ఏర్పడ్డ వాటిలోనే జరుగుతోంది" అని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.

"అవి ఇంకా జరుగుతున్నట్టే అనిపిస్తోంది. ఎందుకంటే ఇది, మనం ఏదైనా ఒక సమస్య గురించి అప్పటికప్పుడే అప్రమత్తం కాగానే, వెంటనే దూరం అయిపోయే సమస్య కాదు".

బిషప్ ఇల్లు
ఫొటో క్యాప్షన్, జలంధర్ బిషప్ నివాసం

వేధింపులు ఎక్కడెక్కడ జరిగాయి?

2005లో రద్దైన మహిళా సమాజం పోప్ బెనెడిక్ట్ కింద పనిచేసిన 'కమ్యూనిటీ ఆఫ్ సెయింట్ జీన్'. అది ఫ్రాన్స్‌కు చెందినది" అని వాటికన్ సిటీకి చెందిన అలెస్సాండ్రో జిసోట్టీ బీబీసీకి చెప్పారు.

ఫ్రెంచ్ రోమన్ కాథలిక్ వార్తాపత్రిక లా క్రోయిక్స్‌ కథనం ప్రకారం "మతాధికారులు పవిత్ర పద్ధతులకు వ్యతిరేకంగా చాలా మంది మహిళలతో ప్రవర్తించారని 'కమ్యూనిటీ ఆఫ్ సెయింట్ జీన్' 2013లో అంగీకరించింది.

భారత్‌లో బయటపడ్డ మరో కేసులో 2014-2016 మధ్య ఒక నన్‌పై 13 సార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలతో గత ఏడాది ఒక బిషప్‌ను అరెస్ట్ చేశారు.

జలంధర్‌ మతాధికారిగా పనిచేసిన బిషప్ ఫ్రాంకో ములక్కల్ తనపై ఆరోపణలను ఖండించారు.

చిలీలో కూడా మతాధికారులు నన్లను వేధించినట్లు వార్తలు రావడంతో గత ఏడాది వాటికన్ ఒక దర్యాప్తు ప్రారంభించింది. ఈ వేధింపులు బయటపడడంతో మహిళలను ఆర్డర్ నుంచి తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది ఇటలీ, ఆఫ్రికాలో కూడా వేధింపుల కేసులు వెలుగుచూసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ గత ఏడాది తెలిపింది.

నిరసనల్లో పాల్గొన్న నన్స్

చర్చిల్లో మహిళలు ఏం చేసేవారు?

వాటికన్ మహిళా మ్యాగజీన్‌ 'వుమెన్ చర్చ్ వరల్డ్' ఈ వేధింపులను కొన్ని రోజుల క్రితమే ఖండించింది.

"కాథలిక్కులలో నిషేధం ఉన్నప్పటికీ, కొన్ని కేసుల్లో మతాధికారుల వల్ల కలిగిన గర్భాన్ని నన్లు బలవంతంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది" అని పత్రిక తెలిపింది.

నన్లపై లైంగిక వేధింపుల గురించి పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడడంపై ఈ మ్యాగజీన్ ఎడిటర్ లుసెట్టా స్కారఫ్పియా "ఇది కాస్త సాయం కావచ్చు, కానీ చర్చి దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించారు.

"జరిగే ఘోరాలను పట్టించుకోకుండా వాటికన్ ఇలాగే కళ్లు మూసుకుని ఉంటే, చర్చిల్లో మహిళలపై జరుగుతున్న అణచివేత ఎప్పటికీ మారదు" అని ఆమె రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)