భారత్‌లోని చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియకు తెరపడుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నవీన్ నేగి
- హోదా, బీబీసీ ప్రతినిధి
కన్ఫెషన్. ఈ ఇంగ్లీష్ పదం మొట్ట మొదట స్కూల్లో ఆఖరి రోజున 'కన్ఫెషన్ సెషన్' జరిగినప్పుడు తెలిసింది. ఆ రోజు స్నేహితులందరూ మనసువిప్పి మాట్లాడుకునేవారు. తమకు ఎవరంటే ఇష్టమో, ఏ టీచర్ అంటే ఇష్టం లేదో, ఎవరు ఎక్కువ అల్లరి చేశారో, వంటి విషయాలతో పాటు చాలా విషయాలను చర్చించుకునేవారు.
కన్ఫెషన్ అంటే నమ్మకం ఉన్నవారితో మన మనసులో దాచుకున్న రహస్యాలను పంచుకోవడం. అలా చేయడం వల్ల మనసులో ఉన్న భారమంతా పోతుంది.
ఈ కన్ఫెషన్‌లో ఒక పెద్ద షరతు ఉంది. సెషన్ పూర్తైన తర్వాత ఎవరూ దాని గురించి మాట్లాడకూడదు. ఎవరు ఏం చెప్పినా అది ఆ నాలుగు గోడల మధ్యే ఉండిపోతుంది.
కానీ కొందరిని బ్లాక్‌మెయిల్ చేయడానికి, లైంగికంగా వేధించడానికి ఆ కన్ఫెషన్ ఒక మార్గంగా మారుతుందని మాత్రం అప్పుడు అనుకోలేదు.
కేరళలో ఇటీవల ఒక చర్చిలోని ఫాదర్ తనను ఏళ్ల తరబడి లైంగికంగా వేధించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు ఒక వివాహిత ఆరోపించారు. దీంతో దేశంలోని చర్చిల్లో కన్ఫెషన్(మన తప్పులను అంగీకరించడం) దుర్వినియోగంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.
తనకు 16 ఏళ్ల వయసు నుంచి.. పెళ్లయ్యే వరకూ ఫాదర్ తనను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించారు.
పెళ్లి తర్వాత ఆమె ఈ విషయాన్ని చర్చిలోని మరో ఫాదర్‌కు కన్ఫెస్ చేసినప్పుడు.. ఆయన కూడా ఆమెను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి.
దీంతో తీవ్రంగా కుంగిపోయిన ఆ మహిళ ఫాదరైన మరో కౌన్సిలర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ కూడా అలాంటి పరిస్థితే ఎదురైందని ఆమె ఆరోపించారు.

ఫొటో సోర్స్, Thinkstock
ఈ లోపు పంజాబ్‌లోని జలంధర్‌లో ఫాదర్‌కు సంబంధించిన మరో విషయం వెలుగుచూసింది. అతడు కొట్టాయం జిల్లాకు చెందిన వ్యక్తి. అక్కడ ఒక నన్‌పై అతడు 2014 నుంచి 2016 వరకూ లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ రెండు ఘటనలతో చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ రెండు కేసులను పరిగణనలోకి తీసుకున్న జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యు) వీటిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. చర్చిల్లో జరిగే కన్ఫెషన్ ఆచారాన్ని నిలిపివేయాలని సిఫారసు చేసింది.
కన్ఫెషన్ ఇవ్వడం వల్ల మహిళల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని కమిషన్ తన నివేదికలో తెలిపింది.

సిఫారసులు
- కేరళ చర్చిలో రేప్, లైంగిక వేధింపుల కేసులపై ఒక కేంద్ర ఏజెన్సీ ద్వారా విచారణ జరిపించాలి.
- కన్ఫెషన్ ఆచారం నిలిపివేయాలి. దాని కారణంగా మహిళలను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.
- కేరళ, పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్‌లపై వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులపై వచ్చిన ఆరోపణలపై నిర్ణయం తీసుకోవాలి.
- బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సాయం అందించాలి.

ఫొటో సోర్స్, Getty Images
కన్ఫెషన్ అంటే ఏంటి?
చర్చిలో కన్ఫెషన్ ఎలా ఉంటుంది? దాన్ని ఎలా చేస్తారు? అన్నది తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది.
దిల్లీ వికాస్‌పురి ప్రాంతంలో ఉంటున్న 'అవర్ లేడీ ఆఫ్ గ్రేసెస్' చర్చి పాస్టర్ ఫాదర్ దీపక్ సోరెంగ్ దీని గురించి వివరంగా చెప్పారు.
కన్ఫెషన్ చేయడానికి చర్చిలో ప్రత్యేకమైన ఒక ప్రాంతం ఉంటుంది. కన్ఫెషన్ చేసుకునే వ్యక్తి, చర్చి పాస్టర్ అక్కడికి వెళ్తారు.
ఒక వ్యక్తి కన్ఫెషన్ చేస్తున్నప్పుడు, అక్కడ పాస్టర్ తప్ప మూడో వ్యక్తి ఎవరూ ఉండకూడదు అని ఆయన చెప్పారు.
కన్ఫెషన్ ప్రాధాన్యత గురించి చెబుతూ.. "బైబిల్ రెండో చాప్టర్‌లో కన్ఫెషన్ ప్రస్తావన ఉంది. అందరూ రోజువారీ పనుల కోసం బయటికి వెళ్తునప్పుడు ఎన్నో మంచి- చెడు పనులు చేయాల్సి ఉంటుంది. జీవితంలో అతడు ఎన్ని పాపాలను చేస్తాడో, వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం చాలా అవసరం. అందుకే మీ పాపాలను దేవుడి ప్రతినిధిగా భావించి చర్చి పాస్టర్ ముందు చెప్పుకోవాలని ఏసు చెప్పారు అని ఆ చాప్టర్లో ఉంది." అని సోరెంగ్ అన్నారు.
ఫాదర్ సోరెంగ్ మరో విషయం కూడా చెప్పారు. సాధారణంగా చిన్న పిల్లలు కన్ఫెస్ చేయరు. ఎందుకంటే మంచి ఏదో- చెడు ఏదో వారికి తెలియదు. పిల్లలకు 9 లేదా పదేళ్లు వచ్చినపుడు వాళ్లు కన్ఫెషన్ ఇవ్వడానికి అర్హత పొందుతారు. ఎందుకంటే ఆ వయసు తర్వాత ఎవరికైనా మంచి- చెడు మధ్య వ్యత్యాసం తెలుస్తుందని భావిస్తారు.

ఫొటో సోర్స్, Ncw
కన్ఫెషన్ చేసిన విషయం ఎప్పటికీ బయటకు రాదని ఏదైనా గ్యారంటీ ఉంటుందా? అంటే..
దీనికి సమాధానంగా.. "అది నమ్మకాన్ని బట్టి ఉంటుంది. పాస్టర్ ముందు ఎవరైనా తమ తప్పులను ఒప్పుకున్నారు అంటే, దాని అర్థం ఆ వ్యక్తి తన మనసు శుద్ధి చేసుకుంటున్నాడు అని. అలా చేయడానికి పాస్టర్ అతడికి సాయం చేస్తాడు. అందుకే పాస్టర్ తన రహస్యం ఎవరికీ చెప్పరని వాళ్లలో ఒక నమ్మకం ఏర్పడుతుంది" అని సోరెంగ్ చెప్పారు.
మరి పాస్టర్ ఆ రహస్యాన్ని బహిర్గతం చేసినపుడు, లేదా దానిని దుర్వినియోగం చేసినప్పుడు ఏమవుతుంది?
దీనిపై ఫాదర్ సోరెంగ్ మాటల్లో ఆందోళన వ్యక్తమైంది. "ఇప్పటివరకూ ఇలాంటి ఘటనలు నా దృష్టికి రాలేదు. కానీ ఎవరైనా పాస్టర్ అలా చేస్తే, అలాంటి వారిని మొదట పాస్టర్ పదవి నుంచి తొలగిస్తాం. తర్వాత వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. అయితే బైబిల్‌లో ఇలాంటి అంశాలకు సంబంధించి ఎలాంటి నియమాలు లేవు" అని సోరెంగ్ చెప్పారు.
మహిళా కమిషన్ చేసిన సిఫారసుల ప్రకారం చర్చిలో కన్ఫెషన్ ఆచారాన్ని నిలిపివేస్తే, క్రైస్తవ మతంపై ఏదైనా ప్రభావం పడుతుందా? అంటే
"అలాంటి వాటి వల్ల మతంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే కన్ఫెషన్ లేకపోయినా జనం ప్రార్థనలు చేయడానికి వస్తారు. తమ తప్పులను ఎవరి ముందైనా ఒప్పుకోలేకపోవడం అనేది కొందరికి కష్టంగా ఉంటుంది" అని సోరెంగ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళా కమిషన్ సిఫారసుల గురించి 'ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్' ప్రధాన కార్యదర్శి జాన్ దయాళ్‌ను కూడా బీబీసీ కలిసి మాట్లాడింది.
జాన్ దయాళ్ మాట్లాడుతూ.. "మహిళా కమిషన్ ఛైర్మన్ బీజేపీ సభ్యులు. ఈ విషయం గురించి తెలియకుండా వాళ్లు ఒక రాజకీయ నాయకుల్లా మాట్లాడుతున్నారు. భారతదేశంలో దాదాపు 2 కోట్ల క్యాథలిక్, ఆర్థొడాక్స్ క్రైస్తవులు ఉన్నారు. వారు కన్ఫెషన్ ప్రక్రియను అనుసరిస్తారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు పారిస్ చర్చిల్లో కూడా వెలుగుచూశాయి. అక్కడ చట్ట ప్రకారం నిందితులైన పాస్టర్లకు శిక్ష విధించారు. భారత్‌లో కూడా చట్టం తన పని తాను చేయాలి. మేం చర్చిల్లో పారదర్శకతకు మద్దతిస్తున్నాం" అన్నారు.
మరోవైపు తాజా నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కన్నన్‌థనమ్ అన్నారు.
ఆయన తన ఫేస్‌బుక్ పేజిలో "ఇది ప్రభుత్వ అధికారిక వైఖరి కాదు. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అది రేఖా శర్మ వ్యక్తిగత అభిప్రాయం" అని పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ‘అందరూ పడుకున్నాక ఇంటి యజమాని నా దగ్గరకు వచ్చేవాడు’
- భారతీయ మహారాజు కానుకగా ఇచ్చిన ఆవులు, ఎద్దులు బ్రెజిల్ దశ మార్చాయి. ఇలా..
- చెర్రీ: హైదరాబాద్‌లో పుట్టిన అతి చిన్న పసిపాప.. ప్రిమెచ్యూర్ బేబీల జీవితాలకు కొత్త ఆశ
- ‘భారత్ గురించి ఇమ్రాన్‌కు తెలిసినంతగా ఏ పాక్ నేతకూ తెలియదు’
- ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును!
- ఊళ్లలో కుల వివక్షకు పేపర్ కప్పుకు సంబంధమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








