నరేంద్ర మోదీ నాలుగు సార్లు పర్యటించినా నేపాల్ చూపు చైనా వైపే ఉందా?

నరేంద్ర మోదీ, కొయిరాలా

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం నేపాల్ ఆసక్తిగా ఎదురు చూస్తోందా? ఐదేళ్ల మోదీ పాలనలో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి?

భారత ప్రధానమంత్రి నాలుగు సార్లు ఖట్మాండులో పర్యటించిన తర్వాత కూడా ఆ దేశం చైనా వైపు చూస్తోందా? బీబీసీ ప్రతినిధి సురేంద్ర ఫుహాల్ కథనం...

ఇండియా, నేపాల్ మధ్య విశిష్ట సంబంధంలో చాలా సారూపత్యతలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య తెరిచి ఉండే సరిహద్దు, నేపాల్‌లో భారత కరెన్సీ చెల్లుబాటు వంటివి కొన్ని.

వీడియో క్యాప్షన్, వీడియో: భారత పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై నేపాల్‌లో ఆసక్తి.. ఎందుకు?

2014లో మోదీ తన ప్రమాణ స్వీకారానికి.. నాటి నేపాల్ ప్రధానమంత్రి సుశీల్ కొయిరాలా సహా సార్క్ సభ్య దేశాల నాయకులను ఆహ్వానించడం ద్వారా పొరుగు దేశాలకు తన ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వనుందో చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు భారత్-నేపాల్‌ సంబంధాలు ఎంతో మారిపోతాయన్న ఆశలు రేకెత్తాయి.

కానీ రెండేళ్లు తిరిగే సరికి పరిస్థితి మారిపోయింది. అప్పటికే భూకంపం కారణంగా తీవ్రంగా నష్టపోయిన నేపాలీలకు మదేశీల ఉద్యమం కారణంగా భారత్ నిత్యావసరాల సరఫరా నిలిపేయడం రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచింది.

కొత్తగా ఏర్పాటైన నేపాలీ రాజ్యాంగం తమకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని మదేశీ ఉద్యమకారుల ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే మదేశీలను రెచ్చగొడుతోంది ఇండియాయేనని ఆరోపించింది నేపాల్ ప్రభుత్వం. భారత్ ఆ ఆరోపణల్ని ఖండిస్తోంది.

నేపాల్‌లో నిరసనలు

''నేపాలీలను బుజ్జగించడంలో మోదీ సఫలం కాలేదన్నది నిజం. నేటికీ నేపాల్ చాలా విషయాల్లో భారత్‌ మీదే ఆధారపడి ఉంది. కానీ నాకాబందీ సమయంలో మేం ఎదుర్కొన్న ఇబ్బందులు మా మదిలోనుంచి తొలగిపోవు'' అని ఆశిష్ భండారీ వ్యాఖ్యానించారు.

''మొదట్లో ప్రతి ఒక్కరూ మోదీని అభినందించారు. ఆయన పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించడం పట్ల సంతోషించాం. కానీ ఆ తర్వాత ఆయన దిగ్బంధనం ద్వారా మాకు ఇబ్బందులు సృష్టించారు. ఇప్పుడు మోదీ గురించి అందరికీ బాగా తెలుసు కాబట్టి ఎవరూ మోసపోలేరు'' అని శ్రీజన ధున్గానా అనే మహిళ పేర్కొన్నారు.

ఆ ఉదంతంతో నేపాల్ క్రమంగా తన తూర్పు సరిహద్దు దేశమైన చైనాకు దగ్గరవుతూ వచ్చింది.

నేపాల్ - చైనా

ఆ ఐదు నెలల దిగ్బంధనం తర్వాత భారతదేశం స్పందించింది. మదేశీలను ప్రధాన స్రవంతిలో చేరాలని కూడా కోరింది. ‘‘అయితే ఈ విషయంలో భారత కృషి నిష్ఫలమైందని నా ఉద్దేశం. మోదీ మొదట ఒక తప్పు చేశారు. ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలోనే మిగతా కాలం గడిపేశారు'' అని దేశ్‌సంచార్.కామ్ ఎడిటర్ యుబరాజ్ ఘిమిరి అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత మోదీ నాలుగు సార్లు ఖట్మాండులో పర్యటించారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆ దేశానికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇక దౌత్యపరంగా చూస్తే ఇవాళ నేపాల్ అటు చైనాకు ఇటు భారత్‌కు సమదూరం పాటిస్తూ ఆచితూచి అడుగులు వేస్తోంది.

అయితే ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. నేపాల్ అధికార పార్టీ ఇప్పుడు మోదీకి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

మోదీ నేపాల్

ఫొటో సోర్స్, Getty Images

''ఆయన హయాంలో ఇండో-నేపాల్ సంబంధాల విషయంలో కొన్ని సానుకూల మార్పులొచ్చాయి. అది మంచిదే'' అని నేపాల్ మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నేత నారాయణ్ కజి శ్రేష్ఠ పేర్కొన్నారు.

అయితే కొంతమంది నేపాలీలకు.. మోదీ ఏం చేశారు, ఏం చెయ్యలేదు అన్నది మాత్రమే ముఖ్యం కాదు.

భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23న రాబోతున్నాయి. అప్పటి వరకు రెండు దేశాలు తమ సంబంధాల గురించి పునఃమదింపు చేసుకోవటానికి సమయం ఉంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)