'మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం'.. కశ్మీర్‌లో పెల్లుబికిన నిరసనలు

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం
జమ్మూకశ్మీర్‌లో మూడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైందనే ఆరోపణలతో నమోదైన కేసు కలకలం రేపింది.
బందీపురతో పాటు కశ్మీర్ లోయలోని మరికొన్ని ప్రాంతాల్లో సోమవారం పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి.
బాధిత చిన్నారి, నిందితుడి స్వస్థలమైన సుంబల్‌లోని మలిక్‌పురలో అధికారులు కర్ఫ్యూ విధించారు.

ఫొటో సోర్స్, EPA
మలిక్‌పురకు వచ్చే దారులన్నింటినీ పోలీసు, పారామిలిటరీ దళాలు మూసివేశాయి. మీడియాను కూడా అనుమతించడం లేదు. ఆ ప్రాంతంతోపాటు ప్రధాన రహదారి వెంబడి పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
బారాముల్లా ప్రాంతంలో సోమవారం జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కొందరు యువకులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
తమ ఇంటికి సమీపంలోని పాఠశాల బాత్రూమ్‌లో అత్యాచారం జరిగిందని బాధిత చిన్నారి తండ్రి బీబీసీతో చెప్పారు. ఈ ఘటనతో తమ కుటుంబ సభ్యులందరూ దిగ్భ్రాంతి చెందారని పేర్కొన్నారు.
''మే 9న రాత్రి 7 గంటలకు ఈ అత్యాచారం జరిగింది. అప్పుడు నేను మసీదుకు వెళ్లాను. కుమార్తె కోసం నా భార్య అంతటా వెతుకుతోంది. స్కూల్ దగ్గరి నుంచి శబ్దాలు వినిపించాయని స్థానిక బాలికలు చెప్పారు. ఆ దగ్గరలోనే చిన్న కొలను ఉంది. అందులో మా పాప పడి ఉంటుందేమోనని గాలించాం. దొరకలేదు'' అని ఆయన చెప్పారు.
''తిరిగి పాప పేరును గట్టిగా పిలవడం మొదలుపెట్టాం. ఆమె అరుపులు చిన్నగా వినిపించాయి. స్కూల్ బాత్రూంలో పడి ఉండి, 'అమ్మా.. అమ్మా' అంటూ ఆమె అరుస్తోంది. ఇరుగుపొరుగు వాళ్లతో కలిసి మేం అక్కడికి వెళ్లి, నిందితుడిని పట్టుకున్నాం. మా పాప బట్టలపై, బాత్రూంలో రక్తపు మరకలున్నాయి. నిందితుడి తండ్రి, సోదరులను పిలిపించి, అతడు చేసిన పనిని చూపించాం. ఆ తర్వాత అతడిని వారికి అప్పగించి, పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. నిందితుడు అప్పుడప్పుడూ మా చిన్నారిని బయటకు తీసుకువెళ్లేవాడు. ఇంత పని చేస్తాడని ఊహించలేదు'' అని వివరించారు.
పోలీసుల తీరు సంతృప్తికరంగానే ఉందని, దోషికి కఠినమైన శిక్ష పడాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
నిందితుడి తండ్రి అబ్దుల్ రెహమాన్ బీబీసీతో మాట్లాడారు.
తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసత్యమైనవని, భూవివాదం కారణంగానే ఈ కేసు పెట్టారని ఆరోపించారు.
''ఆ చిన్నారి కుటుంబానికి నేను ఇల్లు విక్రయించా. వాళ్లు నా కుమారుడిపై పూర్తిగా అసత్య ఆరోపణలు మోపారు. నేరం జరిగిన సమయంలో నా కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అతడు నిజంగానే దోషి అని తేలితే శిక్షించాలి'' అని అన్నారు.
కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించినట్లు బందీపుర ఎస్పీ రాహుల్ మలిక్ చెప్పారు.
ఆ బృందం పని ప్రారంభించిందని, వాంగ్మూలాలు కూడా నమోదు చేసిందని తెలిపారు.
''విచారణ త్వరితగతిన సాగుతోంది. బాలిక వయసు మూడేళ్లు కావడంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశాం'' అని రాహుల్ చెప్పారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
నిందితుడిని మైనర్‌గా చూపించేందుకు స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తప్పుడు జనన ధ్రువపత్రం జారీ చేశారని స్థానికులు ఆరోపించారు.
''ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటల్లోనే నిందితుడి వయసు పదేళ్లని, నాలుగో తరగతి చదువుతున్నాడని ధ్రువపత్రం ఇచ్చారు. పోలీసులకూ ఈ విషయం చెప్పాం. అది తప్పుడు పత్రమని వారు కూడా అభిప్రాయపడ్డారు'' అని స్థానికుడు మహమ్మద్ అస్లాం చెప్పారు.

ఫొటో సోర్స్, MAJID JAHAGIR/BBC
ఈ విషయం గురించి ఎస్పీ రాహుల్ మలిక్‌ను బీబీసీ ప్రశ్నించింది.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ఆయన బదులిచ్చారు. నిందితుడి వయసును నిర్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
దోషికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఇందర్‌పుర సుంబల్‌లో రహదారిపై మహిళలు ప్రదర్శన నిర్వహించారు.
''మూడేళ్ల అమాయక చిన్నారిపై ఈ అఘాయిత్యం జరిగింది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయంగా ఉంది. నిందితుడిని ఉరి తీయాలని మేం డిమాండ్ చేస్తున్నాం'' అని ప్రదర్శనలో పాల్గొన్న అమీనా చెప్పారు.

ఫొటో సోర్స్, MAJID JAHANGIR/BBC
ఘటనను సమాజానికి ఓ మచ్చగా వేర్పాటువాద నాయకుడు, హురియత్ కాన్ఫరెన్స్ గ్రూప్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ వర్ణించారు.
రెండు నెలల క్రితం బందీపురలో కన్నతండ్రి అత్యాచారం చేయడంతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన కశ్మీర్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
2018లో జమ్మూలోని కఠువాలో ఎనిమిదేళ్ల చిన్నారి అపహరణ, అత్యాచారాలకు గురైన కేసు కూడా భారీ ఎత్తున నిరసనలకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
- మోదీ నిజంగానే మిరాజ్ విమానాలను మేఘాలతో పాక్ రాడార్ నుంచి కాపాడారా...
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ధోని పొరపాటు చెన్నైకి ఐపీఎల్ టైటిల్‌ను దూరం చేసిందా?
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- అమెరికా: 'ఈ శిలువను బహిరంగ ప్రదేశం నుంచి తొలగించండి'
- భారత్, దక్షిణాసియా అమ్మాయిలపై ఆస్ట్రేలియాలో లైంగిక వేధింపులు
- 'లైంగిక దాడుల బాధితులను ఆదుకోవడంలో విఫలం' అనే కథనంపై స్పందించిన భారత క్యాథలిక్ చర్చి
- ‘‘వాటికన్ ఒక గే సంస్థ’’: క్రైస్తవ పూజారుల ‘రహస్య జీవితాలు బట్టబయలు చేసిన’ జర్నలిస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









