లైంగిక నేరాలు: దేశంలో ఎన్ని చట్టాలున్నా ఎందుకు తగ్గడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
మహిళలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. చిన్న పిల్లపై తీవ్ర లైంగిక నేరాల విషయంలో మరణశిక్ష కూడా విధించేలా చట్టాల్ని సవరించారు. మైనర్లపై జరిగే నేరాల నియంత్రణకు 2012లో పోక్సో చట్టం కూడా తీసుకువచ్చారు. 2013లో మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను కూడా బలోపేతం చేశారు.
కానీ 2013లో 35శాతం అధికంగా రేప్ కేసులు పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. దీని తర్వాత చేపట్టిన మరికొన్ని చర్యలు కూడా ఈ సంఖ్య మరింత పెరగడానికి దోహదం చేశాయి. పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసుల సంఖ్యను పెంచడం, మహిళలు మాత్రమే పనిచేసే స్టేషన్లను ఏర్పాటు చేయడం, నిర్భయ నిధి వంటి చర్యలు మహిళలకు కొంత ధైర్యాన్నిచ్చాయి.
ఇన్ని చేసినా, లైంగిక నేరాల విషయంలో శిక్షలు పడటంలో మాత్రం పెద్దగా మార్పేమీ కనిపించడం లేదు.
శిక్షల వరకూ వచ్చే కేసులు ఐదేళ్ల క్రితం ఉన్న 25శాతమే ఇప్పుడూ కొనసాగుతోంది.
బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య పరిశోధన.
ఐదేళ్ల క్రితం తమ నాలుగేళ్ల తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని ఈ తల్లిదండ్రులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
2014లో దిల్లీలో వారి పొరుగింటి వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.
అతడిని పట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ఈ బాలిక కుటుంబం ఈ నగరాన్ని వదిలి వెళ్లిపోవాలని ఎన్నోసార్లు అనుకుంది.
"ఇంత దారుణ నేరానికి పాల్పడిన వ్యక్తి మళ్లీ ఇలాంటిదేదైనా చేస్తాడేమో అనే ఆలోచన కొన్నిసార్లు నాకు నిద్ర పట్టనివ్వడంలేదు.
ఇంతవరకూ ఏ లాయరూ మమ్మల్ని సంప్రదించలేదు. అతనికి శిక్ష పడిందని ఏ పోలీసూ మాకు చెప్పలేదు.
అతడు విడుదలై ఉంటాడని అనుకుంటున్నా" అని ఆ బాలిక తండ్రి ఆందోళన చెందుతున్నారు.

ఆ తర్వాత ఒకరోజు, సంపూర్ణ అనే ఎన్జీవో నుంచి గరిమ వీరిని సంప్రదించారు. అత్యాచారాలపై పాత కేసులను ఆమె పరిశీలిస్తుంటారు.
కోర్టుల్లో సుదీర్ఘకాలం కొనసాగే విచారణలతో ఈ తల్లిదండ్రులు తమ ఆశ వదులుకున్నారు.
కానీ, నిందితుడికి 15ఏళ్ల జైలు శిక్ష పడిందని, వీరు నిర్భయ నిధి ద్వారా పరిహారం కూడా పొందవచ్చని గరిమ తెలిపారు.

2012లో నిర్భయ అత్యాచారం తర్వాత న్యాయవ్యవస్థ పనితీరు మెరుగుపరిచేందుకు కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి సరిపోవు.
"విచారణ చాలాకాలంపాటు సాగుతుంది. అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ప్రాసిక్యూటర్ చాలా బిజీగా ఉన్నారు. కేసును సరైన రీతిలో డీల్ చెయ్యడానికి ఆయనకు సమయం లేదు, దాన్ని అర్థం చేసుకోవడం లేదు" అని దిల్లీ మాజీ డీసీపీ ఆమోద్ కాంత్ అభిప్రాయపడ్డారు.
"బాధిత కుటుంబాన్ని కలుసుకోవడం, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడం, బాధితురాలి పునరావాసం, మానసిక స్థితిని అర్థం చేసుకోవడం - ఇవన్నీ చాలా సమస్యలు. ఎన్నో మంచి చట్టాలున్నప్పటికీ ఈ సమస్యల వల్లే పూర్తి ఫలితాలు రావడం లేదు" అని ఆమోద్ కాంత్ అభిప్రాయపడ్డారు.
పిల్లలపై లైంగిక హింస విపరీతంగా పెరుగుతోందని ఆమోద్ కాంత్ నిర్వహించిన ఓ సర్వేలో స్పష్టమైంది. కఠిన చట్టాల రూపకల్పనకు ఈ సర్వే వివరాలు ఆధారమయ్యాయి.

ప్రస్తుత, గత ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు రూపొందించాయి. రేప్ అనే పదానికి నిర్వచనాన్ని విస్తృతం చేసి, ఎన్నో లైంగిక నేరాలను ఈ పరిధిలోకి తెచ్చారు.
ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైతే జరిమానాలు కూడా విధించవచ్చు. దీంతో అత్యాచారాలపై ఫిర్యాదుల నమోదు సులభమైంది.
పోలీసుల వద్దకు ఎన్నో కేసులు వస్తున్నప్పటికీ, కేవలం 20శాతం మాత్రమే విచారణ దశను దాటుతున్నాయి.
వీటిలో 25శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఈ సంఖ్యలో ఏమీ మార్పు లేదు.

"మన దగ్గర ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేవు. కోర్టుల్లో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విచారణలు ఆలస్యమవుతున్నాయి.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపై మేం ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయగలం. మేం ఇప్పటికే అది చేశాం. ఇక ముందు కూడా చేస్తాం" అని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు.
వెయ్యి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు గతేడాది ప్రభుత్వం ప్రకటించింది.
వీటితో సత్వర న్యాయం జరుగుతుందని మహిళలు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- అభిప్రాయం: ఆయనకు ఇద్దరున్నపుడు ఆమెకిద్దరు ఎందుకు ఉండకూడదు?
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
- రేణూ దేశాయ్: స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు
- మహిళల అవయవాలకు ‘మగ’ పేర్లే ఎందుకున్నాయి?
- “పిల్లల్ని కనడం తప్పనిసరి కాదు.. అది నా ఇష్టం”
- ‘ఏపీలో ముందు స్కాములు ప్లాన్ చేసి తరువాత స్కీములు ప్రవేశపెడుతున్నారు’
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









