తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్‌కు బహూకరించిన మరియా కోరీనా మచాదో, నోబెల్ కమిటీ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, Reuters/White House
- రచయిత, మాక్స్ మాట్జా
- హోదా, బీబీసీ ప్రతినిధి
వెనెజ్వెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కోరీనా మచాదో గురువారం శ్వేత సౌధంలో అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. ఈ ప్రైవేటు సమావేశంలో తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ట్రంప్‌కు అందచేసినట్టు మచాదో చెప్పారు.
ట్రంప్, మచాదో వ్యక్తిగతంగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. అమెరికా దళాలు వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను కారకస్‌లో అదుపులోకి తీసుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అభియోగాలు మోపిన కొన్ని వారాల అనంతరం ఈ సమావేశం జరిగింది.
ట్రంప్‌తో సమావేశానంతరం ‘‘ఈ రోజు వెనెజ్వెలా ప్రజలకు చరిత్రాత్మక రోజుగా భావిస్తున్నా’’ అని మచాదో చెప్పారు.
‘‘ఇది పరస్పర గౌరవానికి ఓ అద్భుతమైన మచ్చుతునక’’ అని ట్రంప్ సోషల్‌మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.
వెనెజ్వెలాలో 2024లో జరిగిన ఎన్నికలలో తాము గెలిచామని మచాదో వర్గం చెప్పినప్పటికీ, వెనెజ్వెలా కొత్త నాయకురాలిగా ఆమెకు ట్రంప్ ఇప్పటిదాకా మద్దతు ప్రకటించలేదు. మరోపక్క తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తోనే ఆయన మాట్లాడుతున్నారు. రోడ్రిగ్జ్ మదురో హయాంలో ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.
అయితే మచాదోతో సమావేశం ‘‘ఓ గొప్ప గౌరవం’’ అని ‘‘ఆమె ఓ అద్భుత మహిళ, ఎన్నో పరీక్షలు దాటి వచ్చారు’’ అని ట్రంప్ చెప్పారు.


ఫొటో సోర్స్, Reuters
వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అక్కడ గుమిగూడిన మద్దతుదారులతో మచాదో స్పానిష్‌లో మాట్లాడుతూ "మనం అధ్యక్షుడు ట్రంప్‌పై భరోసా పెట్టుకోవచ్చు’’ అన్నారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది.
తర్వాత "మన స్వేచ్ఛ పట్ల ఆయనకున్న ప్రత్యేక నిబద్ధతకు గుర్తింపుగా..నేను అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని బహూకరించాను" అని మచాదో ఇంగ్లీషులో విలేకరులతో చెప్పారు.
నోబెల్ శాంతి బహుమతిని పొందాలనే తన కోరిక గురించి తరచుగా మాట్లాడే ట్రంప్, మచాదోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం, దానిని ఆమె అంగీకరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అయినప్పటికీ, మచాదో గతేడాది ఆ గౌరవాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు.
ఈ విషయంపై స్పందన కోసం బీబీసీ వైట్ హౌస్‌ను సంప్రదించింది.
గత వారం మచాదో, ఆ నోబెల్ బహుమతిని ట్రంప్‌తో పంచుకుంటానని చెప్పారు. అయితే దాన్ని బదిలీ చేయలేమని నోబెల్ కమిటీ స్పష్టం చేసింది.
"ఒకసారి నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత, దానిని రద్దు చేయడం, పంచడం, లేదా ఇతరులకు బదిలీ చేయడం సాధ్యం కాదు.’’ అని కమిటీ కిందటివారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఇది శాశ్వత నిర్ణయమని’’ చెప్పింది.
మచాదో వ్యాఖ్యలపై స్పందన కోసం బీబీసీ సంప్రదించినప్పుడు, కమిటీ తమ గత ప్రకటననే ప్రస్తావించింది.
గురువారం వైట్ హౌస్ సమావేశానికి ముందు, "ఒక పతకం యజమానులను మార్చగలదు, కానీ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత బిరుదును కాదు" అని ఎక్స్‌లో నోబెల్ పీస్ సెంటర్ పోస్ట్ చేసింది.
ఆధునిక వెనెజ్వెలా వ్యవస్థాపక పితామహులలో ఒకరైన సైమన్ బొలివర్‌కు, అమెరికా స్వాతంత్య్ర యుద్ధంలో పోరాడిన మార్క్విస్ డి లాఫాయెట్ జార్జ్ వాషింగ్టన్ రూపం ఉన్న పతకాన్నిబహుమతిగా ఇవ్వడాన్ని మచాదో గుర్తు చేశారు.
ఇది అమెరికా, తన దేశం సంయుక్తంగా ‘దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ కోసం చేసిన పోరాటానికి సంకేతం, సోదర భావానికి గుర్తు’’ అని చెప్పారు.
"200 ఏళ్ల చరిత్రలో, బొలీవర్ ప్రజలు వాషింగ్టన్ వారసుడికి ఒక పతకాన్ని తిరిగి ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఆ పతకం నోబెల్ శాంతి బహుమతి .. మన స్వేచ్ఛ పట్ల ఆయన చూపిన ప్రత్యేక నిబద్ధతకు ఇది గుర్తింపు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వాషింగ్టన్ పర్యటన సందర్భంగా మచాదో అమెరికా సెనేటర్లను కలవడానికి కాంగ్రెస్‌కు కూాడా వెళ్లారు.
అక్కడ ఆమె మద్దతుదారులు "మరియా, ప్రెసిడెంట్" అని నినాదాలు చేస్తూ వెనెజ్వెలా జెండాలను ఊపుతుండటంతో ఆమె విలేకరులతో ఏం మాట్లాడారో సరిగా వినిపించలేదు.
ట్రంప్‌తో సమావేశమైన సమయంలో, రోడ్రిగ్జ్ తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం తప్పని, ఈ సంధికాలంలో తమ కూటమి వెనెజ్వెలాను పాలించాలనుకుంటోందని చెప్పి, ట్రంప్‌ను ఒప్పించడానికి ఆమె ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు.
గురువారం సమావేశం జరుగుతున్న సమయంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. " మచాదో వెనెజ్వెలా ప్రజలకు ఒక అద్భుతమైన, ధైర్యవంతమైన స్వరం, ట్రంప్ ఈ సమావేశం కోసం ఎదురుచూస్తున్నారు."అన్నారు.
ట్రంప్ గతంలో మచాదోను "స్వాతంత్య్ర సమరయోధురాలి"గా అభివర్ణించారు. కానీ మదురో తొలగింపు తర్వాత వెనెజ్వెలా నాయకత్వాన్ని మచాదోకు అప్పగించేందుకు ఆమెకు దేశంలో తగినంత మద్దతు లేదని వాదించారు.
జనవరి 3న మదురోను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి, అమెరికా ఆంక్షల కింద ఉన్న వెనెజ్వెలా చమురు రంగ పునరుద్ధరణకు ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
బుధవారం ఒక అమెరికా అధికారి మాట్లాడుతూ, అమెరికా 500 మిలియన్ (రూ.4,150 కోట్లు)డాలర్ల విలువైన వెనెజ్వెలా చమురును అమ్మిందని చెప్పారు.
నిషేధిత వెనెజ్వెలా చమురును రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్న చమురు ట్యాంకర్లను కూడా అమెరికా స్వాధీనం చేసుకుంది. గురువారం ఆరో ట్యాంకర్‌ను కూడా సీజ్ చేశామని అమెరికా దళాలు తెలిపాయి .
వెనెజ్వెలా ప్రభుత్వ రాయబారి గురువారం వాషింగ్టన్‌కు వెళ్లి అమెరికా అధికారులను కలవనున్నారు. దేశ రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
గురువారం కారకస్‌లో రోడ్రిగ్జ్ వార్షిక ప్రసంగం చేశారు. వాషింగ్టన్‌లో సమావేశాలకు హాజరు కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా చెప్పారు.
"నేను ఎప్పుడైనా తాత్కాలిక అధ్యక్షురాలిగా వాషింగ్టన్‌కు వెళ్లాల్సి వస్తే, ధైర్యంగా నిలబడి, నడుస్తూ వెళ్తాను, పాకుతూ కాదు, అమెరికాతో దౌత్యానికి భయపడొద్దు" అని వెనెజ్వెలా ప్రజలకు చెప్పారు రోడ్రిగ్జ్.
బుధవారం నాడు ట్రంప్, రోడ్రిగ్జ్ కూడా ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో రోడ్రిగ్జ్ "అద్భుతమైన వ్యక్తి" అని కొనియాడారు. అలాగే రోడ్రిగ్జ్ కూడా ఫలప్రదంగా, మర్యాదపూర్వకంగా, పరస్పర గౌరవంతో మాట్లాడుకున్నామని అభివర్ణించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













