డెనిజోవన్స్: షేర్పాలు, టిబెటన్లకు ఆక్సిజన్ లోపాన్ని తట్టుకునే జన్యువు ఈ ప్రాచీన మానవజాతి నుంచే సంక్రమించిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పాల్ రిన్‌కాన్
- హోదా, సైన్స్ ఎడిటర్; బీబీసీ న్యూస్ వెబ్‌సైట్
డెనిజోవన్స్ అని పిలిచే పురాతన మానవ జాతి టిబెట్‌లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలపై నివసించారనేందుకు శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించాయి.
ఇంతటి విపరీత వాతావరణాన్ని తట్టుకుని మనగలిగే సామర్థ్యం మన మానవ జాతి అయిన హోమో సెపియన్లకు మాత్రమే ఉండిందని ఇప్పటివరకూ పరిగణించేవారు.
ఆధునిక మానవులు ఇంతటి ఎత్తైన ప్రాంతాల్లో వాతావరణాన్ని తట్టుకోగలిగేందుకు సాయపడే జన్యువును పురాతన డెనిజోవన్స్ మానవులు వారసత్వంగా అందించిటన్లు కనిపిస్తోంది.
ఈ అధ్యయనం వివరాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు.
మనవంటి ఆధునిక మానవులు వేలాది సంవత్సరాల కిందట ప్రపంచమంతటా విస్తరించటానికి ముందు ఆసియాలో నివసించిన ఓ అంతుచిక్కని మానవ జాతి డెనిజోవన్స్.

ఫొటో సోర్స్, JEAN-JACQUES HUBLIN, MPI-EVA, LEIPZIG
ఈ మానవజాతికి సంబంధించి సైబీరియా - డెనిజోవా కేవ్ అనే ఒకే ఒక్క చోట దొరికిన ఒక ఎముక, పళ్ల ముక్కలు మాత్రమే ఇంతకుముందు వరకూ లభించిన శిలాజాలు.
అయితే.. ఈ డెనిజోవన్లు మానవ కుటుంబ వృక్షంలో ఒక సుదూర శాఖగా ఈ శిలాజాల డీఎన్‌ఏ వెల్లడించింది.
ఇప్పుడు మరో ప్రాంతం నుంచి తొలి డెనిజోవన్ శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. టిబెట్ పీఠభూమి మీద సముద్రమట్టానికి 3,280 మీటర్ల ఎత్తులో ఉన్న బైషియా కార్ట్స్ కేవ్‌లో 1980లో గుర్తించిన కింది దవడ ఎముక అది.
యురేనియం సిరీస్ డేటింగ్ అనే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఎముకను పరీక్షించినపుడు అది 1,60,000 సంవత్సరాల కిందటిదని వెల్లడైంది.
ఇంతటి ఎత్తైన ప్రాంతంలో అతి పురాతన మానవ జాతి నివసించినట్లు ఆధారాలు లభించటం ఆశ్చర్యకరమని జర్మనీలోని లీప్‌జిగ్‌లో గల మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంత్రోపాలజీ శాస్త్రవేత్త జీన్ జాక్వెస్ హుబ్లిన్ పేర్కొన్నారు. తాజా అధ్యయన సహ రచయిత ఆయన.
''అతి ప్రాచీన మానవజాతులను - నియాండర్తల్స్, డినిజోవన్స్ వంటి హోమోసెపియన్స్ తొలి రూపాలను - పరిశీలించినపుడు విపరీత వాతావరణాల్లో నివసించే విషయంలో ఈ మానవజాతుల సామర్థ్యాలు పరిమితమైనవేనన్నది స్పష్టం'' అని హుబ్లిన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, DONGJU ZHANG, LANZHOU UNIVERSITY
''యూరప్‌లో పరిస్థితిని చూసినట్లయితే.. నియాండర్తల్ నివాస ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి 150 ఏళ్లుగా జనం వీటిని అధ్యయనం చేస్తున్నారు. వీటిలో అత్యధిక ఎత్తులో ఉన్న ప్రాంతాలు సముద్రమట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉన్నవి. అవికూడా ఎక్కువగా లేవు. అదికూడా నియాండర్తల్ మానవులు వేసవి కాలంలో.. బహుశా ప్రత్యేక వేటల కోసం వెళ్లే ప్రాంతాలు అవి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది'' అని ఆయన వివరించారు.
టిబెటన్ పీఠభూమిలోని డెనిజోవన్స్ గురించి మాట్లాడుతూ.. ''అది ఒక పీఠభూమి... జనం అక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చివెళ్లటం కాకుండా.. అక్కడే నివసించటానికి తగినన్ని వనరులు ఉన్నాయి'' అని చెప్పారు.
పరిశోధకులకు ఆ శిలాజంలో డీఎన్ఏ ఆనవాళ్లేవీ లభించకపోయినప్పటికీ దవడ పన్నుల్లో ఒక దాని నుంచి మాంసకృత్తులు వెలికితీయగలిగారు. దానిని ప్రాచీన మాంసకృత్తుల విశ్లేషణ పద్ధతి అన్వయించి పరిశోధించారు.
''ఈ శిలాజం డెనిజోవా కేవ్‌లో బయటపడ్డ డెనిజోవన్లకు చాలా దగ్గరి సంబంధీకులైన ప్రాచీన మానవులకు సంబంధించినదని ఈ విశ్లేషణలో వెల్లడైంది'' అని ఈ అధ్యయన సహ రచయిత, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్ (డెన్మార్క్) పరిశోధకుడు ఫ్రిదో వెల్కెర్ పేర్కొన్నారు.
డెనిజోవా కేవ్‌లో లభ్యమైన మనుషుల్లో.. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో హైపోక్సియా (ఆక్సిజన్ లోపం) నుంచి రక్షణ కల్పించే జన్యువు ఎందుకు ఉందన్న విషయాన్ని ఈ పరిశోధనలో వెల్లడైన అంశాలు వివరించగలవు.

ఫొటో సోర్స్, DONGJU ZHANG, LANZHOU UNIVERSITY
సైబీరియాలోని ఆ గుహ సముద్ర మట్టానికి కేవలం 700 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉండటంతో అక్కడి వారికి ఆక్సిజన్ లోపాన్ని ఎదుర్కొనే పరిస్థితులు, అవసరం ఉండవు కాబట్టి.. వారిలో ఈ జన్యువు ఎందుకు ఉందన్నది ఇప్పటివరకూ అంతుచిక్కని మిస్టరీగా ఉంది.
ఇప్పటి షేర్పాలు, టిబెటన్లు, వారి పొరుగున నివసించే ప్రజా సమూహాల్లో కూడా ఇదే తరహా జన్యువు ఉంది. హోమో సెపియన్లు వేలాది సంవత్సరాల కిందట డెనిజోవన్లతో కలిసినపుడు ఈ జన్యువు వీరికి సంక్రమించి ఉండవచ్చునని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
నిజానికి ఈ తరహా జన్యువు సానుకూల ప్రకృతి వరణానికి లోనై జన్యు పరివర్తన జరిగి ఉండవచ్చునని పరిశోధకుల ఊహ.
''ఈ తరహా వాతావరణంలో నివసించటానికి.. అంటే ఆక్సిజన్ లోపించిన వాతావరణంలో శ్వాసపీల్చుకోవటానికి అనుకూలమైన జన్యు పరివర్తనాన్ని ప్రకృతి వరణం ద్వారా కొనసాగి ఉంటుందని మనం ఊహించవచ్చు'' అని ప్రొఫెసర్ హుబ్లిన్ పేర్కొన్నారు.
''నేటి టిబెటన్లకు ఈ జన్యు పరివర్తన ఎలా వచ్చిందనేదానికి ఈ పరిస్థితి ఒక వివరణ కావచ్చు'' అని అభిప్రాయపడ్డారు.
- ఇరవైల్లో ఉండే క్రియేటివిటీ అరవైల్లో ఉండాలంటే
- ఇజ్రాయెల్ దళాలు, పాలస్తీనా మిలిటెంట్ల మధ్య తీవ్రమైన ఘర్షణ
- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది...
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- స్కూలు నుంచి ఇంటికెళ్లాలంటే.. రెండు విమానాలు మారాలి, 5 రోజులు కొండలు ఎక్కాలి
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








