ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏం జరుగుతోంది? :అభిప్రాయం

ఫొటో సోర్స్, facebook/NaraChandrababuNaidu
- రచయిత, జాన్‌సన్ చోరగుడి
- హోదా, బీబీసీ కోసం
ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ)ల మధ్య ప్రతిరోజూ ప్రసార మాధ్యమాల్లో వినిపిస్తున్నసంవాదానికి కారణాలేంటి?
దేశం ఏనాడో 'నలుపు తెలుపు'ల్లో రాసుకున్న లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ పని విభజన, ఆ నియమ నిబంధనల అమలులో పాటించాల్సిన నైతికత ఇప్పుడు ఏమైంది?
కొత్తగా ఈ రెండు వ్యవస్థల మధ్య దూరం పెరగడానికి, ఇద్దరు కీలక అధికారులతో ముఖ్యమంత్రికి ఇంతగా స్పర్ధలు రావడానికి కారణాలు ఏమిటి?
ప్రజలు కూడా దీన్ని తమకు కావలసినట్లుగా అర్ధం చేసుకోవాలని వాస్తవాలను 'కండిషనింగ్' చేస్తున్న 'కొత్త మీడియా, దాని వెనకున్న శక్తుల మాటేంటి? చూద్దాం.. కొత్త ఆర్థిక సంస్కరణలతో మొదలైన 'సరళీకరణ' ప్రక్రియను దేశంలో అందరికంటే ముందుగా ఒడిసిపట్టుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ప్రయోగాత్మంగా దాన్ని నేరుగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశపెట్టి ప్రజలు ఎన్నుకోకుండానే, పొలిటికల్ మేనేజ్‌మెంట్' ద్వారా 1995లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు.
తొలి అడుగులోనే తనకు అధికారాన్ని అందించిన 'సరళీకరణ' సూత్రాన్ని అప్పటినుంచీ ఇప్పటి వరకూ ఆయన అన్వయించని రంగం లేదు, సందర్భము లేదు.
నిజానికి, దాన్నిఇప్పుడు ఆయన ఒక 'పొలిటికల్ స్కూల్' స్థాయికి చేర్చారు.
అప్పటివరకు ఆచరణలో ఉన్నపరిపాలన సంప్రదాయాలకు భిన్నమైన సరళీకరణ శైలిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలోకి తెచ్చారు.

ఉండిపోయేవారు రెండు రకాలు
ఒక ప్రాంతీయ పార్టీ అధినేత కనుసన్నల్లో మసిలే లెజిస్లేచర్ ఇలాంటి మార్పుకు తేలిగ్గానే అందులోకి ఒదుగుతుంది.
కానీ, అధికారగణం పరిస్థితి అలా ఉండదు. అటువంటి 'షిఫ్ట్'తో అది కొంత కుదుపునకు గురవుతుంది. సర్దుబాటుకు సమయం పడుతుంది.
దాన్ని ఉక్కపోత అనుకున్నవారు, కేంద్ర సర్వీసులు లేదా విదేశీ 'ఎసైన్మెంట్స్' చూసుకుని రాష్ట్రం వదిలి బయటకు వెళ్లారు.
ఇక్కడే పనిచేయడానికి ఆసక్తితో ఉన్నవారు రెండు రకాలు.
మొదటి రకం.. ఐఐటీ, ఐఐఎం నేపథ్యంతో వస్తున్న హిందీ బెల్ట్‌కు చెందిన కొత్త తరం యువ ఐఏఎస్, ఐపీఎస్‌లు.
వీరి దృష్టిలో దేశంలో ముందుగా పరిపాలనలో సరళీకరణ' ప్రక్రియను అనుసరిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇక్కడ వ్యాపారాల్లో వుండే ఆధిపత్య వర్గాలు ఇచ్చే 'ఆదరణ' వారికి మరో ఆకర్షణ.
ఈ కారణాలతోనే సర్వీస్ ఎంపికలో ఏపీ బయటి వారికి చాలా కాలంగా తొలి ప్రాధాన్యంగా ఉంటోంది.
వీరిలో ఎక్కువమంది స్వతంత్రంగా తమ అధికారాల్ని అమలుచేసే కలెక్టర్ పదవి వరకు రాష్ట్రంలో ఉంటున్నారు. ఆ తర్వాత, కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. మళ్ళీ వెనక్కి ఎక్కువగా రావడంలేదు.
ఇక రెండో రకం గ్రూప్-1 సర్వీస్ డిప్యూటీ కలెక్టర్లు. డీఎస్పీలు, ఇతర శాఖల నుంచి కోటా నిష్పత్తి మేరకు వచ్చే అధికారులు, కేడర్ కేటగిరీలో ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పదోన్నతి పొందుతున్నారు.
వీరు స్థానికులు కావడం, సగానికి పైగా సర్వీస్ రాష్ట్రంలోనే చేసి ఉండటం, హిందీ భాష మీద పట్టు తక్కువగా ఉండటం వంటి కారణాలతో రాష్ట్రంలోనే పనిచేసి ఇక్కడే రిటైర్ అవుతున్నారు.
చాలా సార్లు వీరికి దొరికే కీలక పోస్టింగ్స్ రాజకీయ నాయకుల అండదండలను బట్టి వుంటాయి. తర్వాత వారి మధ్య వుండే పరస్పర విశ్వసనీయతను వారు 'క్యాష్' చేసుకోవడం మామూలే.
ఈ నేపథ్యంలో 1996-97 మధ్య కొరియా దేశపు సామాజిక ఉద్యమాన్ని 'జన్మ భూమి' పేరుతో చంద్రబాబు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచార హోరుతో ప్రారంభించారు.
మూడు నెలలకు ఒకసారి క్షేత్ర పర్యటనలు చేస్తూ కింది స్థాయి ఉద్యోగుల పనిని కూడా నేరుగా ఆయనే సమీక్షించడం మొదలుపెట్టినప్పుడు జరిగిదేంటి?
తోడుగా అనుకూల 'మీడియా' ఉంటే, ఇవన్నీ ముఖ్యమంత్రి నాయకత్వ లక్షణాలని పార్టీ ప్రచారానికి తోడ్పడుతుంది. చంద్రబాబును చాలా గొప్ప 'అడ్మినిస్ట్రేటర్' అని అన్నారు.
బ్యూరోక్రసీలో ఉండేవారు కూడా ముఖ్యమంత్రి వింటే చెబుతారు. లేకుంటే, మౌనంగా ఉండిపోతారు. వాళ్ళు కూడా ముప్పై ఏళ్ళు పైబడి ప్రభుత్వ సర్వీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, 'మిడ్ లెవెల్ ట్రైనింగ్'ల్లో వారు కాలానుగుణమైన మార్పులకు తగినట్టు క్రమంగా సర్దుకుంటారు.
అయితే, ప్రజలకు ఎలాంటి 'ఆబ్లిగేషన్' ఉండదు.
ఆరు నెలలు ముందుగానే ప్రభుత్వాన్ని రద్దుచేసి 2004లో చంద్రబాబు ఎన్నికలకు వెళ్ళేవరకు అందరూ ఆయన గురించి అలాగే అనుకున్నారు.
కానీ, జనం దాన్ని పూర్తిగా వేరుగా అర్థం చేసుకున్నారు. 2004-2014 మధ్య చంద్రబాబుకు పదేళ్ళు విరామం వచ్చింది.

ఫొటో సోర్స్, FACEBOOK/ELECTION COMMISSION OF INDIA
'సాంకేతిక దూరం' తెలియంది కాదు
ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పూర్తిచేస్తుకున్నారు.
ఒకే ప్రాంతీయ పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పుడు, అధికార యంత్రాంగం మీద ఒత్తిడి సహజంగా చాలా ఎక్కువుంటుంది. రాష్ట్రం చిన్నది కావడంతో ఆ ఒత్తిడి ఉష్ణం స్థాయికి పెరిగింది.
అయినా, ఇదంతా రోజువారీ పరిపాలనకు సంబంధించిన విషయం అయితే వాళ్ళు దానికి 'ట్యూన్' అయిపోతారు.
కానీ, రాష్ట్రపతికి జవాబుదారు అయిన సీఈఓ అధికార పరిధిలో రాష్ట్ర అధికార యంత్రాంగం సార్వత్రిక ఎన్నికల కోసం పనిచేయాల్సి వచ్చినప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం.
లోక్‌సభకు, కొన్ని రాష్ట్రాల శాసనసభలకు 2019 ఏప్రెల్ 11 నుండి మే 19 వరకు ఏడు విడతల్లో దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల ప్రకటన వెలువడిన మార్చి 10 నుంచి ఫలితాలను ప్రకటించే మే 23 వరకు ఈ ప్రవర్తన నియామవళి (కోడ్)అమల్లో ఉంటుంది.
ఒక రాష్ట్రంగా ఏపీ కొత్తదైనా, రాష్ట్రానికి గానీ, ఇక్కడి ముఖ్యమంత్రికి గానీ ఎన్నికల నిర్వహణ సమయంలో లెజిస్లేచర్, బ్యూరోక్రసీల మధ్య ఉండాల్సిన లేదా పాటించాల్సిన 'సాంకేతిక దూరం' గురించి తెలియంది కాదు.
ఎన్నికల ప్రవర్తన నియమావళికి 1979లో జరిగిన సవరణలు 'కోడ్' అమల్లో ఉన్న కాలంలో అక్కడి అధికార పార్టీకి ఎన్నికల్లో ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలకు పాల్పడకూడదని నిర్దేశించాయి.
అయితే, 2019 ఏప్రిల్ 10న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ సహచరుల్లో కొందరిని వెంటపెట్టుకుని వెలగపూడి సచివాలయంలో ఉన్న సీఈఓ కార్యాలయానికి వెళ్లారు. కొంత సేపు ధర్నా చేశారు.

చీఫ్ సెక్రటరీకి ఇది సంకట స్థితి
సీఈఓతో మాట్లాడుతూ చంద్రబాబు "నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ " (అందరికీ సమాన అవకాశాలు లేవు) అనే అభియోగాన్ని ఎన్నికల సంఘం మీద మోపారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు తొమ్మిది పేజీల పిర్యాదు లేఖను అందించారు.
ఈ అరుదైన పరిణామంతో పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది.
ఎందుకంటే, రాజ్యాంగపరమైన సార్వత్రిక ఎన్నికల విధులను దేశమంతా రాష్ట్రాల అధికార యంత్రాంగాలు నిర్వహిస్తున్నసందర్భం అది.
అలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర సీఈఓ పనితీరుపై ఫిర్యాదు చేయడం తీవ్రమైన విషయం అవుతుంది.
అందుకే, రాష్ట్ర పరిపాలన వ్యవస్థకు అధిపతి అయిన చీఫ్ సెక్రటరీ వెంటనే అప్రమత్తమయ్యారు.
జిల్లా ఎన్నికల అధికారులు తన అధికార పరిధిలో పనిచేసే కలెక్టర్లు కాబట్టి వారితో చీఫ్ సెక్రటరీ నేరుగా మాట్లాడుతూ, పోలీస్ యంత్రాంగానికి చీఫ్ అయిన డీజీపీతో శాంతి భద్రతల పరిస్థితిని సమన్వయం చేసుకుంటూ .. ఎన్నికల నిర్వాహణ సజావుగా జరగడానికి సీఈఓకి సహకరించారు.
ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడాల్సి ఉంది. మరి ఈ కాలంలో అప్పటివరకూ ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీల అధికార పరిధులేంటి?
అనూహ్యంగా ఈ అంశం తెరపైకి వచ్చి, చర్చనీయంగా మారింది.
గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తిన సందర్భాలు ఉండుంటే, పరిష్కరించేందుకు ఓ 'కేస్ స్టడీ రికార్డ్' ఉండుండేది.
కానీ ఇది మొదటి కేసు.
అన్నిటికీ మించి అధికారంలో ఉన్న పార్టీ నేత, ముఖ్యమంత్రి ఎన్నికల ముందురోజు ''లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కల్పించండి'' అంటూ సీఈఓని అడగడం.. నిస్సందేహంగా చీఫ్ సెక్రటరీకి ఇది సంకట స్థితి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు రెండో 'ట్విస్ట్'
పైగా సాధారణ పద్ధతికి భిన్నంగా ప్రస్తుత ఏపీ చీఫ్ సెక్రటరీని నేరుగా ఎన్నికల సంఘం నియమించింది.
ఈ పరిస్థితుల్లో, ఎన్నికలు ముగిశాయి కాబట్టి ముఖ్యమంత్రి తాను, తమ మంత్రివర్గం ఎప్పటిలా పరిపాలనా వ్యవహారాలు కొనసాగిస్తామనడం రెండో 'ట్విస్ట్' అయ్యింది.
అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, 1974 లో 'ఈపీ రాయప్ప వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం' కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ.. 'చీఫ్ సెక్రటరీ పోస్ట్ అత్యంత కీలకమైంది. అత్యంత సున్నితమైంది. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీల మధ్య చక్కటి సమన్వయం ఉండాలి' అని వ్యాఖ్యానించింది.
2013లో 'సలీల్ సబ్ లోక్ వర్సెస్ భారత ప్రభుత్వం' కేసులో ఇచ్చిన తీర్పులో.. 'చీఫ్ సెక్రటరీ, డీజీపీ పోస్ట్ లను భర్తీ చేసేటప్పుడు ముఖ్యమంత్రి అన్ని అంశాలనూ పరిశీలించి, తగిన వ్యక్తిని నియమించాలి'' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఏపీలో చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పునేఠాను తొలగించి, ఆయన స్థానంలో ఎల్.వి.సుబ్రహ్మణ్యంను ఎన్నికల సంఘం నియమించినప్పుడు, ఇంటిలిజెన్స్ ఐజీని మార్చినప్పటికీ డీజీపీ ఆర్.పి.ఠాకూర్‌ను కదపలేదు.
సీఈఓ '2017 ఏప్రిల్ నాటి సుప్రీంకోర్టు తీర్పు'ను దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించడం అందుకు కారణం కావొచ్చు.
ఆ తీర్పులో జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త.. ''రాజ్యాంగపరమైన విధుల నిర్వహణలో చీఫ్ సెక్రటరీ విఫలమై ప్రభుత్వ నమ్మకం కోల్పోతే, వెంటనే ముఖ్యమంత్రి తొలగించవచ్చు అయితే, డీజీపీని అలా తొలగించడానికి వీల్లేదు. ఈ విషయంలో రెండు పోస్టులనూ ఒకే రీతిగా చూడలేం'' అని స్పష్టం చేసింది.
ఓ నియమాల చట్రంలో పనిచేయాల్సిన అధికారి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ.
ఏపీలో సీఈఓ కార్యాలయానికి ముఖ్యమంత్రి వచ్చి ధర్నాచేసిన అరుదైన పరిస్థితుల్లో, ప్యానల్‌లో సీనియర్‌గా ఉంటూ ఎన్నికల సంఘం ద్వారా చీఫ్ సెక్రటరీగా నియామకం పొందిన అధికారి 'బుక్' లోని నియమ నిబంధనల మేరకు పనిచేయడం ఓ అంశం.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని మంత్రిత్వ శాఖలకూ చీఫ్ గా వుండే కేబినేట్ సెక్రటరీ కార్యాలయం నుంచి, ప్రధాన ఎన్నికల కమిషనర్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే ఉత్తర్వులకు లోబడి కూడా చీఫ్ సెక్రటరీ పనిచేయాల్సి ఉంటుంది.
చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వానికి అసౌకర్యంగా ఉండుంటే, ఆ విషయం ఇప్పుడున్న సమాచార వెల్లువలో గంట గంటకూ ప్రజలకు తెలుస్తూనే ఉంటుంది.
కానీ, అధికార శ్రేణుల మధ్య జరిగే ఉత్తరప్రత్యుత్తరాలు అలా బయటకు తెలిసే అవకాశం లేదు.
మరి ఎవరు చెబుతున్నదాన్ని పౌరసమాజం ప్రామాణికంగా తీసుకోవాలి?
ఇది మన ముందున్నకొత్త సవాలు.
కాబట్టి, ఫలితాలు ప్రకటించి కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు, ఎన్నికల ముందు రోజు చేసినట్టే ముఖ్యమంత్రి ప్రజాసమస్యల పట్ల తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను సత్వర పరిష్కారం కోసం చీఫ్ సెక్రటరీకి గానీ, లేదా వారి కార్యాలయం ద్వారా కేంద్రానికి గానీ లేఖల రూపంలో తెలియజేయొచ్చు.
అయితే అవి గంటల వారీ 'బ్రేకింగ్ న్యూస్'లు కాకపోవచ్చు. అయినా, జనసామాన్యం అవసరాలు పరిష్కరిచే మామూలు వార్తలుగా వచ్చినా పెద్ద నష్టమేమీ లేదు.
ఇవి కూడా చదవండి
- 99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- కిమ్-పుతిన్: తొలిసారిగా భేటీ కానున్న ఉత్తర కొరియా, రష్యా నాయకులు
- శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?
- బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇచ్చిన రాజీవ్ గాంధీని చంపించిన ఎల్టీటీఈ ప్రభాకరన్
- సచిన్ టెండూల్కర్ ‘లిటిల్ మాస్టర్’ ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









