నవీన్ పట్నాయక్: ప్రభుత్వ వ్యతిరేకత దరిచేరనివ్వని నేత.. ఐదోసారి సీఎంగా ప్రమాణం

ఫొటో సోర్స్, Bjd
బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఐదోసారి ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రికార్డు సృష్టించారు.
72 ఏళ్ల పట్నాయక్ వరసగా ఐదోసారి రాష్ట్ర ప్రభుత్వం పాలనా పగ్గాలు అందుకున్నారు. ఒడిశా చరిత్రలో ఇలాంటి రికార్డ్ ఇదే తొలిసారి.
దేశంలో సిక్కిం ముఖ్యమంత్రిగా మొన్నటివరకూ పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ ఒక్కరే నవీన్ కంటే ఎక్కువ కాలం ఒక రాష్ట్రానికి వరసగా ముఖ్యమంత్రిగా పనిచేసారు.
చామ్లింగ్ 24 సంవత్సరాల 165 రోజులు సిక్కింకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ ఓటమి పాలైంది.
ఒడిశాకు ఐదోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ ఈ ఐదేళ్లూ పదవిలో కొనసాగి, మరోసారి అధికారం చేపట్టగలిగితే చామ్లింగ్ రికార్డు బద్దలవుతుంది.
2005 మార్చి 5 నుంచి నవీన్ పట్నాయక్ ఒడిశాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విలక్షణ నేత
నవీన్ పట్నాయక్‌కు తన బీగల్ కుక్కలు బ్రూనో, రాక్సీ తప్ప ఒడిశా రాజకీయాల్లో వేరే స్నేహితులెవరూ లేరు. నవీన్ జీవితంలో నాటకీయతకు ఎలాంటి చోటు లేదు.
ఆయనకు అద్భుతంగా ప్రసంగించే లక్షణం లేదు. బాగా మాట్లాడడం కాదు, ఆయనసలు తన రాష్ట్ర ప్రజల భాష కూడా మాట్లాడలేరు. నవీన్ అన్ని ప్రసంగాలనూ ఆయన సహచరులు ఇంగ్లిష్‌లో రాసి ఇస్తారు. దానిని ఆయన రోబోలా చదివేస్తారు. కొన్నిసార్లు మాటలను తప్పుగా కూడా ఉచ్ఛరిస్తారు. కానీ, రాష్ట్ర ప్రజలు దానికి చికాకుపడరు, పైగా సంతోషిస్తారు. నవీన్ ఏదైనా సభలో 10 నిమిషాలు మాట్లాడితే సుదీర్ఘంగా ప్రసంగించినట్లు లెక్క.
నవీన్ పట్నాయక్ జీవిత చరిత్ర రాసిన రూబెన్ బెనర్జీ "నవీన్ 2000లో ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వచ్చినపుడు ఆయనకు ఒడియా మాట్లాడ్డం వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన తన జీవితంలో ఎక్కువ కాలం ఒడిశా బయటే గడిపారు. ఆయన తన ప్రసంగం మొదట్లో ఇంగ్లీషులో రాసిన "మొత్తె భాలో ఒడియా కెహ్బా పాయీ టిక్కె సమయ్ లొగిబా" అనే ఒక లైన్ చదవడం నాకిప్పటికీ గుర్తే.

ఫొటో సోర్స్, facebook/naveenpatnaik
ఒడియా రాకపోయినా ప్రజలతో సంభాషణ
అయితే, దానివల్ల ఆయనకు మంచే జరిగింది. అప్పట్లో ఒడిశాలోని రాజకీయ పార్టీలన్నీ చెడ్డపేరు మూటగట్టుకోవడంతో ఆయనకు ఒడియా రాకపోవడం అక్కడి వారికి బాగానే అనిపించింది. ఆయనకు, మిగతా రాజకీయ నేతలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ప్రజలు గుర్తించారు. అందుకే, వాళ్లంతా నవీన్‌కు ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
నవీన్‌కు ఇప్పటికీ ఒడియా సరిగా మాట్లాడ్డం రాదు. కానీ ఒకప్పుడు ఆయన ఒడియాలో ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ప్రజలను కలవడం, వారి బాగోగులు తెలుసుకోవడం చేస్తుంటారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. మమతా బెనర్జీ బెంగాలీలో మాట్లాడకుండా బెంగాల్ ప్రజలను ఓట్లు అడగడం మనం కనీసం ఊహించుకోగలమా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే అక్కడి ప్రజలకు నవీన్ వారి భాషలో మాట్లాడినా, మాట్లాడకపోయినా లేదా ఇంగ్లీషు, ఫ్రెంచిలో మాట్లాడినా ఏమాత్రం తేడాగా అనిపించదు.

ఫొటో సోర్స్, fb/naveenpatnaik
పేదరికం ఉన్నా, భిక్షాటన చాలా తక్కువ
నవీన్ పట్నాయక్ పాలనలోని ఒడిశాలో అనేక అనూహ్య అంశాలు కనిపిస్తాయి. ఈ దేశంలోని పేద రాష్ట్రాల్లో ఒడిశా ఒకటి. కానీ, మీకు భువనేశ్వర్, కటక్, పూరీ రోడ్లపై చాలా తక్కువ మంది భిక్షగాళ్లు కనిపిస్తారు.
ఒడిశా వెనుకబడిన రాష్ట్రం. కానీ, పోటీ పరీక్షల్లో ఇప్పటికీ ఒడిశా నుంచి వచ్చే వారి సంఖ్య మిగతా ప్రాంతాల కంటే ఎక్కువగా ఉంటోంది.
ప్రజారోగ్యం విషయంలో కూడా ఒడిశా అగ్ర రాష్ట్రాల జాబితాలో ఉండదు. కానీ, ఇక్కడ పట్టణాలు పరిశుభ్రంగా కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో నవీన్ లాంటి నేతలు చాలా తక్కువ
నవీన్ గురించి ఒకటి ముఖ్యంగా చెప్పుకోవాలి. ఆయనను బహుశా దేశంలోనే అందరికంటే తక్కువ మాట్లాడే రాజకీయ నేతగా అనుకోవచ్చు. ఆయన గట్టిగా మాట్లాడ్డం ఎవరూ ఎప్పుడూ వినలేదు.
నవీన్ పట్నాయక్ జీవిత చరిత్ర రాసిన ఇంగ్లీష్ పత్రిక అవుట్ లుక్ ఎడిటర్ రూబెన్ బనర్జీ "మీరు ఆయన్ను కలిస్తే ఆయనను మించిన మృదుభాషి, మంచివాడు, ఉన్నతుడు, తక్కువ మాట్లాడేవారు ఉండరనిపిస్తుంది. అంతే కాదు, అప్పుడప్పుడు ఆయనసలు రాజకీయ నేతే కాదేమో అనిపిస్తుంది. కానీ, దేశంలో ఆయన్ను మించిన రాజనీతిజ్ఞులు లేరనే మాట మాత్రం అక్షరాలా నిజం.
ఆయన మామూలు రాజకీయ నేత కాదు, పెద్ద పెద్ద రాజకీయ నేతలే పోటీపడలేనంత కరకు రాజకీయ వేత్త. కొంతమంది రాజకీయం ఆయన రక్తంలోనే ఉందంటారు. కానీ ,ఆయన తన జీవితంలో 50 ఏళ్ల వరకూ రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటారు. నవీన్ చాలా తెలివైనవారు. ఒడిశాలో ఆయన్ను ఢీకొట్టే రాజకీయ నాయకులే లేరు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు దేశాల హీరో బిజూ పట్నాయక్
నవీన్ పట్నాయక్‌కు రాజకీయం వారసత్వంగా అందింది. ఆయన తండ్రి బిజూ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, పైలట్ కూడా. రెండో ప్రపంచ యుద్ధంలో ఇండోనేషియా స్వతంత్ర పోరాటం, 1947లో కశ్మీర్‌పై పాకిస్తాన్ దాడుల సమయంలో ఆయన పాత్రను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.
బిజూ పట్నాయక్ జీవిత చరిత్ర రాసిన సుందర్ గణేశన్ తన పుస్తకం 'ద టాల్‌మన్'లో "బిజూ పట్నాయక్ దిల్లీ సఫ్దర్‌గంజ్ ఎయిర్ పోర్టు నుంచి శ్రీనగర్‌కు తన డకోటా డీ సీ-3 విమానంలో చాలాసార్లు వెళ్లారు. 1947 అక్టోబర్ 17న ఆయన లెఫ్టినెంట్ కల్నల్ దేవాన్ రంజిత్ రాయ్ నేతృత్వంలో 1-సిక్ రెజిమెంట్‌లోని 17 జవాన్లను తీసుకుని శ్రీనగర్ చేరుకున్నారు" అని చెప్పారు.
"అక్కడి ఎయిర్ పోర్టును పాకిస్తాన్ సైన్యం స్వాధీనం చేసుకుందేమో చూడ్డానికి బిజూ పట్నాయక్ తన విమానం కిందికి దించి రెండు సార్లు చక్కర్లు కొట్టారు. అది పాక్ నియంత్రణలో ఉంటే అక్కడ విమానాన్ని దించొద్దని ప్రధాన మంత్రి నెహ్రూ ఆయనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు".
"బిజూ పట్నాయక్ విమానంలో నేలకు కొన్ని మీటర్ల ఎత్తున ఎగురుతూ ఎయిర్‌పోర్టులో ఎవరూ లేకపోవడం చూశారు. విమానాన్ని కిందికి దించారు. 17 మంది జవాన్లను అక్కడికి చేర్చి పాకిస్తానీ మూకలను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించారు".
ఒకసారి ఆయన బాకూ, అజర్‌బైజాన్ నుంచి టేకాఫ్ అయ్యి స్టాలిన్‌గ్రాడ్‌లో జర్మన్ సైనికుల మధ్య చిక్కుకుపోయిన రష్యా సైనికులకు ఆయుధాలు అందించారు. అలాగే, 1942లో బర్మాను జపాన్ స్వాధీనం చేసుకున్నప్పుడు తీవ్రంగా బాంబింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న బ్రిటిష్ పౌరులను కాపాడి తీసుకొచ్చారు. బిజూ పట్నాయక్ చనిపోయినప్పుడు ఆయన శవపేటికపై మూడు దేశాలు భారత్, రష్యా, ఇండోనేసియాల జెండాలు కప్పారు.

దిల్లీ పార్టీల్లో మంచి చొరవ
బిజూ పట్నాయక్ ఉన్నప్పుడు నవీన్ పట్నాయక్‌కు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఆయన దిల్లీలో ఉండేవారు. అక్కడ ఉన్న పార్టీ సర్కిల్‌లో ఆయన బిజీగా ఉండేవారు..
"ఆయన సోషలైట్. దూన్ స్కూల్లో చదివేవారు. అక్కడ సంజయ్ గాంధీ ఆయన క్లాస్-మేట్. కళలు, సంస్కృతి అంటే ఆయనకు చాలా ఆసక్తి ఉండేది. ఆయన మాట్లాడే ఇంగ్లిష్ యూరోపియన్ ఉచ్ఛారణలో ఉండేది. నవీన్‌కు 'డన్‌హిల్' సిగరెట్ అన్నా, 'ఫేమస్ గ్రౌస్' విస్కీ అన్నా చాలా ఇష్టం" అని రూబెన్ బెనర్జీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
"దిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఆయనకు ఒక బొతిక్ ఉండేది. ఆయన 1988లో వచ్చిన 'ది డిసీవర్స్' అనే సినిమాలో చిన్న పాత్ర కూడా చేశారు.
అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ భార్య జాక్వెలిన్ కెనెడీ కూడా ఆయన స్నేహితురాలే.
1983లో ఆమె భారత పర్యటనకు వచ్చినపుడు నవీన్ ఆమెతోపాటు జైపూర్, జోధ్‌పూర్, లక్నో, హైదరాబాద్ తిరిగారు".

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES
రాజీవ్, సోనియాను కలవనన్నారు
ప్రముఖ జర్నలిస్ట్ తవ్లీన్ సింగ్ తన పుస్తకం 'దర్బార్'లో 1975లో దిల్లీ రాజకీయాల గురించి చాలా వివరంగా వర్ణించారు. "అత్యవసర స్థితి ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత మార్తాండ్ సింగ్ నన్ను, నవీన్ పట్నాయక్‌ను భోజనానికి పిలిచారు. మేం మా డ్రింక్స్ తీసుకుని ఆ సమావేశంలో ఒక మూల కూర్చున్నాం. హఠాత్తుగా మా ముందున్న తలుపు తీసుకుని రాజీవ్ గాంధీ, సోనియా లోపలికి వచ్చారు"
"నవీన్ నాతో 'నేను వాళ్ల దగ్గరకు వెళ్లను. వాళ్లకు నన్ను కలవడం ఇబ్బందిగా ఉండచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల ముందే ఇందిరాగాంధీ మా నాన్న బిజూ పట్నాయక్‌ను జైల్లో వేశారు' అన్నారు".
అప్పుడే మార్తాండ్ వదిన నీనా మా దగ్గరకు వచ్చి "ఆ మూల నిల్చుంది నవీన్ పట్నాయకా" అని సోనియా అడిగారని చెప్పారు. దాంతో మేమిద్దరం, "మనల్ని గుర్తుపట్టినపుడు వెళ్లి హలో చెబితే పోలా" అనుకున్నాం అని రాశారు.
అప్పుడు సోనియా వేసుకున్న తెల్లటి ఫ్రాక్‌ను చూసిన నవీన్, "మీరు దీన్ని 'వేలెంటినో' నుంచి కొన్నారా అని అడిగారు. దానికి సోనియా, "కాదు, కాదు.. నేను దీన్ని ఖాన్ మార్కెట్‌లో నా టైలర్ దగ్గర కుట్టించాను" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER@NAVEEN_ODISHA
హోటల్‌లో బస చేసి మొదటి ఎన్నికల్లో గెలిచారు
1998లో అస్కా ఎంపీ స్థానంలో నవీన్ పట్నాయక్ పోటీ చేస్తున్నప్పుడు ఆ ఎన్నికలను కవర్ చేయడానికి 'ఇండియా టుడే' నన్ను పంపించింది అని రూబెన్ బెనర్జీ చెప్పారు.
"అప్పుడు నేను నా ఫొటోగ్రాఫర్‌తో అక్కడికి చేరుకున్నా. నాకక్కడ నవీన్ పట్నాయక్ ఎక్కడా కనిపించ లేదు. చాలా కష్టపడి నేను ఆయన ఎక్కడున్నారో పట్టుకున్నాను" అన్నారు.
నవీన్ పట్నాయక్ ఆయనను ఆ మరునాడు గోపాల్‌పూర్ బీచ్‌లో ఉన్న ఒక హోటల్ దగ్గరకు రావాలని చెప్పారు. రూబెన్ అక్కడకు వెళ్తే నవీన్ అక్కడ లేరు. హోటల్ దగ్గర కూల్ డ్రింక్ అమ్మేవాడు ఆయన ఇక్కడ కాదు ఒబెరాయ్ గోపాల్‌పూర్‌లో ఉంటారని చెప్పాడు. ఇప్పుడు ఆ హోటల్ పేరు మేఫెయర్ పామ్ బీచ్ రిసార్ట్. రూబెన్ అక్కడికి చేరుకునేటప్పటికి ఏకాంతంగా ఉన్న నవీన్ స్విమ్మింగ్ పూల్ పక్కనే కూచుని సిగరెట్ తాగుతున్నారు.

ఫొటో సోర్స్, facebook/naveenpatnaik
మంచి బాలుడి ఇమేజ్ కోసం కొన్ని దాస్తారు
రూబెన్ తనతోపాటు ఎన్నికల ప్రచారానికి రావడానికి నవీన్ ఒప్పుకున్నారు. కానీ, దానికి రెండు షరతులు పెట్టారు. "మొదట తన రిపోర్టులో ప్రచారానికి వచ్చిన తను ఒబెరాయ్ హోటల్లో దిగినట్టు ఎవరికీ చెప్పకూడదు. రెండోది తను సిగరెట్ తాగానని రాయకూడదు".
తమను ఓటు అడుగుతున్న వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడని ప్రజలు అనుకోకూడదని బహుశా ఆయన అనుకుని ఉంటారు. తన మంచి బాలుడి ఇమేజ్‌ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని అబద్ధాలు చెప్పడానికి కూడ సిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, BIJOY MOHAPATRA/FACEBOOK
బిజయ్ మహాపాత్ర రాజకీయ జీవితానికి తెర
ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలో నంబర్ టూ అయిన బిజయ్ మహాపాత్రకు టికెట్ ఇవ్వనప్పుడు నవీన్ పట్నాయక్ రాజకీయ చాతుర్యం గురించి అందరికీ తెలిసింది.
"నా దృష్టిలో బిజయ్ మహాపాత్ర చాలా పెద్ద ప్రాంతీయ నేత. ఆయన బిజూ బాబు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. నామినేషన్ వేయాల్సిన చివరి రోజు పాట్‌కురా అసెంబ్లీ స్థానంలో ఆయనకు టికెట్ ఇవ్వని నవీన్ పట్నాయక్ అతానూ సవ్యసాచిని అక్కడ పోటీ చేయమన్నారు".
"ఇక సమయం ముగిసిపోతోందనగా నిమిషాల ముందు సవ్యసాచి తన నామినేషన్ వేశారు. వేరే స్థానం నుంచి నామినేషన్ వేయడానికి మహాపాత్రకు పెద్దగా సమయం కూడా దొరకలేదు. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి బెహరాకు మద్దతివ్వాలని నిర్ణయించారు. ఆ ఎన్నికల్లో బెహరా గెలిచారు కూడా."
"బెహరా తన కోసం ఆ స్థానం ఖాళీ చేస్తారని మహాపాత్ర ఆశగా ఎదురుచూశారు. కానీ, నవీన్ పట్నాయక్ ఆయన్ను తనవైపు తిప్పుకున్నారు. బెహరా ఆ సీటు ఖాళీ చేయకపోవడంతో మహాపాత్రకు ఉపఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం లేకుండాపోయింది. నా దృష్టిలో రాజకీయ ప్రత్యర్థులను ఇలా తప్పించే పద్ధతి చాలా అనైతికం" అని రూబెన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Pti
ఐఏఎస్ అధికారి ప్యారీ మోహన్ మహాపాత్రతో ఢీ
బిజయ్ మహాపాత్రే కాదు, ఆయన తనకు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి ప్యారీ మోహన్ మహాపాత్రకు చెక్ పెట్టిన విధానం కూడా అందరినీ షాక్ ఇచ్చింది.
"ప్యారీ బాబు చాలా మంచి ఐఏఎస్ అధికారి. పార్టీలో ఏ జరుగుతోందో ఆయనకు ఎప్పుడూ తెలుస్తుండేది. మొదట్లో ప్రజలు నవీన్ ఒక ముసుగు లాంటివారని, అసలు పాలన అంతా ప్యారీయే నడిపిస్తున్నారని అనుకునేవారు" అని రూబెన్ రాశారు.
"ప్యారీ నవీన్‌ను ఉపయోగించుకుంటున్నారని ఒక ఇమేజ్ సృష్టించే ప్రయత్నం చేశారు. నిజానికి ఆయన అలా చేసేవారు కాదు. ఇద్దరి మధ్య 2008 నుంచి దూరం పెరగింది. ఎందుకంటే ప్యారీ బాబుకు కూడా అత్యాశ ఉండేది".
ప్యారీ బాబు చనిపోయే ముందు ఆయన్ను కలిసినట్లు రూబెన్ చెప్పారు. ఆయన నాతో "2009లో నవీన్ దిల్లీ వచ్చినప్పటి నుంచి సమస్య మొదలైందని అన్నారు. ఆయన సోదరి గీతా మెహతా కూడా దిల్లీ వెళ్లారు. ఆమె ప్యారీ బాబును భోజనానికి పిలిచారు. అప్పుడు నవీన్ ఆరోగ్యం సరిగా లేదు".
"భోజనం చేస్తున్నప్పుడు 'నవీన్‌పై చాలా ఒత్తిడి ఉంటోంది. దానివల్ల అతడి ఆరోగ్యం కూడా పాడవుతోంది. మీరు ఉప ముఖ్యమంత్రి కావచ్చుగా' అని గీత అన్నారు. నవీన్‌కు ఆ మాట నచ్చలేదు. ఆయనకు తన సొంత సోదరే ఇలా అనుకుంటే, నాలుగున్నర కోట్ల ఒడిశా ప్రజలకు కూడా అదే అనిపిస్తూ ఉండచ్చని అర్థమైంది".
"అదే రోజు నుంచి ప్యారీ బాబుకు కౌంట్ డౌన్ మొదలైంది. తర్వాత ప్యారీ బాబు ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో తనపై తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నాడని నవీన్ ఆయనపై ఆరోపణలు చేశారు. మెల్లమెల్లగా ఆయనకు నవీన్ ఫోన్ రావడం ఆగిపోయింది. ప్యారీని పట్టించుకోవడం కూడా మానేశారు. నవీన్ రాజకీయ నైపుణ్యానికి ఇదొక ఉదాహరణ".

ఫొటో సోర్స్, TWITTER@PANDAJAY
ఇద్దరు స్నేహితులకూ ఉద్వాసన
నవీన్ పట్నాయక్ మొదటిసారి ఒడిశా వచ్చినపుడు ఆయనకు క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరే ఉండేవారు. అనంగ ఉదయ్ సింగ్‌దేవ్ (ఏయూ సింగ్ దేవ్), బైజయంత్ పండా(జై పండా). ఈ ఇద్దరితో కూడా ఆయన స్నేహం పూర్తికాలం నిలవలేదు. వారు కూడా పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది.
నవీన్‌ను వదిలిన తర్వాత బీజేపీ సభ్యత్వం తీసుకున్న జై పాండా, "నవీన్ మొదటి నుంచి ఇంట్రావర్టే. ఎక్కువ మాట్లాడేవారు కాదు. కానీ, మాతో ఎప్పుడైనా తినడానికి కూచున్నప్పుడు ఆయన ఓపెన్‌గా మాట్లాడేవారు. 60వ దశకంలో ఆయన దేశం బయట న్యూయార్క్, మిలన్, లండన్‌లో ఉన్నారు. అందుకే, ఆయన ఆలోచనలు విశాలంగా ఉండేవి. పాశ్చాత్య దేశాల్లో రాక్ స్టార్స్‌తో కూడా ఆయనకు మంచి పరిచయాలు ఉండేవి" అన్నారు.
"ఆయన 1997లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 2013-14 వరకూ ఒక తరహా రాజకీయాలు చేశారు. ఆ తర్వాత రెండో రకం రాజకీయాలు. 2014 వరకూ ఆయన పాలన చూసి నాకు గర్వంగా అనిపించేది. ఆయన అవినీతిపై కఠిన చర్యలు తీసుకున్నారు".
"కానీ, మూడో పదవీకాలం మొదలైనప్పుడు నవీన్ ఆలోచనల్లో మార్పు మొదలైంది. కొందరు కొత్తవాళ్లు ఆయన చుట్టూ చేరడం, దానివల్ల ఒడిశా వెనకబడడం ప్రారంభమైంది".
పండా, నవీన్ మధ్య అపోహలు
"నవీన్ పట్నాయక్‌కు అంత సన్నిహితులైన మీరు ఆయనకు అలా ఎలా దూరం అయ్యారు" అని నేను జై పాండాను అడిగాను. దానికి జై, "ఆయనకు, నాకు మధ్య అపోహలు సృష్టించడానికి కొందరు మొదటి నుంచీ ప్రయత్నించేవారు. మేం వాటి గురించి చెప్పుకుని నవ్వుకునేవాళ్లం. మేం వారంలో మూడుసార్లు కలిసి భోంచేసేవాళ్లం".
"కానీ, 2014 తర్వాత ఆయన చుట్టూ ఒక కొత్త కోటరీ ఏర్పడింది. వారు నాపైన ఆయనకు ఏవేవో చెప్పేవారు. మొదట్లో మేం దేని గురించి నవ్వుకున్నామో, తర్వాత వాటినే నవీన్ సీరియస్‌గా తీసుకున్నారని నాకు అనిపించింది".
"నేను అధికారం హస్తగతం చేసుకోవాలనుకుంటున్నట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రెండుమూడు సార్లు ఆయనకు చెప్పాలని ప్రయత్నించాను. కానీ, ఆయన పట్టించుకోలేదు. తర్వాత నన్ను పార్టీ నుంచే బయటకు పంపేశారు."
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఒడియా టీచర్‌కు పనే లేదు
నవీన్ పట్నాయక్ చాలా కాలం క్రితమే జీన్స్, టీషర్ట్ వదిలేసి, తెల్ల కుర్తా, పైజామా వేసుకోవడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఖుర్దాలో తయారయ్యే లుంగీ కట్టుకోవడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి అయిన మొదట్లో ఒడియా రిటైర్డ్ టీచర్ రాజ్‌కిశోర్ దాస్ ఆయనకు ఒడియా నేర్పించేవారు.
ఆయన ఒక మూల కూర్చుని మాట్లాడకుండా కాఫీ తాగుతుండేవారు. ఎందుకంటే నవీన్‌కు ఆయన దగ్గర ఒడియా నేర్చుకునేంత సమయం ఉండేది కాదు. కొన్నిరోజుల తర్వాత ఆయన రావడమే మానేశారు.
నవీన్ దినచర్య ఉదయం ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్‌తో ప్రారంభమవుతుంది. తర్వాత ఆయన పుచ్చకాయ, బొప్పాయి ముక్కలు తింటారు.
11 గంటలకు ఆఫీసుకు వెళ్లే ముందు ఆయన గ్లాసు కొబ్బరినీళ్లు తాగుతారు. మధ్యాహ్నం తేలికపాటి ఆహారం తీసుకునేందుకు తినేందుకు ఇంటికి వస్తారు. సాధారణంగా ఆయన కిచిడీ, పెరుగు లేదా సూప్‌తో ఒక బ్రెడ్ తీసుకుంటారు.
రాత్రి ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తారు ఫేమస్ గ్రౌస్ విస్కీ కొన్ని పెగ్గులు తాగాక భోంచేస్తారు. రెడ్ థాయ్ కర్రీ అంటే ఆయనకు చాలా ఇష్టం.

ఫొటో సోర్స్, facebook/naveenpatnaik
ప్రాపంచిక విషయాలపై మోజు లేదు
ఆయన సన్నిహితుల్లో ప్రముఖ జర్నలిస్ట్ వీర్ సంఘ్వీ ఒకరు. ఒకసారి ఆయన హిందుస్తాన్ టైమ్స్‌లో తాను దిల్లీలో ఉన్నప్పుడు జరిగినవి రాశారు. "పప్పూ ఎలాంటి విషయాలపైనా మోజు చూపేవారు కాదు. ఆయన ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారు. నవీన్‌కు ఇద్దరు నౌకర్లు, కారు డ్రైవర్ ఉండేవారు. ఎందుకంటే, ఆయనకు కారు నడపడం కూడా రాదు" అన్నారు.
ఆయన ఎప్పుడూ ప్రముఖ రెస్టారెంట్లలో భోంచేసేవారు కాదు. ఆయన ఇంటికి వచ్చేవారు, ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా ఆయన వంటమనిషి చేసే భోజనమే తినేవారు. ఒకసారి ఆయన కాస్త మత్తులో ఉన్నప్పుడు నేను, "మీ సింప్లిసిటీ రహస్యమేంటి" అని అడిగాను. దానికి ఆయన "నేను వేరే వాళ్ల ఇంట్లో ప్రపంచంలోని అత్యంత అందమైన వస్తువులు చూశాను. అందాన్ని ఇష్టపడాలంటే దానికి యజమానే కావాలనేం లేదు, మనకు వాటిని ఆస్వాదించడం రావాలి అంతే" అన్నారు.
యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్ పోరులో గెలిచిన నవీన్ ఇప్పుడు స్వయంగా తానే 'ఎస్టాబ్లిష్‌మెంట్'గా మారారు.
ఇన్నేళ్లు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ 2019 ఎన్నికల్లో కూడా తన మ్యాజిక్ చూపించారు. వరుసగా అయిదుసార్లు సిక్కిం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన పవన్ చామ్లింగ్ రికార్డులు ఆయన బద్దలు కొట్టగలరేమో చూడాలి.
రూబెన్ బెనర్జీ .."నవీన్ 2000లో మొదటిసారి గెలిచారు 'ఎస్టాబ్లిష్మెంట్' అంటే అధికార వ్యవస్థను వ్యతిరేకించారు. 19 ఏళ్ల తర్వాత ఆయన 2019లో స్వయంగా ఎస్టాబ్లిష్మెంట్‌లా ఉన్నారు. ఒడిశాలో ఎలాంటి పారిశ్రామికీకరణ లేదనే విషయం అందరికీ తెలుసు. మనం ఒడిశా సంపన్న రాష్ట్రం అని కూడా చెప్పలేం" అన్నారు.
పేదరిక నిర్మూలన దిశగా రాష్ట్రంలో కాస్త పనులైతే జరిగాయి. 75 లక్షల మంది దారిద్ర్యరేఖకు ఎగువకు వచ్చారు. నవీన్ పట్నాయక్ గురించి ఇంకో మాట కూడా చెబుతారు. ఆయన సొంత ఇమేజ్ చాలా బాగుంది. ఆయన వ్యక్తిగతంగా బహుశా అవినీతిపరుడు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
నిధుల దుర్వినియోగంపై విమర్శలు
ఆయన ప్రజా నిధులను దుర్వినియోగం చేశాడనే విమర్శలు ఉన్నాయి. కానీ ఆయన ప్రజా సంక్షేమం కోసం ఒక్క రూపాయికే కిలో బియ్యం, ఉచిత సైకిల్ వంటి చాలా పథకాలు అమలు చేశారు. మీరు ఏ సామాను అడిగినా అది ఉచితంగా అందించేవారు.
ఆయన ఆహార పథకం కూడా ప్రారంభించారు. అయిదు రూపాయలకే అన్నం, పప్పు అందించేవారు. కానీ, దానివల్ల రాష్ట్రాభివృద్ధి గానీ, వనరులు గానీ పెరగలేదు. ఆయన పథకాల వల్ల పేదలు సంతోషంగా ఉండగలిగారు.
ఇవి కూడా చదవండి
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- మసూద్ అజర్ విషయంలో చైనా ఎందుకు పట్టు సడలించింది
- థాయ్ కింగ్ పెళ్ళి: బాడీగార్డుతో ప్రేమ వివాహం
- హాజీపూర్ బాలికల హత్యలు: ‘ముందు ఊపిరాడకుండా చేస్తాడు.. చనిపోయాక రేప్ చేస్తాడు’
- ‘భూములిచ్చినవారికి ఉద్యోగాలన్నారు, ఆ మాట ఏమైంది’
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- శ్రీలంక దాడుల మృతులు: వంద మరణాలు ఎందుకు తగ్గాయి? తప్పుగా లెక్కించడానికి కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









