ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను కోర్టులో సవాల్ చేయవచ్చా?

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎలక్షన్ కమిషన్ మధ్య సంఘర్షణ నెలకొనడం.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం తెలిసిందే. నియమావళి అమలు చేయడంలో తమకు ఎవరైనా ఒకటేనంటూ ఈసీ అధికారులు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, జారీచేస్తున్న ఆదేశాలపై చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
ఈసీ దేశం కోసం కాకుండా మోదీ కోసం పనిచేస్తోందంటూ ఈసీ విశ్వసనీయతపైనా సందేహాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈసీ అధికార పరిధి ఎంత.. నియమావళి అమలు ఎలా ఉంటుందో చూద్దాం.
టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో ఈసీ ఎంతో విశ్వసనీయతను సంపాదించుకుంది.
ఎన్నికల ప్రవర్తన నియామవళిని ఉల్లంఘిస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఆ సమయంలో అందరికీ తెలిసొచ్చింది.
అయితే ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఎన్నికల ప్రవర్తన నియమావళి న్యాయ పరిధిలోకి పూర్తిగా రాదు.

ఫొటో సోర్స్, facebook/Election Commission of India
రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా ఈసీకి అధికారాలు
ప్రవర్తన నియామవళిపై ఫిర్యాదులను ఈసీనే స్వీకరిస్తుంది. వాటిపై విచారణనూ ఆ సంస్థే జరుపుతోంది. చివరికి శిక్షను కూడా నిర్ధారిస్తుంది.
రాజ్యాంగంలోని 324వ అధికరణం ఈసీకి ఈ అధికారాలను కల్పించింది. అయితే, వీటికి కొన్ని మినహాయింపులు ఉండొచ్చు.
రాజకీయ పార్టీలతో సంప్రదింపుల తర్వాత నిర్దేశించుకున్న మార్గదర్శకాలే ప్రవర్తన నియమావళి అని ఈసీ అధికార ప్రతినిధి శెఫాలీ శరణ్ అన్నారు.
''ఈ మార్గదర్శకాలకు సూత్రప్రాయంగా అందరూ అంగీకారం తెలిపారు. కానీ, ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలను విచారించి, చర్యలు చేపట్టే బాధ్యత ఒక్క ఈసీదే'' అని తెలిపారు.
రాజకీయ పార్టీల నుంచి అనవసర ఆటంకాలు రాకుండా, ఎన్నికల ప్రక్రియలో అవి జోక్యం చేసుకోకుండా చూసేందుకే ఇలా ప్రవర్తన నియమావళిని న్యాయ పరిధిలోకి తీసుకురాలేదని శెఫాలీ వివరించారు.
అధికార పార్టీలు, ఉన్నతాధికారుల ప్రభావం లేకుండా ఈసీని స్వతంత్ర సంస్థగా చేశారని పేర్కొన్నారు.
ఒకటిన్నర నెలల్లో 40 వేల ఫిర్యాదులు
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు ప్రవర్తన నియమావళి మార్చి 10న అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఉల్లంఘనలకు సంబంధించి ఈసీకి సుమారు 40వేల ఫిర్యాదులు అందాయి.
ఫిర్యాదుల వెల్లువ కారణంగా వాటిని సత్వరంగా పరిష్కరించడం ఈసీకి ఇబ్బందిగా మారింది.
ఓ ఫిర్యాదును ఇంత సమయంలోగా పరిష్కరించి తీరాలన్న కాలపరిమితేదీ లేదని శెఫాలీ అన్నారు.
ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపైనా నిర్ణీత మార్గదర్శకాలేవీ లేవని వివరించారు.
ఇటీవల ఈసీ తనకున్న అధికారాలను వినియోగించుకుంటూ.. కొందరు నాయకుల ప్రచారంపై స్వల్పకాలికంగా (24 నుంచి 72 గంటల వరకూ) నిషేధం విధించింది.
విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినందుకు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అజామ్ ఖాన్‌లు ఇలా నిషేధానికి గురయ్యారు.
ఈసీ నిర్ణయాలను కోర్టులో సవాల్ చేయొచ్చా?
అయితే, ఎన్నికల నిర్వహణ, ఉల్లంఘనలకు సంబంధించిన చాలా అంశాలను న్యాయపరంగా సవాలు చేయొచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ చట్టాల కింద ఈ వెసులుబాటు ఉందని వారు అంటున్నారు.
ఉదాహరణకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 1860కి సంబంధించిన ఉల్లంఘనలైతే కోర్టులో వాటిని సవాలు చేసేందుకు అవకాశం ఉంది.
ప్రజాప్రాతినిధ్య చట్టానికి సంబంధించినవైతే నేరుగా కోర్టే ఈ ఆ విషయంపై దృష్టి సారించొచ్చు.
అయితే, ప్రవర్తన నియమావళి మాత్రం పూర్తిగా ఈసీ పరిధిలోనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల ఈసీ ముందుకు వచ్చిన ఉల్లంఘనల అంశాలు..
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు
భారత సైన్యాన్ని యోగి ఆదిత్యనాథ్ 'మోదీ సైన్యం' అని పేర్కొన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఈసీ ఆయనకు నోటీసులు పంపింది.
మోదీ బయోపిక్
ప్రధాని నరేంద్ర మోదీ ఆధారంగా హిందీలో ఓ చిత్రం రూపొందింది. మోదీ పాత్రలో హిందీ సినీ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించారు. ప్రతిపక్ష పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈ చిత్రం విడుదలను ఈసీ అడ్డుకుంది. ఎన్నికలు ముగిశాక విడుదల చేసుకోవాలని నిర్మాతలకు సూచించింది.
గవర్నర్ కల్యాణ్ సింగ్ వ్యవహారం
నరేంద్ర మోదీని మళ్లీ ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని భాజపా కార్యకర్తల సమావేశంలో రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ వ్యాఖ్యానించారు. కల్యాణ్ సింగ్ రాజ్యాంగ పదవిలో ఉన్నందున నేరుగా ఆయనకు నోటీసులు జారీచేసే వీలు ఈసీకి లేదు. దీంతో ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఈసీ లేఖ రాసింది. ఇంకా దీనిపై స్పందన రాలేదు.
అభినందన్ ఫొటో
రాజకీయ ప్రయోజనాల కోసం భారత వాయుసేన పైలెట్ అభినందన్ ఫొటోను, పేరును మోదీ వాడుకున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీని ఆశ్రయించింది. ఈ విషయంపై ఈసీ ఇంకా స్పందించలేదు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు నవ్‌జోత్ సింగ్ సిద్ధూ వంటి నాయకులపై బీజేపీ కూడా ఈసీకి ఫిర్యాదులు చేసింది.
'నమో టీవీ' ఛానెల్ కేసు, మోదీ సభలను ప్రభుత్వ మీడియా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న వ్యవహారంతోపాటు చాలా కేసులు ఈసీ ముందు అపరిష్కృతంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- 'భారత సైన్యాన్ని మోదీ సేన అంటే దేశద్రోహమే’ : వీకే సింగ్
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- మాయావతి, యోగిల ప్రచారంపై ఈసీ ఆంక్షలు
- 'ఫుడ్ అనేది ఒక పోర్న్ అయితే... నేను పోర్న్ స్టార్‌ని'
- న్యూస్పేపర్లలో ఆహార పదార్థాలను చుట్టి ఇవ్వడం, పార్సిల్ చేయడంపై నిషేధం.. జులై 1 నుంచి అమలు
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- హైదరాబాద్‌కు బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది?
- అరటిపండు తింటే హ్యాంగోవర్ దిగిపోతుందా
- ఆరోగ్యంపై హార్మోన్ల ప్రభావం గురించి మహిళలు తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








