మాయావతి, యోగి ఆదిత్యనాథ్‌లు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించిన ఈసీ

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిల మీద భారత ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. యోగి మూడు రోజులు, మాయావతి రెండు రోజులు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో యోగి, మాయావతి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి ఫిర్యాదులు అందాయి. అంతేకాదు, తనకు అందిన ఫిర్యాదుల మీద ఈసీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పలువురు న్యాయవాదులు ఈ అంశాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు.
దాంతో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ నేతల మీద అందిన ఫిర్యాదులపై ఎందుకు చర్య తీసుకోలేదని ఈసీని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యల అనంతరం ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుంది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 72 గంటలపాటు అంటే మూడు రోజులు యోగి ఆదిత్యనాథ్, రెండు రోజుల పాటు మాయావతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశించింది.
ఏప్రిల్ 7న మాయావతి సహారన్పూర్ ఎన్నికల సభలో మాట్లాడుతూ, ముస్లింలు తమ వోట్లు చీలిపోకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. సహారన్పూర్‌లో బీఎస్పీ కూటమి అభ్యర్థిగా ఫైజల్-ఉర్-రహమాన్ పోటీలో ఉన్నారు. మాయావతి ఎన్నికల ప్రసంగం వీడియో చూసిన ఎన్నికల కమిషన్ ఆమె వ్యాఖ్యలను అభ్యంతకరమైనవిగా గుర్తించింది.
యోగి ఆదిత్యనాథ్ మీరట్ ఎన్నికల సభలో మాట్లాడుతూ, 'అలీ', 'బజరంగ్‌బలి' అంటూ వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్, సమాజ్‌వాది, బీఎస్పీలు 'అలీ'ని నమ్ముకుంటే, మేం 'బజరంగ్‌బలి'ని నమ్ముకుంటాం" అని అర్థం వచ్చేలా మాట్లాడారు. అవి అనుచిత వ్యాఖ్యలుగా భావించిన ఈసీ ఆయన మూడు రోజులు ప్రచారానికి దూరంగా ఉండాలని ఆంక్షలు విధించింది.
ఇవి కూడా చదవండి:
- హేమామాలిని.. తమిళ సినిమాల నుంచి ఎందుకు తప్పుకున్నారు?
- గంటాపై 15 లక్షలు.. లోకేశ్, అఖిలపైనా భారీ బెట్టింగ్
- BBC Fact Check: కాంగ్రెస్ పార్టీ బాల్ ఠాక్రేకు ఓటుహక్కు లేకుండా చేసిందా?
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- మోదీ వ్యతిరేక 'నగ్న నిరసన'ను తమిళ రైతులు ఎందుకు విరమించుకున్నారు...
- 'రఫేల్'లో మరో వివాదం: అనిల్ అంబానీకి ఫ్రాన్స్ పన్నుల మాఫీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




