స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
తొలి దశ పోలింగ్ ముగిసింది. ప్రజలిచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎంపీ, ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. ఓట్లు లెక్కించే మే 23న వాటిని తెరుస్తారు. అభ్యర్థుల భవిష్యత్‌ను నిర్ణయించే ఈవీఎంలకు అప్పటి వరకు ఎలాంటి భద్రత కల్పిస్తారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఏం చెబుతున్నాయి?
మూడంచెల భద్రత
ఓట్లు పోలైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్‌రూమ్‌లంటారు. ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలిస్తారు. కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. అప్పటివరకు ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలోనే ఉంటాయి.
స్ట్రాంగ్‌రూమ్‌లకు రెండు తాళాలు వేయాలి. ఒక కీ (తాళం చెవి) జిల్లా ఎన్నికల అధికారి వద్ద, రెండోది నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వద్ద ఉంటుంది.
స్ట్రాంగ్‌రూం తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయాలి. ఎవరూ లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. స్ట్రాంగ్‌రూమ్‌ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలి. దీనికోసం మూడెంచల భద్రత ఉంటుంది.
గది బయట మొదటి అంచెలో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఉంటాయి. ఒక ప్లాటూన్‌లో 30 నుంచి 50 మంది సైనికులు ఉంటారు. వీరి విధులకు సంబంధించి లాగ్‌బుక్ నిర్వహించాలి.
ఆ తర్వాత రెండు అంచెల్లో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తుంటారు. భద్రతా సిబ్బంది మూడు షిఫ్టుల్లోనూ పని చేయాల్సి ఉంటుంది.

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

నిరంతరం సీసీటీవీ నిఘా
స్ట్రాంగ్‌రూం లోపల, బయటా సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేయాలి. స్ట్రాంగ్ రూం పక్కనే 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ఉండాలి.
స్ట్రాంగ్ రూమ్ ప్రవేశమార్గాన్ని నిరంతరం సీసీటీవీ కెమేరాల నిఘాలో ఉంచాలి. స్ట్రాంగ్ రూంకి ఒకటి కంటే ఎక్కువ ప్రవేశ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియో చిత్రీకరించాలి.
స్ట్రాంగ్‌రూం భద్రతా ఏర్పాట్లను 24 గంటలూ పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలి.
అగ్నిప్రమాదం జరిగితే వెంటనే ఆర్పివేసేలా స్ట్రాంగ్‌రూం లోపల, వెలుపల తగినన్ని అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతీ ఒక్కరి వివరాలు నమోదు
స్ట్రాంగ్ రూం పరిశీలనకు వచ్చే అధికారులు మినహా మరెవరినీ అక్కడికి అనుమతించరు. స్ట్రాంగ్ రూంలకు వెళ్లే మార్గం మొత్తం నిఘా నీడలో ఉంటుంది.
స్ట్రాంగ్ రూం ద్వితీయ భద్రతా వలయాన్ని దాటే ప్రతీ వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా ఎస్పీ, అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.
రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో స్ట్రాంగ్‌రూం ప్రాంగణాన్ని సందర్శించి, లాగ్ బుక్‌ను, సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాలి. ఒకవేళ స్ట్రాంగ్‌రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యత తీసుకోవాలి. ఏ రోజు ఎవరు వచ్చి తనిఖీ చేశారన్నది లాగ్‌బుక్‌లో నమోదు చేయాలి.
ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలో ఉన్నంత కాలం అక్కడ నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండాలి. స్టాండ్‌బైగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి.
పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఉన్నతాధికారుల ఫోన్ నెంబర్లు ఇవ్వాలి. అభ్యర్థులు ఆ నెంబర్లను స్ట్రాంగ్ రూంల వద్ద ఉన్న తమ ఏజెంట్లకు అందించాలి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లను సంప్రదించమని చెప్పాలి.

ఏ వాహనమూ లోపలికి రాకూడదు
మంత్రులు, అభ్యర్థులు, అధికారుల వాహనాలను మూడో అంచెలోకి రాకముందే నిలిపివేయాలి. ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూం వరకు వెళ్లాలి. వాహనాల పార్కింగ్ మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి.
ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్‌రూంని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరవాలి.
స్ట్రాంగ్ రూం నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడాన్ని వీడియో చిత్రీకరణ చేయాలి. అభ్యర్థుల ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్‌రూంని గమనించేందుకు అనుమతించాలి.
ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేయాలి. ఈ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్‌రూంకి తరలించాలి.

అభ్యర్థులు, వారి ప్రతినిధులకు ప్రత్యేక రూము
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం, దాని పరిధిలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను కృష్ణా యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. వీటిని పోటీలో ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు, వారి ప్రతినిధులతో కలసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆదివారం సందర్శించారు.
ఈవీఎంలు, స్ట్రాంగ్ రూముల భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఆయన అన్నారు. కృష్ణా యూనివర్శిటీలోని స్ట్రాంగ్ రూముల వద్ద 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, ఇక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించుకునే విధంగా అభ్యర్థులకు అవకాశం కల్పించామని తెలిపారు. ఇందుకోసం యూనివర్శిటీ ఆవరణలో ప్రత్యేక రూమును ఏర్పాటు చేశామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్‌లో సవరించిన పోలింగ్ శాతం 79.64
- ఉత్తరాంధ్ర: కనీస సౌకర్యాలను నోచుకోని గిరిజన పల్లెలు
- రష్యా జైళ్లలో యోగా: 'సెక్స్ కోరికలు పెరిగి హోమో సెక్సువల్స్ అవుతారు'
- తక్కువ పని చేసే కళ... రాణించటమెలా?
- ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది?
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- అంబేడ్కర్‌తో బీబీసీ అరుదైన ఇంటర్వ్యూ: 'సరైనవారు ఎన్నికైతేనే ఎన్నికలకు విలువ'
- అమెరికన్ ఉయ్యాల భద్రమేనా? 50 లక్షల బేబీ స్లీపర్స్‌ను వెనక్కు తీసుకున్న ఫిషర్-ప్రైస్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









