ఈవీఎం హ్యాకింగ్: 2014 లోక్‌సభ ఎన్నికలు రిగ్గయ్యాయంటూ ‘అమెరికా సైబర్ నిపుణుడి’ ఆరోపణ.. ఖండించిన ఈసీ

ఈవీఎం

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశంలో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంల) రూపకల్పనలో పాలుపంచుకుంటున్నట్లు చెప్తున్న అమెరికా సైబర్ నిపుణుడు ఒకరు.. ఆ ఎన్నికలు రిగ్గయ్యాయని ఆరోపించారు. అయితే.. తన ఆరోపణలకు ఆధారాలను చూపలేదు.

ఈ ఆరోపణలను భారత ఎన్నికల కమిషన్ ఖండించింది. ఈవీఎంలు పూర్తిగా సురక్షితమైనవని స్పష్టంచేసింది. మరోవైపు కేంద్రంలో అధికార బీజేపీ సైతం ఈ ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టింది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఓడిపోతోందని విమర్శించింది.

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) మాజీ ఉద్యోగినని చెప్తున్న సయ్యద్ షుజా అనే వ్యక్తి సోమవారం అమెరికా నుంచి స్కైప్ ద్వారా లండన్‌లోని జర్నలిస్టులతో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. లండన్‌లో బీబీసీ ప్రతినిధి గగన్ సభర్వాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయితే సయ్యద్ షుజా అనే వ్యక్తి 2009-14 మధ్య కాలంలో ఈవీఎంల తయారీలో ఏ విధంగానూ పాలు పంచుకోలేదని ఈసీఐఎల్ ఎన్నికల సంఘానికి ఓ లేఖ రాసింది. తమ రికార్డులను పరిశీలించామని, ఈసీఐఎల్‌లో శాశ్వత ప్రాతిపదికన గానీ, ఇతర విధానాల్లో గానీ 2009-14 మధ్య కాలంలో సయ్యద్ షుజా పనిచేయలేదని స్పష్టం చేసింది.

స్వయంగా వచ్చి చేసి చూపిస్తారన్నారు.. స్కైప్‌లో మాట్లాడారు...

నిజానికి.. అమెరికాకు చెందిన సైబర్ నిపుణుడు స్వయంగా ఈ సమావేశానికి హాజరై.. ఈవీఎంను ఎలా హ్యాక్ చేస్తారనేది చూపిస్తారని పేర్కొన్నారు. అయితే.. గత వారాంతంలో తనపై గుర్తుతెలియని కిరాయి దుండగులు దాడి చేయటం వల్ల తన లండన్ పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. అందువల్ల తాను టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో మాట్లాడుతున్నానన్నారు.

అయితే.. స్కైప్ చాట్‌లో ఎవరూ గుర్తుపట్టటానికి కానీ, సరిగా చూడటానికి వీలు లేకుండా ఆయన చీకట్లోనే ఉన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, కాబట్టి తన భద్రత కోసం తనను ఎవరూ గుర్తించకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నానన్నారు.

ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ యూరప్, ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ లండన్‌లు సంయుక్తంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాయి. పాత్రికేయులు, విద్యార్థులతో పాటు బ్రిటన్, భారత ఎంపీ కపిల్ సిబల్ సహా పలువురు ప్రముఖులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈవీఎం

ఫొటో సోర్స్, Getty Images

‘‘నాది హైదరాబాద్.. ఈసీఐఎల్ మాజీ ఉద్యోగిని’’

తాను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తినని, ఈసీఐఎల్ మాజీ ఉద్యోగినని 2014లో భారత సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలకు రూపకల్పన చేసిన బృందంలో సభ్యుడినని సుషా చెప్పారు. తన ప్రాణాలకు ప్రమాదం ఉందన్న భయంతో 2014లో అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భారతదేశంలో ఈవీఎం హ్యాకింగ్ గురించి తెలిసిన తన మాజీ సహోద్యోగులు, స్నేహితులు ఐదుగురు హత్యకు గురయ్యారని కూడా సయ్యద్ చెప్పారు.

''అమెరికా, కాంగో వంటి ఇతర దేశాలు ఈవీఎంలను ఎలాంటి సమస్యా లేకుండా ఎలా ఉపయోగిస్తున్నాయి?'' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ''అమెరికా ఈవీఎంలను నేను అధ్యయనం చేయలేదు. ఆ అవకాశం నాకు రాలేదు. కాబట్టి అమెరికా గురించి నేను వ్యాఖ్యానించలేను. ఇక కాంగో గురించైతే నాకేమీ తెలియదు'' అని సయ్యద్ బదులిచ్చారు.

‘‘నేను శరణార్థిని... అందుకనే...’’

''ఇండియాలో ఉపయోగించిన ఈవీఎంలను ఎవరైనా వచ్చి హ్యాక్ చేసి చూపాలని భారత ఎన్నికల కమిషన్ గత ఏడాది బహిరంగంగా సవాలు చేసింది. ఆ సవాలును అంగీకరించాలని మీరు అనుకోలేదా?'' అని ప్రశ్నించగా.. ''నేను ఇక్కడ శరణార్థిని. ఒకవేళ నేను ఇండియా తిరిగి వెళితే నా భద్రత పరిస్థితి ఏమిటి? కాబట్టి.. ఆ సవాలులో పాల్గొనదలచిన వారికి నేను ఒక అవకాశం ఇచ్చాను. కానీ వారు వెనుకడుగు వేశారు'' అని ఆయన పేర్కొన్నారు.

''మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ సమావేశం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు?'' అన్న ప్రశ్నకు.. ''నేను ఏమీ ఆశించటంలేదు. ఏదీ మారబోదని నాకు తెలుసు. ఎందుకంటే ఈవీఎంలు అలాగే ఉంటాయి. ఏం జరుగుతోందో అది జరుగుతూనే ఉంటుంది. అందరూ కలిసి బ్యాలట్ పేపర్ కోసం అడిగినా కానీ.. ఏదీ మారబోదు. ఎందుకంటే ఓట్లు కొనుగోలు చేయటానికి అవసరమైనన్ని డబ్బులు బీజేపీ దగ్గర ఉన్నాయి'' అని సయ్యద్ వ్యాఖ్యానించారు.

ఈవీఎం

ఫొటో సోర్స్, Getty Images

‘‘హ్యాక్ చేయటానికి వీలు లేని ఈవీఎంలు ఉన్నాయి’’

''హ్యాక్ చేయటానికి వీలులేని ఈవీఎంలు వాళ్ల (ఎన్నికల కమిషన్) దగ్గర ఉన్నాయి. కానీ వాటిని వారు ఉపయోగించరు. మేం వారికి ఇచ్చిన డిజైన్.. హ్యాక్ చేయటానికి వీలులేనిది. దానిలో మోసపూరితంగా మార్పులు చేసే అవకాశమే లేదు. వైర్‌లెస్ సాయంతో దానికి కనెక్ట్ కాలేరు. ఎందుకంటే అది చాలా సంక్లిష్టమైన డిజైన్'' అని మరొక ప్రశ్నకు సమాధానంగా సయ్యద్ పేర్కొన్నారు.

సయ్యద్ తను చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయారు. అయితే.. ఈ విషయాన్ని ఇంకా పరిశోధించటానికి, నిగ్గుతేల్చటానికి అవసరమైతే జర్నలిస్టులకు తన వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలను సంతోషంగా అందిస్తానని చెప్పారు. ఈ మాటతో సమావేశం ముగిసింది. కానీ.. జర్నలిస్టులు ఎదురుచూస్తున్నదేమీ జరగలేదు.

ఆరోపణలు చేశారు.. ఆధారాలు చూపలేదు...

ఈవీఎంను ప్రత్యక్షంగా హ్యాక్ చేసి చూపిస్తానన్న వ్యక్తిని స్వయంగా చూడటానికి, అతడు హ్యాక్ చేస్తే వీక్షించటానికి వచ్చారు. కానీ వేలాది మైళ్ల దూరంలో చికటి గదిలో కూర్చుని కనీకనిపించకుండా పెద్ద పెద్ద ఆరోపణలు చేసి.. వాటికి ఆధారాలు ఇవ్వని ఒక వ్యక్తిని స్కైప్ స్క్రీన్ మీద కలిశారు.

సయ్యద్ ఆరోపణలపై ఏవైనా నిర్ధారణలకు రావాలన్నా, ఏదన్నా మాట్లాడాలన్నా సయ్యద్ చెప్పిన మాటలను ముందుగా సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కి ఆయనను కాంగ్రెస్ పార్టీయే పంపించిందా అని అడిగిన ప్రశ్నకు.. ఈ భేటీ నిర్వాహకుల్లో ఒకరు తన స్నేహితులని.. సయ్యద్ గురించి, అతడి ఆరోపణల గురించి తనకు, ఇతర రాజకీయ పార్టీల నాయకులకు ఆయన చెప్పారని.. స్వయంగా వచ్చి ఇది వినాలని ఆహ్వానించారని సిబల్ బదులిచ్చారు. అయితే.. ఆయన ఒక్కరే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

భారత ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది?

ఎన్నికల్లో భారత ఎన్నికల కమిషన్ ఉపయోగించిన ఈవీఎంలు లోపరహితమైనవని ఈసీఐ పునరుద్ఘాటించింది.

''ఈ ఈవీఎంలను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లలో పటిష్ట పర్యవేక్షణ, భద్రతల మధ్య తయారు చేశారు. 2010లోనే ఏర్పాటు చేసిన ప్రముఖ సాంకేతిక నిపుణుల కమిటీ పర్యవేక్షణలో అన్ని దశలనూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను క్షుణ్నంగా పరిశీలించారు'' అని సోమవారం ఒక ప్రకటనలో వివరించింది.

ఈ విషయానికి సంబంధించి చట్టపరంగా ఎటువంటి చర్యలు చేపట్టవచ్చుననే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

ముక్తార్ అబ్బాస్ నక్వీ

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల్లో పరిస్థితి తెలిసే ముందుగానే ఈవీఎంలపై నిందలు: బీజేపీ

మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు నుంచే ఈవీఎంలను తప్పుపట్టటం మొదలుపెట్టిందని కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీ ఎద్దేవా చేశారు. ''దేశంలో వాతావరణం ఎలా ఉందో ఆ పార్టీకి అర్థమైనట్లు ఉంది. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలతో 2019లో ఏం జరగబోతోందో తెలిసిపోయినట్లు ఉంది'' అని విమర్శించారు.

లండన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఎంపీ కపిల్ సిబల్‌ను కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు పంపించారని ఆయన ఆరోపించారు. దేశాన్ని, దేశ ప్రజస్వామ్య వ్యవస్థను అవమానించటం వారి పని అని విమర్శించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి: మమత

ఈవీఎంల విషయమై లండన్‌లో ఆరోపణలు వచ్చిన తర్వాత.. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పశ్చిమ బంగ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.

''ప్రతి ఓటూ ఎంతో విలువైనది. యునైటెడ్ ఇండియా సభలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఈవీఎం అంశం గురించి మాట్లాడాయి. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్లాలని జనవరి 19వ తేదీనే అన్ని పార్టీలూ కలిసి నిర్ణయించాయి'' అని పేర్కొన్నారు.

భారతదేశంలో ఈవీఎంల గురించి గతంలోనూ ప్రశ్నలు వచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత చాలా ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల పనితీరు, విశ్వసనీయత మీద సందేహాలు లేవనెత్తాయి.

ఈవీఎం

ఫొటో సోర్స్, Eci

గతంలో ఈసీ సవాలు

ఈవీఎంను ట్యాంపర్ చేయవచ్చునంటూ ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈవీఎం తరహా యంత్రం ఒకదానితో దిల్లీలో ప్రదర్శన కూడా నిర్వహించింది.

ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ఈవీఎంను హ్యాక్ చేసి చూపించాలని గతంలో ఒక సవాలు కూడా చేసింది. ఆ సవాలుకు ఎన్‌సీపీ, సీపీఎంలు మాత్రమే హాజరయ్యాయి. కానీ చాలెంజ్‌లో పాలుపంచుకోలేదు. ఎన్నికల సంఘం చూపించిన దానిని వీక్షించాయి.

ఎన్నికల కమిషన్ సవాలు ఒక డ్రామా మాత్రమే అని, కాబట్టి అందులో తాము పాల్గొనబోమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.

వీడియో క్యాప్షన్, వీడియో: ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)